వండని వంట… కొత్తిమీర పచ్చడి

కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.

కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)

పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.

రచన : కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ కారం

ముందుగా ఉల్లిపాయలలోని పోషకాల గురించి తెలుసుకుందాం ! ఉల్లిపాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ విటమిన్ ఎ, సి, ఇ, ఇంకా ఎన్నో ఉంటాయి. కేన్సర్ కణాలను నిరోధించటంలో ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ. జుట్టు వత్తుగా, నల్లగా పెరగటానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ తగ్గించుకునేందుకు ఉల్లిపాయ ఉపయోగకరమైనది. చెడు కొలెష్ట్రాల్‌ని తగ్గించటమే గాక గుండె వ్యాధులను కూడా నిరోధిస్తుందని సంబంధిత నిపుణులు అంటారు.

కావల్సిన దినుసులు: ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ (అన్నీ ఉల్లిపాయకు తగినన్ని)

ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్రలని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక, చింతపండు కూడా వేసి బాగా కలిసేట్లు దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచి, పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి.
మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడికి రుచి ఎక్కువ. పచ్చడి చేసేటప్పుడు నీరు తగలకుండా ఉంటే, ఈ పచ్చడి వారమైనా బయట కూడా పాడవదు. ఇది దోశెల్లోకి, అన్నంలోకి, జొన్నరొట్టెల్లోకి చాలా బావుంటుంది. రైస్‌లో తినేటప్పుడు కొంచెం కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేస్తే రుచి పెరుగుతుంది.

రచన : శ్రీమతి కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి

వండే పని లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసుకునే క్యారెట్ – పచ్చి కొబ్బరి ‘పచ్చి పచ్చడి’ తయారీ విధానం..

కావలసిన పదార్థములు:
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
క్యారెట్ ముక్కలు – ఒక కప్పు.
కొత్తిమీర – అర కప్పు
పచ్చిమిరపకాయలు – ఎనిమిది
శుభ్రం చేసిన చింతపండు నిమ్మకాయంత!
కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ.
రుచికి సరిపడినంత ఉప్పు

తయారీ విధానం:
క్యారెట్ దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకోవాలి.

ముందుగా – కొబ్బరి, క్యారెట్టు ముక్కలను కలిపి, కొంచెం దంచిన తర్వాత మిగిలిన పదార్థాలు వేసుకుని, రోటిలో గాని మిక్సీలో కానీ రుబ్బుకోవడమే! అంతే !!

పొయ్యి మీద పెట్టే పని లేకుండా, సింపుల్‌గా చేసుకునే క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి రెడీ!

వేడి వేడి అన్నంలోకే కాదు… కొన్ని టిఫిన్లలోకి కూడా రుచికరంగా ఉంటుంది.

రచన : శాంత కర్రి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా, నూనె కూడా వాడకుండా, కరివేపాకుతో రుచికరంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు.

గుప్పెడు లేత కరివేపాకును తీసుకోవాలి. అందులో తగినంత చింతపండు, మనం తినగలిగేంతగా ఎండుమిర్చి, పసుపు, సరిపడ ఉప్పు చేర్చుకుని, అన్నిటినీ కలిపి రోట్లో నూరాలి. మిక్సీలోను చేయొచ్చు. కరివేపాకు పచ్చడి రెడీ!

తాజా కరివేపాకు పచ్చడిని వేడి వేడి అన్నంలో కలిపి తింటే చాలా బాగుంటుంది. అలా తినలేని వారు కొద్దిగా గానుగ నూనెను చేతి మీద వేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. లేదా నెయ్యి కలిపి కూడా తినవచ్చు.
రెండు రోజులు తిన్నాక పచ్చడిని మిగిలితే, కరివేపాకు పచ్చడికి సరిపడ అన్నం కలిపి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలతో అతి తక్కువ నూనెలో తిరగమోత వేస్తే, ‘కరివేపాకు రైస’ తయారు అవుతుంది. కరివేపాకు సువాసనతో, పచ్చడి బాగుంటుంది.

పులుపు కావాలనుకుంటే, కాస్త నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ కరివేపాకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకటి, రెండు రోజుల్లో వాడుకోవాలి.
ఏ పచ్చడి అయినా అప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవడం ఆరోగ్యదాయకం!
ఇదే విధంగా కొత్తిమీరతోను పచ్చడి చేసుకోవచ్చు.

  • రచన : ఇందిర జమ్మలమడక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కాలీఫ్లవర్ పచ్చడి

1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.

3) 4, 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగాదంచుకోవాలి.

4) రెండు టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు.

కాలీఫ్లవర్ ముక్కలను, నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, కారం, ఉప్పు… అన్నిటిని కలపాలి. ఓ పావుగంట నుంచి అరగంట వరకు అలా ఉంచాలి. (అన్నీ పచ్చివే.)

క్యాలీఫ్లవర్ ముక్కలకు పులుపు పట్టి, నములుతుంటే కరకర మంటాయి.

అన్నంలో కలుపుకున్నా, ఉప్మా లాంటి వాటిలోనూ, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే, ఓ ముద్ద ఎక్కువే తింటారు.

ఫ్రిజ్‌లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏ రోజుకారోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

ఒక కాలీఫ్లవర్ పువ్వును, 3 లేదా 4 సార్లు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు.

  • రచన : తాయమ్మ కరుణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడికాయ కొబ్బరి పచ్చడి

పచ్చడి తయారీకి రెండు మామిడికాయలు, ఒక కొబ్బరి చిప్ప, ఐదారు వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర, తగినంత కారం, ఉప్పు అవసరం.

మామిడి కాయల్ని కడిగి తుడిచి, ముక్కలుగా కోసుకోవాలి. అందులో జీడి ఉన్నా పిక్క ఉన్నా తీసెయ్యాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసుకొని, వెల్లుల్లి రెబ్బలు, కొంచం జీలకర్ర రోటిలో వేసి దంచుకోవాలి. మిక్సీలో వేసుకున్నా ఫరవాలేదు. తర్వాత తగినంత ఉప్పు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు దంచుకోవాలి. అంతే పచ్చడి రెడీ. రుచికరంగా ఉంటుంది. అవసరం అనుకున్నవారు, ఎండుమిర్చి, అవాలు, కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోతే ఎలా అనుకునేవారు, పోపుకు బదులుగా, గానుగ నూనెను కానీ, నెయ్యిని కానీ, ‘మామిడి-కొబ్బరి’ పచ్చడి మీద వేసుకుని తినవచ్చు. ఈ సీజన్లో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.

  • పొనగంటి వేంకట రాజ్యలక్ష్మి, జమ్మికుంట

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More