నెలలు తక్కువగా పుట్టిన దూడకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి. బాగా వెచ్ౘ్గా వుండే విధంగా గడ్డి, గోనె సంచులతో పడక ఏర్పాటు చేయాలి. జున్నుపాలు మితంగా రోజుకు 4 పర్యాయాలు త్రాగించాలి.
హోమియో: 1. ముందుగా ఫైవ్ ఫాస్ 30, తదుపరి కార్బో వెజ్ 30 రోజుకు 10 మాత్రలు, ఓపియం 30 మడు రోజులకొక పర్యాయం చొప్పున 10 రోజుల తినిపించాలి. 2. ఆల్ఫాల్ఫా 30, జిన్సెంగ్ 30 కలిపిన మందు ఒక చెంచా, కొద్దిపాటి నీళ్ళలో కలిపి, రోజుకు 3 సార్లు చొప్పున 20 రోజులు త్రాగించాలి. అల్లోపతి : 1. విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు రోజుకు ఒక పర్యాయం వారం రోజులు త్రాగించాలి. 2. టెట్వ్యాక్ (TETVAC) ఇంజక్షన్ 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి. 3. సూచించిన ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.
ఆరోగ్యంగా పెరిగిన దూడలు భవిష్యత్తులో అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవులు, గేదెలు లేదా మంచి శక్తి కల్గిన ఎద్దులుగా ఎదిగి రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి దూడల పెంపకంకంలో శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం వల్ల వాటి ఆరోగ్యంని కాపాడుకోవచ్చు. పుట్టిన మొదటి కొన్ని వారాలు, నెలలు దూడల జీవితంలో అత్యంత ముఖ్య దశ. ఈ దశలో దూడలకి మంచి పోషకాహారం, నట్టల నివారణ మందులు, రోగనిరోధక టీకాలు సకాలంలో అందించినట్లయితే దూడలు ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా ఆరోగ్యముగా ఎదిగి రైతులకు ఆదాయాన్ని ఇస్తాయి.
దూడలలో పోషకాహారం లోపించండం లేదా పాకలలో పరిశుభ్రత పాటించకపోవడం వలన వాటికి అంటువ్యాధులు సంభవించి వాటి ఎదుగుదల మందగించడం,శరీర బరువు తగ్గడం, మరణాల రేటు పెరగడం మరియు భవిష్యత్తులో అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వ్యాధులు వచ్చిన తరువాత చికిత్స చేయడం కంటే ముందుగా నివారణ చర్యలు తీసుకోవడం వలన అంటువ్యాధులు నివారించవచ్చు.
దూడలలో సాధారణంగా వచ్చే వ్యాధులు:
దూడలలో పుట్టిన వెంటనే చనిపోవడానికి గల ప్రధాన కారణాలు: కష్టప్రసవం (Dystocia), పుట్టిన వెంటనే ముక్కులోని జిగురు పదార్థాలు శుభ్రం చేయకపోవడం వలన ఊపిరి ఆడకపోవడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాల వలన మరియు పుట్టిన వెంటనే తగిన మోతాదులో ముర్రుపాలు అందించకపోవడం మరియు తల్లి పోషకాహార లోపం కూడా దూడలు పుట్టిన వెంటనే చనిపోవడానికి కారణాలు.
నాభి సంక్రమణ ( Navel ill): పుట్టిన వెంటనే నాభిని శుభ్రపర్చకపోతే సూక్ష్మజీవుల సంక్రమణ కలుగుతుంది. దీని వలన దూడలకి బొడ్డు వాపు మరియు తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ వ్యాధి నివారణకు పుట్టిన వెంటనే అయోడిన్ ద్రావణంతో నాభిని శుభ్రపరచాలి.
