సీటొస్తే… కొలువు గ్యారంటీ!

15 ఏళ్లుగా వంద శాతం ప్రాంగణ నియామకాలు
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సేవలకూ అవకాశం
‘నార్మ్‌’లో పీజీడిప్లొమా కోర్సు

ఇక్కడ సీటొస్తే చాలు.. మంచి వేతనాలతో ఉద్యోగం లభిస్తోంది. కోర్సులో చేరిన విద్యార్థులు కూడా శతశాతం ఉత్తీర్ణత సాధిస్తుంటారు. ఇదీ హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌) ఘనత. ఇక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ - అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం) కోర్సును పూర్తిచేసినవారు 100% ఉద్యోగాలు పొందుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తవగానే విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు ప్రారంభమవుతున్నాయి. ఏఐసీటీఈతో పాటు 'న్యాక్‌' గుర్తింపుపొందిన ఈ వ్యవసాయ అనుబంధ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉంది.

వ్యవసాయ పరిశోధనలో మేటిగా…
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌)కి అనుబంధంగా వ్యవసాయ పరిశోధన విద్యా నిర్వహణకు సంబంధించి 1976లో నార్మ్‌ ఏర్పాటయింది. వ్యవసాయ పరిశోధనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం.. మెరుగైన సలహాలను అందించడంతో పాటు రైతులు, శాస్త్రవేత్తలతో సహా వివిధ వాటాదారులకు పేటెంట్లు వంటివి లభించేందుకు నార్మ్‌ కృషి చేస్తోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పారిశ్రామిక, వ్యాపార రంగాల అధ్యయనాలను సమ్మిళితం చేసి సంబంధిత రంగాల్లో ఉద్యోగాలు పొందేందుకు విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా 2009లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సును ప్రారంభించింది. 2019 వరకు ఇది పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లామా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ అగ్రికల్చర్‌ (పీజీడీఎంఏ) పేరిట ఉండేది. 2020 నుంచి దాన్ని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ – అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (పీజీడీఎం-ఏబీఎం)గా నిర్వహిస్తున్నారు.

ప్రతిభావంతులకు పట్టం…
బీఎస్సీ వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య, మత్స్య నాలుగేళ్ళ కోర్సులు ఉత్తీర్ణులైన వారు క్యాట్‌, సీమాట్‌ పరీక్షలు రాయాలి. అర్హత సాధించినవారు నార్మ్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటారు. పీజీడీఎం-ఎంబీఎంలో 60 సీట్లు ఉండగా… ఏటా వెయ్యిమందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఆయా అభ్యర్థులకు ఎనలిటికల్‌ రైటింగ్‌స్కిల్స్‌ టెస్ట్‌, బృందచర్చలు, మౌఖిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికే ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాసంస్థల మాదిరే రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ప్రవేశాలు పొందినవారికి ఒక్కో విద్యార్థికి ఒక్కో గది చొప్పున హాస్టల్‌ వసతి ఉంటుంది. విశాలమైన తరగతి గదులుంటాయి. జాతీయ అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులం ఉంటుంది. బోధకుల్లో 70% మంది శాస్త్రవేత్తలు, నిపుణులు ఉండగా.. 30% మంది పారిశ్రామికరంగం నుంచి వచ్చి బోధన చేస్తారు. విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠాలతో పాటు అసైన్‌మెంట్లు, కేస్‌ స్టడీస్‌, ముఖాముఖి చర్చలు, పారిశ్రామిక ప్రముఖులతో భేటీలు, క్షేత్రస్థాయి పరిశీలనలు వంటివి ఉంటాయి. సెమినార్లు, వర్క్‌షాపులు, సింపోజియాలలోనూ పాల్గొంటారు. వారికి కార్పొరేట్‌ కంపెనీల కోసం కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు అవకాశం కల్పిస్తారు. రెండేళ్ళ కోర్సులో ఆరు ట్రిమిస్టర్లు ఉంటాయి. ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్న్‌షిప్‌, ప్రజెంటేషన్‌ స్కిల్స్‌, సప్లైచెయిన్‌, రాజకీయ, ఆర్థిక తరగతులు వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

