కోళ్లలో మైకోప్లాస్మోసిస్ వ్యాధి / దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి (సి.ఆర్.డి)

మైకోప్లాస్మా జాతి సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధుల సమూహాన్ని “మైకోప్లాస్మోసిస్” అంటారు. ఈ జాతి సూక్ష్మజీవులు సుమారుగా 17 రకాలున్నప్పటికీ, 2-3 రకాలు మాత్రమే కోళ్లలో వ్యాధిని కలిగిస్తాయి. అవి మైకోప్లాస్మా గాలిసెప్టికం(అన్ని రకాల పక్షులకు), మైకోప్లాస్మా సైనోవి (సాధారణ కోళ్ళు, టర్కీలు, పావురాలు), మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ (ప్రధానంగా టర్కీలకు). ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ సంబందిత లక్షణాలు గమనిస్తాము మరియు దీర్గకాలికంగా ఉంటుంది. అందువలన దీనిని దీర్గ కాలిక శ్వాసకోశ వ్యాధి లేదా క్రానిక్ రేస్పిరెటరి డిసీజ్ (సి.ఆర్.డి) అని అంటారు.

అన్ని వయస్సు కోళ్ళకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. శీతాకాలం వంటి చల్లగా వుండే మాసాల్లో మరియు ఇతర వ్యాధులైనటువంటి ఇ.కోలి, పాశ్చురేల్లోసిస్, ఇన్ఫేక్ట్చువస్ బ్రోoకిటిస్, కొక్కెర తెగులు సోకినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి ఉదృతంగా ఉంటుంది. వ్యాధి సోకిన కోడి ద్వారా, కలుషితమైన గాలి ద్వారా ఆరోగ్యకరమైన ఇతర కోళ్ళకు వ్యాపిస్తుంది. షెడ్ లో కోళ్ళు కిక్కిరిసి వుండి, గాలి, వెలుతురు ప్రసరణ సరిగా లేకుండా ఉన్నప్పుడు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కలుషితమైన లిట్టర్, కోళ్ళ మూత్రం ద్వారా, కలుషితమైన దాణా,  త్రాగునీటి ద్వారా, ఇతర పక్షులు, కోడి పిల్లల బాక్సులు, పరికరాలు, గ్రుడ్ల ట్రే ల ద్వారా, టీకాలు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో పని మనుషుల ద్వారా , బ్రీడింగ్ ఫారాలలో వ్యాధి గ్రస్త పుంజుల వీర్యం ద్వారా, తల్లి కోడి అండాశయం నుండి గ్రుడ్డు ద్వారా కోడిపిల్లలకు వ్యాపిస్తుంది.

లక్షణాలు:
మైకోప్లాస్మా గాలిసెప్టికం బారిన పడిన బ్రాయిలర్ కోళ్లలో 4 వారాల తరువాత మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి బారిన పడిన లేయర్ కోళ్లలో వ్యాధి మెల్లగా వ్యాపిస్తుంది. సూక్ష్మక్రిమి కోళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తరువాత 11-18 రోజుల్లో లక్షణాలు కనబడతాయి. ప్రప్రథమంగా శ్వాసకోశ వ్యవస్థ ప్రభావితం అవుతుంది. అందులోను మొదటగా శ్వాసనాళo పైభాగం ఆశించడం వలన శ్వాస తీసుకోవడం కష్టతరమై కోళ్ళు తల పైకెత్తి గాలి పీల్చుకుంటాయి. అలా శ్వాస తీసుకుంటున్నప్పుడు కూతలు కూడా వినబడుతాయి. ఆ తర్వాత సుక్ష్మక్రిమి గాలిగదులు, శ్వాసనాళం కింది భాగాన్ని ఆశించినప్పుడు గాలి గదులు వాచిపోతాయి. శ్వాసనాళంలో నెమ్ము చేరడం వలన గురక శబ్దం వస్తూ ఉంటుంది. కళ్ళు, ముక్కు నుండి నీరు కారుతూ ఉంటుంది. చిన్న పిల్లలలో 30% వరకు మరణాలు సంభవిస్తాయి. గ్రుడ్ల ఉత్పత్తి 20-30% తగ్గిపోతుంది. మేత వినియోగం తగ్గటం వలన పెరిగే కోళ్లలో పెరుగుదల రేటు తగ్గి బరువు తగ్గిపోతుంది. కొన్ని సందర్భాలలో నీళ్ళ విరోచనాలుంటాయి. ఇంకా పెరికార్దిటిస్, పెరిటోనిటిస్, పెరిహేపటైటిస్ తరచుగా కనబడతాయి.

