ఔషధ మొక్క… అక్కలకర్ర

అక్కల కర్ర ఒక చిన్న, నిలువుగా పెరిగే పూల మొక్క. ఇది వేగంగా పెరిగి బంగారం రంగు, ఎరుపురంగు పూలగుత్తులను కలిగి ఉంటాయి. దీని ఆకులు, పూల గుత్తులు పళ్ళనొప్పులను తగ్గించే బాధ నివారణ కారకం కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దీనిని అలంకరణ మొక్కగా, ఔషధ మొక్కగా పెంచుతారు. కాండాలు నిలువుగా లేదా నేలపై ప్రాకుతూ ఎరుపు రంగులో నూగు లేకుండా ఉంటాయి. ఆకులు వెడల్పుగా అండాకారం నుండి ముక్కోణాకారంలో ఉంటాయి. ఆకులు 5-11 సెం.మీ. పొడవు, 4-8 సెం.మీ. వెడల్పుండి అంచులు మొనతేలిన పళ్ళు కలిగిఉంటాయి. పూల గుత్తులు ఒకటిగా ఎకీన్లు (కాయలు) నల్లగా, 2-2.5 మి.మీ. పొడవుంటాయి.

సాధారణ నామం: టూతేక్‌ప్లాంటే, పారాక్రెస్
శాస్త్రీయ నామం: ఆక్మెల్లా ఒలరేసియ

కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • అక్కలకర్రను విస్తృతంగా పంటినొప్పి, గొంతు, చిగుళ్ళ చికిత్సలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా తాజా పూలగుత్తులు లేదా ఎండబెట్టి పొడిచేసిన పూలగుత్తులను ఉపయోగిస్తారు. కాని వేర్లు, ఆకులను కూడా సిఫారసు చేస్తున్నారు.
  • డిసెంట్రి, కీళ్ళనొప్పుల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది.
  • లాలాజలం ఉత్పత్తిని పెంచుతుంది. వేసవిలో వచ్చే జ్వరం నయం చేయడానికి ఉపయోగపడుతుంది.
  • మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. ఆకులను బాక్టీరియా, శిలీంద్రాల వల్ల కలిగే చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.
  • గాయాలను త్వరగా నయం చేస్తుంది. జలుబు, ఫ్లూ రోగాల నుండి కాపాడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • అక్కలకర్ర ఆకుల డైక్లోరోమిథేన్ ద్రావణం పరీక్షించిన అన్ని బాక్టీరియాలపై యాంటిబాక్టీరియాల్ చర్యని ప్రదర్శించింది. ఎస్కెరిచియా కోలై > స్టెఫైలోకోకస్ ఆరియస్ > ప్రోటియస్ వుల్గారిస్ > బాసిల్లస్ సబ్‌టైలిస్ > క్లెబ్సియెల్లా న్యుమోనియాపై ఈ క్రమంలో యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. డైక్లోరోమిథేన్ ద్రావణం అసిటోన్, నీటి ద్రావణాల కన్నా వంగకాయతొలుచు పురుగు, ల్యూసినాయిడెస్ ఆర్బొనాలిస్‌పై అధిక యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణం ఆల్కలాయిడ్స్, టెర్పెనాయిడ్స్, ఫైటోస్టిరాల్స్, సపోనిన్స్, స్టీరాయిడ్, టానిన్స్, ఫినాలిక్ కాంపౌండ్స్‌ని కలిగి ఉంది (పవున్‌రాజ్, అతని అనుచరులు, 2014)..
  • అక్కలకర్రక్రూడ్ హెక్సేన్‌ద్రావణం టూటా ఆబ్సల్యూటపై అధిక కీటకనాశక చర్యను ప్రదర్శించింది. ఈ ద్రావణాన్ని టమాట పంటనాశించే టూటాఅబ్సల్యూట పురుగుల నివారణలో ఉపయోగించవచ్చు. ఈ ద్రావణం నుంచి వేరు చేసిన ఆల్కమైడ్స్ టూటా ఆబ్సల్యూట నివారణ కార్యక్రమాలలో పురుగు మందులుగా ఉపయోగించవచ్చు. వీటిలో స్పైలాంతాల్ ముఖ్యమైనది. ఇది అత్యధిక కీటకనాశక చర్య కలిగి, బదనిక, సోలెనాప్సిస్ సీవిస్సిమకు ఎటువంటి హాని కలిగించదు. (మోరినో, అతని అనుచరులు, 2011)