  • మూడో ట్రిమిస్టర్‌ నుంచే కంపెనీలు నార్మ్‌కు వచ్చి విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేసుకుంటున్నాయి. ఐదో ట్రిమిస్టర్‌ లోనూ మళ్లీ కంపెనీలు వచ్చి ఇంటర్న్‌షిప్‌ ఇస్తున్నాయి. అది పూర్తయిన వెంటనే ప్రాంగణ నియామకాలు మొదలవుతున్నాయి. విద్యార్థలకు శిక్షణ ఇచ్చిన కంపెనీలే సగానికి పైగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తుండగా.. మిగిలినవారిని ఇతర కంపెనీలు ఎంపిక చేస్తున్నాయి.
  • వ్యవసాయ, విత్తన, ఎరువులు, పురుగు మందులు, పశువైద్య, మత్స్య, జీవశాస్త్ర, బ్యాంకింగ్‌ ఆర్థిక, బీమా, వాణిజ్య సంస్థలు, గృహోపకరణాలు, అగ్రిటెక్‌ తదితర రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇంతవరకు నియమితులైనవారికి సగటున రూ. 10.7 లక్షల ప్యాకేజీ ఉంది. గత ఏడాది అత్యధికంగా రూ. 15 లక్షల ప్యాకేజీ వచ్చింది. నార్మ్‌లో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులో 50% మేరకు అమ్మాయిలు ఉంటున్నారు.

సీట్ల సంఖ్య రెట్టింపునకు యోచన
‘మా విద్యార్థులు మెరికలు. 15 ఏళ్లుగా ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగం పొందారు. ఈ కోర్సుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా సీట్ల సంఖ్యకు 120కి పెంచాలని ఆలోచిస్తున్నాం’ అని నార్మ్‌ ప్రాంగణ నియామకాల సమన్వయకర్త గణేశ్‌కుమార్‌ తెలిపారు. ‘ఈ కోర్సులో చేరిన వారు 15 ఏళ్ళుగా వంథాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. క్రమశిక్షణతో పాటు పర్యావరణ హితమైన వాతావరణంలో తరగతులు సాగుతున్నాయి. ఉద్యోగాలు పొందిన వారు వ్యవసాయ రంగానికి గణనీయమైన సేవలందిస్తున్నారు’ అని చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ అనీజా తెలిపారు.

Read More

ముడిసరకు కాదు.. ఉత్పత్తులే ఎగుమతి

మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధలపై విస్తృత పరిశోధనలు
ఎగుమతులకు అనువుగా ఉత్పత్తి చేస్తేనే రైతులకు ప్రయోజనం
సీటీఆర్‌ఐ సంచాలకుడు మాగంటి శేషుమాధవ్‌

'వాణిజ్య పంటలకు సంబంధించి మన దగ్గర నుంచి అధిక శాతం ముడిసరకు విదేశాలకు వెళ్తోంది. ఆయా దేశాల్లో వాడే ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేసి ఎగుమతి చేస్తే ఇటు రైతులకు.. అటు ప్రభుత్వానికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ దిశగా ఐకార్‌-ఎన్‌ఐఆర్‌సీఏ రెండేళ్లుగా పరిశోధనలు చేస్తోంది' అని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్‌ఐ) డైరెక్టర్‌ మాగంటి శేషు మాధవ్‌ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం కేంద్రంగా ఇప్పటివరకు పొగాకుపై పరిశోధనలు చేసిన సీటీఆర్‌ఐ, త్వరలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ కమర్షియల్‌ అగ్రికల్చర్‌ (ఎన్‌ఐఆర్‌సీఏ) గా మారనుందని తెలిపారు. తమ సంస్థ శాస్త్రవేత్తలు రెండేళ్లుగా మిర్చి, పసుపు, ఆముదం, అశ్వగంధ తదితర వాణిజ్య పంటలపై పరిశోధనలు చేస్తున్నారని వెల్లడించారు. 