మైకోప్లాస్మా సైనోవి తరచుగా 4-12 వారాల కోడిపిల్లలకు, అలాగే 10-12 వారాల టర్కీకోళ్ళకు సోకుతుంది. ఇది ప్రధానంగా కీళ్ళను ప్రభావితం చేయడం వలన కీళ్ళ వాపులు, కీళ్ళ మధ్యలో మరియు టేండాన్ పొరలలో తెల్లటి చిక్కటి ద్రవం చేరి, కోళ్ళు కుంటుతూ ఉంటాయి.

మైకోప్లాస్మా మిలియాగ్రిడిస్ వ్యాధి బారిన పడిన టర్కీ కోళ్ళలో శ్వాస కష్టమవటం, తక్కువ శరీర పెరుగుదల, మెడ మరియు కాళ్ళ కీళ్ళలో వాపు, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటం, పొదిగే గ్రుడ్ల నుండి పిల్లల ఉత్పత్తి తగ్గటం, అధిక మరణాలు సంభవించడం వంటివి గమనిస్తాము.

పోస్ట్ మార్టెం చేసి చూస్తే:
శ్వాసనాళం ఫైభాగంలో రక్తస్రావాలు ఉంటాయి. తెల్లటి జిగట పదార్ధం కనబడుతుంది. గాలి గదులు మందమై కందిపోయి జున్ను లాంటి పదార్ధం పేరుకొని ఉంటుంది. గుండె, కాలేయం మీద పలుచని పొర ఏర్పడుతుంది.
చికిత్స : వ్యాధి గ్రస్త కోళ్ళకు థయాముటిన్, టైలోసిన్ వంటి యాంటిబయోటిక్ మందులను త్రాగే నీళ్ళలో లేదా ఇంజక్షన్ రూపంలో 5-7 రోజులు వాడాలి. ఇవే కాకుండా ఆక్సిటెట్రాసైక్లిన్, క్లోర్టెట్రాసైక్లిన్ ను టన్ను దాణాలో 200-400 గ్రా. చొప్పున కలిపి కూడా వాడవచ్చు.

నివారణ :

  • పెద్ద కోళ్ళు, కోడి పిల్లలు ఒకే షెడ్లో కాకుండా వేర్వేరు షెడ్లలో ఉంచాలి. ఈ షెడ్లు దూరంగా, ఎడంగా ఉండాలి.
  • కొత్తగా పిల్లలు తెచ్చే ముందు, షెడ్లను పొటాషియం పెర్మంగానేట్ మరియు ఫార్మలిన్ ద్రావణంతో ఫుమిగేషన్ చేసి 2-3 వారాలు ఖాళీగా ఉంచాలి.
  • కోళ్ళ ఫారాలలో కోళ్ళు కిక్కిరిసి, గుమికూడి ఉండకుండా చూడాలి. అందుకొరకు సరిపోను స్థలం కేటాయించాలి.
  • అధిక చలి మరియు గాలి, వెలుతురు లోపం వలన ఈ వ్యాధి వ్యాపిస్తుంది. కావున గాలి,వెలుతురు సక్రమంగా ప్రసరించేలా చూడాలి.
  • టీకాలు, ఏలికపాముల మందు వేసే సమయంలో, ముక్కు కత్తిరించే సమయంలో కోళ్ళు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
  • పాత లిట్టర్ తొలగించి, అమోనియా వాయువును నివారించాలి.
  • వ్యాధితో మరణించిన కోళ్ళను కాల్చి వేయాలి. వ్యాధి సోకిన వాటిని వెంటనే వేరు చేయాలి.
  • వాహనాలు, దాణా బస్తాలు, క్రేట్లు, పరికరాల ద్వారా వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్త వహించాలి.
  • కోళ్ళ షెడ్లు మరియు పరికరాలను శుభ్రం చేయడానికి ప్రతిపాదిత క్రిమిసంహారణిలైనటువంటి ఫినోలిక్ ఆమ్లం, క్రెసాలిక్ ఆమ్లం, హైపోక్లోరైట్, 10% ఫార్మలిన్, 0.1% గ్లుటరాల్దిహైడ్, బ్లీచింగ్ పౌడర్ ను వాడాలి.