అతిసారవ్యాధి:
పుట్టిన దూడలలో అధికంగా కనిపించే వ్యాధులలో అతిసారం (Diarrhoea లేదా Scores) ఒకటి. ఈ వ్యాధి వల్ల దూడ శరీరంలో నీరు, ఖనిజలవణాలు వేగంగా కోల్పోయి నిర్జలీకరణకు గురవుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే కొద్ది గంటలలోనే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి కారకాలు, లక్షణాలు మరియు నివారణ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
అతిసారం అంటే ఏమిటి ? దూడలు తరుచుగా నీటి వంటి లేదా పలుచటి మలాన్ని విసర్జించడం, సాధారణం కంటే ఎక్కువసార్లు మలం చేయడం, శరీరం నుంచి నీరు మరియు లవణాలు అధికంగా కోల్పోవడం వంటి పరిస్థితిని అతిసారం అంటారు. ఈ వ్యాధి స్వతంత్ర వ్యాధి కాకుండా బాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు లేదా పోషకాహార లోపల వల్ల కలుగుతుంది. ముఖ్యంగా పుట్టిన 5-30 రోజుల మధ్య ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అతిసారం కారణాలు ముఖ్యంగా రెండు రకాలు 1. ఇన్ఫెక్షియస్ కారణాలు ( సంక్రామక కారణాలు ) 2. నాన్ ఇన్ఫెక్షియస్ కారణాలు ( అసంక్రామక కారణాలు)
దూడలలో అతిసారం కలిగించే సంక్రామక కారణాలు (infectious causes) : సూక్ష్మజీవుల వలన కలిగే అతిసారన్ని సంక్రామక అతిసారం అంటారు. ఇది ఒక దూడ నుండి మరొక దూడకు వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. వైరస్ కారకాలు : రోటా వైరస్, కరోనా వైరస్ బాక్టీరియా: ఇ. కోలై , సాల్మొనెల్లా spp., క్లోస్ట్రిడియం పరాన్నజీవులు: క్రిప్టోస్పోరిడియం, కాక్సిడియా
దూడలలో అతిసారం కలిగించే అసంక్రామక కారణాలు (Non infectious causes): ఇవి ఒక దూడ నుండి మరొక దూడకి వ్యాపించవు. ప్రధానంగా పోషణ, నిర్వహణ మరియు పర్యావరణ కారణాల వలన ఏర్పడుతాయి. వీటిలో ముఖ్య కారణాలు ● పుట్టిన వెంటనే తగిన పరిమాణంలో ముర్రుపాలు ఇవ్వకపోవడం ● అధికంగా లేదా తక్కువ పాలు ఇవ్వడం. ● అపరిశుభ్రమైన పాలని ఇవ్వడం. ● కలుషితమైన నీరు లేదా దాణా ఇవ్వడం. ● పోషకాహార లోపాలు. ● అప్పుడే పుట్టిన దూడకి సరిపోని వాతావరణం మరియు అపరిశుభ్రమైన పాకలో ఉంచడం, మొదలైనవి. అపుడే పుట్టిన దూడలకి రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడం వల్ల సులభంగా వ్యాధికారక క్రిముల భారిన పడే అవకాశం ఉంటుంది.
దూడలలో అతిసారవ్యాధి ముఖ్య లక్షణాలు: ● తరుచుగా పలుచటి లేదా నీళ్ల లాంటి విరేచనాలు రావడం. ● మలం రంగు పసుపు, తెలుపు,ఆకుపచ్చ లేదా గోధుమ రంగులో ఉండవచ్చు. ● విరేచనాల వలన శరీరంలో నీటి శతం తగ్గి కళ్ళు లోపలికి పోవడం,చర్మాన్ని పైకి లాగితే ఆలస్యంగా మామూలు స్థితికి రావడం. ● పాలు తాగడం తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం గమనించవచ్చు. ● దూడలు తరుచుగా బలహీనంగా కనిపిస్తాయి, శరీర బరువు తగ్గుతుంది. ● ముఖ్యంగా బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణలో జ్వరం ఉండవచ్చు. ● కళ్ళలో మెరుపు తగ్గి, చెవులు చల్లగా అనిపించడం. ● పొట్ట నొప్పి, అపుడప్పుడు పొట్ట ఉబ్బినట్లు కనిపిస్తుంది. ● మూత్రవిసర్జన తగ్గడం , శరీరం పూర్తిగా ఎండిపోయినట్లు కనిపిస్తుంది. ● సకాలంలో చికిత్స చేయకపోతే మరణం కూడా సంభవించవచ్చు.