ఉత్పత్తులు తయారు చేసి.. ఎగుమతులు పెంచాలి
దేశంలో మిర్చి 25.96 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ఉత్పత్తి అవుతుంటే.. అందులో 6.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిసరకు (రూ.12492 కోట్లు) ఎగుమతి అవుతోంది. మన దేశ వాటా 58 శాతంతో అగ్రస్థానంలో ఉన్నా.. 0.5 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వచ్చే రెండేళ్ళలో వాటిని 3 లక్షల టన్నులకు పెంచాలన్నదే లక్ష్యం. ఉదాహరణకు దుబాయ్‌ ప్రజలకు మిర్చి ఎర్రగా… కారంగా ఉండాలి. యూరప్‌లో కారం తక్కువగా ఉంటూ.. ఫ్లెక్స్‌గా వినియోగిస్తారు. ఏ దేశంలో ఏ తరహా ఉత్పత్తులకు గిరాకీ ఉందో గుర్తించి.. అందుకు అనుగుణంగా వంగడాలు, ఉత్పత్తుల తయారీ దిశగా పరిశోధనలు సాగుతున్నాయి. నాలుగు వాణిజ్య పంట ఉత్పత్తులు అధికంగా సాగు చేసే ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశాం. సాగు పద్ధతులను రైతులకు వివరిస్తాం. ఉత్పత్తులు కొనుగోలు చేసి, శుద్ధి చేసేందుకు ప్రాథమిక స్థాయిలో ఎఫ్‌పీవో, రెండో థలో ఎఫ్‌పీసీ, మూడో స్థాయిలో సంబంధిత పరిశ్రమలతో ఒప్పందం చేసుకొని రైతులకు మేలు జరిగేలా చూస్తాం. ఇప్పటికే రాజమహేంద్రవరం కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో నిర్కా నెస్ట్‌ (ఎన్‌ఐఆర్‌ సీఏ నెస్ట్‌) పేరుతో స్టాల్‌ పెట్టి, విక్రయాలకు ఏర్పాట్లు చేస్తున్నాం.

అధిక ధరలకు దిగుమతి చేసుకుంటూ నష్టపోతున్నాం
దేశం నుంచి మిర్చి, ఆముదం ముడిసరకును విదేశాలకు పంపిస్తున్నాం. వాటితో అక్కడి వారు ఉత్పత్తులు తయారు చేస్తుంటే.. తిరిగి మనం అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నాం. భారత్‌లో 17.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆముదం దిగుబడి ఉంటే.. అది కేవలం నూనె ఉత్పత్తికే పరిమితం. టూత్‌పేస్టు, లిప్‌స్టిక్‌, రంగులు, వార్నిష్‌ ఇక్కడా చేయొచ్చు. ఏటా 6.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆముదం నూనె (రూ. 7,805 కోట్లు) ఎగుమతి చేస్తూ… దాని ఆధారంగా తయారు చేసిన వస్తువులను రూ. 11 వేల కోట్లకు దిగుమతి చేసుకుని నష్టపోతున్నాం. మన నుంచి వియత్నాం విర్చి దిగుమతి చేసుకుంటోంది. మిర్చి ఆయిల్‌, చాక్లెట్‌, సాస్‌ తదితర 100 రకాలు తయారు చేసి, వాటిని ఎగుమతులు చేస్తూ లాభాలు ఆర్జిస్తోంది. అలాంటివి మనవద్దే తయారు కావాలి. ఔషధాల్లో వినియోగించే అశ్వగంధకు 9 శాతం క్యుమిలేటివ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ (సీఐజీఆర్‌) ఉంది. దీని చూర్ణంతో హెల్త్‌మిక్స్‌, ఇమ్యూనిటీ బూస్టర్‌, క్యాప్సిల్‌ తయారు చేశాం. అనంతపురంలో అశ్వగంధ, ఆముదం సాగును ప్రోత్సహిస్తున్నాం. ఆహారం, డెయిరీ, ఆక్వా రంగాల్లో వినూత్న ఆలోచనలతో వచ్చేవారికి తోడ్పాటు అందించేందుకు రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐలో ఆరు నెలల్లో ఇంక్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం.