  • స్పైజలాంతాల్ యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్, లార్విసైడల్ లక్షణాలను కలిగి ఉంది (శర్మ, అతని అనుచరులు, 2010).
  • అక్కలకర్ర ద్రావణాలు ఈడెసఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సి, అనోఫెలెస్ క్యూలిసిఫేసీస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించాయి (అమర్ అండ్ మెహిహోర్మ్, 2006; పాండె, అతని అనుచరులు, 2007; సరాఫ్ అండ్ దీక్షిత్, 2002).
  • స్పెలాంతాల్ ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌పై ఫంగిస్టాట్ మరియు ఫంగిసైడల్ చర్య ప్రదర్శించింది (కౌటిన్‌హా, అతని అనుచరులు, 2006).
  • స్పైలాంతాల్ అనేక జీవ చర్యలను కలిగి ఉంది (డుబే, అతని అనుచరులు, 2013)
  • స్పైలాంతాల్ యాంటిఫంగల్ (డూబే, అతని అనుచరులు, 2013), బాక్టీరియోస్టాటిక్ (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004), ఇన్‌సెక్టిసైడల్ (కడిర్, అతని అనుచరులు, 1989; శర్మ, అతని అనుచరులు, 2012; మోరెనో, అతని అనుచరులు, 2012); యాంటిమలేరియల్ (శర్మ, అతని అనుచరులు, 2012); ఈడెసఈజిప్టి, హెలికోవర్పా జియానియోనేట్స్‌పై యాంటిలార్విసైడల్ చర్యలు (రామ్‌సేవక్, అతని అనుచరులు, 1999) ప్రదర్శించింది.
  • హెచ్. లాంగిపెస్‌వేర్ల నుండి వేరు చేసిన స్పైలాంతాల్ మరియు ఇతర ఆల్కమైడ్లు స్ల్కీరోషియం రాల్ఫిసి, స్ల్కీరోటినియాసెపివొరం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్, రైజోక్టోనియా సొలాని ఎజి3 మరియు ఎజి5 శిలీంద్రాల పెరుగుదలనరికట్టాయి (మోలినాటోర్రెస్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతాల్ బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కరిచియా కోలి, శకారోమైసిస్ సెరెవిసియా పెరుగుదలను కూడా అరికట్టింది (మోలినొటోర్రెస్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతస్ క్యాల్వ లోని స్పైలాంతాల్ ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైటెస్ పై యాంటిఫంగల్ చర్య ప్రదర్శించింది (రాయ్, అతని అనుచరులు, 2004).
  • స్పైలాంతాల్ కీటకనాశినిగా కూడా ఉపయోగపడుతంది (కడిర్, అతని అనుచరులు, 1989; స్పెల్‌మన్, అతని అనుచరులు, 2011; శర్మ, అతని అనుచరులు, 2012). బ్రోకోలి వంటి క్యాబేజి జాతి కూరగాయల పంటలనాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాని చంపింది (శర్మ, అతని అనుచరులు, 2012). సొలనేసి జాతి మొక్కలనాశించే టమాట లీఫ్‌మైనర్, టూట ఆబ్సల్యూటని కూడా చంపింది. (మోరెనో, అతని అనుచరులు, 2012).
  • స్పైలాంతాల్ నత్త, ఫైసా ఆక్సిడెంటాలిస్‌పై బలమైన మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (జాన్స్, అతని అనుచరులు, 1982).
  • అక్కలకర్ర మొక్కపొడి (3%, 5%), మొక్కజొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే సైటోఫిలస్ జియామెయిస్ వీవిల్స్ మరణ శాతాన్ని పెంచి, విడుదలయ్యే పెద్దపురుగుల శాతాన్ని తగ్గించి గింజలను కాపాడుతుంది. గింజల మొలకశాతంపై ఎటువంటి దుష్ప్రభావం చూపదు (ఓగ్బాన్, అతని అనుచరులు, 2015).
Read More

