పంటల్లో బెట్టను తట్టుకునేందుకు పశువుల పేడ, మూత్రం ద్రావణం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలు, ద్రావణాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా పశువుల పేడ, మూత్రం ద్రావణం ఒకటి.

పశువుల పేడ, మూత్రం ద్రావణం మొక్కలకు తక్షణ శక్తిని ఇస్తుంది. కాబట్టి వర్షాభావ పరిస్థితులలో తెగుళ్లు/పురుగుల సమస్య నుంచి తేరుకుంటున్నప్పుడు దీనిని వాడుకోవచ్చు. పశువుల పేడ, పశువుల మూత్రంలో చాలా రకాల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇవి పంటకు హానిచేసే తెగుళ్ళను నివారించడంలో ఉపయోగ పడతాయి.

ఈ ద్రావణంలో ఉన్న పోషకాల (నత్రజని, భాస్వరం, పొటాష్ మరియు సూక్ష్మ పోషకాలు) వల్ల పంటలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఈ ద్రావణాన్ని పంటకాలంలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు: పశువుల పేడ : 5 కిలోలు; పశువుల మూత్రం : 5 లీటర్లు; సున్నం : 150 గ్రా॥

తయారు చేసే విధానం:

  • 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రం తీసుకుని, 5 లీటర్ల నీటిని కలిపి ఒక తొట్టిలో నిలువ చేయాలి.
  • తొట్టిపై మూత పెట్టి, 4 రోజులపాటు ఆ మిశ్రమాన్ని మురగబెట్టాలి.
  • పై మిశ్రమాన్ని ప్రతిరోజు కర్రతో, సవ్య మరియు అపసవ్య దిశలలో బాగా కలియపెట్టాలి.
  • ఈ మిశ్రమానికి 4 రోజుల తర్వాత కొద్దిగా నీరు చేర్చి, వడపోసి, 150 గ్రాముల సున్నం కలపాలి.
  • ఈ ద్రావణానికి 100 లీటర్ల నీటిని కలిపి ఒక ఎకరం పొలంలో ఒకసారి పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • పశువుల పేడ, మూత్రం ద్రావణం చిక్కగా ఉంటుంది. అందువల్ల వడపోయటానికి ముందు ఒక మెష్‌నిగానీ, పలుచటి గోనెసంచిని గానీ ఉపయోగించాలి.
  • తర్వాత దానికి నీరు కలిపి పలుచటిగుడ్డతో వడపోసుకోవాలి.
  • తయారు చేసిన ద్రావణాన్ని వెంటనే ఉపయోగించుకోవాలి.
  • ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే ద్రావణం చెడిపోయే అవకాశం ఉంది.
    పంటలలో తెగుళ్ళ సమస్య వుంటే పశువుల పేడ, మూత్రం ద్రావణానికి ఇంగువ కలిపి పిచికారీ చేసుకోవాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే దాని ఘాటైన వాసనకు రెక్కల పురుగులు పంటపై గుడ్లు పెట్టడానికి ఇష్టపడవు.
  • ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారీ చేయటం వల్ల పంటలు బెట్టను సుమారు వారం రోజులవరకూ తట్టుకుంటాయి.
  • ఈ ద్రావణం పంటలలో వ్యాధినిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఈ ద్రావణాన్ని బాగా వడపోసి “డ్రిప్” లేదా “స్ప్రింక్లర” పద్దతి ద్వారా పంటలకు అందజేయవచ్చు.
  • పశువుల పేడ, మూత్రం ద్రావణాన్ని కూరగాయ పంటలలోనూ, ఇండ్ల వద్ద పెంచే ఆకుకూరలపైనా ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చు. పశువుల పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం వరి పైరులో వచ్చే అగ్గి తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేయాలి
Read More

ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు వృద్ధిలో రెండో స్థానంలో తెలంగాణ : మంత్రి తుమ్మల

పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఈ ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగు గత ఖరీఫ్‌తో పోలిస్తే 36 శాతం పెరిగి, దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జాతీయ రబీ సదస్సులో తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు, రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షపాతంలో మార్పులు, దీర్ఘకాలిక పొడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగి, గత ఏడాదితో పోలిస్తే 36 శాతం వృద్ధితో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు.

కూరగాయల సాగు లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచి, అవసరమైన ఆర్థిక సహాయం అందించాలి:
తెలంగాణలో కూరగాయల సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 8,800 ఎకరాల లక్ష్యాన్ని లక్ష ఎకరాలకు పెంచేందుకు కేంద్రం అనుమతితో పాటు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. పెరుగుతున్న కూరగాయల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పంటల వైవిధ్యీకరణకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

ఎల్‌నినో, కరువు పరిస్థితులకు ప్రత్యేక కేంద్ర సహాయం ఇవ్వాలి…
ఎల్‌నినో పరిస్థితులు, మారుతున్న వర్షపాత సరళి, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల కారణంగా తెలంగాణలోని అనేక మండలాలు లోటు, తీవ్ర లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయని మంత్రి తెలిపారు. ఆయా మండలాలకు సూక్ష్మ సాగునీరు, రక్షిత సాగునీరు, నీటి సంరక్షణ నిర్మాణాల కోసం ప్రత్యేక కేంద్ర సహాయం అందించాలని కోరారు.

