మార్కెటింగ్‌, ఆయిల్‌ఫెడ్‌, వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష

నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించి మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ రోజు సచివాలయంలో మార్కెటింగ్‌, ఆయిల్‌ ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఇప్పటికే ఉన్న గోదాముల సామర్థ్యం మరియు కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే విధంగా రాష్ట్రంలో మరిన్ని గోదాములు మరియు కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం నాబార్డ్‌, ఆర్‌ఐడిఎఫ్‌ నిధులను ఉపయోగించుకోవాలని సూచించారు. రైతులు మాత్రమే ఉత్పత్తులను అమ్ముకునేలా రైతుబజార్లను పకడ్భందిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం అన్ని మార్కెట్లు మరియు రైతు బజార్లలో సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్లలో డిజిటల్‌ బోర్డుల ఏర్పాటుపై ఆరా తీశారు. మార్కెట్‌ యార్డుల పునర్విభజనకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని వెంటనే ఏర్పాటు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు.
వానాకాలం సీజన్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇప్పటికే 40 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను జిల్లాల వారిగా సిద్ధం చేసామని, రానున్న 10,15 రోజుల్లో 2 కోట్ల విత్తన ప్యాకెట్లు రైతులకు అందుబాటులో ఉంచుతామని వ్యవసాయశాఖ సంచాలకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి సూచించారు. పచ్చిరొట్ట విత్తనాల అందుబాటుపై మంత్రి ఆరా తీశారు. సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అలాగే మే నెలాఖరు వరకు 2 లక్షల మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి, వాటి ఫలితాలు రెండు నెలలలోపు రైతులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేగాక ప్రతి రైతుకు మట్టి నమూనా పరీక్ష ఫలితాలు అందేవిధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని మార్కెట్‌ యార్డులలో, రైతు వేదికలలో ఈ సౌకర్యాన్ని కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మట్టి నమూనా పరీక్షల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలో రైతులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
మార్క్‌ ఫెడ్‌ ఆధ్వర్యంలో వివిధ రకాల పంట ఉత్పత్తుల సేకరణ గురించి ఆరా తీసిన మంత్రిగారు, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఇప్పటికే లక్ష మెట్రిక్‌ టన్నుల జొన్నలను సేకరించామని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా కూడా రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అదే సమయంలో జొన్నల సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పిఏసిఎస్‌ సీఈఓల బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని, తదనుగుణంగా స్టేట్‌ లెవల్‌ కమిటీ ద్వారా బదిలీలపై వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రిగారు ఆదేశించారు. కొత్తగా ప్రతిపాదించిన పిఏసిఎస్‌ లను పరిశీలించి, రైతులకు ఉపయోగపడే విధంగా నిబంధనలకు అనుగుణంగా తుదిజాబితా తయారుచేయాలన్నారు. అలాగే 311 పిఏసిఎస్‌ లను ఎఫ్‌పిఓ లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పిఏసిఎస్‌ మరియు డిసిసిబి లకు సంబంధించి ఎంక్వైరీ పూర్తయి, సర్‌ చార్జీ ఉత్తర్వులు జారీచేయడమైనదని, దానిలో భాగంగా ఇప్పటివరకు 6 కోట్ల 38 లక్షల రివకరి పూర్తి అయిందని, ఇంకా 19 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని, అలాగే 74 సర్‌ చార్జ్‌ లు పెండింగ్‌ ఉన్నాయని అధికారులకు మంత్రికి తెలియజేయగా, మిగిలిన రికవరీని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
గత పదిసంవత్సరాలుగా అపెక్స్‌ సహకార సంఘాల ఆడిట్‌ ఎందుకు జరగలేదని ఆడిట్‌ అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత ఆడిట్‌ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌సిఎస్‌ కమిషనర్‌ ను ఆదేశించారు. అదేవిధంగా అన్ని అపెక్స్‌ సహకార సంఘాలను ఆడిట్‌ చేయాలన్నారు.
2021 లో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేసిన 2800 మంది రైతులనుండి పంట వస్తుందా? లేదా అని మంత్రిగారు ఆరా తీశారు. ఒకవేళ పంట రాకపోతే అందుకు గల కారణాలు తెలుసుకొని, దానికి నివారణ చర్యలను రైతులకు తెలియజేయాలన్నారు. రైతు పొలంలోకి ఎట్టిపరిస్థితులలో కూడా ఆఫ్‌ టైప్‌ మొక్కలు వెళ్లకూడదని మంత్రిగారు స్పష్టం చేశారు. ఆయిల్‌ఫెడ్‌ సంస్థ మిగతా అన్ని కంపెనీలకు మార్గదర్శకంగా ఉండేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా, సహకార అడిషనల్‌ రిజిస్ట్రార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీమతి లక్ష్మీబాయి మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

సమగ్ర విత్తన చట్టం తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం

రైతు ప్రయోజనాల పరిరక్షనే చట్టం పరమావధి కావాలి.

