34.60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము

ప్రస్తుత ఖరీఫ్‌లో 34.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇది గతేడాది కంటే ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నులు అదనం అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5.59 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి రూ.8,206 కోట్లు చెల్లించాం. రైతులు నష్టపోకుండా మద్దతుధర అందించాం. ఎన్టీఆర్‌ భరోసా కింద రూ.50 వేల కోట్లు పింఛన్ల కింద ప్రజలకు అందజేశాం. ప్రస్తుతం పెద్దఎత్తున రోడ్లు నిర్మిస్తున్నాం. ఇందుకోసం తాజాగా రూ.2,500 కోట్లు కేటాయించాం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ కార్యక్రమాన్ని చేపట్టి, పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. డేటా లేక్‌ ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది’ అని మనోహర్‌ వివరించారు.

Read More

సరిపడా యూరియా నిల్వలు

యాసంగి సీజన్‌కు రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలున్నందున యూరియా సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌లతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. ఇంటి నుంచి బుకింగ్‌ కోసం ఏర్పాటుచేసిన యాప్‌ ద్వారా 82,059 మంది 2,01,789 బస్తాలు కొనుగోలు చేశారు. జిల్లాల వారీగా యూరియా నిల్వలు, డిమాండ్‌, పంపిణీపై కలెక్టర్లు పరిశీలిస్తూ అవసరమైతే అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి” అని మంత్రి సూచించారు.

సహకార సంఘాలను బలోపేతం కోసం పటిష్ఠ చర్యలు
తెలంగాణలో సహకార సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని హైదరాబాద్‌లో నాబార్డు ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సహకార వారోత్స వాల సదస్సులో మంత్రి తుమ్మల తెలిపారు. ”సహకార సంఘాలను కంప్యూటరీకరించి డిజిటల్‌ సేవలు అందించాం. ఆధార్‌ ఆధారిత చెల్లింపులు, బీమా సాయం అందిస్తున్నాం. 2024- 25లో పీఏసీఎస్‌ ద్వారా రైతులకు రూ.7,500 కోట్ల రుణాలు ఇచ్చాం. 311 సంఘాలను రైతు ఉత్పత్తి సంఘాలుగా మారుస్తున్నాం” అని తుమ్మల తెలిపారు. వంథాతం రుణాల రికవరీ, వ్యాపార నిర్వహణలో పురోగతి సాధించిన 11 ప్రాథమిక వ్యవసాయ సంఘాలకు ఈ సందర్భంగా మంత్రి పురస్కారాలు అందించారు. సమావేశంలో నాబార్డు తెలంగాణ, మహారాష్ట్రల సీజీఎంలు ఉదయభాస్కర్‌, మణికుమార్‌, ఆర్బీఐ ప్రాంతీయ సంచాలకుడు చిన్మయ్‌కుమార్‌, ఎన్‌సీడీసీ రీజనల్‌ డైరెక్టర్‌ శార్దూల్‌ జాదవ్‌, రాష్ట్ర సహకార బ్యాంకుల సంఘం జాతీయ చైర్మన్‌ కొండూరి రవీందర్రావు, తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సాయికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

వ్యవసాయ యంత్రపరికరాలపై 50% సబ్సిడీ

గతంలో ఆగిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునరుద్ధరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.101.83 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. సన్నకారు, చిన్న, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు మంజూరు చేసేందుకు వ్యవసాయశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటికయ్యే ఖర్చులో కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించనున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ (సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌-స్మామ్‌) పథకం కింద కేంద్రం ఇస్తున్న నిధులకు తమ వాటా కలిపి పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రం సన్నద్ధమైంది.

