ఎల్ నినో-మారుతున్న వాతావరణం:పరాన్నజీవి వ్యాధులపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవులు, పశువులు మరియు పర్యావరణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల నేపాల్లో సంభవించిన తీవ్ర వరదలు మరియు హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని మరోసారి వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆలోచించేలా చేశాయి. ఈ మార్పుల్లో ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (El Niño–Southern Oscillation – ENSO) ఒక ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు సంభవిస్తాయి.

2027 వరకు ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గే అవకాశం లేదని భారత వాతావరణ శాస్త్ర విభాగం (India Meteorological Department – IMD) హెచ్చరిస్తోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం, కరువులు, వరదలు వంటి వాతావరణ మార్పులు మానవ–పశు ఆరోగ్యం, పశుపోషణ, వ్యవసాయం, ఆహార–నీటి భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా, పరాన్నజీవులు, వాటి మధ్యస్థ అతిథులు, వాహకాలు మరియు అతిథి జంతువుల పరస్పర సంబంధాలను ప్రభావితం చేసి, పరాన్నజీవుల అభివృద్ధి, జీవన సామర్థ్యం మరియు వ్యాప్తిని మార్చగలవు. అనేక పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు మరియు ఇతర అభివృద్ధి దశలు పర్యావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అనుకూలమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్ల నుంచి లార్వాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొన్ని పరాన్నజీవుల జీవచక్రం త్వరగా పూర్తవుతుంది మరియు కొన్ని వాహకాల సంఖ్య కూడా పెరగవచ్చు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఎండలు కొన్ని పరాన్నజీవుల గుడ్లు మరియు స్వేచ్ఛా జీవన దశల జీవన సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.

గొర్రెలు మరియు మేకల్లో కనిపించే ముఖ్యమైన జీర్ణాశయ నెమటోడ్ పరాన్నజీవి Haemonchus contortus. దీనిని సాధారణంగా Barber’s pole worm అని పిలుస్తారు. ఇది రక్తాన్ని పీల్చడం ద్వారా తీవ్రమైన రక్తహీనత, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది.

ఈ పరాన్నజీవి గుడ్డు నుంచి సంక్రమణకు కారణమయ్యే మూడవ దశ లార్వా (L3) వరకు అభివృద్ధి చెందడానికి ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ పరిస్థితులు అవసరం. తగిన వర్షపాతం, నేల తేమ మరియు మితమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్లు వేగంగా అభివృద్ధి చెంది L3 లార్వాలుగా మారి పచ్చికపైకి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎల్ నినో సమయంలో తక్కువ వర్షపాతం, పొడి పరిస్థితుల కారణంగా లార్వాల అభివృద్ధి తగ్గవచ్చు. అయితే ఎల్ నినో తర్వాత తేమ మరియు వర్షపాతం పెరిగే పరిస్థితులు ఏర్పడితే సంక్రమణ పరిస్థితులు మళ్లీ మారవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పచ్చికపై కొత్తగా లార్వాల అభివృద్ధి తగ్గినప్పటికీ, ఇప్పటికే జంతువుల్లో ఉన్న పరాన్నజీవి భారం కొనసాగవచ్చు. అంతేకాకుండా కరువు వల్ల మేత కొరత ఏర్పడి జంతువుల పోషక స్థితి మరియు రోగనిరోధక శక్తి తగ్గితే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గగానే వచ్చే అధిక వర్షపాతం మరియు వరదల సమయంలో పశువుల మలం నీటి వనరుల్లోకి చేరడం వల్ల Cryptosporidium, Giardia, Entamoeba వంటి నీటి ద్వారా వ్యాపించే పరాన్నజీవుల సంక్రమణ ప్రమాదం పెరగవచ్చు. కరువు సమయంలో సురక్షితమైన నీటి వనరులు తగ్గిపోవడం వల్ల మానవులు మరియు పశువులు పరిమితమైన లేదా కలుషితమైన నీటి వనరులను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.

మరో వైపు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు దోమలు, ఈగలు, గోమార్లు మరియు పేలు వంటి వాహకాల సంఖ్య, అభివృద్ధి మరియు కాలానుగుణ కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా మలేరియా, ట్రీపానాసోమా, థిలేరియా, బెబేసియా, లీష్మానియాసిస్ మరియు ఫైలేరియాసిస్ వంటి పరాన్నజీవి వ్యాధుల వ్యాప్తి విధానాల్లో మార్పులు సంభవించవచ్చు.