డా. టి. విజయ నిర్మల శాస్త్రవేత్త (పశువైద్య విభాగం), డా. ఎన్. శ్రీ విద్య రాణి శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. బి.ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త (గృహ విజ్ఞాన విభాగం), డా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్, శాస్త్రవేత్త (ఉద్యాన విభాగం), డా. ఎం.బాలకృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట, వై.ఎస్.ఆర్. కడప జిల్లా-516173, డా. గోవిందరాజులు, ఎ.డి.ఆర్., ఆర్.హెచ్.ఆర్.ఎస్., తిరుపతి & డా. సి.హెచ్. రూత్, విస్తరణ సంచాలకులు, వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా
ఫోన్ : 8121136184

Read More

ఆరోగ్యకరమైన లేయర్ పుల్లెట్ కోళ్లు – లాభాల సిరులు

లాభదాయకమైన లేయర్ల పెంపకం నాణ్యమైన పుల్లెట్‌ల పెంపకం నుండే ప్రారంభం అవుతుంది. తక్కువ వయసున్న పుల్లెట్‌లు అండోత్పత్తి దశకు చేరే సమయానికి సరైన శరీర బరువు ఉన్నట్లయితే వాటి జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు అవుతుంది.

షెడ్ ఏర్పాటుచేసుకోవడం:
పాత బ్యాచ్ తీసి వేసిన తరువాత కొత్త బ్యాచ్ మొదలు పెట్టడానికి కనీసం 3 వారాల విరామ సమయాన్ని పాటించాలి. షెడ్‌ని శుబ్రపరిచే ముందు షెడ్‌లో ఉన్న మేత మరియు కోళ్ల లిట్టర్‌ని తొలగించి, ఎలుకల నియంత్రణ కూడా చేపట్టాలి. షెడ్ మొత్తాన్ని అధిక ప్రెషర్ కలిగిన నీటి జెట్ వాషర్ సహాయంతో కడగాలి. ఇదే సమయంలో షెడ్‌కి కావలసిన మరమ్మతులు చేయించుకుని పెట్టుకోవాలి. పాత బ్యాచ్ కోళ్లను తీసి వేసిన తర్వాత ఆ బ్యాచ్‌లో ఉపయోగించిన ఫీడర్లు, డ్రింకర్లను తీసేసి ముందుగా డిటర్ౙెంట్‌తో బాగా కడిగి, తర్వాత డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణంలో ఒక రాత్రి అంతా నానబెట్టి, మరుసటి రోజు శుభ్రమైన నీటితో కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన బాక్టీరియాలు చనిపోతాయి. తరువాత పాత బ్యాచ్ లిట్టర్ అంతా పూర్తిగా తీసేయాలి. కడిగే సమయంలో షెడ్డు పై కప్పు నుంచి మొదలు పెట్టి తర్వాత గోడలు, ఆపై నేలను శుభ్రం చేసుకోవాలి. నేలను ప్రెషర్ వాషెర్ సహాయంతో శుభ్రం చేసి, డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. నేల మొత్తాన్ని ఫ్లేమ్ గన్ సహాయంతో కాల్చాలి. ఇలా కాల్చటం వలన క్రిములు, కోడి ఈకలు మరియు వాటిపై ఉండే క్రిములు అన్నీ నశిస్తాయి. మట్టి నేల ఐతే పొడి సున్నాన్ని చల్లాలి, కాంక్రీట్ ఫ్లోర్ ఉన్నట్లయితే సున్నంతో వైట్ వాషింగ్ చేయించుకోవాలి. ఇదే సమయంలో వాటర్ ట్యాంక్ మరియు నీటి పరికరాలు అన్నీ శుభ్రం చేసుకోవాలి. వాటర్ లైన్‌లు శుభ్రపరుచుటకు లిదీబీజిరిదిజిరిదీ, ఔ904, ఇతర డిస్ ఇన్ఫిక్టన్ట్ ద్రావణాలు వాడాలి, తర్వాత శుభ్రమైన నీటితో కడగవలెను.

కోడి పిల్లలు రాకముందు:
కోడిపిల్లలు రావడానికి 48 గంటల ముందుగానే షెడ్ రెడీ చేసుకోవాలి. కోడి పిల్లలు షెడ్ కి చేరుకునే సమయానికి షెడ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా, షెడ్ సైజుని బట్టి ముందుగానే లైట్లు ఆన్ చేసుకోవాలి. దీనివలన షెడ్ లోపల వాతావరణం సరైన ఉష్ణోగ్రతకి చేరుకుంటుంది. ఫీడర్లలో దాణా కనిపించేలా వెలుతురు 30 – 35 లక్స్ ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన తాజా చిక్ స్టార్టర్ దాణాని ఫీడర్లలో నింపాలి. అలాగే కోడి పిల్ల తాగడానికి అనువుగా డ్రింకర్లలో నీటిని నింపి తగిన ఎత్తులో అమర్చాలి. ఒత్తిడిని తగ్గించడానికి నీటిలో విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్ కలపాలి.