అధిక పోషక పదార్థాలు గల ‘నాడెప్ కంపోస్ట్

నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.

కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.

కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :

  • పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
  • పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
  • జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
  • నీరు – 1350-1400 లీ.
    కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
  • మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
  • రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
  • మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.

పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.

కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.

ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.

Read More

వివిధ పంటలపై ‘పంచగవ్య’ ప్రభావం

‘పంచ’ అంటే అయిదు. ‘గవ్య’ అంటే గోమాత నుండి లభించే పదార్థాలు. గోమాత నుండి లభించే ఐదు ఉత్పత్తులను – పాలు, పెరుగు, పేడ, మూత్రం, నెయ్యి – సరైన నిష్పత్తిలో కలిపి పులియబెడితే వచ్చే ఉత్పత్తినే “పంచగవ్య’ అంటారు. పంచగవ్య ఒక సమర్థవంతమైన సేంద్రియ ఎరువు. ఇది పురుగులకు వికర్షిణిగా పనిచేస్తుంది. పంచగవ్యపై జరిపిన అనేక అధ్యయనాలలో 3 శాతం ద్రావణం సమర్థవంతంగా మొక్కల పెరుగుదలకు, పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా కాపాడటానికి పని చేస్తుందని తేలింది. వివిధ మొక్కలకు వివిధ నిష్పత్తులతో ప్రయోగాలు చేయవచ్చని సూచించబడింది.
పంచగవ్య మొక్కల పెరుగుదలకే కాకుండా, చీడపీడలకు తట్టుకునే శక్తిని కూడా ఇస్తుంది. దీనిని అన్ని రకముల మొక్కలపై వాడుకోవచ్చు. నారుమళ్ళకు బాగా శ్రేష్ఠం.

మామిడి : ఆ అధిక ఆడ పుష్పాలతో పూత సాంద్రతను పెంచుతుంది. ఆ పండ్లు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఏర్పడతాయి. క్రమం లేకుండా లేదా సంవత్సరం విడిచి సంవత్సరం పండ్లు ఏర్పడటం ఉండదు. ఆ గది ఉష్ణోగ్రత వద్ద పండ్ల నిల్వగుణాన్ని 12 రోజులు పెంచుతుంది. ఆ పండ్ల రుచి, వాసన అద్భుతం.

జామ : అధిక టోటల్ సాల్యుబుల్ షుగర్స్ ఆ పండ్ల నిల్వ గుణం 5 రోజులు పెరుగుతుంది.

పసుపు : దిగుబడులు 22% పెరుగుతాయి. ఆ అతి పొడవాటి చిల్ల కొమ్మలు. ఆ ¢డైనేజి నష్టాన్ని తగ్గిస్తుంది. ఆ తల్లి, చిల్ల కొమ్మల నిష్పత్తిని తగ్గిస్తుంది. ఆ పురుగులు, తెగుళ్ళను తగ్గించే తూనీగ, సాలీడులను వృద్ధి చేస్తుంది. ఆ తల్లి, విత్తన కొమ్మలకు ఎక్కువ ధర లభిస్తుంది. ఆ కుర్కుమిన్ పరిమాణాన్ని పెంచుతుంది.

నిమ్మ : సంవత్సరం పొడవునా పూత ఏర్పడేలా చేస్తుంది. ఆ పండ్లు పుష్టిగా, మంచి వాసన కల్గి ఉంటాయి. ఆ నిల్వ గుణం 10 రోజులు పెరుగుతుంది.