పరాన్నజీవి వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి?

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పరాన్నజీవి నియంత్రణలో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

1.వాతావరణ ఆధారిత పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ సమాచారాన్ని పరాన్నజీవి వ్యాధుల పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.
2. లక్ష్యిత నులిపురుగు నివారణ: అవసరం లేని blanket deworming కు బదులుగా, మల పరీక్ష, వ్యాధి లక్షణాలు మరియు స్థానిక వ్యాధి పరిస్థితుల ఆధారంగా చికిత్స చేయాలి.
3. FAMACHA విధానం: Haemonchus contortus ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంటి పొర ఆధారంగా రక్తహీనత ఉన్న జంతువులను గుర్తించి, అవసరమైన వాటికి మాత్రమే చికిత్స చేయడం ప్రయోజనకరం.
4. పోషకాహార నిర్వహణ: కరువు మరియు మేత కొరత సమయంలో తగిన ప్రోటీన్ మరియు శక్తి (ఎనర్జీ) పోషక పదార్థాలు అందించడం ద్వారా జంతువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి.
5. సురక్షితమైన నీరు: మానవులు మరియు పశువులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి.
6. వాహకాల పర్యవేక్షణ: వాటి ఋతువుల ఆధారిత కార్యకలాపాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, పురుగుమందుల వినియోగం మరియు వాహక నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి.
7. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: El Niño వాతావరణ హెచ్చరికలను పశువుల వ్యాధుల నిఘా మరియు పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.

ఎల్ నినో (El Niño) అనేది ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక శక్తివంతమైన క్లైమేట్ డ్రైవర్. ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరాన్నజీవి వ్యాధుల (parasitic diseases) వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం రోగ నిర్ధారణ, చికిత్స మాత్రమే సరిపోవు. కాబట్టి భవిష్యత్తులో పరాన్నజీవి వ్యాధుల నియంత్రణ రోగ నిర్ధారణ మరియు చికిత్సకే పరిమితం కాకుండా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, లక్ష్యిత నులిపురుగు నివారణ, FAMACHA విధానం, పరమాణు స్థాయి పర్యవేక్షణ మరియు వన్ హెల్త్ (మానవ–పశు–పర్యావరణ ఆరోగ్య సమగ్ర విధానం) విధానాలను సమన్వయం చేయాలి.

“వాతావరణాన్ని అర్థం చేసుకుంటే పరాన్నజీవి వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు; ముందస్తు అంచనా ఉంటే సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది.”

Dr. వి. జ్ఞానీ చరిత, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, Dr. పి వి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పరాన్న జీవశాస్త్ర విభాగం. పశు వైద్య కళాశాల, ప్రొద్దటూరు-516360, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్. Ph: 9100771767

Read More

వ్యాధుల నుంచి మీ పాడి ఫారం సురక్షితమేనా? – ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి

“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.

పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు.
అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.

  1. కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా?
    కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
  2. అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా?
    మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
  3. మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా?
    పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  4. పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా?
    మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
  5. పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా?
    పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
  6. మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా?
    పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
  7. పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
    పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
  8. ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా?
    పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  9. టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా?
    వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
  10. పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా?
    రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం?
ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.

పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419

Read More

దూడల ఆరోగ్య సంరక్షణ – వ్యాధుల నివారణ మార్గాలు

ఆరోగ్యంగా పెరిగిన దూడలు భవిష్యత్తులో అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవులు, గేదెలు లేదా మంచి శక్తి కల్గిన ఎద్దులుగా ఎదిగి రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి దూడల పెంపకంకంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం వల్ల వాటి ఆరోగ్యంని కాపాడుకోవచ్చు. పుట్టిన మొదటి కొన్ని వారాలు, నెలలు దూడల జీవితంలో అత్యంత ముఖ్య దశ. ఈ దశలో దూడలకి మంచి పోషకాహారం, నట్టల నివారణ మందులు, రోగనిరోధక టీకాలు సకాలంలో అందించినట్లయితే దూడలు ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా ఆరోగ్యముగా ఎదిగి రైతులకు ఆదాయాన్ని ఇస్తాయి.

