తెలంగాణా రాష్ట్రంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్ మరియు సీసీఐ అధికారులను వ్యవసాయాశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యకక్షుడు రవీందర్తో కూడా మాట్లాడిన మంత్రి, మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.


