కిసాన్ సారథి-రైతుకు డిజిటల్ వ్యవసాయ సలహాల వారధి

పరిచయం:
ఆధునిక భారతదేశంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు సరైన సమాచారం సరైన సమయంలో అందించడం అత్యంత అవసరం. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచార సాంకేతికత వ్యవసాయ రంగంలో వేగంగా విస్తరిస్తూ, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, మొబైల్ అప్లికేషన్లు, సామాజిక మాధ్యమాలు మరియు డిజిటల్ సేవలు రైతులకు వ్యవసాయ సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో అప్రమాణిక వ్యవసాయ సమాచారం విస్తృతంగా ప్రచారం కావడం వల్ల రైతులు శాస్త్రీయ, విశ్వసనీయ సమాచారాన్ని పొందడం అత్యంత అవసరంగా మారింది. వాతావరణ మార్పులు, చీడ పీడల సమస్యలు, మేలైన యాజమాన్య పద్దతులు, పంటల ధరల హెచ్చుతగ్గులు, ఆధునిక సాంకేతికతల అవసరం వంటి అంశాల కారణంగా రైతులు నిపుణుల సలహాలను తరచుగా పొందాల్సి వస్తోంది. ఇటు వంటి పరిస్థితుల్లో రైతులకు సరైన సమాచారం, సరైన సమయంలో, సరైన భాషలో, అందించడం వ్యవసాయాభివృద్ధికి కీలకం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మరియు డిజిటల్ ఇండియా కార్పొరేషన్ సంయుక్తంగా “కిసాన్ సారథి” (Kisan Sarathi) అనే ఆధునిక డిజిటల్ వేదికను అభివృద్ధి చేశారు. ఇది మొబైల్ ఆధారిత వ్యవసాయ సలహా వ్యవస్థగా పనిచేస్తూ రైతులను నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణ నిపుణులు మరియు కృషి విజ్ఞాన కేంద్రాలతో అనుసంధానిస్తుంది.

కిసాన్ సారథి గురించి:
కిసాన్ సారథి అనేది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) రూపొందించిన వ్యవసాయ సమాచార ప్రసార మరియు సాంకేతిక డిజిటల్ వేదిక. ఇది ఇంటరాక్టివ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ సిస్టమ్ (IIDS) సాంకేతికత ఆధారంగా, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (DIC), ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY), భారత ప్రభుత్వం సహకారంతో జులై 16, 2021వ సంవత్సరంలో అభివృద్ధి చేయబడి, గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారి చేతులమీదుగా ప్రారంబించడం జరిగింది. ఇది “సరైన సమాచారం- సరైన సమయంలో రైతు మాతృ భాషలో” అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. రైతులు తమ పంట, భూమి రకం, ప్రాంతం, సమస్యల వివరాలను నమోదు చేసుకుంటే, వాటి ఆధారంగా వ్యక్తిగతీకరించిన వ్యవసాయ సలహాలు అందుతాయి. ప్రస్తుతం ప్రతి జిల్లాలోని కృషి విజ్ఞాన కేంద్రాలు, రైతులను ఈ పోర్టల్ లో నమోదు చేసి, వారికి వ్యవసాయ, ఉద్యాన, పసుపోషణ, వాతావరణ, సలహాలు సూచనలు సంక్షిప్త సమాచారం (message) రూపం లో అందిస్తున్నారు. అయితే ఈ మెసేజ్ కేవలం 150 అక్షరాల్లో మాత్రమే అందించడం జరుగుతున్నది. రైతు తమ మొబైల్ ఫోన్ ద్వారా నేరుగా సంబందిత జిల్లా శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800 123 2175 ను వినియోగించవచ్చు. పోర్టల్ సేవలే కాక ప్రస్తుతం కిసాన్ సారథి రైతు అప్లికేషన్ (APP) ను రూపొందించి రైతుకు అందుబాటులో వుంచారు.

కిసాన్ సారథి రైతు యాప్:
యాప్‌లో ఉన్న “Talk to Expert” సౌకర్యం ద్వారా రైతులు రెండు ప్రధాన సేవలను వినియోగించుకోవచ్చు:
• కిసాన్ కాల్ సెంటర్ (KCC) – టోల్ ఫ్రీ నంబర్ 1800 180 1551, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
• కిసాన్ సారథి సహాయ కేంద్రం – నంబర్ 14426, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.

ఈ సేవల ద్వారా రైతులు పంటల సాగు, ఎరువుల వినియోగం, పురుగు, తెగుళ్ళ నివారణ, విత్తనాల ఎంపిక, పశుసంవర్ధక అంశాలు మరియు ప్రభుత్వ పథకాలపై నిపుణుల సలహాలను పొందవచ్చు.