 దూడలలో పోషకాహారం లోపించండం లేదా పాకలలో పరిశుభ్రత పాటించకపోవడం వలన వాటికి అంటువ్యాధులు సంభవించి వాటి ఎదుగుదల మందగించడం,శరీర బరువు తగ్గడం, మరణాల రేటు పెరగడం  మరియు భవిష్యత్తులో అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వ్యాధులు వచ్చిన తరువాత చికిత్స చేయడం కంటే ముందుగా నివారణ చర్యలు తీసుకోవడం వలన అంటువ్యాధులు నివారించవచ్చు.

దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు:

దూడలలో పుట్టిన వెంటనే చనిపోవడానికి గల ప్రధాన కారణాలు: కష్టప్రసవం (Dystocia), పుట్టిన వెంటనే ముక్కులోని జిగురు పదార్థాలు శుభ్రం చేయకపోవడం వలన ఊపిరి ఆడకపోవడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాల వలన మరియు పుట్టిన వెంటనే తగిన మోతాదులో ముర్రుపాలు అందించకపోవడం మరియు తల్లి పోషకాహార లోపం కూడా దూడలు పుట్టిన వెంటనే చనిపోవడానికి కారణాలు.

నాభి సంక్రమణ ( Navel ill): పుట్టిన వెంటనే నాభిని శుభ్రపర్చకపోతే సూక్ష్మజీవుల సంక్రమణ కలుగుతుంది. దీని వలన దూడలకి బొడ్డు వాపు మరియు తీవ్రమైన జ్వరం వస్తుంది.
ఈ వ్యాధి నివారణకు పుట్టిన వెంటనే అయోడిన్ ద్రావణంతో నాభిని శుభ్రపరచాలి.

అతిసారవ్యాధి:

పుట్టిన దూడలలో అధికంగా కనిపించే వ్యాధులలో అతిసారం (Diarrhoea లేదా Scores) ఒకటి. ఈ వ్యాధి వల్ల దూడ శరీరంలో నీరు, ఖనిజలవణాలు వేగంగా కోల్పోయి నిర్జలీకరణకు గురవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కొద్ది గంటలలోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి కారకాలు, లక్షణాలు మరియు నివారణ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

అతిసారం అంటే ఏమిటి ?
దూడలు తరుచుగా నీటి వంటి లేదా పలుచటి మలాన్ని విసర్జించడం, సాధారణం కంటే ఎక్కువసార్లు మలం చేయడం, శరీరం నుంచి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడం వంటి పరిస్థితిని అతిసారం అంటారు. ఈ వ్యాధి స్వతంత్ర వ్యాధి కాకుండా బాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు లేదా పోషకాహార లోపల వల్ల కలుగుతుంది. ముఖ్యంగా పుట్టిన 5-30 రోజుల మధ్య ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అతిసారం కారణాలు ముఖ్యంగా రెండు రకాలు 1. ఇన్ఫెక్షియస్ కారణాలు ( సంక్రామక కారణాలు ) 2. నాన్ ఇన్ఫెక్షియస్ కారణాలు ( అసంక్రామక కారణాలు)

దూడలలో అతిసారం కలిగించే సంక్రామక కారణాలు (infectious causes) : సూక్ష్మజీవుల వలన కలిగే అతిసారన్ని సంక్రామక అతిసారం అంటారు. ఇది ఒక దూడ నుండి మరొక దూడకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది.
వైరస్ కారకాలు : రోటా వైరస్, కరోనా వైరస్
బాక్టీరియా: ఇ. కోలై , సాల్మొనెల్లా spp., క్లోస్ట్రిడియం
పరాన్నజీవులు: క్రిప్టోస్పోరిడియం, కాక్సిడియా