అరటి : సాగు నీటిలో కలిపి పారించడం, పిచికారి చేయడంతోపాటు 3% ద్రావణాన్ని (100 మి.లీ.) మగపూవుని తొలగించిన తర్వాత గెల చివర పాలిథిన్ సంచిలో పోసి కట్టాలి. గెల పరిమాణం ఒకే మాదిరిగా ఉంటుంది. గెల కోత సాధారణ పంటలలో కన్నా ఒక నెల ముందే జరుగుతుందని గమనించడమైనది. గెల పైభాగంలో, అడుగు భాగంలో వున్న హస్తాల పరిమాణం ఒకే మాదిరిగా వుంటుంది.

మల్లె : అరుదైన సువాసన, పరిమళం. ఆ మొగ్గ తొలుచు పురుగు ఆశించదు. ఆ సంవత్సరం పొడవునా పూత వస్తుంది.

Read More

‘అమృత మట్టి’తో అమృతాహారం!

పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించని పద్థతుల్లో పంటల సాగు ఇప్పటి అవసరం. అంతేకాదు.. పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా కలిగిన అధిక దిగుబడులు సాధించాలి! రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి!! ఈ లక్ష్యాల సాధనకు రైతులకు దారి చూపేదే ‘అమృత మట్టి’తో పర్యావరణ అనుకూల (నేచ్యు-ఎకో) సేద్యం. సేంద్రియ సేద్యాన్ని మరో మెట్టుపైన నిలబెడుతుంది ఈ సేద్య పద్ధతి.

పర్యావరణానికి హాని లేకుండా, వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా సాగు చేయటమే నేచ్యు-ఎకో పద్ధతి ప్రత్యేకత. ‘అమృత మట్టి’ ద్వారా ఈ పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని పరీక్షల్లో నిరూపితమైంది. సంప్రదాయ (రసాయనిక) పద్ధతుల్లో పండించే కూరగాయలతో పోల్చితే అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయలు అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఐదు రెట్ల మాంసకృత్తులు, 20 శాతం కాల్షియంను అదనంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్ బి-12 ఉనికిని అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో కనుగొనడం విశేషం.

ఉత్పాదకాలను డబ్బు పోసి కొని వాడడానికి బదులుగా.. పొలాల చుట్టు పక్కల్లో లభించే వనరులను ఉపయోగించుకోవటం, సాగు భూమికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పద్ధతికి రూపకల్పన చేశారు ప్రొఫెసర్ శ్రీపాద్ ఎ.దబోల్కర్.

అమృతమట్టిని ఉపయోగించి… భూమిలో జీవన ద్రవ్యం, సేంద్రియ కర్బనాలను పెంచటం ద్వారా రసాయనిక వ్యవసాయంలో కన్నా తొలి ఏడాదే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని ప్రొ. దబోల్కర్ నిరూపించారు. చీడ పీడల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు దబోల్కర్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక కీటక నాశనులు, క్రిమి సంహారకాల పిచికారీ అవసరం లేదు. పోషకాలను అందించేందుకు రసాయనిక ఎరువులను వాడాల్సినవసరం లేదు. పొలం అంతటా మట్టి పరుపులను (రైజ్డ్ బెడ్స్) తయారుచేసుకుని అమృత జలాన్ని, అమృత మట్టిని వినియోగించి పంటలు పండిస్తారు.

అమృతమట్టి తయారుచేసే పద్ధతి….
అమృతమట్టి తయారీ వివిధ దశలతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం ముందుగా అమృత జలాన్ని తయారు చేసుకోవాలి.

అమృత జలం తయారీ విధానం:
ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా.బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడుసార్లు కలపాలి. మూడురోజుల తర్వాత పదిపాళ్లు నీటికి ఒక పాలు అమృత జలాన్ని కలిపి పంటలకు వాడుకోవచ్చు.