సమస్య నమోదు: (Raise a problem):
యాప్‌లో ఉన్న “Raise a Problem” సౌకర్యం ద్వారా రైతులు తమ పంటకు సంబంధించిన సమస్యలను వ్రాత రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటో, వీడియో లేదా వాయిస్ సందేశాన్ని జతచేసి నిపుణులకు పంపవచ్చు. దీనివల్ల సమస్యను ఖచ్చితంగా విశ్లేషించి, రైతులకు వేగవంతమైన మరియు శాస్త్రీయ పరిష్కార సూచనలు అందించబడతాయి

చాటింగ్ సౌకర్యం: (Chat boat):
యాప్‌లో ఉన్న ‘భారత్ విస్తార్’ AI చాట్‌బాట్ సౌకర్యం ద్వారా రైతులు తమ వ్యవసాయ సందేహాలను తెలుగు సహా స్థానిక ఇతర 13 భాషల్లో అడిగి తక్షణమే సమాధానాలు పొందవచ్చు. పంటల సాగు, పురుగు నివారణ, ఎరువుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై 24×7 సమాచారాన్ని అందిస్తుంది.

కిసాన్ సారథి యాప్ ముఖ్య లక్షణాలు:
కిసాన్ సారథి యాప్ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక వినూత్న సౌకర్యాలతో రూపొందించబడింది. ఇందులోని ముఖ్య లక్షణాలు:
• నిపుణులతో ప్రత్యక్ష సంభాషణ (Talk to Expert): కిసాన్ కాల్ సెంటర్ (1800 180 1551) మరియు కిసాన్ సారథి హెల్ప్ లైన్ (14426) ద్వారా రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో నేరుగా మాట్లాడి తమ సందేహాలకు పరిష్కారం పొందవచ్చు.
• సమస్య నమోదు (Raise a Problem): పంటకు సంబంధించిన సమస్యలను వ్రాత రూపంలో నమోదు చేయడంతో పాటు ఫోటో, వీడియో లేదా వాయిస్ సందేశాన్ని జతచేసి నిపుణులకు పంపే సౌకర్యం.
• AI ఆధారిత చాట్‌బాట్ (భారత్ విస్తార్): తెలుగు సహా స్థానిక భాషల్లో రైతుల వ్యవసాయ సందేహాలకు 24×7 తక్షణ సమాధానాలు అందించే కృత్రిమ మేధ (AI) ఆధారిత చాట్‌బాట్.
• వ్యక్తిగతీకరించిన వ్యవసాయ సలహాలు: రైతు పంట, భూమి, ప్రాంతం మరియు సమస్యల ఆధారంగా ప్రత్యేక సిఫార్సులు.
• వాతావరణం మరియు అత్యవసర హెచ్చరికలు: ప్రాంతానికి అనుగుణంగా వాతావరణం, చీడపీడలు, ఇతర పశువుల వ్యాధులపై తక్షణ హెచ్చరికలు మరియు సూచనలు.
• స్థానిక భాషలో సేవలు: రైతులు తమ మాతృభాషలోనే సమాచారం మరియు సలహాలను పొందవచ్చు.
• ఎక్కడైనా-ఎప్పుడైనా సేవలు: స్మార్ట్ మొబైల్ ద్వారా ఇంటి వద్ద నుంచే లేదా పొలంలో నుంచే సేవలను వినియోగించుకునే అవకాశం.
• గత సలహాలు భద్రపరచడం: గతంలో పొందిన సలహాలను అవసరమైనప్పుడు తిరిగి పరిశీలించుకునే సౌకర్యం.

రైతులకు కలిగే ప్రయోజనాలు:
ప్రయోజనం
నిపుణుల సలహాలు: వివరణ – వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల నిపుణులతో నేరుగా సంప్రదించే అవకాశం.
సమస్యలకు వేగవంతమైన పరిష్కారం: ఫోటో, వీడియో లేదా వాయిస్ ద్వారా సమస్యను పంపి త్వరితగతిన శాస్త్రీయ సూచనలు పొందవచ్చు.
AI ఆధారిత తక్షణ సమాచారం: భారత్ విస్తార్ AI చాట్‌బాట్ ద్వారా 24×7 వ్యవసాయ సమాచారాన్ని పొందవచ్చు.
సమయానుకూల హెచ్చరికలు: వాతావరణ మార్పులు, చీడపీడలు మరియు వ్యాధులపై ముందస్తు సమాచారం అందుతుంది.
ఉత్పాదకత పెరుగుదల: శాస్త్రీయ సూచనల అమలు ద్వారా దిగుబడి మరియు నాణ్యత మెరుగుపడుతుంది.
ఖర్చు తగ్గింపు: ఎరువులు, పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లను అవసరానికి అనుగుణంగా వినియోగించి ఖర్చు తగ్గించుకోవచ్చు.
స్థానిక భాషలో సేవలు: తెలుగు సహా స్థానిక భాషల్లో సులభంగా సమాచారం అందుబాటులో ఉంటుంది.
డిజిటల్ సాధికారత: రైతులు ఆధునిక సమాచార సాంకేతికతను వినియోగించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.