దూడలలో అతిసారం కలిగించే అసంక్రామక కారణాలు (Non infectious causes): ఇవి ఒక దూడ నుండి మరొక దూడకి వ్యాపించవు. ప్రధానంగా పోషణ, నిర్వహణ మరియు పర్యావరణ కారణాల వలన ఏర్పడుతాయి. వీటిలో ముఖ్య కారణాలు
● పుట్టిన వెంటనే తగిన పరిమాణంలో ముర్రుపాలు ఇవ్వకపోవడం
● అధికంగా లేదా తక్కువ పాలు ఇవ్వడం.
● అపరిశుభ్రమైన పాలని ఇవ్వడం.
● కలుషితమైన నీరు లేదా దాణా ఇవ్వడం.
● పోషకాహార లోపాలు.
● అప్పుడే పుట్టిన దూడకి సరిపోని వాతావరణం మరియు అపరిశుభ్రమైన పాకలో ఉంచడం, మొదలైనవి.
అపుడే పుట్టిన దూడలకి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల సులభంగా వ్యాధికారక క్రిముల భారిన పడే అవకాశం ఉంటుంది.

దూడలలో అతిసారవ్యాధి ముఖ్య లక్షణాలు:
● తరుచుగా పలుచటి లేదా నీళ్ల లాంటి విరేచనాలు రావడం.
● మలం రంగు పసుపు, తెలుపు,ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు.
● విరేచనాల వలన శరీరంలో నీటి శతం తగ్గి కళ్ళు లోపలికి పోవడం,చర్మాన్ని పైకి లాగితే ఆలస్యంగా మామూలు స్థితికి రావడం.
● పాలు తాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం గమనించవచ్చు.
● దూడలు తరుచుగా బలహీనంగా కనిపిస్తాయి, శరీర బరువు తగ్గుతుంది.
● ముఖ్యంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలో జ్వరం ఉండవచ్చు.
● కళ్ళలో మెరుపు తగ్గి, చెవులు చల్లగా అనిపించడం.
● పొట్ట నొప్పి, అపుడప్పుడు పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది.
● మూత్రవిసర్జన తగ్గడం , శరీరం పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది.
● సకాలంలో చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు.

దూడలలో అతిసార వ్యాధి చికిత్స నివారణోపాయాలు:

● పుట్టిన దూడలకి మొదటి 2 గంటలలోపు తగిన మోతాదులో ముర్రుపాలు ఇవ్వాలి. ఇది రోగనిరోధకశక్తి పెంచి అతిసారాన్ని తగ్గిస్తుంది.
● దూడలను శుభ్రమైన, పొడి గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి.
● కలుషితమైన నీరు, మేత ఇవ్వకూడదు.
● అనారోగ్య దూడలను ఆరోగ్యవంతమైన దూడల నుండి వేరుగా ఉంచాలి.
● దూడ నాభిని అయోడిన్ ద్రావణంతో శుభ్రపరచాలి. నాభి ద్వారా సంక్రమణలు జరగకుండా జాగ్రత్తపడాలి.
● పాలను నిర్ణీత సమయంలో తగిన మోతాదులో ఇవ్వాలి.
● దూడలకు సకాలంలో టీకాలు మరియు నట్టల నివారణ మందులు ఇవ్వాలి.
● వ్యాధి సోకిన దూడలకి అజాగ్రత్త చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి. ఆంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇప్పించాలి.
● ద్రవాలు మరియు ఎలెక్ట్రోలైట్ థెరపీ చికిత్సలో అత్యంత ముఖ్యమైనది.
● దూడకి తీవ్రమైన నీరసం, కళ్ళ లోతు, లేచి నిలబడ లేకపోవడం లేదా 24 గంటలకు మించి తీవ్ర అతిసారం ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

మలబద్దకం:
చలికాలములో ఎక్కువగా దూడలలో మలబద్దకం కనిపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు దూడకు తగిన మోతాదులో జున్నుపాలు లభించేట్లు చూడాలి. జున్నుపాలు దూడలలో మలబద్దకాన్ని నివారిస్తుంది. దూడకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి. ఆకస్మికంగా ఆహరం మార్చకుండా , క్రమంగా మార్పులు చేయాలి.
దూడలకు అప్పుడప్పుడు ఆముదము, అరటిపండు, లిక్విడ్ పరాఫిన్ వంటి మందులు అందించాలి.
దూడలు ఎదిగే దశలో లేత గడ్డి ఎక్కువగా మేపిన మలబద్దకం తగ్గుతుంది.
దూడలకు గడ్డి, దాణా వంటి ఘనపదార్థాలు జీర్ణించుకునే శక్తిని కలుగచేయుటకు తల్లి నెమరు వేసేటపుడు సొంగ తీసుకొని దూడ నోట్లో పెట్టినట్లయితే దూడ జీర్ణాశయంలో అందుకు కావాల్సిన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి.