Read More

ప్రకృతి సేద్యమే మానవాళికి శ్రీరామరక్ష

‘పకృతి సేద్యమే మానవాళి ఆరోగ్యానికి శ్రీరామరక్ష.. దీన్ని ఒక ఉద్యమంలా ప్రతి రైతు స్వీకరించాలి’ అని గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవ్‌వ్రత్‌ పిలుపునిచ్చారు. వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, భూసారాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోక మంథన్‌ మహోత్సవంలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘లోక్‌జీవన్‌ మియిన్‌ విజన్‌’ అంశంపై ఆచార్య దేవ్‌వ్రత్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో పది లక్షలమందికి పైగా రైతులు, సుమారు 7.93 లక్షల ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ సాగులో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని, తద్వారా అధిక దిగుబడిని, రాబడిని పొందుతున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో దేశంలోనే సేంద్రియ గుజరాత్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు తామంతా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గోఆధారిత ఉత్పత్తుల ద్వారా పంటకు పట్టే చీడపీడలను నివారించవచ్చని, ఆ విషయాల మీద తమ రాష్ట్రంలో విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో వేదకాలం నాటి వైజ్ఞానిక, శాస్త్ర పరిజ్ఞానంపై డా. అనీర్‌బన్‌ బంధోపాధ్యాయ, గుజరాత్‌ యూనివర్సిటీ వీసీ ప్రొ. నీరజ గుప్తా కీలకోపన్యాసం చేశారు.

Read More

గల్ఫ్‌కు ‘అనంత’ అరటి…

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పండించిన అరటి దిగుబడులతో ‘బనానా రైలు’ శుక్రవారం ముంబైకి బయల్దేరింది. తాడిపత్రి నుంచి శుక్రవారం బయల్దేరిన ఈ రైలును వర్చువల్‌ విధానంలో విజయవాడ నుంచి వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ ప్రారంభించారు. ఈ ఏడాది లక్ష టన్నుల అరటి ఉత్పత్తిని విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. సౌదీ, ఇరాన్‌, ఇరాక్‌, ఖతర్‌, ఈజిప్టు వంటి దేశాలకు 15 కంపెనీల ద్వారా అరటి ఎగుమతి అవుతోందని తెలిపారు.