ముగింపు: వ్యవసాయ రంగం వేగంగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో కిసాన్ సారథి యాప్ రైతులకు విశ్వసనీయ డిజిటల్ సహచరుడిగా మారుతోంది. కిసాన్ సారథి యాప్ రైతులకు శాస్త్రీయ, విశ్వసనీయ మరియు సమయానుకూల వ్యవసాయ సమాచారాన్ని అందించే సమగ్ర డిజిటల్ వేదిక. నిపుణులతో ప్రత్యక్ష సంభాషణ, పంట సమస్యల నమోదు, AI ఆధారిత చాట్‌బాట్ వంటి సేవల ద్వారా రైతులు మెరుగైన వ్యవసాయ నిర్ణయాలు తీసుకొని ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు కిసాన్ సారథి యాప్‌ను ఉపయోగించి డిజిటల్ వ్యవసాయ సేవల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఈడిగ రవి గౌడ్, విస్తరణ శాస్త్రవేత్త,
కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె, నంద్యాల జిల్లా, ఆ.ప్ర.-518124
Ph: 9640230518

Read More

ఆధునిక వ్యవసాయ సాంకేతికతతో రైతుల ఆదాయం రెట్టింపు దిశగా…

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కోట్లాది మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు, చీడపీడలు, మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు వంటి అనేక సమస్యలు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధునిక వ్యవసాయ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచి, ఖర్చులను తగ్గించి, రైతుల నికర ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది.

  1. డ్రోన్లతో పంటల పర్యవేక్షణ
    వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. డ్రోన్ల ద్వారా పంట పొలాలను తక్కువ సమయంలో పరిశీలించి, పంటలో నీటి కొరత, పోషక లోపాలు, చీడపీడలు, వ్యాధుల ప్రభావాన్ని గుర్తించవచ్చు.అవసరమైన ప్రాంతాల్లోనే పురుగుమందులు లేదా ద్రవ ఎరువులను పిచికారీ చేయడం ద్వారా ఇన్‌పుట్ ఖర్చులు, సమయం, నీరు మరియు శ్రమను ఆదా చేయవచ్చు. ముఖ్యంగా పెద్ద విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు డ్రోన్ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుంది.
  2. సెన్సార్లతో నీటి వినియోగం తగ్గింపు
    నేలలో తేమను గుర్తించే మాయిశ్చర్ సెన్సార్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేలలో తేమ అవసరమైన స్థాయిలో ఉన్నప్పుడు నీటిపారుదల చేయకుండా, అవసరమైనప్పుడు మాత్రమే నీరు అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను సెన్సార్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు.
  3. కృత్రిమ మేధస్సు (AI) – రైతుకు డిజిటల్ సహాయకుడు
    కృత్రిమ మేధస్సు వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. పంట ఫోటో ఆధారంగా కొన్ని చీడపీడలు, వ్యాధుల లక్షణాలను గుర్తించడం, వాతావరణ సమాచారాన్ని విశ్లేషించడం, పంటల పరిస్థితిని పర్యవేక్షించడం వంటి పనుల్లో AI ఆధారిత సాధనాలు సహాయపడుతున్నాయి.రైతు తన పొలంలో తీసిన పంట ఫోటోను ఆధారంగా చేసుకుని సమస్యను ముందుగానే గుర్తించి, వ్యవసాయ నిపుణుల సలహాతో సరైన నివారణ చర్యలు చేపడితే పంట నష్టాలను తగ్గించవచ్చు.
  4. మొబైల్ ఫోన్ – రైతు చేతిలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం
    నేడు దాదాపు ప్రతి రైతు చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటల సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ నిపుణుల సలహాలు వంటి సమాచారాన్ని మొబైల్ ద్వారా పొందవచ్చు.సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందితే నిర్ణయాలు మరింత మెరుగ్గా తీసుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన పెట్టుబడులు తగ్గి, పంట నిర్వహణ మెరుగుపడుతుంది.
  5. అధిక దిగుబడి మరియు వాతావరణ అనుకూల రకాలు
    ఆధునిక వ్యవసాయంలో మంచి నాణ్యత కలిగిన, అధిక దిగుబడి ఇచ్చే మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తన రకాలను ఎంపిక చేయడం కీలకం.పంట కాలం, నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన పంట–సరైన రకం–సరైన కాలం అనే విధానాన్ని పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు.
  6. మట్టి పరీక్ష – ఎరువుల ఖర్చుకు నియంత్రణ
    రైతులు మట్టి పరీక్ష చేయకుండా అంచనాతో ఎరువులు వేయడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.మట్టి పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేయడం ద్వారా అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించవచ్చు. దీంతో ఎరువులపై అనవసరమైన ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  7. ప్రెసిషన్ ఫార్మింగ్ – ప్రతి ప్రాంతానికి అవసరమైన నిర్వహణ
    ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే మొత్తం పొలాన్ని ఒకే విధంగా కాకుండా, పొలంలోని వివిధ ప్రాంతాల అవసరాలను గుర్తించి విత్తనం, నీరు, ఎరువులు, పురుగుమందులను అవసరానికి అనుగుణంగా వినియోగించడం.దీని ద్వారా “ఎక్కడ ఎంత అవసరమో అక్కడ అంతే” అనే విధానాన్ని పాటించవచ్చు. ఫలితంగా వనరుల వినియోగ సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
  8. పంటల వైవిధ్యీకరణతో అదనపు ఆదాయం
    ఒకే పంటపై ఆధారపడటం రైతుకు మార్కెట్ మరియు వాతావరణ ప్రమాదాలను పెంచుతుంది. అందువల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలు మరియు పశుగ్రాస పంటలను ప్రాంతానికి అనుగుణంగా చేర్చడం ద్వారా ఆదాయ వనరులను విస్తరించవచ్చు.ఉదాహరణకు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పుధాన్యాలు మరియు నూనెగింజలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించవచ్చు.
  9. పంట అవశేషాల నిర్వహణ – వ్యర్థం కాదు, వనరు
    పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని సేంద్రియ పదార్థం కూడా తగ్గుతుంది. పంట అవశేషాలను కంపోస్ట్, మల్చింగ్, పశుగ్రాసం లేదా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులుగా వినియోగించడం ద్వారా వాటిని వనరుగా మార్చవచ్చు.ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు సాగు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  10. యాంత్రీకరణతో శ్రమ మరియు సమయం ఆదా
    వ్యవసాయ కూలీల కొరత, పెరుగుతున్న కూలి ఖర్చులు రైతులకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. చిన్న మరియు పెద్ద రైతులకు అనువైన వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం ద్వారా దుక్కి దున్నడం, విత్తడం, కలుపు నివారణ, పంట కోత వంటి పనుల్లో సమయం మరియు శ్రమను ఆదా చేయవచ్చు.చిన్న రైతులు వ్యక్తిగతంగా యంత్రాలు కొనుగోలు చేయలేని సందర్భంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) ద్వారా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావచ్చు.
  11. మార్కెట్ సాంకేతికత – మంచి ధర కోసం
    రైతు ఆదాయంలో ఉత్పత్తి ఎంత ముఖ్యమో, సరైన మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. మొబైల్ ఆధారిత మార్కెట్ సమాచారం, డిజిటల్ మార్కెటింగ్, రైతు సమూహాలు మరియు FPOల ద్వారా మార్కెట్‌కు నేరుగా అనుసంధానం కావడం వల్ల మధ్యవర్తిత్వ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుంది.నాణ్యత, గ్రేడింగ్, ప్యాకేజింగ్, నిల్వ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు రైతు ఉత్పత్తికి అదనపు విలువను తీసుకురాగలవు.
  12. సౌరశక్తితో వ్యవసాయం
    సౌర పంపులు మరియు ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పరికరాలను వినియోగించడం ద్వారా కొన్ని సందర్భాల్లో విద్యుత్ మరియు ఇంధన వ్యయాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా నీటిపారుదల అవసరాల్లో సౌరశక్తి ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