అదేవిధంగా ఎల్‌నినో, కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రత్యేక చర్యగా మొక్కజొన్న, జొన్నను ధరల మద్దతు పథకం (ఆఐఐ) పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా నీటి ఒత్తిడిని తట్టుకునే జొన్న కరువు ప్రభావిత ప్రాంతాలకు అనుకూలమైన పంట కావడంతో కనీసం జొన్ననైనా పీఎస్ ఎస్ లో చేర్చాలని కోరారు.

ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన ధరలు కల్పించాలి…
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ తెలంగాణలో అదనంగా దాదాపు 1.10 లక్షల హెక్టార్లలో ఆయి…పామ్ సాగు విస్తరించిందని, సుమారు 72 వేల మంది కొత్త రైతులు ఆయిల్‌పామ్ సాగులోకి వచ్చారని మంత్రి తెలిపారు. ఆయిల్‌పామ్ దీర్ఘకాలిక పంట కావడంతో రైతులు సులభంగా మరో పంటకు మారే అవకాశం ఉండదని, అందువల్ల రైతులకు స్థిరమైన, గిట్టుబాటు ధరలు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని గతంలో ఉన్న 44 శాతానికి పునరుద్ధరించాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు. దేశీయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న సమయంలో దిగుమతి విధానాలు కూడా దేశీయ రైతులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, ఆయిల్‌పామ్ ధరలపై ప్రత్యేక కమిటీని నియమించి రైతుల సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.

రైతులకు రియల్‌టైమ్ నేల ఆరోగ్య సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి….
సాంప్రదాయ మట్టి పరీక్షల ద్వారా ప్రతి రైతుకు సకాలంలో నేల ఆరోగ్య సమాచారం అందించడం సాధ్యం కావడం లేదని మంత్రి తెలిపారు. రైతులకు రియల్‌టైమ్‌లో నేల ఆరోగ్య వివరాలను అందించేందుకు శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల సబ్సిడీ విధానాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మంజూరు చేయాలి..
తెలంగాణలో 33 జిల్లాలు ఉండగా ప్రస్తుతం 16 కృషి విజ్ఞాన కేంద్రాలు మాత్రమే ఉన్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ విద్య, పరిశోధన ద్వారా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం వేగంగా రైతులకు చేరేందుకు వ్యవసాయ విస్తరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు అదనంగా 16 కృషి విజ్ఞాన కేంద్రాలను ఐసీఏఆర్ ద్వారా మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు.

కొడంగల్ అగ్రి బిజినెస్ పార్క్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు కేంద్ర సహకారం అందించండి…
కొడంగల్‌లో అగ్రి బిజినెస్ పార్క్, సెమీ-అరిడ్ హార్టికల్చర్ క్రాప్స్ కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని మంత్రి కోరారు. తెలంగాణలోని ప్రత్యేక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సెమీ-అరిడ్ హార్టికల్చర్ కు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

రైతు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త సీడ్ బిల్ తీసుకురావాలి…
తెలంగాణలో విత్తన రంగానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని రైతు ప్రయోజనాలను కాపాడేలా కొత్త సీడ్ బిల్లును త్వరగా తీసుకురావాలని మంత్రి కోరారు. పంట నష్టాల సందర్భంలో రైతులకు పరిహారం అందించే తగిన నిబంధనలతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా బిల్లులో నిబంధనలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని పెంచే జాతీయ కార్యక్రమాల నేపథ్యంలో రైతు ప్రయోజనాలకు అనుగుణమైన విత్తన చట్టం అవసరమని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఈ కీలక ప్రతిపాదనలు రాష్ట్రంలో వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు, పంటల వైవిధ్యీకరణ, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతుల ఆదాయ భద్రతను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి అవసరమైన సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read More

‘రైతునేస్తం’2026 రైతునేస్తం పురస్కారాల దరఖాస్తులకు ఆహ్వానం

అక్టోబర్ 31లోగా దరఖాస్తులు పంపండి

‘రైతునేస్తం’ సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ ‘పద్మశ్రీ’ డా॥ ఐ.వి. సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులతోపాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ను ప్రతి ఏటా ‘రైతునేస్తం పురస్కారం’ పేరుతో సత్కరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను త్వరలో ఘనంగా నిర్వహించనున్నాము.

