నాబార్డ్, ఆర్ఐడిఎఫ్ నిధులను ఉపయోగించి మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో మార్కెటింగ్, ఆయిల్ ఫెడ్, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఇప్పటికే ఉన్న గోదాముల సామర్థ్యం మరియు కోల్డ్ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో మరిన్ని గోదాములు మరియు కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం నాబార్డ్, ఆర్ఐడిఎఫ్ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్భందిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని మార్కెట్లు మరియు రైతు బజార్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్లలో డిజిటల్ బోర్డుల ఏర్పాటుపై ఆరా తీశారు. మార్కెట్ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.
వానాకాలం సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారిగా సిద్ధం చేసామని, రానున్న 10,15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ సంచాలకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల అందుబాటుపై మంత్రి ఆరా తీశారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేవిధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని మార్కెట్ యార్డులలో, రైతు వేదికలలో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో వివిధ రకాల పంట ఉత్పత్తుల సేకరణ గురించి ఆరా తీసిన మంత్రిగారు, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల జొన్నలను సేకరించామని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా కూడా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిఏసిఎస్ సీఈఓల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని, తదనుగుణంగా స్టేట్ లెవల్ కమిటీ ద్వారా బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రిగారు ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించిన పిఏసిఎస్ లను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా నిబంధనలకు అనుగుణంగా తుదిజాబితా తయారుచేయాలన్నారు. అలాగే 311 పిఏసిఎస్ లను ఎఫ్పిఓ లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పిఏసిఎస్ మరియు డిసిసిబి లకు సంబంధించి ఎంక్వైరీ పూర్తయి, సర్ చార్జీ ఉత్తర్వులు జారీచేయడమైనదని, దానిలో భాగంగా ఇప్పటివరకు 6 కోట్ల 38 లక్షల రివకరి పూర్తి అయిందని, ఇంకా 19 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, అలాగే 74 సర్ చార్జ్ లు పెండింగ్ ఉన్నాయని అధికారులకు మంత్రికి తెలియజేయగా, మిగిలిన రికవరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గత పదిసంవత్సరాలుగా అపెక్స్ సహకార సంఘాల ఆడిట్ ఎందుకు జరగలేదని ఆడిట్ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్సిఎస్ కమిషనర్ ను ఆదేశించారు. అదేవిధంగా అన్ని అపెక్స్ సహకార సంఘాలను ఆడిట్ చేయాలన్నారు.
2021 లో ఆయిల్ పాం ప్లాంటేషన్ చేసిన 2800 మంది రైతులనుండి పంట వస్తుందా? లేదా అని మంత్రిగారు ఆరా తీశారు. ఒకవేళ పంట రాకపోతే అందుకు గల కారణాలు తెలుసుకొని, దానికి నివారణ చర్యలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు పొలంలోకి ఎట్టిపరిస్థితులలో కూడా ఆఫ్ టైప్ మొక్కలు వెళ్లకూడదని మంత్రిగారు స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ మిగతా అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, సహకార అడిషనల్ రిజిస్ట్రార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీమతి లక్ష్మీబాయి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

20 May, 2025