దూడలలో అతిసార వ్యాధి చికిత్స నివారణోపాయాలు:
● పుట్టిన దూడలకి మొదటి 2 గంటలలోపు తగిన మోతాదులో ముర్రుపాలు ఇవ్వాలి. ఇది రోగనిరోధకశక్తి పెంచి అతిసారాన్ని తగ్గిస్తుంది. ● దూడలను శుభ్రమైన, పొడి గాలి, వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. ● కలుషితమైన నీరు, మేత ఇవ్వకూడదు. ● అనారోగ్య దూడలను ఆరోగ్యవంతమైన దూడల నుండి వేరుగా ఉంచాలి. ● దూడ నాభిని అయోడిన్ ద్రావణంతో శుభ్రపరచాలి. నాభి ద్వారా సంక్రమణలు జరగకుండా జాగ్రత్తపడాలి. ● పాలను నిర్ణీత సమయంలో తగిన మోతాదులో ఇవ్వాలి. ● దూడలకు సకాలంలో టీకాలు మరియు నట్టల నివారణ మందులు ఇవ్వాలి. ● వ్యాధి సోకిన దూడలకి అజాగ్రత్త చేయకుండా వెంటనే చికిత్స చేయించాలి. ఆంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు ఇప్పించాలి. ● ద్రవాలు మరియు ఎలెక్ట్రోలైట్ థెరపీ చికిత్సలో అత్యంత ముఖ్యమైనది. ● దూడకి తీవ్రమైన నీరసం, కళ్ళ లోతు, లేచి నిలబడ లేకపోవడం లేదా 24 గంటలకు మించి తీవ్ర అతిసారం ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
మలబద్దకం: చలికాలములో ఎక్కువగా దూడలలో మలబద్దకం కనిపిస్తుంది. ఈ వ్యాధి నివారణకు దూడకు తగిన మోతాదులో జున్నుపాలు లభించేట్లు చూడాలి. జున్నుపాలు దూడలలో మలబద్దకాన్ని నివారిస్తుంది. దూడకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి. ఆకస్మికంగా ఆహరం మార్చకుండా , క్రమంగా మార్పులు చేయాలి. దూడలకు అప్పుడప్పుడు ఆముదము, అరటిపండు, లిక్విడ్ పరాఫిన్ వంటి మందులు అందించాలి. దూడలు ఎదిగే దశలో లేత గడ్డి ఎక్కువగా మేపిన మలబద్దకం తగ్గుతుంది. దూడలకు గడ్డి, దాణా వంటి ఘనపదార్థాలు జీర్ణించుకునే శక్తిని కలుగచేయుటకు తల్లి నెమరు వేసేటపుడు సొంగ తీసుకొని దూడ నోట్లో పెట్టినట్లయితే దూడ జీర్ణాశయంలో అందుకు కావాల్సిన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి.
దూడలలో నట్టల బెడద (Worm infestation):
దూడల కడుపులో గుండ్రటి పురుగులు, లివర్ ఫ్లూక్స్, బద్దె పురుగుల వంటి నట్టలు ఉండడం వల్ల మొదట అజీర్తి చేసి తరువాత పారుకుంటుంది. ● నట్టలు గల దూడ కడుపు ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఎదుగుదల మందగించి, దూడలు సరిగా మేత వేయవు. వెంట్రుకలు నిస్తేజముగా ఉండి దూడ బలహీనంగా చురుకుదనం కోల్పోయి ఉంటుంది. ● రక్తహీనత వల్ల కంటి పొరలు పాలిపోయినట్లు కనిపిస్తాయి. నట్టల నివారణకు దూడలకు వారం రోజుల వయస్సులో నట్టల నివారణ మందులు త్రాగించాలి. 30 వ రోజు వయసులోపల, తిరిగి 60 రోజుల వయస్సుకు నట్టల నివారణ మందులు తగిన మోతాదులో వాడాలి. కొత్తగా కొనుగోలు చేసిన దూడలకు నట్టల నివారణ చేసిన తరువాత ఇతర దూడలతో కలపాలి. మలపరీక్ష ద్వారా నట్టలను గుర్తించి అవసరమైన చికిత్స అందించాలి.
న్యుమోనియా (Pneumonia): చలి, తేమ మరియు పాకలలో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, వైరస్ లేదా బాక్టీరియా సంక్రమణ వల్ల వస్తుంది.