అమృతమట్టి తయారీ విధానం:
తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటలపాటు ఉంచాలి.
బెడ్‌ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మె°దటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా… బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి.
ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది.

విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లోఉన్న కంపోస్టుపై విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి.

21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తనాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిధ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృత జలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి. బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పైన అలా తయారైన కంపోస్టును వారానికి ఒకసారి కలపాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే… అమృత మట్టి సిద్ధమైనట్టే.

Read More

ఔషధ మొక్క నల్లతుమ్మ

సాధారణ నామం: గమ్ అరాబిక్ శాస్త్రీయ నామం: అకేసియా నిలోటికా కుటుంబం: ఫాబేసి

నల్లతుమ్మ వతైన క్యానపి, ముదురు నలుపు కాండం, కొమ్మలతో 5-20 మీ. ఎత్తు పెరిగే చెట్టు. బెరడు నుండి తక్కువ నాణ్యతగల ఎర్రటి బంకకారుతుంది. పలుచని, నిలువాటి, లేతబూడిద రంగు 3-12 జతల ముళ్ళుకలిగి ఉంటుంది. చిన్న చెట్లలో 5-7.5 సెం.మీ. పొడవుముళ్ళుంటాయి. పెరిగిన చెట్లలో సాధారణంగా ముళ్ళుండవు. పెద్ద ఆకుతో 10-30 చిన్న ఆకుల జతలుంటాయి. ఆకుకాడ చివరి జత ఆకుల క్రింద ఒక గ్రంథి ఉంటుంది.పూలు 1.2-1.5 సెం.మీ. వ్యాసం గల బంగారు పసుపురంగు గుండ్రని గుత్తులలో ఏర్పడతాయి. కాయలుగట్టిగా అణచబడి, నూగుతో కప్పబడి, మందంగా, మెత్తగా ఉంటాయి. ఒక కిలోకి సుమారు 8000 గింజలు తూగుతాయి.

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • నల్లతుమ్మ కాండం బెరడు, కాయ, బంక, విత్తనాలు ఔషధ రంగంలో ఉపయోగిస్తారు. బంక రెసిన్ పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. ఇది గర్భసంచి వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది.
  • కాండం బెరడు, కాయలు జీర్ణకోశంలోని పురుగులను నివారించడం, రక్తం గడ్డకట్టకుండా చేయడానికి సహాయ పడతాయి.
  • బెరడు, కాయలు 12-20% టానిన్ కలిగి ఉంటాయి. బెరడు, కాయల నుండి అనేక పోలీఫినాలిక్ మిశ్రమాలను వేరు చేశారు.
  • బంక రెసిన్‌లో గాలక్టోస్, ఆల్ఫాబయో యురోనిక్‌యాసిడ్, అరాబినో బయోసెస్ ఉంటాయి. 52% కాల్షియం, 20% మెగ్నీషియం కూడా ఉంటాయి.
  • పూలలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.

మోతాదు :