Read More

చిరుధాన్యాల సాగు, వినియోగం భారీగా పెరగాలి

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంపై ఎఫ్‌ఏవో నివేదిక

ఆకలి, పోషకాహార లోపం, వాతావరణ మార్పులు, జీవవైవిధ్య ప్రభావం, ఆహారభద్రత సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు... చిరుధాన్యాల సాగు, వినియోగం పెద్దఎత్తున విస్తరించాలని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏవో) సూచించింది. ఈ మేరకు సాగు మరింతగా అభివృద్ధి చెందాలని, విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని, కొత్త వంగడాలకు రూపకల్పన చేయాలని పేర్కొంది. ఉత్పత్తుల మార్కెటింగ్‌ మరింత విస్తృతం కావాలని సూచించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023 ప్రాముఖ్యంపై తాజాగా ఎఫ్‌ఏవో నివేదికను విడుదల చేసింది. వివిధ దేశాల్లో చిరుధాన్యాల సాగు, వినియోగం తదితర అంశాలపై చేపట్టిన అధ్యయనం... నిపుణులు, శాస్త్రవేత్తలు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాల సేకరణ అనంతరం నివేదికను రూపొందించింది. నివేదికలో చిరుధాన్యాల సాగు, వినియోగం విస్తృతికి పలు సిఫార్సులు చేసింది. ముఖ్యాంశలివీ..
  • బాల్యం నుంచే పిల్లలకు చిరుధాన్యాల ఆహారం అందించాలి. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాల ఆధారిత వంటకాలను ప్రవేశపెట్టాలి. బియ్యం, గోధుమలు, మొక్కజొన్న ఇతర ఉత్పత్తులకు బలమైన ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు మారాలి.
  • జన్యువైవిధ్యంతోపాటు సాంకేతికతను మెరుగు పరిచి విజ్ఞానమార్పిడి జరగాలి. స్థానిక సంస్థలు, రైతులు, మహిళలు, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.
  • జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రజల ఆహార అవసరాలకు అనుగుణంగా చిరుధాన్యాల సాగు చేపట్టాలి. విత్తన సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయాలి. రైతులు తమకు అనుకూలమైన రకాలను ఎంచుకోవాలి. స్థిరమైన ఉత్పత్తికి సమీకృత పంటల విధానం అనుసరిణీయం.
  • చిరుధాన్యాలు ఆరోగ్యపరంగా అత్యుత్తమ ఫలితాలిస్తాయి. సంప్రదాయ ఆహారంతో పోలిస్తే వైవిధ్య, స్థితిస్థాపకంగా ఉండే చిరుధాన్యాలు రైతుల జీవనోపాధిని నిలబెట్టాలి. దీనికోసం స్థిరమైన విత్తన పరిరక్షణను బలోపేతం చేయాలి. చిన్న కమతాల రైతులు ఈ పంటలవైపు మొగ్గు చూపుతున్నందున వారికి చేయూతనివ్వాలి. నీటి పొదుపు ద్వారా సాగు సజావుగా సాగే ప్రణాళిక ఉండాలి. నేరుగా వంగడాలను రూపొందించడంతో పాటు కలుపు తీయడం, కోత, నిల్వ, ఉత్పత్తుల శుద్ధి శిక్షణకు సులభతర అవకాశాలను కల్పించాలి.
    మరింతగా మార్కెటింగ్‌…
  • స్థిరమైన ఉత్పత్తి, యాంత్రీకరణతోపాటు రైతులకు పంటలు లాభదాయకంగా మారేలా మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పించాలి.
  • చిరుధాన్యాల కోసం ప్రత్యేకంగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. పంట శుద్ధి అనంతరం పిండి, రవ్వ, ఇతర పదార్థాలుగా మార్చి ప్యాకేజింగ్‌ ద్వారా పంపిణీ జరగాలి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో వారాంతపు సంతల్లోనూతత… సూపర్‌ మార్కెట్లు, కిరణా దుకాణాల్లోనూ విక్రయాలు సాగాలి.
  • ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లు, ఈ-కామర్స్‌ వేదికల ద్వారా ఇళ్లకే నేరుగా సరఫరా చేయడం ద్వారా విక్రయాలు సులభతరం చేయాలి.
  • చిరుధాన్యాల ఉత్పత్తి ప్రదర్శనలు నిర్వహించాలి. యాంత్రీకరణ, ఆహారశుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు గ్రాంట్లను ఇవ్వాలి.

ఉత్పత్తిలో మేటి భారత్‌
చిరుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు భారత్‌, దేశంలో ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకొని చిరుధాన్యాలు సాగవుతాయి. తరి, ఖుష్కి, భూముల్లోనూ పెరుగుతాయి. చీడపీడలను సమర్ధంగా ఎదుర్కొంటాయి. నీటి వినియోగం తక్కువ. వీటి సాగువల్ల నేల సాంద్రత పెరుగుతుంది. పోషకాల పరంగా చిరుధాన్యాలతో కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌, మినరల్స్‌, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమకూరుతాయి. పూర్వకాలం నుంచి చిరుధాన్యాల సాగు, వినియోగం జరుగుతోంది. ప్రధానంగా రాగులు, జొన్నలు, సజ్జలు విస్తృత ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ఉత్పత్తిలో దక్షిణాసియా, సబ్‌సహారా ప్రాంతాల్లో 85 శాతం కంటే ఎక్కువ వినియోగమవుతున్నాయి. భారత్‌, నైజీరియా, నైగర్‌, చైనా, మాలి చిరుధాన్యాల ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్నాయి.

Read More

యుజిసి చైర్మన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ను కలిసిన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ జానయ్య

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్ధాస్‌ జానయ్య బుధవారం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ విద్యా విధానం యొక్క ప్రాధాన్యత, ఆవశ్యకతపై వారు చర్చించారు. జాతీయ విద్యా విధానంపై ఉన్న పలు అపోహలను డాక్టర్‌. జగదీశ్వర్‌ ఈ సందర్భంగా నివృత్తి చేశారు. అలాగే భవిష్యత్తు అవసరాల కనుగుణంగా వ్యవసాయ విద్యాలయం నిర్మాణంపై కూడా డాక్టర్‌. జగదీశ్వర్‌ పలు సూచనలు చేశారు. వచ్చేనెల 20వ తేదీన జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలలో పాల్గొనవలసిందిగా ప్రొఫెసర్‌ జానయ్య విన్నపానికి డాక్టర్‌ జగదీశ్వర్‌ కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన బాలికల వసతి గృహ నిర్మాణానికి యుజిసి తమవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఇరువురి మధ్య తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని.. తమ గ్రామంలో తాము గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. యూజీసీ చైర్మన్‌ డాక్టర్‌ జగదీశ్వర్‌ మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్దాస్‌ జానయ్యలది నల్గొండ జిల్లాలోని మామిడాల గ్రామం కావటం విశేషం.