పురస్కారాలకు దరఖాస్తు చేసుకునే వ్యవసాయ, అనుబంధ రంగాల శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, అగ్రి ఇన్నోవేషన్స్, రైతులు ‘రైతునేస్తం’ వెబ్‌సైట్ https://rythunestham.in/awards నుండి అప్లికేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, దాన్ని పూరించి, దానికి వారి పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జతపరచి అక్టోబర్ 31వ తేదీలోగా ‘ఎడిటర్, రైతునేస్తం, 6-2-959, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ – 500004. ఫోన్: 9676 79 77 77 (లేదా) ‘రైతునేస్తం’, డో.నెం. 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మం॥, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ – 522 017, ఫోన్: 97053 83666 చిరునామాలకు పంపగలరు లేదా editor@rythunestham.in కు ఇ-మెయిల్ చేయవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఈ వేడుక త్వరలో ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడుతుంది.

యడ్లపల్లి వేంకటేశ్వరరావు
‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత
చైర్మన్ – రైతునేస్తం ఫౌండేషన్
ఫోన్: 9490559999, 98490 05182

Read More

ఔషధ మొక్క…. పాషాణభేది

పాషాణభేది మెత్తని కాండం కలిగి వాము ఆకును పోలి వుండే ఏక లేదా ద్వివార్షిక మొక్క. దీని ఆకుల నుండి ఎలాంటి వాసన రాదు. సుమారు 0.5-1.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. బాగా శాఖలు తొడిగి చిన్నపాటి పొదలా తయారవుతుంది. ప్రతికణుపు దగ్గర రెండు చొప్పున ఆకులు వస్తాయి. ఈ ఆకుల మొదళ్ళ నుండి మళ్ళీ ఆకులు పుడతాయి. అంచులు దంతాలు కలిగి ఉంటాయి. ఆకులు, కొమ్మలు నూగు కలిగి ఉంటాయి. దీనిని లేత కొమ్మల కత్తిరింపుల ద్వారా వ్యాప్తి చేస్తారు. వేర్లు క్యారట్ దుంపలలాగా ఉండి ప్రతి మొక్కకు 4-5 దుంపలు ఉంటాయి.

సాధారణ నామం : కోలియస్ / మెడిసినల్ కోలియస్ శాస్త్రీయ నామం : కోలియస్ ఫోర్‌స్కాహ్లీ కుటుంబం: లామినేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కోలియస్ దుంపలను అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దుంపల నుండి ఫోర్‌స్కోలిన్ అనబడు డైటెర్పనాయిడ్ (కోలియోనాల్) లభిస్తుంది.
  • పాషాణ భేది హృద్రోగాలు, ఊబకాయం, బ్రాంకైటిస్, ఉబ్బసం, నరాల బలహీనత, రక్తక్షీణత మొదలగు వ్యాధుల చికిత్సకు మరియు బలవర్థకమైన ఔషధంగా ఉపయోగపడుతుంది.
  • క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగించబడుతున్నది.

వ్యవసాయరంగంలో

  • పాషాణ భేది నుండి వేరు చేసిన ఫోర్‌స్కోలిన్ ద్రావణం నిమ్మ ఆకులను తినే పాపిలియో డెమోలియస్ 4వ దశ లార్వాలపై గణనీయమైన యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (శ్రీనివాసరావు, అతని అనుచరులు, 2014).
  • పాషాణభేది వేర్ల నుండి వేరు చేసిన డైటెర్పిన్, ఫోర్‌స్కోలిన్ పాపిలియో డెమోలియస్ నివారణకు సురక్షితమైన యాంటిఫెర్టిలిటి కారకం (శ్రీనివాసరావు అండ్ సబిత, 2017).
  • పాషాణ భేది ఆకుల ఇథనాల్ ద్రావణం (0.1%) ఈడెస్ ఈజిప్టి గుడ్లు పెట్టదాన్ని 77.3%, కూలెక్స్ క్వింక్విఫేసియెన్స్ గుడ్లు పెట్టడాన్ని 39.22% తగ్గించాయి (స్వాతి, ఆమె అనుచరులు, 2010).
  • పాషాణభేది వేర్ల ఇథనాల్ ద్రావణం కాండం, ఆకుల ఇథనాల్ ద్రావణం కన్నా క్లెబ్సియెల్లా న్యుమోనియే పై అత్యధిక యాంటిబ్యాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (రాజ్‌కుమార్ అండ్ మాలతి, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వ్యాధుల నుంచి మీ పాడి ఫారం సురక్షితమేనా? – ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి

“పశువుకు వ్యాధి ఎలా వచ్చింది?” అనే ప్రశ్నతో పాటు… “అది మన ఫారంలోకి ఎలా వచ్చింది?” అని కూడా ఆలోచించాలి.

పాడి ఫారంలో ఒక పశువుకు వ్యాధి వస్తే, అది ఆ ఒక్క పశువుతోనే ఆగిపోతుందని చెప్పలేం. కొత్తగా తెచ్చిన పశువులు, బయట నుంచి వచ్చే వ్యక్తులు, వాహనాలు, అపరిశుభ్రమైన పాక, మేత, నీరు, పరికరాలు ఇలా అనేక మార్గాల్లో వ్యాధులు ఫారంలోకి రావచ్చు. ఒక పశువు నుంచి మరో పశువుకు కూడా వ్యాపించవచ్చు.
అందుకే పశువులకు చికిత్స చేయించడమే కాకుండా, వ్యాధులు ఫారంలోకి రాకుండా, వచ్చినా ఇతర పశువులకు వ్యాపించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ఏర్పాట్లు అవసరం లేదు. రోజూ మనం చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు.
మరి మీ పాడి ఫారంలో అలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఈ 10 అంశాలతో మీరే తెలుసుకోండి.