  • కషాయం తయారు చేయడానికి 20-30 గ్రా. విత్తన పొడి అవసరం. రోజుకి 50-100 మి.లీ. కషాయాన్ని 3-6 గ్రా. విడి మోతాదుల్లో తీసుకోవాలి.
  • తుమ్మ బంకను రోజుకి 2-3 గ్రా. వాడాలి., బార్క్‌పేస్టుని రసికారుతున్న ఎగ్ౙిమాపై పూయాలి.
  • రక్తస్రావాన్ని ఆపడానికి తాజా పుండ్లపై ఎండిన ఆకుల పొడి చల్లాలి., నోటి అల్సర్, పళ్ళచిగుళ్ళ నుండి రక్తస్రావం ఆగడానికి బెరడు కషాయంతో పుక్కిలించాలి. నిప్పు వల్ల కలిగిన గాయం, పుండు మానడానికి ఆకుల నుండి తయారు చేసిన పేస్టుని పూయాలి.
  • డయేరియా, జీర్ణాశయ నులిపురుగుల చికిత్సకు 40-50 మి.లీ. కషాయం యివ్వాలి. కాయల నుండి తయారు చేసిన కషాయాన్ని రుతుస్రావం సమయంలో రక్తస్రావాన్ని ఆపటానికి సేవించాలి. 45-50 మి.లీ. కాయలు, బెరడు కషాయాన్ని మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • 2-3 గ్రా. ఆకులను నూరి ఒక చెంచా పంచదారతో కలిపి రోజుకి ఒకటి లేదా 2 సార్లు సేవించడం ద్వారా స్పెర్మటోరియా / ధాతు సిండ్రోమ్ నివారించబడుతుంది.
  • ఒక కప్పు నీటికి 3 గ్రా. తుమ్మ బంక పొడి కలిపి 2-3 ని. వేడిచేసి రోజుకొకసారి సేవిస్తే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

వ్యవసాయరంగంలో …

  • నల్లతుమ్మ కలపను నాగలి, కాడివంటి భూమిని దున్నే పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
  • నల్లతుమ్మ నీటి ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (తుల్సి భరద్వాజ్, అతని అనుచరులు, 2015).
  • నల్లతుమ్మ మిథనాల్ మరియు ఇథనాల్ ద్రావణాలు పలు పంటలలో తెగుళ్ళు కలిగించే బాక్టీరియా క్సన్తోమోనాస్ కాంపెస్ట్రిస్ వెసికటోరియా, క్ౙాంతోమోనాస్ ఆక్సొనోపోడిస్ మాల్వేసియారం, క్సన్తోమోనాస్ ఒరైజె ఒరైజె, ఎర్వినియా కెరటొవొరాల పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి (కవిత అండ్ సతీష్, 2011).
  • నల్లతుమ్మ కొయ్య / గుజ్ౙు పురుగు నివారణ లక్షణాలను కలిగి ఉన్నాయి. (హెచ్‌డిఆర్ఎ ది ఆర్గానిక్ ఆర్గనైజేషన్) నల్లతుమ్మ ద్రావణాలు నిల్వ సమయంలో గింజలనాశించే ఆస్పర్ౙిల్లస్ స్పీసిస్ పెరుగుదలనరికట్టాయి. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదల గణనీయంగా అరికట్టబడింది (సతీష్, అతని అనుచరులు, 2006).
  • నల్లతుమ్మ ఆకు ద్రావణం (25%) ప్రొద్దు తిరుగుడు గింజల నుండి వేరు చేసిన ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, రైజోక్టోనియా బటాటికోలా, కర్వులేరియా లునేట, మ్యూకార్, క్లాడోస్పోరియం, ఆల్టర్నేరియా హీలియాంతి, రైజోపస్ నైగ్రికాన్స్ శిలీంద్రాల పెరుగుదల నరికట్టింది. (ముంతాజ్‌బెయిగ్ అండ్ సుమియాఫాతిమ, 2017)
  • నల్లతుమ్మ గింజల ద్రావణం మామిడి వెర్రితెగులుకారక శిలీంద్రం ఫ్యుజేరియం మొనిలిఫార్మె పెరుగుదలనరికట్టింది (ఇహాబ్ అల్లాస్, 2016)

Read More

‘సంజీవని’ సేంద్రియ ఎరువు

ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల (ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు / గేదెలు / ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది.

4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ / ఆముదం / కానుగ చెక్క (కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక / నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు.

7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువును తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక (తువ్వ) మట్టి వాడాలి.

సంజీవని ఎరువును తయారు చేసే పద్దతి:
తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి.

ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి.

సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ / ఆముదం / కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి. పైన చదునుగా చేయాలి.

నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.

21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు / మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమతెర లాంటి గుడ్డనుగాని, వలను గాని,షేడ్ నెట్ను గాని ఏర్పాటు చేసుకోవాలి.

