పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1964లో స్థాపించబడిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

1960లలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీమతి ఇందిరా గాంధీ రాజకీయ నాయకత్వం, డా. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి కలిసి హరిత విప్లవానికి దారితీశాయని మంత్రి కొనియాడారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు.

గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు.

రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు.

అలాగే భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్ౙి బి సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, మధుర స్వామినాథన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More

ANGRAU వైస్‌ఛాన్స్‌లర్ (ఇన్‌ఛార్జి )గా డా. పాలడుగు సత్యనారాయణ

ఆంధ్రా రైస్‌మాన్‌గా పేరొందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. పాలడుగు సత్యనారాయణ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ (ఇంఛార్జి)గా నియమితులయ్యారు. ప్రస్తుతం వీరు వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులుగా పనిచేస్తూ ఉన్నారు. వీరు 1983 బ్యాచ్ బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థి. వీరి కృషితో 40కు పైగా అధిక దిగుబడినిచ్చే రకాలు వరి పంటలో రావటం జరిగింది. దేశంలో దాదాపు 7 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో వీరు అభివృద్ధి చేసిన వంగడాలు సాగులో ఉండటం వీరి ప్రత్యేకత. వీరికి డా. ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారంతో పాటు 2012లో రైతునేస్తం పురస్కారం, మరెన్నో ఇతర పురస్కారాలు లభించాయి. వీరి మార్గదర్శనంలో విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని, రైతుల హృదయ స్పందన కావాలని, ఆ ప్రయత్నంలో విజయవంతం కావాలనీ మనఃపూర్వకముగా ‘రైతునేస్తం’ కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తోంది.

Read More

తెలంగాణలో ప్రతి జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రం!

పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతోపాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు వీలుగా ప్రతి జిల్లాకో రైతు విజ్ఞాన కేంద్రం (ఆర్‌వీకే) స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ మేరకు ఆర్‌వీకేలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రా(కేవీకే)లు పనిచేస్తున్నాయి. ఇందులో కొద్దిమంది శాస్త్రవేత్తలే పని చేస్తున్నారు. ఏకంగా 15 జిల్లాల్లో శాస్త్రవేత్తలు లేరు. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించాలని యోచిస్తోంది. వీటన్నింటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రివర్సిటీని ఆదేశించింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక, కేవీకేలను ఆర్‌వికెలుగా మారుస్తారు. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్‌వికెలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు 32 జిల్లాల్లో విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో ఆరుగురు చొప్పున శాస్త్రవేత్తలను నియమిస్తారు. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వాటిలో ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. వాటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. వాటిలో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు. అంకుర సంస్థలకు సైతం స్థలాలను కేటాయిస్తారు.

Read More

పంటల వివరాల నమోదులో SAR డాటా వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదనలు

తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలు అంచనా వేసేందుకు ప్రొ. జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిపాదించిన ప్రాజెక్టుపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాగవుతున్న పంటల విస్తీర్ణం అంచనా వేయటం ద్వారా రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది కావున వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం ముందస్తు అంచనా వేయటానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర వసతులను ఉపయోగించి ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల వరకు రాష్ట్రంలో పంటల వారిగా సాగవుతున్న విస్తీర్ణాన్ని అంచనా వేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, వాటి అమలుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. అదేవిధంగా రానున్న కాలంలో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల భీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు వివిధ సాంకేతిక సంస్థలతో జరిపిన సంప్రదింపులకు కొనసాగింపుగా జరిగిన ఈ సమావేశంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము ఇంతకుముందు Synthetic Aperture Data ఆధారంగా స్విట్జర్లాండ్‌ సంస్థ భాగస్వామ్యంతో కలిసి చేసిన ప్రయోగాలను మరియు ఆ సాంకేతికత ఆధారంగా వానాకాలంలో పంటల నమోదులో వివిధ రాష్ట్రాలలో సాధించిన ఖచ్చితత్వాన్ని మంత్రికి తెలియజేశారు.

అంతేకాకుండా వివిధ పంటలను ఆశించు చీడపీడల వివరాలను కూడా సెన్సార్‌ అమర్చడం ద్వారా ముందుగానే తెలుసుకునే వీలుందని, ఈ దిశగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వివిధ పంటలలో ఈ పంటకాలం నుంచే ప్రయోగాలు చేపట్టాలని ఉపకులపతికి మంత్రిగారు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా మనకు అందుతున్న వివరాలను బట్టి శాటిలైట్‌ టెక్నాలజీ ద్వారా లభించే సమాచారం కంటే కూడా సెన్సార్ల ద్వారా అందే సమాచారం ద్వారా చీడపీడల నివారణ సమర్థవంతంగా నిర్వహించవచ్చని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మంత్రికి తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ డా. సమీరేండు మోహంతి మరియు శాస్త్రవేత్త డా. టి.ఎల్‌. నీలిమ, పరిశోధన సంచాలకులు డా. యం బలరాం, డిజిటల్‌ అగ్రికల్చర్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డా. బి. బాలాజీ నాయక్‌ పాల్గొన్నారు.

Read More