Read More

సీనియర్‌ అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ సందర్శన

న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీలోని యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సీనియర్‌ అగ్రికల్చరల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ సింగ్‌ ఈరోజు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. పరిపాలన భవనంలో డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ మరియు డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ డాక్టర్‌ జెల్లా సత్యనారాయణ, ఇతర విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాగు పద్ధతులు, విశ్వవిద్యాలయం చేస్తున్న బోధన, పరిశోధన, విస్తరణ తదితర అంశాల గురించి చర్చించారు. వాతావరణ మార్పులు దాని ప్రభావాలను అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, రూపొందించవలసిన ప్రణాళికలు విస్తృతంగా చర్చించారు.

Read More

పశువైద్య విశ్వవిద్యాలయంలో ఎన్‌ఆర్‌ఐ, సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్లు

25న కౌన్సెలింగ్‌

    తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో బీవీఎస్‌సీ కోర్సులో ఎన్‌ఆర్‌ఐ, సెల్ప్‌ఫైనాన్స్‌ కేటగిరి సీట్ల భర్తీకి ఈనెల 25న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ శరత్‌చంద్ర సోమవారం తెలిపారు. రాజేంద్రనగర్‌ కళాశాలలో ఒక ఎన్‌ఆర్‌ఐ, మరో సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీటు, కోరుట్ల కళాశాలలో మూడు ఎన్‌ఆర్‌ఐ, రెండు సెల్ఫ్‌ఫైనాన్స్‌ సీట్లు ఉన్నాయని తెలిపారు. ప్రవేశార్హత, రుసుములు తదితర వివరాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ http://tsvu.edu.in ద్వారా తెలుసుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25న రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ పరిపాలనాభవనానికి దరఖాస్తు ఫారం, దరఖాస్తు రుసుం, ధృవీకరణ పత్రాలు, కళాశాల రుసుం డిమాండ్‌ డ్రాప్ట్‌ (డీడీ)లతో హాజరుకావాలని సూచించారు.
Read More

వరిలో మరిన్ని నూతన వంగడాలు

భారతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల నిపుణులు

    వరిలో మరిన్ని నూతన వంగడాలను రూపొందించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని నిపుణులు సూచించారు. భారతీయ వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్‌), అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)లు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరం సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రారంభమైంది. ఐఐఆర్‌ఆర్‌ డైరెక్టర్‌ మీనాక్షి సుందరం అధ్యక్షత వహించగా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు వాసిం హుస్సేన్‌, మహేందర్‌, ముత్తురామన్‌, జ్యోతి, కల్యాణి, నీరజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్లాంట్‌ బ్రీడింగ్‌లో సరికొత్త డేటా అనాలసిస్‌ పద్ధతులను వినియోగించి నూతన వంగడాలను రూపొందించాలన్నారు

Read More

వ్యవసాయాభివృద్ధికి సహకరించండి రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలకు కేంద్ర కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది సూచన

వ్యవసాయరంగ అభివృద్ధికి నూతన ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలతో ముందకువచ్చే వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విశాఖ నగరంలో సోమవారం ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో దేవేశ్‌ చతుర్వేది మాట్లాడుతూ రాష్ట్రాలు చేపట్టే రైతు సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వ మద్దతు, సహకారం ఉంటుందన్నారు. వ్యవసాయ రంగానికి ఏపీ ప్రభత్వం పెద్దపీట వేస్తోందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల, పుదుచ్చేరి నుంచి వ్యవసాయరంగ నిపుణులు, అధికారులు సదస్సుకు హాజరయ్యారు.

Read More