కోడి పిల్లల నాణ్యతః
కోడిపిల్లలను నాణ్యమైన పేరెంట్స్ / హేచరీ నుండి తీసుకోవాలి. కోడిపిల్లలు మంచి బరువుతో పూర్తిగా ఆరిపోయి మరియు బొడ్డు బాగా నయమై ఉండాలి. కాళ్ళు నిటారుగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. మొదటి రోజునే మారెక్స్ వ్యాధి రాకుండా హెచ్‌వీటి స్ట్రెయిన్ టీకా వేయించాలి.

బ్రూడింగ్ – అతి ప్రధానం:
కోడి పిల్లల జీవితంలో మొదటి రెండు వారాలు క్లిష్టమైనవి.అపుడే పుట్టిన కోడిపిల్లలు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. కావున వాటికి అనువైన వాతావరణాన్ని అందించాలి. కేజ్‌లో కోడి పిల్లల కాళ్ళు ఇరుక్కోకుండా న్యూస్ పేపర్‌ని పరచాలి. కోడి పిల్లలను కేజ్‌లో పెంచుతున్నట్లు ఐతే న్యూస్ పేపర్ మీద దాణాని చల్లి ఉంచాలి, ఇలా చేయడం ద్వారా కోడి పిల్లలలో దాణా తినడాన్ని ప్రేరేపించవచ్చు. కోడి పిల్లలు ఎంత తొందరగా తినడం మొదలుపెడతాయో అంత వేగంగా వాటి ఎదుగుదల ఉంటుంది. హేచరీ నుండి బయటికి వచ్చాక ఎంత తొందరగా తింటే అంత ఆరోగ్యాంగా ఉంటాయి, లేకపోతే డీహైడ్రేషన్ వలన బలహీనం అవుతాయి. కేజ్‌లలో పిల్లలు నేల మీద పిల్లల లాగా కదల్లేవు కాబట్టి వాటికి కావలసిన ఉష్ణోగ్రత మరియు తేమని అందించాలి.

షెడ్లలో పాటించాల్సిన ఉష్ణోగ్రతలు
వయస్సు (రోజులలో) కావాల్సిన ఉష్ణోగ్రత (డిగ్రీల సెంటీగ్రేడ్)
1-7 32-33
8-14 28-30
15-21 26-28
22-28 23-26
28-35 21-23

సరైన బరువును చేరుకోవడానికి కోడి పిల్లల నిర్వహణః
ఒక క్రమబద్ధమైన సమతుల్యమైన పెరుగుదల రేటును అనుసరిస్తూ కోడి పిల్లలు ఎదుగుతాయి. ఎదిగేటపుడు వాటికి కావలసిన పోషణ, టీకాలు, సరైన నిర్వహణ, లైటింగ్ / వెలుతురు అందించినపుడు, కోళ్లు జాతి / బ్రీడ్ జన్యు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఎదిగే దశలో బ్రీడ్ సామర్థ్యానికి తక్కువ బరువు ఉండే కోళ్ళలో అవయవాలు సరిగా అభివృద్ధి చెందక, దీని ప్రభావం గుడ్లు పెట్టే దశలో కన్పిస్తుంది. దీనివల్ల గుడ్ల సంఖ్య తగ్గిపోవడం, చిన్న గుడ్లు రావడం లేదా దాణా వినియోగం తగ్గిపోవడం జరిగి రైతులు నష్టపోతారు.

ఎదిగే దశను 3 భాగాలుగా విభజించవచ్చు.
0-6 వారాల వయసు వరకు: ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో ఎలాంటి పోషక లోపమైన, ఫారం నిర్వహణలో జరిగే లోపాలు ఈ రెండు వ్యవస్థలను శాశ్వతంగా దెబ్బ తీస్తాయి. దీని వలన కోళ్లు తేలికగా వ్యాధులకు గురి అవుతాయి.

