సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ మిల్లెట్స్ అండ్ ఇంక్యుబేషన్ కేంద్రం (సీఓఈఎం) చిరుధాన్యాలను ‘రెడీ టూ ఈట్’లా సిద్ధం చేస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన ఈ సంస్థ.. ఔత్సాహికులకు ఆయా సాంకేతికతలను అందిస్తోంది. మైసూరులోని సీఎస్‌ఐఆర్ – సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఎఐ) లో గతేడాది డిసెంబరులో సీఓఈఎం ఏర్పాటైంది. ఏడాది పూర్తి చేసుకోబోతున్న ఈ కేంద్రం.. చిరుధాన్యాలలో సాధించిన ఘన ఆవిష్కరణలు…
గంటకు 500 కిలోల సామర్థ్యం
చిరుధాన్యాల ఉత్పత్తిలో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. రైతులు మాత్రం అవగాహన లేక నష్టపోతున్నారు. సీఓఈఎం ముందుగా రైతు నుంచి కార్యాచరణ మొదలుపెట్టింది. రూ.20 కోట్లతో 3 రకాల ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ధాన్యాన్ని నేరుగా ఈ కేంద్రాలకు తరలించేలా అవగాహన కల్పించింది. ధాన్యం నాణ్యత, శుద్ధి, అనుబంధ ఉత్పత్తుల తయారీ రైతుల కళ్లముందే చేపడుతోంది. ప్రత్యేక ప్రాసెసింగ్ యంత్రాలతో గంటకు 500 కిలోల ధాన్యం శుద్ధి చేసి, ఉత్పత్తులనూ తయారు చేయడంతో రైతులకు కేంద్రంపై గురి కుదిరింది.
మెక్ డొనాల్డ్ మెచ్చింది
సీఓఈఎంలో జొన్న, రాగి, సజ్జ తదితర ధాన్యాలతో చేసిన బన్.. మెక్‌డొనాల్డ్ సంస్థకు ఎంతో నచ్చింది. దాన్ని ‘మిల్లెట్ బన్ బర్గర్’గా మార్చి ప్రపంచ విపణికి పరిచయం చేసింది.
వివిధ రకాల ఉత్పత్తులు
చిరుధాన్యాలు శుద్ధి చేసేటప్పుడు వచ్చే వ్యర్థాలనూ ఈ ఇంక్యుబేషన్ కేంద్రంలో వృథాగా పోనివ్వడం లేదు. రాగి పొట్టు నుంచి అయిల్, విరిగిన రాగులతో సేలాలు, పగుళ్లిచ్చిన గింజలతో ‘రాగి రైస్’, నూకతో రవ్వ, మురుకులు ఇలా.. ఒక్క రాగులతోనే 45 రకాల ఉత్పత్తులు చేస్తోంది. వాటికి అదనపు పోషకాలూ జోడిస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో 9 రకాల ధాన్యాలను 190 రకాల ఉత్పత్తులుగా మలిచే వ్యవస్థలున్నాయి. బయో డిగ్రేడబుల్, తినదగిన ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలు తయారు చేస్తోంది. వినియోగదారుడు కోరుకున్న రంగులు, రుచులను చేర్చేందుకు ఎలక్ట్రానిక్స్ నోస్, మౌత్ అప్లికేషన్లు, ప్యాకేజింగ్ వ్యవస్థలూ తీసుకొచ్చింది.
నిల్వకు పెద్దపీట..
- చిరు ధాన్యాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం ఉన్నా.. వాటి పిండి, రవ్వ ఇతర ఉత్పత్తుల నిల్వ కాలం తక్కువ.
- సీఓఈఎం ప్రత్యేక పద్ధతుల్లో 4-5 నెలలపాటు నిల్వ చేసుకునేలా చేసింది.
- ఇందుకు తొలుత వైబ్రో క్లీనర్ల ద్వారా ధాన్యం శుభ్రం చేసి, స్టీమింగ్ ట్యాంకర్లు, డ్రైయర్ బెడ్ల ద్వారా ఆరబెట్టి ఎప్పుడంటే అప్పుడు వాడుకు నేలా పాలిష్ చేస్తోంది.
- ఆ తర్వాత వినియోగదారుడికి అవసరమైన ఉత్పత్తులుగా మార్చుతోంది.
- ధాన్యం నిల్వకూ ఈ కేంద్రంలోనే గోదాములు ఏర్పాటు చేసింది.