మార్గదర్శకాలు…
పేరొందిన 16 కంపెనీలను గుర్తించి ఎంప్యానెల్‌లో చేర్చింది. వాటి నుంచి రైతులు స్వయంగా పరికరాలను కొనుగోలు చేయాలి. సబ్సిడీని కంపెనీలకు అందజేస్తారు. పంపిణీ చేసిన పరికరాల వినియోగాన్ని వ్యవసాయాధికారులు ఐదేళ్లపాటు పర్యవేక్షించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రూ.లక్ష కంటే ఎక్కువ సబ్సిడీ పొందిన వారు ఆరేళ్లవరకు, రూ.3 వేల నుంచి రూ.లక్ష వరకు పొందిన వారు మూడేళ్ల వరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించింది. రూ. లక్ష, అంత కంటే ఎక్కువ విలువైన యంత్రాలకు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ట్రాక్టర్లు, ఇతర స్వయం చాలిత యంత్రాలకు ఏఐ-ఆధారిత టెలిమాటిక్స్‌ కిట్‌ అమరుస్తారు. దీంతో యంత్రం ఎక్కడ ఉందో, ఎంత పని చేసిందో ట్రాక్‌ చేయవచ్చు. యంత్రాలపై చెరిపివేసే వీలు లేకుండా లేజర్‌ కట్‌తో గుర్తింపు సంఖ్య ఉంటుంది.

సబ్సిడీపై అందుబాటులో ఉండే యంత్రాలు…
విత్తనాలు చల్లే యంత్రాలు, కోత యంత్రాలు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లతో నడిచే రొటోవేటర్లు, ప్లౌ, ట్రాలీ, సీడర్‌, కలుపు తీసే యంత్రాలు, పవర్‌ టిల్లర్లు, వీడర్లు, సీడ్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ డ్రిల్‌, స్ట్రాబాలర్లు, బండ్‌ ఫార్మర్‌ వంటి 15 రకాల యంత్రాలకు ఈ సబ్సిడీ వర్తింపజేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో వీటిని పంపిణీ ప్రారంభించనుంది. ఈ పరికరాలతో పంటల దిగుబడి పెరగడంతో పాటు వ్యవసాయ పనుల్లో సమయం, ఖర్చు రెండూ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Read More

నల్లబర్లీ సాగును అరికట్టాలి

వ్యవసాయశాఖ ఎక్స్‌అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌

నల్లబర్లీ పొగాకు సాగును అరికట్టాలని, తెల్లబర్లీ పొగాకును సాగు చేసే రైతులు సంబంధిత కంపెనీలతో 100% కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ ఎక్స్‌ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ సూచించారు. బర్లీ పొగాకు సాగుపై గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… తెల్లబర్లీ పొగాకు కొనుగోలుకు ఇకపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యతా వహించదని, అనధికార నల్లబర్లీ పొగాకు సాగు కట్టడి చేయడంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాల్ని చైతన్యం చేయాలని సూచించారు. గత ఏడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారి 11,990 మంది రైతుల నుంచి 19.79 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు చేశామని, రూ.146 కోట్లు విడుదల చేశామని వివరించారు. తెల్లబర్లీ పొగాకు సాగుదారుల జాబితాతోపాటు కొనుగోలు ఒప్పందాల వివరాల్ని జత చేసి ఇవ్వాలని డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీని ఆదేశించారు.

Read More

జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాలని ఆదేశం

తెలంగాణా రాష్ట్రంలో ఇంకా ప్రారంభంకాని జిన్నింగ్‌ మిల్లులను వెంటనే ప్రారంభించాల్సిందిగా వ్యవసాయ శాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌ మరియు సీసీఐ అధికారులను వ్యవసాయాశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా 328 జిన్నింగ్‌ మిల్లులు నోటిఫై చేసినప్పటికీ, వాటిలో కొన్ని ఇప్పటికీ కొనుగోళ్లు చేపట్టకపోవడం మంత్రి దృష్టికి వచ్చినట్లు తెలిపారు. జిన్నింగ్‌ మిల్లర్లు సమ్మె విరమించి మిల్లులన్నీ ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ, ఇంకా కొన్నిచోట్ల మిల్లులు పనిచేయకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన్‌ అధ్యకక్షుడు రవీందర్‌తో కూడా మాట్లాడిన మంత్రి, మిగిలిన మిల్లులన్నీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా పత్తి కొనుగోళ్లు నిరంతరంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఇప్పటికే 1.32 లక్షల మంది రైతుల నుండి 2.35 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి సేకరించామని పేర్కొంటూ, కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలన్నారు.

Read More