దూడల కడుపులో బంతులు (Hair balls): దూడలు ఒకదానికొకటి నాకుకోవడం వల్ల లేదా గడ్డి తాడులు, ప్లాస్టిక్ వంటివి మింగడం వల్ల కడుపులో ఒకచోటచేరి బంతుల్లా తయారవుతాయి. ఇవి ప్రేగులలోకి చేరి ఆహారపదార్థాలకు అడ్డుపడతాయి. దీని వలన దూడలలో కడుపు నొప్పి సంభవిస్తుంది. దీనికి తగిన చికిత్స లేదు. బంతులు అడ్డుపడడం వలన కడుపు నొప్పి వస్తే శస్త్ర చికిత్స చేయించాలి.
దూడలలో డిప్తీరియా: ఇది ప్రధానముగా బాక్టీరియా వలన వస్తుంది. నోరు లేదా గొంతులో గాయాలు ఏర్పడినపుడు ఈ బాక్టీరియా ప్రవేశించి వ్యాధిని కల్గిస్తుంది. ఈ వ్యాధి వలన అధిక జ్వరం వస్తుంది. నోటి లోపల బూడిద రంగులో పుండ్లు ఏర్పడి, నోటి నుండి చొంగ కారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక వంటి శబ్దాలు రావడం జరుగుతుంది. ● ఈ వ్యాధి నివారణకు పశువైద్యుడి సలహా మేరకు ఆంటిబయోటిక్ మందులు, సల్ఫా మందులు ఇప్పించాలి. ● దూడల పాకలు చలి, ఈదరగాడ్పులు రాకుండా పరిశుభ్రముగా ఉంచాలి.
దూడల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమైన సూచనలు:
1.దూడ పుట్టిన వెంటనే ముక్కు, నోరు శుభ్రం చేసి శ్వాస సులభంగా జరిగేలా చూడాలి.
పుట్టిన 2 గంటలలోపు ముర్రుపాలు తాగించాలి. 3.దూడను పరిశుభ్రమైన పాకలో ఉంచాలి. 4.పుట్టిన దూడ యొక్క నాభిని అయోడిన్ ద్రావణంలో ముంచాలి.
పరిశుభ్రమైన త్రాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి.
నట్టల నివారణ మందులు 10-15 రోజుల వయస్సులో ఒకసారి, 30 వ రోజు ఒకసారి, 60 వ రోజు ఒకసారి తగిన మోతాదులో ఇవ్వాలి.
2 వారాల వయస్సు నుంచి మెల్లిగా కాఫ్ స్టార్టర్ ని మేతగా ఇస్తూ, మూడో నెల వరకు పాలు, క్రమంగా ఘనమేత ఇవ్వాలి.
3 నెలల తరువాత పచ్చిమేత మరియు గడ్డి మేతని ఇవ్వాలి. 9.పాకలో ఖనిజమిశ్రమం కలిగివున్న రాళ్లను వ్రేలాడదీయాలి.
దూడలకు నెలకొకసారి వెంట్రుకలు గొరిగితే బాహ్యపారాన్నజీవుల వలన కలిగే వ్యాధుల నుండి కూడా రక్షించవచ్చు. 11.టీకాలు నిర్ణిత షెడ్యూల్ ప్రకారం చేయించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
దూడల ఆరోగ్యంని ప్రతిరోజు గమనించి, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి.
ముగింపు : దూడలకు సరైన పోషణ, పాకలలో పరిశుభ్రత, సమయానికి నట్టల నివారణ మందులు, టీకాలు చేపట్టడం వలన భవిష్యత్తులో అధిక ఉత్పాదకత కలిగిన పాడి పశువులను తయారుచేయవచ్చు. రైతులు ఈ సూచనలు పాటిస్తే దూడల మరణాల రేటు తగ్గి, పాడి పరిశ్రమలో మంచి లాభాలు పొందగలుగుతారు.
రచయిత: డా. చంద్రగిరి ప్రజ్ఞ, సహాయ ఆచార్యులు, పశు జన్యు శాస్ర మరియు ప్రజనన విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల. 9014639814
మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.
మునగ సాగు – వివరాలు: మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు. ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.
పోషక విలువలు: పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.
ప్రయోజనాలు:
పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.