  1. కొత్తగా తెచ్చిన పశువులను వెంటనే మందలో కలుపుతున్నారా?
    కొత్తగా తెచ్చిన పశువు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినా, దానితో పాటు వ్యాధులు కూడా ఫారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంటనే మందలో కలపకుండా కనీసం 3 వారాల పాటు వేరుగా ఉంచి ఆరోగ్యాన్ని గమనించడం మంచిది. ఈ సమయంలో పశువులో ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే పశువైద్యుని సంప్రదించాలి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మందలో కలపడం మంచిది.
  2. అనారోగ్య పశువులను వేరుగా ఉంచే ఏర్పాటు ఉందా?
    మందలో ఏదైనా పశువు అనారోగ్యానికి గురైతే, వీలైనంత వరకు మందకు కొంత దూరంగా, ఇతర పశువులతో కలవకుండా ఉంచడం మంచిది. అనారోగ్య పశువుకు మేత, నీరు పెట్టేందుకు వాడే తొట్లు, బకెట్లు కూడా ఇతర పశువులకు వాడకుండా చూడాలి. ముందుగా ఆరోగ్యంగా ఉన్న పశువుల పనులు చూసుకొని, చివరగా అనారోగ్య పశువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పశువైద్యుని సలహాతో చికిత్స చేయిస్తే మిగతా పశువులకు వ్యాధి వ్యాపించే అవకాశాన్ని తగ్గించవచ్చు.
  3. మీ పాడి ఫారంలోకి వచ్చే వ్యక్తులు, వాహనాల రాకపోకలను గమనిస్తున్నారా?
    పాడి ఫారానికి వివిధ పనుల కోసం బయట వ్యక్తులు, ఇతర రైతులు, వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటి ద్వారా ఒక ఫారం నుంచి మరో ఫారానికి మట్టి, పేడతో పాటు వ్యాధులు కూడా చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే వ్యక్తులు పశువుల దగ్గరకు నేరుగా వెళ్లకుండా చూసుకోవాలి. వాహనాలను కూడా వీలైనంత వరకు పశువుల పాకకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ఇతర పశువుల ఫారాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులు, వాహనాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
  4. పశువుల పాకలోకి వెళ్లే ముందు చేతులు, కాళ్లు శుభ్రం చేసుకుంటున్నారా?
    మన చేతులు, కాళ్లు, చెప్పులకు అంటుకున్న మట్టి, పేడ ద్వారా కూడా వ్యాధులు ఒక చోటు నుంచి మరో చోటుకు చేరే అవకాశం ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చిన వెంటనే పశువుల దగ్గరకు వెళ్లకుండా చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. ముఖ్యంగా పశువుల సంతకు, మరో పాడి ఫారానికి వెళ్లి వచ్చినప్పుడు ఈ జాగ్రత్త మరింత అవసరం. వీలైతే పశువుల పాకలో వేసుకునేందుకు వేరే చెప్పులు ఉంచుకోవాలి. వాటిని బయట ఇతర పనులకు ఉపయోగించకూడదు. అనారోగ్య పశువును చూసిన తర్వాత చేతులు, చెప్పులు శుభ్రం చేసుకొని, ఆ తర్వాతే ఇతర పశువుల దగ్గరకు వెళ్లాలి. ఈ చిన్న అలవాట్లు బయట నుంచి లేదా ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాధులు చేరే అవకాశాన్ని తగ్గిస్తాయి.
  5. పాకను శుభ్రంగా, పొడిగా ఉంచుతున్నారా?
    పశువుల పాకలో పేడ, వ్యర్థాలు పేరుకుపోయి, నేల ఎక్కువసేపు తడిగా ఉంటే పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందుకే పేడ, ఇతర వ్యర్థాలను రోజూ తొలగించాలి. మూత్రం, మురికి నీరు పాకలో నిల్వ ఉండకుండా బయటకు వెళ్లేలా కాలువలు ఉండాలి. తొలగించిన పేడను పాక దగ్గరే పోగు చేయకుండా, నిర్ణీత ప్రదేశంలో సేకరించి సేంద్రియ ఎరువు తయారీకి లేదా వీలైతే బయోగ్యాస్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. పశువులు పడుకునే ప్రదేశంలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే పాకలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాకలో అపరిశుభ్రతను తగ్గించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి.
  6. మేత, తాగునీరు కలుషితం కాకుండా కాపాడుతున్నారా?