6-12 వారాల వయసు వరకు: ఈ సమయంలో కోళ్ల కండరాలు, ఎముకలు, ఈకలు వేగంగా వృద్ధి చెందుతాయి. 12-13 వారాలు వచ్చే సరికి 95 % అస్థిపంజరం అభివృద్ధి చెందుతుంది. ఆ తరువాత ఎముకలలో ఎదుగుదల ఉండదు. కోడి అస్థిపంజరం పరిమాణాన్ని బట్టి గుడ్డు పెంకు నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఎదుగుదల సరిగా లేని కోళ్ళ గుడ్డు పెంకు బలహీనంగా ఉండి గుడ్లు తొందరగా పగిలిపోవడం జరిగి రైతుకు నష్టం కలుగుతుంది.

13-17 వారాల వయసు వరకు: ఈ సమయంలో శరీర ఎదుగుదల తగ్గి జననేంద్రియాలు వృద్ధి పెరిగి అండోత్పత్తికి సిద్దం అవుతాయి. శరీరంలోని కండరాలు మరియు ఫ్యాట్ అభివృద్ధి సాగుతూనే ఉంటుంది. ఈ దశలో శరీర బరువు 17-18 వారాలలో ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే అండోత్పత్తి ఆలస్యం అవుతుంది.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య దశలు:

  1. బ్రూడింగ్ – ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చూడాలి. కాలాన్ని మరియు వయసును బట్టి ఉష్ణోగ్రతను మారుస్తూ ఉండాలి.
  2. 5వ వారం కనీస శరీర బరువు 350 గ్రా. ఉండేలా చూసుకోవాలి. ప్రతి వారం సాంపిల్ బరువులు నిర్దిష్ట బరువుతో సరిచూసుకోవాలి. ఒకవేళ నిర్దిష్ట బరువు లేనట్లయితే దానికి గల కారణాలను వెంటనే సవరించుకోవాలి. ఉదాహరణకి దాణాలో పోషకాల లోపం, ఫీడర్ల మరియు డ్రింకర్ల సంఖ్య కావాల్సిన దానికన్నా తక్కువగా ఉండడం మరియు వాటి ఎత్తు కోళ్ల ఎత్తుకి ఎప్పటికపుడు సర్దుబాటు చేయడం.
  3. ముక్కు కత్తిరించడం బిక్ ట్రిమ్మింగ్ :
  • కోడి పిల్లల ముక్కు ముందు భాగాన్ని బిక్ ట్రిమ్మర్‌లో పెట్టి, సరైన ఉష్ణోగ్రత అనగా బ్లేడ్ 650 సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత కు చేరుకున్నాక కోడి పిల్ల పరిమాణం బట్టి ఈ సైజు రంద్రాన్ని వాడాలో నిర్ణయించుకోవాలి.
  • ట్రిమ్మింగ్ బ్లేడ్ నారింజ ఎరుపు రంగుకు చేరినట్లయితే అది 650 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్లు గుర్తించాలి.
  • 10 -14 రోజుల వయసులో మొదటి సారి, 14 వారాల లోపు ఇంకొకసారి ముక్కును కత్తిరించుకోవాలి.
  • రెండవసారి ముక్కు కత్తిరించడం 14 వారాల లోపు చేయాలి, తర్వాత చేస్తే అంటే 15 -17 వారాల వయసులో చేయడం వలన నొప్పికి దాణా మరియు నీరు సరిగా తీసుకోక పోషక లోపం జరిగి జననేంద్రియాల అభివృద్ధికి ఒత్తిడి కలిగి గుడ్లు పెట్టడం ఆలస్యమవడమే కాకుండా చిన్న గుడ్లు ఎక్కువ సంఖ్యలో వచ్ౘ్ి రైతులు నష్టపోతారు.
  1. సమయానికి బ్రూడర్ కేజ్ ల నుండి గ్రోవర్ కేజ్ లోకి మార్చాలి.
  2. బ్రూడింగ్ నుండి గ్రోయింగ్ షెడ్లలో ఒకేరకమైన నీటి వ్యవస్థని వాడాలి.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య అంశాలు:
శరీర బరువు పర్యవేక్షణ :