22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది. సంజీవని ఎరువు ఎలా వాడాలంటే..

బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి.

డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు.

వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే చాలా చక్కగా పంట ఎదుగుతుంది.

కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి.

పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి, కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కిలోల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.

Read More

ఔషధ మొక్క… చండ్ర / సండ్ర

చండ్ర / సండ్ర ఒక అతి ప్రసిద్ధి చెందిన చిన్న ఆకులు, ముళ్ళు కలిగిన ప్రయోజనకర ఆయుర్వేద ఔషధ మొక్క. ఈ చెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనబడుతుంది. దీని హార్ట్ ఉడ్ నుండి తీసిన రసాన్ని కదిరసారమంటారు. దీనిని లవంగడవటి వంటి అనేక ఔషధాల్లో ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు. దీని రసం ఎరుపు రంగులో వుంటుంది. దీనిని దంత ధావనంలో టూత్ బ్రష్‌గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కొయ్యని యజ్ఞాలు, హోమాలు వంటి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంధనంగా వాడతారు.

సాధారణ నామం : బ్లాక్ కెటచు / ఖదిర శాస్త్రీయ నామం : అకేసియా కెటచు కుటుంబం: మైమోసేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద చర్మ టానిక్ ఖదిరారిష్టను ఈ మొక్కను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది రోగాన్ని తగ్గించి శరీరానికి స్థిరత్వమిస్తుంది.
  • చండ్ర ఔషధ గుణాలు : గుణం : లఘు,రూష్ట రసం: వగరు, కషాయం రుచి : కారంగా శక్తి : చల్లదనం కలిగిస్తుంది
  • త్రిదోషాలపై ప్రభావం: కఫ, పిత్త గుణాల సమతుల్యత తెస్తుంది.
  • చర్మ వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలన్నింటిలో చండ్ర అతి గొప్పది. చండ్ర కషాయాన్ని స్నానం చేయడానికి, త్రాగడానికి ఉపయోగిస్తారు.
    ఖదిర కషాయాన్ని డయాబెటిస్, మూత్రాశయ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
  • దంత నాణ్యతను పెంచుతుంది. దురదను తగ్గిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబులకు ఉపశమనం కలిగిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో, కడుపులో నులిపురుగుల నివారణలో ఉపయోగపడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. రక్తస్రావం, వాపులు, కాలేయ వ్యాధుల తొలిదశలలోను, రక్తహీనతను తగ్గిస్తుంది.
  • కత్తాని తమలపాకు, పాన్ తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • కెటచిన్ ఆధారిత పురుగు మందు ఉత్పత్తి నిల్వ ధాన్యంలో ఆశించే ట్రైబోలియం కన్‌ఫ్యూసం, ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ కైనెన్పిస్, సైటోఫిలస్ ఒరైజే పురుగులను అరికట్టింది (ఖటున్, అతని అనుచరులు, 2011)
  • బ్లాక్ కెటచు నుండి వేరు చేసిన ఎపికెటచిన్ లెపిడోప్టెరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యని ప్రదర్శించింది (శ్రీమన్నారాయణ్ అండ్ రావు, 1985).
  • చండ్రచెదలను నివారించే గుణం కలిగి వుంది (హెచ్‌డిఆరఎది ఆర్గానిక్ ఆర్గనైజేషన్, సెలిమ్‌సేన్, అతని అనుచరులు, 2017)
  • చండ్ర బెరడు అసిటోన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. చండ్ర అసిటోన్ ద్రావణం ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ఆల్టర్నేరియా అల్టర్నేటా, రైజోపస్ స్టొలానిఫర్, మాక్రోఫోమినా ఫాసియోలినా శిలీంద్రాల పెరుగుదల నరికట్టింది (నాగరాజు, అతని అనుచరులు 2008).
Read More

పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More