– పిజేటిఏయు ఉపకులపతి ఆల్థాస్‌ జానయ్య

తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేంద్రాలకి (ఏఐసిఆర్‌పీ) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఐసిఏఆర్‌ పిజేటిఏయు ఉపకులపతికి నిన్న అధికారికంగా లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పత్తి పరిశోధన చేసే సమన్వయ కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది. ఫలితంగా గత పది ఏళ్లలో జాతీయస్థాయిలో పత్తి పరిశోధన వ్యవస్థలో పిజేటిఏయు భాగస్వామి కాలేకపోయింది. ఇటీవల నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య గత నెలలో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా.టి. పి శర్మ లను కలిసి తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించి వెంటనే అఖిలభారత పత్తి సమన్వయ పరిశోధన పథకంలో పిజేటిఏయుకు భాగస్వామ్యం కల్పించి తదనుగుణంగా వరంగల్‌ లో ఒక ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్‌లో ఒక ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దానితోపాటు ఆయా కేంద్రాలకు ఐసిఏఆర్‌ సిబ్బందిని, నిధులను కేటాయించి పిజేటిఏయులో పత్తి పంటలపై పరిశోధనలను పునఃప్రారంభించి రైతులకు రాగల రోజులలో సాంకేతిక మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విజ్ఞప్తికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ మరియు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సానుకూలంగా స్పందించి కేంద్రాలని వెంటనే మంజూరు చేస్తున్నట్లు నిన్న అధికారికంగా సమాచారం అందిస్తూ లేఖను ఉపకులపతి కి పంపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రెండు ఐఏసిఆర్‌పి కేంద్రాలలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య తెలిపారు.