వాతావరణం మార్పుల కనుగుణంగా పంటలకు సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యకక్షుడు డాక్టర్ జి. చిన్నా రెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ”రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ప్లాంట్ పాథాలజీ అండ్ ఇన్నోవేటివ్ అప్రోచెస్ ఇన్ ప్లాంట్ డిసీజ్ మేనేజ్మెంట్ (ఆర్ఏపీపీఐడి)” అన్న అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తోన్న జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఫైటో పాథలాజికల్ సొసైటీ (సెంట్రల్ జోన్), దక్కన్ సొసైటీ ఆఫ్ ప్లాంట్ ఫాథాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమమేధ, మిషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్యరక్షణలో వినియోగించుకోవాలని సూచించారు. ఆహార మరియు పోషణ, భద్రత కల్పించడంలోనూ వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ వంతు కృషి జరపాలన్నారు. ప్లాంట్ పాథాలజిస్ట్ లే మొక్కల డాక్టర్లని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె. గోపాల్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ దండ రాజి రెడ్డి, గుంటూరు లాం లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి ప్రసంగించారు. పంటకోత అనంతర నష్టాలను తగ్గించడంపై ప్లాంట్ పాథాలజీ శాస్త్రవేత్తలు దృష్టి నిలపాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి సూచించారు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ప్రస్తుత అవసరమని ఆయన చెప్పారు. పర్యావరణ సమతుల్యతలు పాటించాలన్నారు. ప్లాంట్ పాథాలజీ రంగం మరింత ఆధునికతను సంతరించుకోవాల్సిన అవసరం ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి అన్నారు. వివిధ పంటలకు సోకే రోగాల నిర్ధారణ, నివారణకు కూడా రిమోట్ సెన్సింగ్ అధ్యయనం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు అందరూ కలిసి పనిచేయడం వల్ల సస్యరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించగలమని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె. గోపాల్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జె. సత్యనారాయణ ప్రసంగించారు. ప్లాంట్ పాథాలజీ రంగంలో చేపట్టాల్సిన పరిశోధనలు వాటి అవసరాలను వివరించారు. ఈ రెండు రోజుల సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాలను, చేపట్టనున్న ప్రధాన చర్చల గురించిన నివేదికను ఇండియన్ ఫైటో ప్లాంట్ ఫాథాలాజికల్ సొసైటీ (సెంట్రల్ జోన్) అధ్యకక్షుడు డాక్టర్ విద్యాసాగర్ వివరించారు. డాక్టర్ జి. రాజేష్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్లాంట్ పాథాలజీ విభాగం శాస్త్రవేత్తలు, పీజీ, పీహెచ్డి విద్యార్థులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

12 Dec, 2024