    పశువులకు ఇచ్చే మేత, తాగునీరు శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం. మేతలో పేడ, మట్టి లేదా ఇతర మలినాలు కలవకుండా చూసుకోవాలి. మేతను తేమ తగలకుండా, పొడిగా ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. బూజు పట్టిన లేదా చెడిపోయిన మేతను పశువులకు ఇవ్వకూడదు. మేత తొట్లు, నీటి తొట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. తొట్టెలో మిగిలిపోయి చెడిపోయిన మేతను తొలగించి, తాజా మేత వేయాలి. పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇలా మేత, నీటి విషయంలో జాగ్రత్తలు పాటిస్తే వాటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చు. అలాగే పశువులకు సమతుల్య మేతతో పాటు తగిన ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా అందించాలి.
  7. పాలు పితికే పాత్రలు, ఇతర పరికరాలను శుభ్రంగా ఉంచుతున్నారా?
    పాలు పితికే సమయంలో పరిశుభ్రత పాటించడం పశువుల ఆరోగ్యంతో పాటు పాల నాణ్యతకు కూడా చాలా ముఖ్యం. పాలు పితికే ముందు చేతులు, పొదుగును శుభ్రంగా కడిగి, పొదుగును పొడి గుడ్డతో తుడవాలి. పాలు పితికే పాత్రలను ప్రతి సారి ఉపయోగించిన తర్వాత బాగా కడిగి ఆరబెట్టాలి. పాలు పితికే యంత్రాలు, ఇతర పరికరాలను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పాలు పితికిన తర్వాత చనుమొనలను పశువైద్యుడు సూచించిన టీట్ డిప్పింగ్ ద్రావణంలో ముంచడం మంచిది. ఇలా సరైన పద్ధతిలో పాలు పితకడం వల్ల మాస్టిటిస్ (పొదుగు వాపు) వచ్చే అవకాశాన్ని తగ్గించడంతో పాటు నాణ్యమైన పాలను పొందవచ్చు.
  8. ఈగలు, దోమలు, ఎలుకల బెడదను తగ్గిస్తున్నారా?
    పశువుల పాకలో ఈగలు, దోమలు, ఎలుకలు ఎక్కువగా ఉంటే పశువులకు ఇబ్బంది కలిగించడంతో పాటు వివిధ రకాల వ్యాధులు వ్యాపించడానికి కూడా కారణమవుతాయి. అందుకే పాకలో పేడ, మిగిలిపోయిన మేత పేరుకుపోకుండా, చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దాణా నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి, దాణా చెల్లాచెదురుగా పడకుండా చూసుకోవాలి. అవసరమైతే పశువైద్యుల సూచనలతో ఈగలు, దోమలను దూరంగా ఉంచే రిపెల్లెంట్లను, ఎలుకల నియంత్రణకు తగిన పద్ధతులను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల లంపీ స్కిన్ డిసీజ్ (ముద్ద చర్మ వ్యాధి), సర్రా వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
  9. టీకాలు, నట్టల మందులు సమయానికి వేయిస్తున్నారా?
    వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించడం కంటే, ముందుగానే నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే పశువులకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడంతో పాటు, నట్టల నివారణకు కూడా సకాలంలో మందులు ఇవ్వాలి. పశువుల వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ప్రాంతంలో వచ్చే వ్యాధులను బట్టి పశువైద్యుని సూచనతో వీటిని పాటించాలి. టీకాలు, నట్టల మందులు ఇచ్చిన తేదీలను చిన్న పుస్తకంలో లేదా మొబైల్లో నమోదు చేసుకుంటే, తదుపరి ఎప్పుడు ఇవ్వాలో తెలుసుకోవడం సులభమవుతుంది.
  10. పశువు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారా?
    రోజూ కొద్దిసేపు పశువులను దగ్గరగా గమనించడం అలవాటు చేసుకోవాలి. పశువు సాధారణంగా ఎలా ఉంటుందో తెలిసినప్పుడే దాని ఆరోగ్యంలో వచ్చే మార్పులను త్వరగా గుర్తించవచ్చు. మేత తినకపోవడం, నీరసంగా ఉండటం, జ్వరం, దగ్గు, విరేచనాలు, పాల దిగుబడి అకస్మాత్తుగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. అనారోగ్యంగా ఉన్న పశువును వీలైనంత వరకు ఇతర పశువులతో కలవకుండా ఉంచి, వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. మందలోని ఇతర పశువుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో గమనించాలి. ఒకటి కంటే ఎక్కువ పశువుల్లో ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తే మరింత అప్రమత్తంగా ఉండి, వెంటనే పశువైద్యునికి తెలియజేయాలి. వ్యాధిని తొలిదశలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల చికిత్స త్వరగా ప్రారంభించడంతో పాటు, ఇతర పశువులకు వ్యాధి వ్యాపించే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