  • ప్రస్తుతం ఉన్న చట్టంలో నష్టపరిహారం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
  • వివిధ రాష్ట్రాలలో విత్తనచట్టం 1966కు అదనంగా అమలు అవుతున్న చట్టాలపై చర్చ
    1966లో తీసుకొచ్చిన విత్తన చట్టం మారిన పరిస్థితుల దృష్ట్యా మరియు స్థానిక అవసరాల దృష్ట్యా వాటిలో కొన్ని అదనపు రూల్స్‌ లేదా క్లాజ్‌లను కలపాల్సి ఉంటుందని, మరీ ముఖ్యంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కంపెనీల ఆర్‌ అండ్‌ డి వసతులపై నిరంతర నిఘా అవసరమని, ఎవరైనా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తే తీసుకొనే చర్యలు కఠినంగా రూపొందించాలని, అదేవిధంగా విత్తనోత్పత్తి రైతులను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చే విధంగా విత్తనచట్టం 1966లో కొన్ని మార్పులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన జరిగిన సమగ్ర విత్తన చట్టం, ఆవశ్యకత, చట్టంలో అదనంగా చేర్చాల్సిన అంశాలు, మున్నగువాటిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మార్పులు కూడా చట్టాల పరిధిలోకి లోబడి తీసుకొచ్చేవిధంగా ముసాయిదా రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి సమావేశంలో సభ్యులు వెల్లిబుచ్చిన అభిప్రాయాలు అన్నిటినీ పరిగణలోనికి తీసుకోవాలని ఆదేశించారు. 3 నుండి 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన ఒక నిర్ధిష్టమైన కాలపరిమితిలో 3 నెలలలో ముసాయిదా సిద్ధం అయ్యేట్లు చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయకమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, డైరెక్టర్‌ గోపి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
    ఛైర్మన్‌ కోదండరెడ్డి మాట్లాడుతూ…. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో విత్తనచట్టంలో మార్పుల కోసం కొన్ని ప్రయత్నాలు జరిగాయని, అప్పటి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే బి.టి కాటన్‌ విత్తనం ధర రూ.1800 నుండి రూ. 650కి రావడం జరిగిందని తెలిపారు.
    సునీల్‌ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాల వివరాలు ముఖ్యంగా మహారాష్ట్రలో అమలవుతున్న పరిహారం చెల్లింపు వంటివి పరిశీలించవచ్చని తెలిపారు.
    వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి రాష్ట్రంగా ఉందని, విత్తన రైతుల ప్రయోజనాలు కూడా కాపాడేవిధంగా చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
Read More

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష

మిర్చి మరియు కందుల కొనుగోళ్లపై ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, అగ్రికల్చర్‌ డైరెక్టర్‌ గోపి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌లతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్‌ యార్డులలో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురవకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర పొందేలా జిల్లాలలో రిజనల్‌ మరియు సీనియర్‌ ఆఫీసర్లను పంపించాలని అధికారులను ఆదేశించారు.

Read More

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఆయిల్‌ పాం సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నేడు సచివాలయంలో ఆయిల్‌ పాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రిగారు.. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో 16,729 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగు చేపట్టగా, మార్చిలోగా 19,271 ఎకరాలలో ఆయిల్‌ పాం సాగయ్యేటట్టు చర్యలు తీసుకొని, లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయిల్‌ పాం గెలల ధర కూడా పెరిగినందున రైతులను ఆయిల్‌ పాం సాగు వైపు ప్రోత్సహించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టలన్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్‌ పాం ప్రాసెసింగ్‌ యూనిట్‌ జూన్‌ 1 కల్లా పూర్తి చేసి, ఆయిల్‌ పాం గెలల ప్రాసెసింగ్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌పల్లి, కల్లూరు గూడెంలలో ప్రాసెసింగ్‌ ప్యాక్టరీల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టి, పనులు ప్రారంభించాలన్నారు. దీనివలన ఆయిల్‌ పాం సాగు చేపడుతున్న కొత్త జిల్లాలలో రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు, కొత్త రైతులు ముందకు రావడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను సంస్థ పేరు మీదకు మార్చుకొని, చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్పోరేట్‌ సంస్థ మాదిరిగా పనిచేసేందుకు కార్పోరేట్‌ మోడల్లో వివిధ విభాగాలకు నిపుణత కలిగిన సిబ్బందిని నియమించుకునేట్టుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

*సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌, సిరిసిల్ల (సెస్‌)*

నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరాను రైతులకు మరియు పవర్‌ లూమ్‌ పరిశ్రమకు అందించాలని సెస్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. అదనంగా ట్రాన్స్‌ ఫార్మర్లను అందుబాటులో ఉంచుకొని, సమస్య వచ్చిన వెంటనే మార్చి, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా విద్యుత్‌ రెగ్యులేటరి కమిషన్‌ నియమాల ప్రకారం సంస్థను నడిపించాలన్నారు. సంస్థ సిబ్బంది ప్రజాప్రతినిధులను కలుపుకొని వారి సూచనల మేరకు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

*చేనేత జౌళి శాఖ*

చేనేత అభయ హస్తము పథకంను ప్రణాళికబద్దంగా అమలు చేయాలన్నారు. ఈ పథకమును త్వరితగతిన అమలు చేయుటకు నేత కార్మికులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మరమగ్గాల యూనిట్లకు 25 హెచ్‌పి వరకు 50% విద్యుత్‌ సబ్సిడీ అమలు చేయాలని, యారన్‌ డిపో ద్వారా ఆసాములకు మాత్రమే నూలు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆసాములకు నూలుకు అవసరమగు పెట్టుబడిని బ్యాంకుల ద్వారా అందజేయుటకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. తద్వారా ఆసాములు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా నూలు కొనుగోలు చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. యారన్‌ డిపో లో నూలు స్టాకులను పెంచి నూలు కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. జీ.వో.ఎంఎస్‌.నం. 1, తేదీ: 18.03.2024 ప్రకారము ఏ ఏ శాఖలు ఇప్పటిదాకా తమకు కావాల్సిన వస్త్ర ఇండెట్లు టెస్కో కు సమర్పించడం లేదో ఆయా శాఖల మీద చర్యలు తీసుకొనుటకు, చేనేత సహకార సంఘాలకు మరియు పవర్‌ లూమ్‌ సంఘాలకు టెస్కో ద్వారా చెల్లించవలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాలలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్‌, వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌ రావు, సహకారశాఖ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More