రైతు ఆదాయం పెరగడానికి “ఉత్పత్తి పెంపు” ఒక్కటే మార్గం కాదు
రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేవలం దిగుబడిని పెంచడం సరిపోదు. దిగుబడి పెరగడం + సాగు ఖర్చు తగ్గడం + నాణ్యత పెరగడం + మంచి మార్కెట్ ధర + పంట నష్టాల తగ్గింపు + విలువ ఆధారిత ఉత్పత్తులు అన్నీ కలిసినప్పుడే రైతు నికర ఆదాయం గణనీయంగా పెరగవచ్చు.

ఒక రైతు కోసం సాంకేతిక వ్యవసాయ సూత్రం
మట్టి పరీక్ష → మంచి విత్తనం → సరైన పంట ఎంపిక → శాస్త్రీయ సాగు → సూక్ష్మ నీటిపారుదల → సమతుల్య ఎరువుల వినియోగం → IPM → డ్రోన్/సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ → యాంత్రీకరణ → విలువ జోడింపు → మంచి మార్కెటింగ్ఈ మొత్తం ప్రక్రియను సమగ్రంగా అమలు చేస్తే రైతు ఉత్పత్తి ఖర్చును నియంత్రిస్తూ, ఉత్పాదకత మరియు నికర ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

ముగింపు
వ్యవసాయ రంగ భవిష్యత్తు సంప్రదాయ జ్ఞానం మరియు ఆధునిక సాంకేతికత కలయికలో ఉంది. సాంకేతికత రైతుకు ప్రత్యామ్నాయం కాదు; రైతు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం.ప్రతి రైతు తన ప్రాంతంలోని నేల, నీరు, వాతావరణం, పంట మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఎంచుకోవాలి. వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు రైతు సమూహాలు కలిసి సాంకేతికతను గ్రామస్థాయికి తీసుకెళ్లినప్పుడు వ్యవసాయం మరింత లాభదాయకంగా మరియు స్థిరమైన జీవనోపాధిగా మారుతుంది.

కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో రైతు పొలంలో డ్రోన్ ద్వారా విత్తనాలను విత్తే సాంకేతికతపై ప్రదర్శన నిర్వహించబడింది.