మరి… మీ పాడి ఫారం ఎంతవరకు సురక్షితం?
ఈ 10 అంశాల్లో మీరు ఇప్పటికే పాటిస్తున్నవి ఏవి? ఇంకా మెరుగుపరచుకోవాల్సినవి ఏవి? ఒకసారి మీరే పరిశీలించుకోండి.

పశువుల కొనుగోలు నుంచి రోజువారీ సంరక్షణ, మేత, నీరు, పాలు పితకడం, టీకాలు, ఆరోగ్య పరిశీలన వరకు ప్రతి దశలో సరైన పద్ధతులు పాటించడం ముఖ్యం. వీటిని రోజువారీ ఫారం నిర్వహణలో భాగంగా చేసుకుంటే పశువుల ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు పాడి ఫారాన్ని మరింత సురక్షితంగా నిర్వహించవచ్చు.

Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
Dr. బద్దం అఖిల , టీచింగ్ ఫాకల్టీ,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య కళాశాల, కోరుట్ల, PVNRTVU. 7093198419

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ జ్యూస్

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – మనకు అవసరమైనన్ని
  • నిమ్మ రసం – రుచికి సరిపడా
  • మజ్జిగ – కొంచెం (కావాలంటే వేసుకోవచ్చు)
  • అల్లం-చిన్న ముక్క

తయారుచేయు విధానం: ఒక గ్లాసు జ్యూస్‌కు పెద్ద కప్పు ముక్కలు సరిపోతాయి. గుమ్మడికాయను దాని పైనున్న బూడిద పోయేలాగా బాగా కడగాలి. తర్వాత మనకు కావలసినన్ని ముక్కలు కోసుకోవాలి. కాయ పైనున్న చెక్కు, లోపల గింజలు తీయనవసరం లేదు. అన్ని వేసుకోవచ్చు. దీనిలో చిన్న గ్లాసు మజ్జిగ కానీ, నాలుగు స్పూన్ల పెరుగు కానీ వేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ వద్దనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. గుమ్మడికాయలోనే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అల్లం చిన్నముక్క తీసుకుని కట్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీలో కానీ జ్యూసర్‌లో కానీ వేసుకుని జ్యూస్ తయారు చేసుకోవాలి. జ్యూస్ తయారయిన తర్వాత మిక్సీలో వేసుకున్న జ్యూస్‌ను వడకట్టుకోవాలి. జ్యూసర్‌లో అయితే వడగట్టనవసరం లేదు. దీనిలో నిమ్మరసం రుచికి తగినంత కలపాలి.

ఇప్పుడు కొంతమంది జ్యూస్ షాపుల వారు కూడా బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేస్తున్నారు.
  • రచన : లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… వాము ఆకు

సాధారణ నామం కర్పూరవల్లి / కప్పరిల్లాకు/ కంట్రీబోరేజ్
శాస్త్రీయ నామం కోలియస్ ఆరోమాటికస్
కుటుంబం: లామినేసి

ఇది దాదాపు 1 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. దీని అన్ని భాగాలు మెత్తగా, మందంగా ఎక్కువ రసంతో వాములాంటి వాసన కలిగి ఉంటాయి. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున అండాకృతి లేదా హృదయాకారం కలిగి మెత్తని నూగుతో దంతాల లాంటి అంచులతో దళసరిగా ఉంటాయి. పూలు అతిచిన్నవిగా లేత ఊదారంగులో కొమ్మల చివర పొడవైన గుత్తులుగా వస్తాయి. ఫలాలు పెంకు గల చిరుఫలాలు. దీనిని కొమ్మల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వాము ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ ఆకుల నుండి ఆవిరయ్యే నూనె, డైటెర్పీన్లు, థైమాల్, కాంఫర్ వంటి ఔషధగుణాలు గల రసాయనాలు లభిస్తాయి.
  • వాము ఆకు జీర్ణశక్తిని పెంచి అజీర్ణపు కడుపు నొప్పులను పోగొడుతుంది. మూత్రకోశంలోని రాళ్ళను కరిగించి మూత్రాన్ని సులువుగా జారీ చేస్తుంది.
  • ఆకుల కషాయం దీర్ఘకాలపు మొండిదగ్గులకు, ఉబ్బసానికి, అధిక రక్తపోటుని తగ్గించడానికి, గుండె జబ్బులకి ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో

