మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.
కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….
చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది. అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది
కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.
రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
పనస 20 మీ. ఎత్తు పెరిగే వృక్షం. బెరడు నలుపు రంగులో లేదా ఆకుపచ్చ మచ్చలతో నునుపుగా ఉంటుంది. మానులోపల పసుపు రంగులో ఉంటుంది. దీని ఆడ, మగ పూలు లేత ఆకుపచ్చ పసుపు రంగులో ఉంటాయి. పూలు మానుపైనే ఏర్పడతాయి. ఆడ కంకులలోని పూలన్నీ ఫలదీకరణం చెంది ఒకే పెద్ద పండు తయారవుతుంది. పండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
సాధారణ నామం : జాక్‌ఫ్రూట్ ట్రీ శాస్త్రీయ నామం : ఆర్టోకార్పస్ హిటరోఫిల్లస్ కుటుంబం: మోరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పనస ఆకులు, వేర్లు, పండ్లు, గింజలు, చెక్క, పాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. పండ్లలో పిండిపదార్థాలు, అమైనోఆమ్లాలు, బీటాకెరోటిన్ ఉంటాయి. పండులోపల గల జిగురులాంటి పదార్థంలో ల్యూసిన్, ఐసోల్యూసిన్, టైరోసిన్, వాలైన్ ఉంటాయి.
మానులోపలి కర్రభాగంలో మోరిన్, ఆర్టోకార్పిన్ మొదలగు రసాయనాలుంటాయి. లేత ఆకులను వాపులకి, గాయాలకు కాపుపెట్టడానికి ఉపయోగిస్తారు.
లేత పనస కాయకూర మేధస్సును వృద్ధి చేస్తుంది. బలం, వీర్యపుష్టినిస్తుంది.
గింజల పొడిని గిరిజనులు ఆహారంగా ఉపయోగిస్తారు. పనస చెట్టు చెక్క మరియు కొద్దిగా మిరియాలు కలిపిన పొడి మందు గజ్ౙి, తామర, దురదలను పోగొడుతుంది. దీనిని విరేచనాలు అరికట్టడానికి, కడుపులో పుండ్ల నివారణకు కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో…
పనస ఆకుద్రావణం పర్యావరణహిత లార్విసైడ్‌గా పనిచేస్తుంది. ఇది బ్రూకస్‌పైసోరం, ట్రైబోలియం కాస్టానియం, సైటోఫిలస్ ఒరైజెపై కీటకనాశక చర్యను కూడా ప్రదర్శించింది (నాయిర్ అండ్ కర్వేకర్, 2017).
పనస గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఎస్కరిచియాకోలి, సూడోమోనాసఈరూజినోసా, స్టెఫైలోకోకస్ ఆరియస్‌లపై అత్యంత సమర్ధవంతమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (జా అండ్ శ్రీవాస్తవ, 2013).
పనస లేటెక్స్ హెక్సనాయిక్, మిథనాలిక్, పెట్రోలియం ఈదర్, క్లోరోఫాం ద్రావణాలు స్పోడోప్టెరాలిటూర లార్వాలను 90-95% చంపాయి. ఇవి లార్వాల బరువును గణనీయంగా తగ్గించాయి (ఉపాధ్యాయమ్, 2013).
పనస వేర్లు, కాండాలు, ఆకులు, గింజలలో ఉండే అసిటోజెనిన్స్ శక్తివంతమైన పురుగు మందు లక్షణాలు కలిగి ఉంటాయి (నజ్‌ముల్‌హక్, 2006).
ముందుగా పెసరపప్పుని ఒక పళ్ళెంలో పోసుకొని బాగా కటకటలాడేట్లు ఎండపెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ అన్నీ కలిపి మిక్సీ వెసుకోవటమే. అంతే. ఎంతో సులువుగా చేసుకోవచ్చు. ఈ పొడి వేడివేడి అన్నంలో ఆవు నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది.
పూర్వం తిరగలిలో వేసి విసిరేవాళ్ళు.
రోటిలో రుబ్బిన పచ్చడికి, తిరగలిలో విసిరే పొడులకి రుచి ఎక్కువ.
రచన: శ్రీమతి కొలను పద్మావతి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
సత్తుపిండిని కేవలం రెండే రెండు పదార్థాలతో తయారు చేస్తారు. తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగకు కట్టుకుపోయే ‘సద్ది’లో, ఈ సత్తుపిండి ఒకటి.
సత్తుపిండిని, మొక్కజొన్నలను ‘వేపి’ తయారు చేస్తారు. మన వండని వంటలు కాన్సెప్ట్ ప్రకారం, మొక్కజొన్నలను వేపకుండానే తయారు చేసాను.
కిలో మొక్కజొన్నలను బాగా ఎండబెట్టి, శుభ్రం చ్రేసి, మెత్తగా మర పట్టించాలి.
విసుర్రాయితో విసురుకుంటే, ‘కోల్డ్ విసుర్డ్ పిండి’ వస్తుంది, అది మరీ శ్రేష్టమైన పిండి.
మర(గిర్ని) పట్టిస్తే పిండి ఎక్కువ వేడెక్కుతుంది. ఆ మేరకు జీవశక్తి నష్టపోతుంది. కనుక విసుర్రాయి (తిరుగలి) ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండాలి.
సత్తుపిండి తయారీ విధానం: రెండు కప్పుల మొక్కజొన్న పిండికి, తగినంత ముడిబెల్లాన్ని తీసుకోవాలి. కాస్తా వెడల్పు గిన్నెలో అరకప్పు మంచినీరు తీసుకుని, ఆ నీటిలో బెల్లాన్ని కరిగించాలి. కరిగిన బెల్లపు నీటిలో, మొక్కజొన్న పిండిని బాగా కలిపి, ముద్దలు చేసుకోవాలి. అంతే! వెరీ సింపుల్!