దూడలలో నట్టల బెడద (Worm infestation):

దూడల కడుపులో గుండ్రటి పురుగులు, లివర్ ఫ్లూక్స్, బద్దె పురుగుల వంటి నట్టలు ఉండడం వల్ల మొదట అజీర్తి చేసి తరువాత పారుకుంటుంది.
● నట్టలు గల దూడ కడుపు ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఎదుగుదల మందగించి, దూడలు సరిగా మేత వేయవు. వెంట్రుకలు నిస్తేజముగా ఉండి దూడ బలహీనంగా చురుకుదనం కోల్పోయి ఉంటుంది.
● రక్తహీనత వల్ల కంటి పొరలు పాలిపోయినట్లు కనిపిస్తాయి.
నట్టల నివారణకు దూడలకు వారం రోజుల వయస్సులో నట్టల నివారణ మందులు త్రాగించాలి. 30 వ రోజు వయసులోపల, తిరిగి 60 రోజుల వయస్సుకు నట్టల నివారణ మందులు తగిన మోతాదులో వాడాలి.
కొత్తగా కొనుగోలు చేసిన దూడలకు నట్టల నివారణ చేసిన తరువాత ఇతర దూడలతో కలపాలి.
మలపరీక్ష ద్వారా నట్టలను గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి.

న్యుమోనియా (Pneumonia): చలి, తేమ మరియు పాకలలో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, వైరస్ లేదా బాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది.

దూడల కడుపులో బంతులు (Hair balls): దూడలు ఒకదానికొకటి నాకుకోవడం వల్ల లేదా గడ్డి తాడులు, ప్లాస్టిక్ వంటివి మింగడం వల్ల కడుపులో ఒకచోటచేరి బంతుల్లా తయారవుతాయి. ఇవి ప్రేగులలోకి చేరి ఆహారపదార్థాలకు అడ్డుపడతాయి. దీని వలన దూడలలో కడుపు నొప్పి సంభవిస్తుంది.
దీనికి తగిన చికిత్స లేదు. బంతులు అడ్డుపడడం వలన కడుపు నొప్పి వస్తే శస్త్ర చికిత్స చేయించాలి.

దూడలలో డిప్తీరియా: ఇది ప్రధానముగా బాక్టీరియా వలన వస్తుంది. నోరు లేదా గొంతులో గాయాలు ఏర్పడినపుడు ఈ బాక్టీరియా ప్రవేశించి వ్యాధిని కల్గిస్తుంది. ఈ వ్యాధి వలన అధిక జ్వరం వస్తుంది. నోటి లోపల బూడిద రంగులో పుండ్లు ఏర్పడి, నోటి నుండి చొంగ కారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక వంటి శబ్దాలు రావడం జరుగుతుంది.
● ఈ వ్యాధి నివారణకు పశువైద్యుడి సలహా మేరకు ఆంటిబయోటిక్ మందులు, సల్ఫా మందులు ఇప్పించాలి.
● దూడల పాకలు చలి, ఈదరగాడ్పులు రాకుండా పరిశుభ్రముగా ఉంచాలి.

దూడల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన సూచనలు:

1.దూడ పుట్టిన వెంటనే ముక్కు, నోరు శుభ్రం చేసి శ్వాస సులభంగా జరిగేలా చూడాలి.