  • ఒక వారం వయసు నుండి కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించే వయసు వరకు ప్రతి వారం కోడిపిల్లల బరువు చూడాలి. 4 వారాల వరకు గ్రూప్ బరువు, 4 వారాల నుండి 18 వారాల వరకు విడివిడిగా బరువును చూడాలి. తరువాత రెండు వారాలకు ఒకసారి బరువులు చూసినట్లయితే సరిపోతుంది.
  • కేజ్ లలో కోళ్లను ఒకే దగ్గరనుండి కాకుండా మొదటి కేజ్‌లు, చివరి కేజ్‌లు మరియు మధ్య కేజ్‌లలో నుండి తీసుకోవాలి. అదేవిదంగా పైనుండి, మధ్య కేజ్‌లు మరియు కింద వరస కేజ్‌లలోనుండి కోళ్లను ఎంచుకోవాలి.
  • ఇలా పర్యవేక్షించడం ద్వారా వాటి ఎదుగుదలలో సమస్యలను వెంటనే గుర్తించి దాణాలో మార్పులను సరిచేసుకోవచ్చు. తక్కువ బరువులున్న కోళ్లను గ్రేడింగ్ చేసి షెడ్‌లో ఒకవైపు కేజ్‌లలోకి మార్చి కొన్ని రోజులు వాటికి స్టార్టర్ దాణాని అందించాలి.

శరీర బరువు ఏకరూపతః

  • శరీర బరువు ఏకరూపత అనేది భవిష్యత్తులో వాటి అండోత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎదిగే వయసులో 85% ఉండాలి, ఇలా ఉంటే అన్ని కోళ్లు ఒకేసారి అండోత్పత్తికి చేరి అధిక గుడ్లు ఉత్పత్తి చేస్తాయి.
  • యూనిఫార్మిటీ అనేది కంపెనీ స్టాండర్డ్‌తో సరిగా ఉంటే గుడ్ల ఉత్ఫత్తి మరియు గుడ్ల బరువులో తేడాలు లేకుండా ఉంటాయి, తద్వారా రైతు మంచి లాభాలను పొందవచ్చు.

లైటింగ్:

  • లైటింగ్ అనేది గుడ్లు పెట్టె కోళ్ళలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సమయానికి లైటింగ్ అనేది ఇవ్వకపోతే గుడ్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. లైటింగ్ లో రెండు అంశాలు – లైటింగ్ వ్యవధి మరియు తీవ్రత.
  • మొదటి 3 రోజులు 23 గంటలు, 3 వ రోజు నుండి – 3 వారాల వరకు నెమ్మదిగా 23 గంటల నుండి 16 గంటల లైటింగ్ వ్యవధికి తగ్గిస్తూ రావాలి. 4 వ వారం నుండి 7వ వారం వరకు వారానికి ఒక రోజు చొప్పున 12 గంటల వ్యవధికి తగ్గించాలి. 8 వ వారం నుండి 16 /17 వారం లేదా నిర్ణీత శరీర బరువు వచ్చే వరకు సహజంగా వచ్చే లైటింగ్ మాత్రమే ఇవ్వాలి. నిర్ణీత బరువు చేరుకున్నాక లైట్‌తో ప్రేరేపించాలి.
  • శరీర బరువు నిర్ణీత బరువు కన్నా తక్కువ ఉంటే లైట్‌తో ప్రేరేపించడం ఆలస్యం చేయాలి.

కాంతి తీవ్రతః
వయసు 0-7 రోజులు 1-4 వారాలు 4-17 వారాలు >17 వారాలు గుడ్లు పెట్టే దశలో
Lux Min–20 10 6 10 30-35

  • నిర్ణీత బరువు రాకముందే లైటింగ్ ఇచ్చినా లేదా లైటింగ్ తీవ్రత 30 Lux కన్నా ఎక్కువ ఇస్తే కోళ్ళలో ప్రోలాప్స్ వచ్చే ప్రమాదం ఉంది. కావున లైటింగ్ ఇచ్చే ముందు బరువు సరిచూసుకోవడం చాల ముఖ్యం.
    ఎదిగే దశలో ఎదురయ్యే సమస్యలు దీర్ఘ కాలంలో అండోత్పత్తి దశలో గుడ్ల సంఖ్య, సైజు మరియు గుడ్ల పెంకు యొక్క నాణ్యతపై ప్రభావం చూపుతాయి, కాబట్టి పూర్తి శ్రద్ధతో అన్ని అంశాలను పాటించి సరైన శరీర బరువు చేరుకునేలా పుల్లెట్ కోళ్లను పెంచినట్లయితే అధిక లాభాలను అందుకోవచ్చు.
    పుల్లెట్ కోళ్లను పెంచే క్రమంలో పైన తెలిపిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ అవి గుడ్లు పెట్టడం ప్రారంభించిన తరువాత వచ్చే చాలా సమస్యలను అధిగమిస్తూ, ఆశించిన స్థాయిలో ఫలితాలను చూడవచ్చు.

డా. కె. ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోళ్ల శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్, పివిఎనఆర్‌టివియు, ఫోన్: 7013179181

Read More