వండని వంట… మామిడికాయ ఆవ బద్దలు

ఒక మామిడికాయను పిక్కతో సహా చిన్న ముక్కలుగా తరుగుకొని, ఆ ముక్కల్లో జీడి ఉంటే తీసేసి, పసుపు, ఉప్పు, కారం మెంతిపిండి కొంచెం, ఆవపిండి (కాయని బట్టి) గానుగనూనె వేసుకొని కలుపుకోవాలి. పోపు అవసరం లేదు. ఊరాక చాలా రుచిగా ఉంటుంది.

కేవలం మెంతిపిండి కారం వేసి కూడా చేస్తారు. వాటిని మామిడి మెంతిబద్దలు అంటారు. వీటికి జీడీ ఉన్న కాయలు బాగుంటాయి వగరుతో.

వేడి వేడి అన్నంలో, మామిడి ఆవబద్ద బాగుంటుంది. అవసరం అయిన వారు చేతిమీద కాస్తా నెయ్యి వేసి అన్నంలో కలిపి తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఉప్పు తగినంత వేస్తే, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

  • రచన: సంధ్యా శశికాంత్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… క్యారెట్ పచ్చడి

క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక పెద్ద క్యారెట్ దుంప
  • రెండు ఉల్లిగడ్డలు
  • ఒక వెల్లుల్లి గడ్డ
  • ఆరు పచ్చి మిరపకాయలు
  • తగినంత ఉప్పు
  • జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
  • సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.

అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.

మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.

ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.

క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.

అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.

పొయ్యి మీద వండే పనే లేదు.

  • శ్రీమతి జిట్టా జ్యోతి
Read More

వండని వంట… పప్పు పచ్చడి

పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.

దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.

ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.

  • శ్రీమతి లతా కృష్ణమూర్తి
Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

కరివేపాకు గుండెకు మంచిది. జుట్టుని నల్లగా పెరిగేట్టు చేస్తుంది. కడుపులో ఉండే నులిపురుగుల్ని చంపివేస్తుంది. కంటి చూపుకి మంచిది. ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే కరివేపాకు పచ్చడి చేసే విధానం…
కరివేపాకు పచ్చడి చాలా సులువుగా చేసుకోవచ్చు. కావల్సిందల్లా పది పదిహేను ఎండు మిర్చి, రాళ్ళ ఉప్పు, గోలీకాయంత చింతపండు, అర స్పూను జీలకర్ర, కొంచెం బెల్లం ఇంక శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడు కరివేపాకు. కడిగిన నీటి తాలూకా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.

ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి నూరుకున్నాక చింతపండు, పసుపు, బెల్లం వేసి ఇంకొంచెం మెదిపి చివరగా కరివేపాకు వేసి బాగా నలిగేట్టు నూరుకోవాలి. అంతే.

Read More

వండని వంట… వెజ్ మిక్స్

  1. పండిన టొమాటోలు రెండు, మూడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా తరిగి, కొంచెం కొత్తిమీర తరుగుతో సహా అన్నీ ఒక గిన్నెలో వేసుకుని, ఉప్పు వేసి చేత్తో గట్టిగా పిసుకుతున్నట్లు కలిపితే, అన్నీ చక్కగా కలిసిపోతాయి… వేడి వేడి అన్నంలో అయితే భలే ఉంటుంది!
  2. పైన చెప్పిన అన్నీ పెరుగులో కలిపి కూడా తినవచ్చు. రైతాలా ఉంటుంది.
  3. కూర దోసకాయ ముక్కలు సన్నగా తరిగి, పైన చెప్పిన పదార్థాలు అన్నీ కలిపినా, అది కూడా ఒక కూర లాగానే ఉంటుంది.
  4. పైన చెప్పిన అన్ని పదార్థాలు మరియు కీర దోస ముక్కలు కలిపినా, అది కూడా కూర లాగా తినవచ్చు.
  5. ఎండుమిరప కాయలు, ఉప్పు ..చింత పండు గుజ్జులో కలిపి తింటే బావుంటుంది. మనకు అనుకూలంగా ఉల్లిగడ్డ తరిగి వేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కలుపుకోవచ్చు. లేక పోయినా చాలా బావుంటుంది.
  6. పచ్చి మిరప కాయలు, ఉప్పు, కొంచెం చింత పండు మంచిగా నూరుకుని, కూర దోసకాయలు ముక్కలుగా తరిగి దానిలో వేసి కచ్చా పచ్చాగా దంచి, ఒక పచ్చడి లాగ తినొచ్చు.
  7. మనం పచ్చిగా తినగలిగే అన్ని కూరగాయ ముక్కలు (క్యారెట్, దోసకాయ, టొమాటో, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తి మీర) అన్ని ఉప్పుతో కలిపి చేత్తో గట్టిగా కలిపి పెరుగుతో అయినా, లేకుండా అయినా తినొచ్చు.
    పల్లీల పొడి, పచ్చి కొబ్బరి తురుము ఆప్షనల్.
    ఇవన్నీ… సైడ్ డిష్ లాగ తినొచ్చు….లేదా ఎమర్జెన్సీ కూరలుగా కూడా పనికొస్తాయి.
  • ప్రశాంతి

Read More