  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (350 పిపియం) ట్రైబోలియం కాస్టానియం పురుగులను 100% చంపింది. దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. (జయ, ఆమె అనుచరులు, 2014).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) గోధుమ గింజలను ట్రైబోలియం కాస్టానియం ఆశించకుండా పూర్తిగా కాపాడింది.
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ బాసిల్లస్ మెగటీరియం, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎస్కెరిచియా కోలి, స్టెఫైలోకోకస్ ఆరియస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరోజినోసా, క్ౙాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ పారసైటికస్, రైజోపస్ ఒరైజె, రైజోక్టోనియా ఒరైజెసటైవే, కొల్లెటోట్రైకం మ్యూసీ, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా బ్రాసికోలా, కాండిడా ఆల్బికాన్స్ (శిలీంద్రాలు) పెరుగుదలను అరికట్టింది (దీనా, ఆమె అనుచరులు, 2002).
  • వాము ఆకు ద్రావణంలోని 11ఆక్టాడెసెనాయిక్ ఆసిడ్, మిథైల్ ఎస్టర్ మస్క్యిటోసైడల్ మరియు వికర్షక చర్యలను ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్పెఫెన్స్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ పై ప్రదర్శించాయి (మథాలైముత్తు, అతని అనుచరులు, 2016).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ మరియు దానిలోని కార్వక్రాల్ క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిని రసాయన పురుగు మందులకు ప్రత్నామ్నాయంగా నివారించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. (గోవిందరాజు, అతని అనుచరులు, 2016).
  • వాము ఆకు మిథనాల్ ద్రావణం బీటిల్, ఎపిలాక్న వరివెస్టిస్ పై యాంటిఫీడెంట్ చర్యను కలిగి ఉంది. ఎసెన్షియల్ ఆయిల్ శిలీంద్రాలు, బాక్టీరియా, నత్తలు, నెమటోడ్లపై యాంటిఫంగల్, యాంటిబాక్టీరియల్, యాంటిమొల్లస్కల్, యాంటినెమటోడ్ చర్యలను ప్రదర్శించింది (వాస్క్వెజ్, అతని అనుచరులు)
  • కోలియస్ ఆంబోయినకస్ ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ తెల్ల చెదలపై ఇన్‌సెక్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. ఇది రసాయన పురుగు మందులు థయోడాన్, ప్రైమోబన20 కన్నా అధిక సమర్ధవంతంగా చెదపురుగులను చంపింది (గుర్దీప్‌సింగ్, అతని అనుచరులు, 2002).
  • శ్రీగోమత గాయత్రి ఆర్గానిక్స్ అండ్ ఆయుర్వేద సేంద్రియ కోలియస్ పురుగు మందుని కోలియస్ ఆంబోనికస్, ఒరిగానోలతో తయారు చేశారు. ఇది శిలీంద్రనాశక, కీటకనాశక, చెదలనాశక లక్షణాలను కలిగి ఉంది. 20% ద్రావణాన్ని ఉదయం వేళల్లో పిచికారి చేయాలి.
  • వాము ఆకు మొత్తం మొక్కను పురుగు మందుగా ఉపయోగిస్తారు. కోలియస్ ఆంబియానికస్ నర్సరి దశలోని కొబ్బరి మొక్కలపై ఒరెåక్టెస్ రైనోసిరాస్ గుడ్లు పెట్టకుండా నిరోధిస్తుంది. కొబ్బరి నారు మొక్కల చుట్టూ వాము ఆకు (కోలియస్ ఆరోమాటికస్) మొక్కలను నాటడం ఆనవాయితీగా వస్తుంది. (కిఈఒ, అతని అనుచరులు, 2006).
  • వాము ఆకు ఆల్కహాలిక్ ద్రావణాలు షిగెల్లా స్పీ., సాల్మొనెల్లా టైఫి బాక్టీరియాపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (రమ్య, ఆమె అనుచరులు, 2012).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని నిల్వ ధాన్యంలో ఆశించే శిలీంద్రాలపై యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది. ఇది ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ శిలీంద్రం అఫ్లాటాక్సిన్‌ని ఉత్పత్తి చేయకుండా నివారించింది. అంతేగాక గోధుమ గింజలను ఈ ఎసెన్షియల్ ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే శిలీంద్రాలు ఆశించకుండా కాపాడింది. (జయ, ఆమె అనుచరులు, 2011).
  • వాము ఆకు ఎసెన్షియల్ ఆయిల్ అఫ్లాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌ని అత్యంత సమర్ధవంతంగా అరికట్టింది (భానుప్రకాష్ అండ్ డుబె, 2011).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులను అరికట్టే లక్షణాలను గల 200 మొక్కలను గుర్తించారు. అందులో వాము ఆకు ఒకటి.
  • వాము ఆకు మిథనాల్ ఫ్రాక్షన్ 4 ఈడెస్ ఈజప్టి, అనాఫెలెస్ స్టెఫెన్సి, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్‌పై అధిక విషచర్యను ప్రదర్శించింది. 40 పిపియం మిథనాల్ ఫ్రాక్షన్ 4, 100% గుడ్లచావును నమోదు చేసింది, మిథనాల్ ఫ్రాక్షన్ 4 దోమల పెద్ద పురుగులను వికర్షించింది. (మాతలయ్‌ముత్తు, అతని అనుచరులు, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… చింతపండు తొక్కు

కావాల్సిన పదార్థాలు

  • చింతపండు
  • కారంపొడి
  • ఉప్పు
  • పచ్చి ధనియాలు
  • జీలకర్ర
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • ఉల్లిగడ్డ
  • వెల్లుల్లిపాయలు కొన్ని
  • నువ్వుల నూనె

తయారు చేసే విధానం: ముందుగా చింతపండును శుభ్రంగా కడిగి నీరు పోసి నాన పెట్టుకోవాలి. చింతపండు మంచిగా నానిన తర్వాత మొదలు వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, తగినంత ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టాలి. ఆ తర్వాతకి నానబెట్టిన చింతపండును కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ చేర్చి ఒక రౌండ్ తిప్పుకుంటే ఉల్లిగడ్డ బాగా మెత్తగా కాకుండా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నువ్వుల నూనె కలుపుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది.