డా. టి. భరత్, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ
మొబైల్: 9700549754. ఇ-మెయిల్: kvkkothagudem@pjtau.edu.in

Read More

35 వేల మంది డ్వాక్రా మహిళలకు వెదురు సాగుతో జీవనోపాధి

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లోని చిన్న, సన్నకారు మహిళా రైతులకు జీవనోపాది కల్పనలో భాగంగా మైదాన ప్రాంతాల్లో వెదురుసాగును ప్రభుత్వం ప్రోత్సహించనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో గత ఏడాది 3వేల మంది మహిళా రైతులతో ప్రభుత్వం వెదురుసాగు చేపట్టింది. ఈ ఏడాది దాన్ని మరో 35 వేల మందికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది సాగుచేసిన జిల్లాలతోపాటు మరో 10 జిల్లాల్లో ఈ ఏడాది సాగును విస్తరించనున్నారు. మొత్తంగా 87 మండలాల పరిధిలో సాగును చేపట్టనున్నారు. నాలుగో ఏడాది నుంచి రైతులకు ఆదాయం వస్తుంది. నాలుగో ఏడాది రూ.30-50వేలు, ఆ తర్వాత రూ.70వేల నుంచి రూ. లక్ష వరకు ఇలా 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. రైతుల కోసం మారేడుమిల్లిలో ప్రభుత్వం రూ.50 లక్షలతో ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటుచేసింది.
వెదురు సాగు లాభదాయకంగా ఉండేందుకు త్రిపుర నుంచి కొత్త రకం వెదురు మొక్కలు తీసుకొస్తున్నారు. బాంబుసా బాంబుసా, బాంబుసా టుల్డా, బాంబుసా న్యూటన్స్ మొక్కలు ఇక్కడి వాతావరణానికి తట్టుకుని పెరిగేవిగా అధికారులు గుర్తించారు. ఒక్కో మొక్క ధర రూ.5-6 వరకు ఉండనుంది.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన కౌలు ధరలు

ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది రబీ ఇంకా పూర్తిగా ముగియక ముందే పొలాలు కౌలుకు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. సాగునీటి వసతి ఉన్న పొలాలైతే ఎకరాకు రూ.40 వేలు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు. మిరప సాగు అనుకూలించడమే దీనికి కారణం. ఈ ఏడాది వాతావరణంలో మార్పు కారణంగా జనవరి నుంచి మిరపలో నల్లతామర ప్రభావం తగ్గింది. తోటలు ఏపుగా పెరిగాయి. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి లభిస్తోంది. అక్కడక్కడా ఎకరాకు 40-50 క్వింటాళ్లు వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మిరప ధరలు క్రమంగా పెరుగుతూ సగటున క్వింటాలు రూ.20 వేలకు చేరాయి. పెట్టుబడులు పోగా కొంతైనా మిగులుతుందని, అప్పుల నుంచి ఎంతోకొంత బయటపడతామనే ఆశ రైతుల్లో ఉంది. విత్తన మొక్కజొన్న రైతులకూ అధిక దిగుబడులే వచ్చాయి. అందుకే వచ్చే ఖరీఫ్, రబీల్లో ఈ రెండు పంటల సాగుకు రైతులు మొగ్గు చూపిస్తున్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లాలో ఈ ఏడాది 1.10 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. వచ్చే ఏడాది కూడా మిరప సాగు పెరుగుతుందని అంచనా. గురజాల, పెదకూరపాడు, మాచర్ల, చిలకలూరిపేటతో పాటు గుంటూరు జిల్లా తాడికొండ తదితర నియోజకవర్గాల్లో సాగు అధికం. గురజాల నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ముందే చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం ప్రాంతంలో బోర్ల కింద ఉన్న భూములకు ఎకరా రూ.25 వేల నుంచి రూ. 30 వేల వరకు పలుకుతోంది.
“ఉమ్మడి అనంతపురం జిల్లాలో మిరప సాగు కొన్నేళ్లుగా పెరిగింది. హంద్రీ-నీవా, తుంగభద్ర హైలెవల్ కెనాల్ పరిధిలో మిరప విస్తృతంగా పండిస్తున్నారు. వచ్చే ఏడాది మళ్లీ మిరప వేసేందుకు పొలాలను కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరాకు రూ. 40వేల నుంచి రూ.45వేల మధ్య చెల్లించేలా కౌలుకు తీసుకుంటున్నారు.

Read More

ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు తెలిపారు. విస్సన్నపేట మండలంలోని కొండపర్వలో కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి- భారతీయ నూనె గింజలు పరిశోధనా సంస్థ తెలంగాణ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఆర్కే మాథుర్, భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి- భారతీయ నూనె గింజలుపరిశోధనా సంస్థ, హైదరాబాద్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ హరి ప్రకాష్ మీనా, జాతీయ సేంద్రియ, సహజ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ మాజీ సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్ యాదవ్, కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం సంచాలకులు డాక్టర్ సుబ్బా రాయుడు, డాక్టర్ బసవరాజు అతిథులుగా పాల్గొని తమ సందేశాలను అన్నదాతలకు అందించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఆదర్శ, ఉత్తమ రైతులు, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