మొక్కజొన్న పిండి సహజ సువాసనతో తియ్యగా ఉంటుంది.
పెద్దలు, పిల్లలు సత్తుపిండిని ఉపాహారంగా తినవచ్చు.
బెల్లం మోతాదు ఎవరి అబిరుచిని బట్టి వారు, కాస్తా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
పిండి తయారుగా ఉంటే, సత్తుపిండి తయారీ నిముషాలలో అవుతుంది. సత్తుపిండిలో ఎండుద్రాక్ష లేదా ఖర్జూర పండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.
పూర్వం ప్రయాణాల్లో సత్తుపిండిని, బెల్లాన్ని వెంట తీసుకుని పొయ్యేవారు. వంటకు వీలుకాని పూట, సత్తుపిండిని తినేవారు.
రచన: తుమ్మేటి రఘోత్తమరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
కొద్దిగా ముదిరిన వంకాయలు ఆరు తీసుకుని కడిగి, తడి లేకుండా తుడిచి, చిన్న చిన్నముక్కలుగా కోసుకోవాలి.
ఈ ముక్కలకు కొంచెం పసుపు, తగినంత ఉప్పు కలపండి.
శుభ్రంచేసిన చింతపండు నిమ్మకాయంత తీసుకుని, వంకాయ ముక్కల మధ్యలో పెట్టి మూత పెట్టండి. ఒక పూట అయిన తర్వాత మూత తీసి, చింతపండు విడిగా తీసి, దానికి తగినంత కారం, ఇష్టమయితే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీలో బరకగా చేసుకోవాలి.
ఇప్పుడు వంకాయలను గట్టిగా పిసికి వచ్చిన రసానికి ఈ గుజ్జు కలిపి, వంకాయ ముక్కలకు బాగా కలిసే లాగ చేయాలి. చిన్నగిన్నెడు గానుగ నూనెను, ఈ మిశ్రమంలో వేసి కలపాలి. నాలుగైదు గంటలు వూరిన తరువాత, కమ్మటి నెయ్యితోగాని, నూనెతో గాని వేసుకుని, వేడి అన్నంతో తింటే బాగుంటుంది.
రచన: సుబ్బలక్ష్మి మంచికంటి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.
సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.
ప్రధాన సాగు పద్ధతులు
పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.
పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.
వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.
జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.
సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.
కలిగే ప్రయోజనాలు రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.
ముగింపు: మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.
డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951
భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.
మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”
ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.
గోంగూర సాగు: ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
పాలకూర: పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.
తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.
బచ్చలికూర : బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.
చుక్క కూర: చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
కొత్తిమీర: కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.
పుదీన: పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.
మెంతి కూర: దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.
బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258
అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…
మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.
జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.
ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.
రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.
ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.
నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.
రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.
ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.
దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.
రచన : మంచికంటి సుబ్బల
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి
క్యారెట్ ఆకులను కూడా చక్కగా రోటి పచ్చడి చెయ్యవచ్చు. తెలియని వారు దాన్ని కొత్తిమీర పచ్చడి అనుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది.
గుప్పెడు లేత క్యారెట్ ఆకులను తీసుకుని, శుభ్రంగా మంచినీటిలో కడగాలి. ఆకుల అడుగున పేను గట్రా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
క్యారెట్ ఆకుల నుండి చిన్న చిన్న కాడలను తీసేసి, కేవలం ఆకులను మాత్రమే పళ్లెంలో సిద్దంగా ఉంచుకోవాలి.
రెండు టొమాటో పండ్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లిని ఒలిచి పొట్టు తీసి, తగినన్ని పచ్చిమిర్చి, లేత కరివేపాకులు కాసిన్నిచేర్చి, నాలుగింటిని ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పుకోవాలి.
టొమాటో పండ్లలో ఉండే నీటి వల్ల పచ్చడి మెత్తగా రుబ్బుడు అవుతుంది. ప్రత్యేకంగా నీరు కలుపకూడదు. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు… ఇవన్నీ తగినంత మోతాదులో తీసుకుని రోట్లో/మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముందుగానే తయారు చేసి, ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తరువాత క్యారెట్ టొమాటో గుజ్జులో, ఈ పొడుల మిశ్రమాన్ని వేసి మళ్ళీ రోట్లో / మిక్సీలో వేసి బాగా కలిసేలా తిప్పుకోవాలి. అంతే! క్యారెట్ ఆకుల రోటి పచ్చడి రె‘ఢీ’.
సేంద్రీయ ముడిబియ్యపు వేడి అన్నంలో, క్యారెటాకుల పచ్చడి కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. అవసరమైన వారు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కాస్తా వేసుకుని తినవచ్చు. లేదా పచ్చడి తయారీలోనే, గుప్పెడు నువ్వులు లేదా వేరుశనగలు పచ్చివే వేసి రుబ్బుకోవచ్చు. ఇక నూనె, నెయ్యి అవసరం పడదు.
వంటలకు కొత్తవారు అయితే, ఉప్పు కారం ఎప్పుడైనా సరే, మొదట తక్కువ వేసుకుని, రుచి చూసుకుంటూ అవసరం అనుకుంటే, మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పును ఎంత తగ్గిస్తే, అంత ఆరోగ్యం. ఏ రోజుకు ఆరోజు తయారు చేసి వాడుకోవాలి!
రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి
*రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి