హెచ్‌క్యూ పీఎం-5 పేరుతో అభివృద్ధి చేసిన అధిక ప్రొటీన్ మొక్కజొన్న పంటను గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు (కేవీకే) ఈ విత్తనాలను కేవీకే శాస్త్రవేత్తలు ఈ రబీలో 20 ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దిల్లీకి చెందిన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) సహకారంతో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐ.ఏ.అర్.ఐ.) శాస్త్రవేత్తలు ఈ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌లోని గండ్రాయి, చెర్వుకొమ్ముపాలెం, బబ్బెళ్లపాడు, తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి, కన్నెవీడు గ్రామాల్లో రైతులకు పంపిణీ చేశారు. 20 ఎకరాల్లో పంట సాగులో ఉంది. పంట లేత కంకి దశలో ఉంది. కాకినాడ జిల్లా పెద్దాపురం అఖిల భారత సమన్వయ మొక్కజొన్న పరిశోధన ప్రాజెక్టు సౌజన్యంతో రైతులకు కలుపు మందులు, పురుగు మందులు ఉచితంగా అందించారు. ఈ విత్తనాల ప్రత్యేకతను కేవీకే సేద్యవిభాగం శాస్త్రవేత్త డాక్టర్ పీఎన్ శివప్రసాద్, వ్యవసాయ విస్తరణ విభాగం శాస్త్రవేత్త ఐ. వెంకటరెడ్డి వివరించారు.
ఇది బయోఫోర్టిఫైడ్ హైబ్రిడ్ రకం మొక్క జొన్న. సాధారణ రకంతో పోలిస్తే ఇందులో రెట్టింపు అమైనో ఆమ్లాలు (లైసిన్, ట్రిప్టోఫాన్), అధిక ప్రొవిటమిన్-ఎ కంటెంట్‌తో మెరుగైన పోషకాలు ఉంటాయి. ఈ పంట 90 రోజుల్లో కోతకు వస్తుంది. వ్యాధి నిరోధకత ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్నను మనుషులు తినేందుకు, పశువుల దాణాకు కూడా వినియోగిస్తారు.
హెచ్‌క్యూ పీఎం-5 మొక్కజొన్నలో పోషకాల నాణ్యత దాదాపు 3.37 శాతం లైసిన్, 0.72 శాతం ట్రిప్టోఫాన్, 6.60 పీపీఎం ప్రొవిటమిన్-ఎ కలిగి ఉంటుంది. హెక్టారుకు 43-76 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మన ప్రాంతంతో పాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో సాగుకు అనుకూలం. ఇది 5.8-6.8 పీహెచ్ ఉన్న నేలల్లో బాగా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ కింద దేశ ప్రజల్లో పోషకాహార లోపాలను నివారించడానికి ఈ రకం విత్తనాల సాగును ప్రోత్సహిస్తోంది.

4 Apr, 2026