రైతు ఆదాయం పెంపు, విలువ జోడింపులే ప్రధాన లక్ష్యం

రైతు ఆదాయ పెంపు, విలువ జోడింపు లక్ష్యంగా వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులు చేపడుతున్నట్లు, వచ్చే మూడేళ్లలో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని అదనంగా ఉద్యాన పంటల సాగులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వివరించారు. మంగళగిరిలోని వ్యవసాయశాఖ డైరెక్టరేట్‌లో బుధవారం ‘కృషి రోడ్ మ్యాప్’ పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ అగర్వాల్, ఐకార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఉద్యాన) డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్, పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులు దీనికి హాజరయ్యారు. స్థూల విలువ జోడింపులో 15శాతం వృద్ధి సాధన లక్ష్యంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని రాజశేఖర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర అధికారులకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా కృషి రోడ్ మ్యాప్‌ను రూపొందించామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని.. విలువ ఆధారిత పంటల సాగుతోపాటు కేంద్ర, రాష్ట్రాల సమన్వయం ఎంతో కీలకమని సంజయ్‌కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా చెప్పారు.

Read More

సాగు పరికరాలు అద్దెకు

రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గేలా సాగుకు అవసరమైన పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల (సీహెచ్‌సీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. డ్వాక్రా మహిళా రైతులతో (వారి కుటుంబ సభ్యులు)కూడిన ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 520 ఫార్మర్‌ ప్రొడ్యూస్‌ ఆర్గనైజేషన్లు (ఎఫ్‌పీవో) ఉండగా వాటి పరిధిలో తొలి విడతగా 300 సీహెచ్‌సీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధకశాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.

60 కోట్లు కేటాయింపు
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద సీహెచ్‌సీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 60 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. సీహెచ్‌సీల ఏర్పాటుకు ఒక్కో ఎఫ్‌పీవోకు రూ.20 లక్షలు చొప్పున ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది.

రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలే అందుబాటులో ఉంచుతారు
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో ఎఫ్‌పీవో పరిధిలో 1500 నుంచి 2 వేల మంది సన్నచిన్నకారు రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇవి మండలానికి ఒకటి చొప్పున ఉన్నాయి. రైతులకు స్థానికంగా అవసరమయ్యే పరికరాలను కొని సీహెచ్‌సీల్లో ఉంచుతారు. రైతులకు ఈ పరికరాలను బహిరంగ మార్కెట్‌ కంటే తక్కువ ధరకు అద్దెకిస్తారు. సీహెచ్‌సీల నిర్వహణను ఎఫ్‌పీవోనే చూస్తుంది. వచ్చిన ఆదాయాన్ని తిరిగి వాటి నిర్వహణకే వెచ్చిస్తారు.

Read More

రైతుల సంక్షేమం కోసం నాబార్డు భాగస్వామ్యం అవసరం – మంత్రి తుమ్మల

రాష్ట్ర రైతుల ప్రయోజనాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నాబార్డు అధికారులను మంత్రి కోరారు. శుక్రవారం మంత్రి కార్యాలయంలో నాబార్డు సీజిఎం ఉదయ్‌ భాస్కర్‌తో కలిసి నాబార్డు ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాబార్డు అధికారులు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వంతో భాగస్వామ్యం, మైక్రో ఇరిగేషన్‌ పథకం కోసం నిధుల విడుదల, బహుళోపయోగ ప్రాథమిక సహకార సంఘాల (M-PACS) ఏర్పాటు వంటి అంశాలపై మంత్రితో చర్చించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సూక్ష్మ సాగు, సహకార రంగ బలోపేతం వంటి అంశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్‌ మద్దతు అందిస్తోందని ఇదేంతో ప్రశంసనీయమని మంత్రి అన్నారు. ఇందుకోసం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి (ఆర్‌ఐడిఎఫ్‌) కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ రూ. 300 కోట్లు రాష్ట్రానికి కేటాయించినట్లు నాబార్డు అధికారులు తెలిపారు. ఈ నిధులు తక్కువ వడ్డీ రేటుతో (ప్రస్తుతం 4.25%) అందిస్తున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వం నవంబర్‌ 2025 ముగిసేలోపు కొత్త ఆర్‌ఐడిఎఫ్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలు సమర్పించినట్లయితే ఈ నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్‌ఐడిఎఫ్‌ కింద రూ. 41.37 కోట్లు మాత్రమే డ్రా చేసుకుందని, కొనసాగుతున్న ప్రాజెక్టుల కోసం రూ. 1811 కోట్ల డ్రాయబుల్‌ గ్యాప్‌ ఉందని, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఈ ఆర్‌ఐడిఎఫ్‌ రుణాలను వినియోగించుకోవాలని అధికారులు మంత్రికి సూచించారు. ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడుతానని మంత్రి అధికారులకు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో నాబార్డు తెలంగాణ రాష్ట్రానికి మైక్రో ఇరిగేషన్‌ ఫండ్‌ (ఎంఐఎఫ్‌) కింద రూ. 144 కోట్ల నిధులను ఆమోదించినట్టు, ఈ నిధుల విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బిఐతో ఒప్పంద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో 197 కొత్త ఖ-ఆజ్పుఐల ఏర్పాటుకు నాబార్డ్‌ అనుమతి ఇచ్చింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర సహకార అభివృద్ధి కమిటీ (ఐ్పుఈ్పు) ద్వారా త్వరితగతిన ఆమోదించాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రిగారు వీటన్నిటిపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన రైతుల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. పెరిగిన ఉత్పత్తులను అనుగుణంగా నిల్వ సామార్థ్యాలతో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గోదాముల నిల్వ సామార్థ్యం, రైతుల ఉత్పత్తి సామార్థ్యానికి అనుగుణంగా లేదని అన్నారు. గతంలో నాబార్డు వారు తక్కవ వడ్డీతో ఇచ్చిన రుణాలతో ప్రభుత్వం గోదాముల నిర్మాణం చేపట్టేదని గుర్తుచేశారు. అదే ప్రక్రియను తిరిగి కొనసాగించి గోదాములు నిర్మించేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాల కోసం, వారి అర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో నాబార్డు భాగస్వామం కొనసాగించాలని ఈ సందర్భంగా నాబార్డు అధికారులను కోరారు.