  1. పుట్టిన 2 గంటలలోపు ముర్రుపాలు తాగించాలి.
    3.దూడను పరిశుభ్రమైన పాకలో ఉంచాలి.
    4.పుట్టిన దూడ యొక్క నాభిని అయోడిన్ ద్రావణంలో ముంచాలి.
  2. పరిశుభ్రమైన త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
  3. నట్టల నివారణ మందులు 10-15 రోజుల వయస్సులో ఒకసారి, 30 వ రోజు ఒకసారి, 60 వ రోజు ఒకసారి తగిన మోతాదులో ఇవ్వాలి.
  4. 2 వారాల వయస్సు నుంచి మెల్లిగా కాఫ్ స్టార్టర్ ని మేతగా ఇస్తూ, మూడో నెల వరకు పాలు, క్రమంగా ఘనమేత ఇవ్వాలి.
  5. 3 నెలల తరువాత పచ్చిమేత మరియు గడ్డి మేతని ఇవ్వాలి.
    9.పాకలో ఖనిజమిశ్రమం కలిగివున్న రాళ్లను వ్రేలాడదీయాలి.
  6. దూడలకు నెలకొకసారి వెంట్రుకలు గొరిగితే బాహ్యపారాన్నజీవుల వలన కలిగే వ్యాధుల నుండి కూడా రక్షించవచ్చు.
    11.టీకాలు నిర్ణిత షెడ్యూల్ ప్రకారం చేయించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  7. దూడల ఆరోగ్యంని ప్రతిరోజు గమనించి, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.

ముగింపు : దూడలకు సరైన పోషణ, పాకలలో పరిశుభ్రత, సమయానికి నట్టల నివారణ మందులు, టీకాలు చేపట్టడం వలన భవిష్యత్తులో అధిక ఉత్పాదకత కలిగిన పాడి పశువులను తయారుచేయవచ్చు. రైతులు ఈ సూచనలు పాటిస్తే దూడల మరణాల రేటు తగ్గి, పాడి పరిశ్రమలో మంచి లాభాలు పొందగలుగుతారు.

రచయిత: డా. చంద్రగిరి ప్రజ్ఞ, సహాయ ఆచార్యులు, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల. 9014639814

Read More

పొదుగు వాపు… పాడి రైతులకు పెను సవాలు! నివారణ ఎలా?

“పాలు ఇచ్చే ప్రతి పశువు… రైతు కుటుంబానికి ఒక ఆదాయ వనరు. దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత.”

   పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధుల్లో పొదుగు వాపు (మాస్టిటిస్) ఒకటి. ఈ వ్యాధి వల్ల పశువు పొదుగులో వాపు, నొప్పి, పాలలో గడ్డలు, రంగు మారడం లేదా ఇతర అసాధారణ మార్పులు, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా పాడి రైతులు పాల దిగుబడి తగ్గడం, చికిత్స ఖర్చులు పెరగడం, పాల నాణ్యత తగ్గడం వంటి ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అయితే, సరైన అవగాహన, పరిశుభ్రత, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా మాస్టిటిస్‌ను చాలా వరకు నివారించవచ్చు. పొదుగు వాపు రావడానికి ప్రధాన కారణాలు, పాడి రైతులు తరచుగా చేసే పొరపాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యాధి వచ్చినప్పుడు అనుసరించాల్సిన చర్యలను తెలుసుకుందాం.

పొదుగు వాపు లక్షణాలు
పొదుగు వాపు (మాస్టిటిస్)ను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే సకాలంలో చికిత్స ప్రారంభిస్తే పశువు త్వరగా కోలుకోవడంతో పాటు పాల దిగుబడిలో వచ్చే నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. పొదుగు వాపు వచ్చిన పశువులలో ప్రభావితమైన భాగం ఉబ్బడం, గట్టిపడటం లేదా నొప్పిగా ఉండటం గమనించవచ్చు. ఆ భాగం సాధారణం కంటే వేడిగా అనిపించవచ్చు. పాలు పితికే సమయంలో పాలు గడ్డకట్టినట్లు కనిపించడం, పాలు పలుచగా లేదా నీరుగా మారడం, రంగు మారడం లేదా రక్తపు చారలు కనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ పాల దిగుబడి తగ్గుతుంది. కొన్నిసార్లు పాలు పితికేటప్పుడు నొప్పి కారణంగా పశువు కాలు ఎత్తడం, తన్నడం లేదా అసౌకర్యంగా ప్రవర్తించడం గమనించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో జ్వరం, నీరసం, ఆకలి తగ్గడం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు కూడా కనిపించవచ్చు.
ఈ లక్షణాల్లో ఏవైనా కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించాలి.

పొదుగు వాపు వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలి?
పొదుగు వాపు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించి, సూచించిన చికిత్సను వెంటనే ప్రారంభించాలి. స్వయంగా మందులు వాడడం లేదా ఇతరుల సలహాతో చికిత్స చేయించడం మంచిది కాదు. అలాగే, పశువు ఆరోగ్యం మెరుగుపడిందని భావించి చికిత్సను మధ్యలోనే ఆపివేయకూడదు.

