ఏరువాకలో ముందస్తు సందడి
- రాష్ట్రంలో మొదలైన వానాకాలం సీజన్
- నారు పోస్తూ.. దుక్కులు దున్నుతూ పొలాల్లో రైతులు
- 1.34 కోట్ల ఎకరాల సాగు లక్ష్యం
- ప్రభుత్వపరంగా సన్నద్ధత
తెలంగాణా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందస్తుగా ప్రవేశించడంతో వానాకాలం సీజన్ మొదలైంది. రోజూ వర్షాలు కురుస్తుండటంతో రైతులు సైతం ముందస్తు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే వరి నారు పెంపకం ప్రారంభించగా, ఇతర పంటలకు దుక్కులు దున్ని విత్తనాలు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం కార్యాచరణ ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ సీజన్‌లో 1.34 కోట్ల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. గత వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి అదనంగా 5 లక్షల ఎకరాలు ప్రతిపాదించింది. సాధారణంగా జూన్ నెలలో రైతులు పొలాలను దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటారు. ఈసారి మార్చి నుంచే అడపాదడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. గత పది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో రైతులు పంటల సాగుపై దృష్టి సారించారు.
రాష్ట్రంలో పదేళ్లుగా సాగు, ఉత్పత్తులు ఏటేటా పెరుగుతున్నాయి. ఆ మేరకు విత్తనాల సరఫరాకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది. సన్న ధాన్యానికి బోనస్ దృష్ట్యా 40 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందుకోసం 16.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. వీటి కంటే అధిక అంచనాలతో 60.11 లక్షల ఎకరాల్లో సన్నాలు, 38.21 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు కలిపి 98.32 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. పత్తికి సైతం 1.08 కోట్ల ఎకరాలకు అవసరమైన విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభమైంది.
రాష్ట్రవ్యాప్తంగా విత్తనోత్పత్తి కోసం వచ్చే నెల 2న వ్యవసాయ విశ్వవిద్యాలయం సిద్ధం చేసిన విత్తనాలను గ్రామానికి ముగ్గురు చొప్పున ఆదర్శ రైతులకు పంపిణీ చేయనున్నారు. వ్యవసాయవర్సిటీ.. 3వ తేదీ నుంచి సాగు విత్తనాలను రైతులకు అందించనుంది.
వానాకాలం సీజన్‌కు రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో ఏప్రిల్, మే నెలల్లో 1.72 లక్షల టన్నులు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిణీ చేసే అవకాశం ఉంది.
పంటల బీమా అమలు:
ఈ సీజన్‌లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రీమియంలో సగం కేంద్రం, మరో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నాయి. రైతులందరికీ పంటల బీమా వర్తింపజేయడంతో స్థూల పంట విస్తీర్ణంలో 98 శాతానికి ఈ పథకం వర్తిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
నకిలీల నివారణపై దృష్టి:
రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, ఎరువుల బెడద లేకుండా పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వరంగల్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఈ బృందాలు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాల ముఠాలను పట్టుకున్నాయి. ఎరువుల నివారణకు వ్యవసాయశాఖ ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 5 నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జరుగుతోంది.