Read More

తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళిక-2035’ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఉద్యాన పంటల ఉత్పత్తిని పెంచేందుకు 2035 వరకు అనుసరించాల్సిన లక్ష్యాలను ఈ ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే పది సంవత్సరాలలో అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళిక ఇది.
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ డి. రాజిరెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ప్రణాళికలో నిర్ధేశించారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ. 921.40 కోట్లు సాగు పెట్టుబడిగా, అలాగే రూ. 942.50 కోట్లు డ్రిప్‌ కోసం పెట్టుబడిగా కేటాయిస్తే, ఒక్క రూపాయి పెట్టుబడికి నాలుగు రూపాయల లాభం పొందే అవకాశం ఉందని ప్రణాళిక పేర్కొంది. ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుత విస్తీర్ణంలో అమలు చేయడం వల్ల ఏటా రూ. 1,341 కోట్ల ఉత్పత్తి విలువను సాధించవచ్చని అంచనా వేసింది.
వివిధ పంటల్లో మిగులు, ఉత్పత్తి లోటు ప్రాతిపదికగా కార్యాచరణను అమలు చేయాలని, మిగులు ఉత్పత్తి ఉన్న పంటలు, లోటు ఉత్పత్తి ఉన్న పంటలు గుర్తించి, వాటికి అనుగుణంగా విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పంట యాజమాన్యం, మార్కెటింగ్‌ వంటి అంశాలను ప్రణాళికలో సమగ్రంగా వివరించారు.
ప్రణాళికలోని ప్రధాన అంశాలు
విస్తీర్ణం పెంచడం: పండ్లు, కూరగాయలలో విస్తీర్ణం పెంచడానికి అనువైన జిల్లాలను నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఉద్యాన విశ్వవిద్యాలయం ఎంపిక చేసింది. పండ్ల పంటలలో జామ, బొప్పాయి, అరటి, సపోటా, దానిమ్మ, డ్రాగన్‌ ఫ్రూట్‌ (కమలం పండు). ద్రాక్ష, ఖర్జూరం అంజీర్‌, నేరేడు, ఉసిరి మరియు సీతాఫలం 1.32 లక్షల ఎకరాలలో 2030 వరకు అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో విస్తీర్ణం పెంచుకోవచ్చు. కూరగాయలలో 2030కు 2.45 లక్షల ఎకరాలలో అనువైనవిగా నిర్ధారించిన జిల్లాలలో టమాటో, వంగ, క్యారెట్‌, క్యాబేజ్‌, దోస, కాలిఫ్లవర్‌, ముల్లంగి, ఉల్లి, ఆలుగడ్డ, ఆకుకూరలు, బీర, సొర, మిరప, బెండ, కాకర మరియు చిక్కుడు పంటల విస్తీర్ణం పెంచడానికి కృషి చేయాలి. ఆఫ్‌ సీజన్‌ కూరగాయలు పెంపకంపై విశ్వవిద్యాలయం తయారు చేసిన ప్రణాళిక అమలుపరచాలి. సంవత్సరం పొడుగునా కూరగాయల లభ్యతకు, వివిధ వ్యవధుల్లో కూరగాయల సాగు, షేడ్‌ నెట్లో, రక్షిత వసతులలో కూరగాయలు పెంచడం వంటి పద్ధతులను అవలంబించాలి.
ఉత్పాదకత పెంచడం: ఉద్యాన విశ్వవిద్యాలయం పెంపొందించిన సాంకేతికతను పండ్లు, కూరగాయలు, ఔషధ మరియు సుగంధ ద్రవ్యాల పంటలలో అమలుపరిచి అధిక దిగుబడి పొందేందుకు ప్రయత్నం చేయాలి. పంట నష్టాలను తగ్గించడానికి వాతావరణ ఆధారిత సూచనలు సమయానుకూలంగా విడుదల చేయాలి. ప్రతి మండలంలో వ్యవసాయ యంత్రాల కొరకు కనీసం ఒక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా రైతులు సకాలంలో సాగు పనులు పూర్తి చేయగలిగి నష్టాలను తగ్గించు కోగలుగుతారు. ఉద్యాన అధికారులు, విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు రైతులు నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేయాలి.
కోతానంతర పంట యాజమాన్యం: కోత అనంతరం పంట నష్టం తగ్గించడానికి కావలసిన శీతల నిల్వ గిడ్డంగులు, పండ్లను మాగబెట్టే కేంద్రాలు, నిల్వ వసతులతో మార్కెటింగ్‌ యార్డ్‌, శీతల రవాణా వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఉల్లి పండించే ప్రాంతాలలో తక్కువ ఖర్చుతో నిల్వ సదుపాయాలు కల్పించాలి. ఎగుమతులు ప్రోత్సహించడానికి హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో తగిన మౌలిక సదుపాయాలతో సమీకృత ప్యాక్‌ హౌస్‌ ఏర్పాటు చేయాలి. నాణ్యత పెంచడం, నిల్వ మరియు కోతానంతర పంటల నిర్వహణ, పురుగుమందు అవశేషాలు లేని ఉత్పత్తి, నిల్వకాలం పెంచడం, విలువ జోడింపు పై పరిశోధనలు విస్తృతం చేయాలి.
మార్కెటింగ్‌: రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా సామూహిక క్రయవిక్రయాలను, పంట సాగు మరియు కోతానంతర పంట యాజమాన్యంలో సామూహిక కార్యకలాపాలను ప్రోత్సహించాలి. తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులలో పండ్లు, కూరగాయల క్రయవిక్రయాలను సక్రమంగా అమలుపరిచేలా చర్యలు చేపట్టాలి, ఉద్యాన పంటల ధరల ముందస్తు సూచనలపై మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాన్ని ఉద్యాన విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కలిసి నిర్వహించేలా శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయంలో నెలకొల్పాలి. ఈ సూచనలు రైతులకు సకాలంలో అందాలి.