   చికిత్స జరుగుతున్న సమయంలో వ్యాధి సోకిన పశువును సాధ్యమైనంత వరకు ఇతర పశువులకు దూరంగా ఉంచడం మంచిది. పాలు పితికేటప్పుడు ఆ పశువును చివరగా పితకాలి. అనంతరం చేతులు, పాలు పితికే పాత్రలు లేదా యంత్రాలను పూర్తిగా శుభ్రపరచాలి.

     అదేవిధంగా, చికిత్స సమయంలో వచ్చే పాలను పశువైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే వినియోగించాలి లేదా పారవేయాలి. యాంటీబయాటిక్స్‌ చికిత్స పొందుతున్న పశువుల పాలను, పశువైద్యుడు సూచించిన విత్‌డ్రావల్‌ పీరియడ్‌ (మందుల అవశేషాలు పాలలో పూర్తిగా తొలగే వరకు వేచి ఉండాల్సిన గడువు) పూర్తయ్యే వరకు తాగకూడదు, అమ్మకూడదు లేదా ఇతర అవసరాలకు వినియోగించకూడదు.

    చికిత్సను పూర్తిగా కొనసాగించి, సూచించిన జాగ్రత్తలను పాటించడం వల్ల పశువు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

పొదుగు వాపు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి?
పొదుగు వాపు (మాస్టిటిస్) ఎక్కువగా వ్యాధికారక సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు ప్రధానంగా పాలు తీసే సమయంలో, అపరిశుభ్రమైన పశువుల కొట్టం వల్ల లేదా పొదుగుకు ఏర్పడిన చిన్న గాయాల ద్వారా లోపలికి చేరుతాయి. అందువల్ల పొదుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ పాటించే పాడి నిర్వహణ పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

    పాలు తీసే సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు తీసే ముందు పొదుగును శుభ్రమైన నీటితో కడిగి, ఒక్కో పశువును ప్రత్యేకమైన శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. పాలు తీసే వ్యక్తి చేతులు, ఉపయోగించే పాత్రలు లేదా యంత్రాలు కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిసారీ మొదటి కొన్ని పాల ధారలను ప్రత్యేక పాత్రలో సేకరించి జాగ్రత్తగా పరిశీలించాలి. పాలలో గడ్డలు, రక్తపు చారలు, రంగు మారడం లేదా పాలు పలుచగా కనిపించడం వంటి మార్పులు ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం మంచిది. పాలు తీసిన అనంతరం చనుమొనలను పశువైద్యులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కొన్ని సెకన్ల పాటు ముంచడం (టీట్‌ డిప్పింగ్‌) వల్ల సూక్ష్మజీవులు నశించి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే, పాలు తీసిన వెంటనే పశువు పడుకోకుండా కొద్దిసేపు నిలబడి ఉండేలా చూడాలి. ఇందుకోసం కొద్దిగా పచ్చిగడ్డి లేదా దాణా వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చనుమొనలు సహజ స్థితికి చేరే వరకు సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించే అవకాశం తగ్గుతుంది. పాలు తీసే విధానం కూడా పొదుగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పాలను ఎల్లప్పుడూ పూర్తి చేతి పద్ధతిలో తీయాలి. పిడికిలి కణుపులతో (Knuckling) పాలు తీయడం వల్ల చనుమొనలకు గాయాలు ఏర్పడి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే, పొదుగులో పాలు మిగిలిపోకుండా పూర్తిగా పాలు తీయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పాలు తీయడం కూడా పొదుగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

   పశువులు ఉండే పరిసరాల పరిశుభ్రత కూడా పొదుగు వాపు నివారణలో కీలకమైనది. కొట్టంలో పేడ, మూత్రం, బురద పేరుకుపోతే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. పశువులు పడుకునే ప్రదేశం ఎల్లప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొట్టం తడిగా, బురదగా మారకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల పొదుగు వాపు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. పశువు ఆరోగ్యం బాగుంటేనే పొదుగు ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్య పోషకాహారం, ఖనిజ లవణాల మిశ్రమం, విటమిన్లు, పరిశుభ్రమైన తాగునీరు తగిన మోతాదులో అందితే పశువు శారీరక స్థితి మెరుగుపడుతుంది. దీంతో సూక్ష్మజీవులను ఎదుర్కొనే శక్తి పెరిగి, పొదుగు వాపు వచ్చే అవకాశం తగ్గుతుంది. అదే విధంగా, ప్రసవం అనంతరం, అధిక పాలిచ్చే దశలో లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో పశువులపై మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఈ దశల్లో సరైన పోషణ, మంచి నిర్వహణ అందిస్తే పొదుగు వాపు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

