భూసార పరిరక్షణ

నేలను విడిచి సాము చేయలేమన్నది అనుభవాల నానుడి
నేలను తొలచి ఏ ఖనిజాల భోంచేయలేమన్నది నిక్కమైన రూఢి
నేల సారం మరచి సాగు చేయగలమని రైతులోకం పొరబడి
ఎరువంటే మరయంత్రపు గుళికలొకటే అని దాని వెంటబడి

ఏటా పొందుతున్నారు నిస్సారపు ధాన్యరాశుల దిగుబడి
ఎంత కాలమిలా అవగాహనాలేమి అనారోగ్య హానికర సాగుబడి
ఏ మాత్రమూ తగదు మన్నుకు నీ మేనుకు ఈ అపకార ఒరవడి
పర్యవసానాల పరిష్కారాలకై పరుగులెత్తు త్వరపడి

తరిగిపోతున్నది..
త్వరత్వరగా వడివడిగా తరిగిపోతున్నది
తరతరాలు మన్నవలసిన ఈ నేలయందలి మన్ను సారం
మునుపటి కంటే వడిగా తరిగి… పోతున్నది

తరలిపోతున్నది..
మరల మరల దుక్కులతో వరదల కరిగిపోతున్నది
తరగని గని వంటి సారం మన్ను.. బిరబిరా తరలి సాగర తీరం
చిరుజల్లుకు సైతం కదిలి కడలివైపు…. పోతున్నది

తగలబడుతున్నది..
ఎరగడి మంటల మలమల మాడిపోతున్నది
సర్వ జీవుల పార్థీవదేహాల తన ఎదల దాచుకునే భూమాతరం
కార్చిచ్చు తోడ తగలబడి….. బూడిదవుతున్నది

మరల రాకున్నది..
సార హీన నేలయందు పోషక రాశి మరల రానన్నది
కర్మాగార గరళమే మరణ శాసనమై క్షీణించుకపోయిన భూసారం
కరముల జోడించి ఎంత వేడినా…. మరల రాకున్నది

తరచి చూడమన్నది..
పైరు పెంపుకు ఇరుసు వంటి సేంద్రియ కర్బనం కరువవుతున్నది
మరుసటి తరం మనుగడకై పదిలమైన మన్నొకటే మూలాధారం
కన్నులు తెరచి తరచి చూడ… వేడుతున్నది

ఓసారి… ఒక్కసారి… తప్పనిసరి… తప్పదు మరి…

నేటి అవసరం.. ఆపాత జ్ఞాన రీతుల నెమరేసుకునుడు
నెమరేసుకునుడే కాదు.. ఒక్కొక్కటి ఒదలకుండా పాటించుడు
కోతల కాగానే పిలువకు… ఎగిసిపడే మంటల దేవుడు
పంట అవశేషాల కాల్చకు… అచ్చాదనలకై వదలి చూడు

పదింతల మేలు పశువుల మేతకు వదులుడు
మరి కొన్నాళ్ళు సన్న జీవాల మంద కట్టుడు
మరచిపోకు ఎల్లవేళలా నేలన ఆకులు కప్పి ఉంచుడు
నేలకు గాయం కాకుండా జీర్ణం అయ్యేలా కలియదున్నుడు

పలు రకముల పచ్చి రొట్టలు పద్దతిగా పెంచినపుడు
పప్పు ధాన్యాలను, తీరైన అంతర పంటలను ఎంచినపుడు
పంట మార్పిడితో సమయానికి తగు నేర్పు చూపించినపుడు
ఆ తదుపరి.. ఓ హలధారి.. జర్ర వెనక్కి మర్రి చూడు

తిరిగి వస్తున్నవి
సుస్తీ అయిన నేలమ్మకు చికిత్స చేసేందుకు
సుశిక్షితులైన మిత్ర కీటక మహోన్నత కూటమి.. తిరిగి వస్తున్నవి.

ఎరగడి మంటల హడలిపోయి
నేల పొరల దీర్ఘ నిద్రావస్థ యందు బడలిన ఎర్రల దండు
ఉర్వికి ఉపకారులై ఉపరితలమునకు.. తిరిగి వస్తున్నవి

కుప్పను తగలబెట్టి పేలాలు వేయించుట అలవి కాని అవివేకము
బంగారి గుడ్లకై బాతు కుత్తుక పట్టి పొట్టను చీల్చుట అంతులేని అజ్ఞానము
అన్నమన్న ఆనాటి జనులకు ఆహార భద్రత ఇచ్చె సాంద్ర సేద్య రీతి
దుక్కి దున్ను కిసానులకు ఆరోగ్య- ఆదాయ భద్రత మాత్రం అధోగతి

నేలవిడిచి సాము చేయుట, నేల సారం మరచి సాగుబాట అసాధ్యము
బలమైన బువ్వ, ఆ బువ్వను పండించెడి బలమున్న భూమి అత్యావశ్యము
భూసారమున్న నేలలోనే సత్తువున్న పంటలు, ఆనక పోషక సహిత వంటలు
భూసుపోషణ, సస్యావరణ పరిరక్షణతోనే పదికాలాలు పదిలం భావితరములు

  • యాదగిరి శ్రీనివాస్, 9393666693

Read More

ఇటుకల కిల్న్ పద్ధతిలో బయోచార్ తయారీ

ఇటుకల కిల్న్ అనేది ఇటుకలు లేదా రాళ్లతో శాశ్వతంగా నిర్మించే బయోచార్ తయారీ నిర్మాణం. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో పంట అవశేషాలను బయోచార్‌గా మార్చేందుకు ఈ పద్ధతి అనువైనది. ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతు సమూహాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు మరియు గ్రామస్థాయి బయోచార్ ఉత్పత్తి కేంద్రాలు ఈ విధానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

ముందుగా కిల్న్ అడుగు భాగంలో పొడి చెక్కలు లేదా చిన్న కొమ్మలను అమర్చి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు లేదా ఇతర పొడి పంట అవశేషాలను పొరలుగా నింపాలి. పై పొర మండడం ప్రారంభమైన తర్వాత కిల్న్ లో గాలి ప్రవేశాన్ని క్రమంగా నియంత్రించాలి. దీంతో అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్‌గా మారతాయి.

అవశేషాలు ఎక్కువ భాగం నల్లని బయోచార్‌గా మారిన తర్వాత గాలి ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేసి కిల్న్ ను మూసివేయాలి. అనంతరం పూర్తిగా చల్లారిన తర్వాత బయోచార్‌ను బయటకు తీసి బూడిదను వేరుచేయాలి. అవసరమైతే బయోచార్‌ను చిన్న ముక్కలుగా చేసి కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.

ఇటుకల కిల్న్ ద్వారా ఒకేసారి ఎక్కువ పరిమాణంలో నాణ్యమైన బయోచార్‌ను తయారు చేయవచ్చు. ప్రారంభ నిర్మాణ వ్యయం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలం ఉపయోగించుకునే అవకాశం ఉండటం, ఉత్పత్తి వ్యయం తగ్గడం, పెద్ద ఎత్తున బయోచార్ తయారీకి అనువుగా ఉండటం వల్ల గ్రామీణ స్థాయిలో సామూహిక బయోచార్ ఉత్పత్తికి ఈ పద్ధతి ఉత్తమ ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది.

Read More