తెలంగాణలో రాష్ట్రంలో రోజుకు కేవలం 4 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తవుతున్నాయి, 26 లక్షల లీటర్ల పాలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు కారణం ఇక్కడ పశుసంపద వృద్ధి చెందకపోవడమే. గేదెలు, ఆవుల సంఖ్య తగ్గడంతో.. పాడి, దాని అనుబంధ ఉత్పత్తులపై ప్రభావం పడింది. పాడి రైతులు పోసే పాలు రోజువారీ 50 వేల లీటర్ల మేరకు తగ్గాయి. సమస్య తీవ్రత, ప్రజావసరాల దృష్ట్యా పాడి రంగాన్ని ఆదుకునేందుకు పాడిపశువుల సంఖ్య పెంపుదల, ఇతర చర్యలు చేపట్టాలని రాష్ట్ర పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. 2019తో పోలిస్తే తాజాగా జరిగిన పశుగణనలో పాలిచ్చే గేదెలు, ఆవులు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది.

పశువుల సంఖ్య తగ్గింది: 2019లో ఆవులు 42,32,383 ఉండగా.. తాజాగా వాటి సంఖ్య 30,69,524 (27.48%)కి తగ్గింది. గేదెల సంఖ్య 42,26,603 నుంచి 3052102 (27.78%) కి తగ్గింది. మేకలు 49,34,673 నుంచి 45,48,999 (7.82%) కి తగ్గాయి.
సూర్యాపేట జిల్లాలో ఆవులు 62.65%, సంగారెడ్డి 50.74%, మెదక్‌ 45.26%, మహబూబాబాద్‌లో 43.64% తగ్గాయి. గేదెలు సంగారెడ్డి జిల్లాలో 46.14%, కామారెడ్డి 45.92%, మెదక్‌ 45,32%, మహబూబాబాద్‌ లో 43.23% తగ్గాయి. మేకలు హైదరాబాద్‌లో 40.87%, రంగారెడ్డి జిల్లాలో 25.83 % క్షీణించాయి.

పాడిపరిశ్రమకు ఆశించిన ప్రోత్సాహం లేకపోవడం వల్ల రైతుల్లో ఆసక్తి తగ్గుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 0.87% మాత్రమే పాడిపశువుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతున్నాయని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. పాడిపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు పశువుల పంపిణీ పథకాన్ని చేపట్టి, లబ్దిదారులకు వాటిని పంపిణీ చేయాలని విజయ డెయిరీ ప్రభుత్వాన్ని కోరింది.