ఈ ప్రణాళిక పుస్తకాన్ని డాక్టర్‌ డి. రాజి రెడ్డి, డాక్టర్‌ ఎ. భగవాన్‌, డాక్టర్‌ జి.పి. సునందిని రూపొందించారు.

Read More

లాభదాయక పంట ఆయిల్‌పామ్‌

వరి, పత్తి రైతులతో పోలిస్తే ఆయిల్‌ పామ్‌ రైతులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని, దేశంలో ఇతర అన్ని పంటల కంటే ఆయిల్‌ పామ్‌ అత్యంత లాభదాయక పంట అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధ్యయనంలో వెల్లడయింది. దేశీయ అవసరాలకు వినియోగించే నూనెల్లో పామాయిల్‌ దిగుమతులు అత్యధికంగా 21 శాతంగా ఉన్నాయని, దాన్ని తగ్గించే దిశగా సాగు మరింత పెరగాలని, 2047 నాటికి 50% వరకు స్వయం సమృద్ధి సాధించాలని నిర్దేశించింది. దేశవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు, వినియోగం, ఇతర ప్రయోజనాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) నేతృత్వంలో కేంద్రం అధ్యయనం నిర్వహించి, ఆ నివేదిక-2025 ను తాజాగా విడుదల చేసింది. ముఖ్యాంశాలిలా ఉన్నాయి.
దేశంలో వంట నూనెల వార్షిక తలసరి వినియోగం 19.7 కిలోలుగా ఉంది. వినియోగంలో 16.9 మిలియన్‌ టన్నులు భారత్‌ దిగుమతి చేసు కుంటోంది. అందులో 56% పామాయిలే. ఇది ప్రపంచ పామాయిల్‌ దిగు మతులలో 21 శాతం. వినియోగం ఇదే స్థాయిలో ఉంటే 2047 నాటికి డిమాండ్‌ 66.8 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.
లాభం-ఖర్చు నిష్పత్తి పామాయిల్‌ పంటకు అధికంగా ఉంది. ఆయిల్‌పామ్‌కు పెట్టిన రూ. 1 ఖర్చుకు రూ.1.49 లాభం వస్తోంది. వరిలో అయితే రూ.1 ఖర్చుకు.. లాభం రూ.1.03, పత్తిలో రూ.1 ఖర్చుకు లాభం 1.13 శాతంగా ఉంది.
అభివృద్ధికి సూచనలు
ఆయిల్‌పామ్‌ దిగుబడి హెక్టారుకు 2.4 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దాన్ని 4-5 మెట్రిక్‌ టన్నులకు పెంచే దిశగా ప్రణాళిక అవసరం.
దేశంలో ప్రస్తుతం వరి, పత్తి తదితర పంటలు సాగయ్యే 1.6 కోట్ల ఎకరాలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయి.
నర్సరీలు, శుద్ధి సామర్థ్యాలు పెంచేదిశగా పెట్టుబడులను ప్రోత్సహించాలి.
రైతులకు మార్కెటింగ్‌ వనరులను అందుబాటులోకి తేవాలి. చిన్న రైతులకు తేలికగా రుణ లభ్యత ఉండేలా చూడాలి.

Read More