పొదుగు వాపును నివారించాలంటే పరిశుభ్రమైన పాడి నిర్వహణ, సరైన పాలు తీసే పద్ధతి, పశువుల ఆరోగ్యంపై నిరంతర శ్రద్ధ—ఈ మూడింటినీ రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి.

“రోజువారీ పాడి నిర్వహణలో పాటించే చిన్న చిన్న జాగ్రత్తలే… పెద్ద నష్టాలను నివారిస్తాయి.”

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల, టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల. 7093198419

Read More

గొర్రెల్లో నీలి నాలుక వ్యాధి నివారణ ఎలా?

ఈ వ్యాధిని మూతివాపు, మూతిపుండ్లు, పూతరోగం మొదలగు పేర్లతో వివిధ ప్రాంతాలలో వ్యవహరిస్తారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న గొర్రెలలో నాలుక నీలిరంగుకు మారుతుంది. కావున ఈ వ్యాధిని నీలిరంగు వ్యాధి అని వ్యవహరిస్తారు.

వ్యాధి ఎలా వస్తుంది?
ఈ వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. దోమకాటు వలన ఈ క్రిములు గొర్రె శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలంలో వ్యాధి క్రిముల అభివృద్ధికి మరియు అవి విస్తరింపచేసే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది.

వ్యాధి లక్షణాలు:

  • వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం ఎక్కువగా ఉంటుంది.
  • క్రమేణా జ్వరం ఉన్న గొర్రెలకు చొంగ కారుతూ, పెదవులు మరియు చిగుళ్ళు వాచి, పెదవుల లోపలి భాగం ఎర్రబడి, చిన్న చిన్న గుల్లలు ఏర్పడతాయి.
  • వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెలలో ఈ వ్యాధి కాళ్ళకు కూడా పాకుతుంది. గిట్టల మొదటి భాగం వాచి, గిట్టల మధ్య ఎర్రగా ఉంటుంది. కావున గొర్రెలు సరిగా నడవలేక మేత సమయంలో వెనుకపడతాయి.
  • వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుకు మారుతుంది. మరియు మెడ వంకర పోతుంది.
  • వ్యాధి తీవ్రతను బట్టి 5Ð6 రోజులు మేత మేయక, నీరు త్రాగకపోవుట వలన గొర్రెలు నీరసించి చివరికి చనిపోతాయి.

వ్యాధిని ఎలా నివారించాలి?

  • వ్యాధి నివారణ టీకాల ఉత్పత్తికి ప్రస్తుతము పరిశోధనలు చివరి దశలో ఉన్నాయి.
  • వర్షాకాలంలో కొట్టం, పరిసర ప్రాంతాలలో ఈగలు, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలి.
  • రోజుకు రెండు పర్యాయాలు వేపాకుతో పొగ వేసిన యెడల దోమలను నివారించవచ్చు.

చికిత్స:

  • వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశువైద్యుని సంప్రదించి, యాంటిబయోటిక్ మరియు నొప్పి నివారణ మందులు వాడడం ద్వారా వ్యాధిగ్రస్తమైన గొర్రెలు చనిపోకుండా కాపాడుకోవచ్చు.
  • నోటిలోని పుండ్లను 1% పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో కడిగి జింక్ పౌడర్ నీటితో రుద్దాలి. గిట్టల మధ్య ఉన్న పుండ్లను కడిగి హిమాక్స్, నీమ్‌లెంట్ వంటి ఆయింట్‌మెంటులు పూయాలి.
  • కస్తూరి దిలీప్, పిహెచ్.డి. స్కాలర్, వి.వి.వి. అమృత్‌కుమార్, ప్రొఫెసర్, పశువైద్య విభాగం, పశువైద్య కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్: 9391097150
Read More