రచన : ఇమ్మిడిశెట్టి ప్రభాకరరావు, హన్మకొండ, తెలంగాణ.

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా, లేదా తురుము కొద్దిగా
  • పెరుగు – సరిపడునంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • ఆవపిండి – అర చెంచా
  • రెండు పచ్చిమిర్చి (చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి)
  • తరిగిన కొత్తిమీర – కొద్దిగా

తయారుచేసే విధానం
బూడిది గుమ్మడికాయ పైన ఉన్న మందపాటి తొక్కను చాకుతో తీసివేసి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా పెద్ద ముక్కను తురుముగా చేసుకొని అయినా పెరుగు పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు. పెరుగును చల్లకవ్వంతోనే చిల్కి ఈ తురుమును లేదా గ్రైండ్ చేసుకున్న ముద్దను పెరుగులో కలుపుకోవాలి. దానికి తగిన మోతాదు లోపల ఉప్పు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పౌడర్, కొంచెం ఆవపిండిని కలుపుకొని చల్లకవ్వంతోని చక్కగా చిలకాలి.
బూడిద గుమ్మడికాయ పెరుగు పచ్చడిని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినవచ్చు.

రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఆధునిక వ్యవసాయ సాంకేతికతతో రైతుల ఆదాయం రెట్టింపు దిశగా…

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. కోట్లాది మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, పెరుగుతున్న సాగు ఖర్చులు, చీడపీడలు, మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు వంటి అనేక సమస్యలు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆధునిక వ్యవసాయ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఉత్పాదకతను పెంచి, ఖర్చులను తగ్గించి, రైతుల నికర ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది.

  1. డ్రోన్లతో పంటల పర్యవేక్షణ
    వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. డ్రోన్ల ద్వారా పంట పొలాలను తక్కువ సమయంలో పరిశీలించి, పంటలో నీటి కొరత, పోషక లోపాలు, చీడపీడలు, వ్యాధుల ప్రభావాన్ని గుర్తించవచ్చు.అవసరమైన ప్రాంతాల్లోనే పురుగుమందులు లేదా ద్రవ ఎరువులను పిచికారీ చేయడం ద్వారా ఇన్‌పుట్ ఖర్చులు, సమయం, నీరు మరియు శ్రమను ఆదా చేయవచ్చు. ముఖ్యంగా పెద్ద విస్తీర్ణంలో సాగు చేసే రైతులకు డ్రోన్ సాంకేతికత ఉపయోగకరంగా ఉంటుంది.
  2. సెన్సార్లతో నీటి వినియోగం తగ్గింపు
    నేలలో తేమను గుర్తించే మాయిశ్చర్ సెన్సార్లు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. నేలలో తేమ అవసరమైన స్థాయిలో ఉన్నప్పుడు నీటిపారుదల చేయకుండా, అవసరమైనప్పుడు మాత్రమే నీరు అందించడం ద్వారా నీటి వృథాను తగ్గించవచ్చు.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను సెన్సార్ ఆధారిత వ్యవస్థలతో అనుసంధానం చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు.
  3. కృత్రిమ మేధస్సు (AI) – రైతుకు డిజిటల్ సహాయకుడు
    కృత్రిమ మేధస్సు వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. పంట ఫోటో ఆధారంగా కొన్ని చీడపీడలు, వ్యాధుల లక్షణాలను గుర్తించడం, వాతావరణ సమాచారాన్ని విశ్లేషించడం, పంటల పరిస్థితిని పర్యవేక్షించడం వంటి పనుల్లో AI ఆధారిత సాధనాలు సహాయపడుతున్నాయి.రైతు తన పొలంలో తీసిన పంట ఫోటోను ఆధారంగా చేసుకుని సమస్యను ముందుగానే గుర్తించి, వ్యవసాయ నిపుణుల సలహాతో సరైన నివారణ చర్యలు చేపడితే పంట నష్టాలను తగ్గించవచ్చు.
  4. మొబైల్ ఫోన్ – రైతు చేతిలో వ్యవసాయ విజ్ఞాన కేంద్రం
    నేడు దాదాపు ప్రతి రైతు చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, పంటల సాగు పద్ధతులు, చీడపీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ నిపుణుల సలహాలు వంటి సమాచారాన్ని మొబైల్ ద్వారా పొందవచ్చు.సరైన సమయంలో సరైన సమాచారం రైతుకు అందితే నిర్ణయాలు మరింత మెరుగ్గా తీసుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన పెట్టుబడులు తగ్గి, పంట నిర్వహణ మెరుగుపడుతుంది.
  5. అధిక దిగుబడి మరియు వాతావరణ అనుకూల రకాలు
    ఆధునిక వ్యవసాయంలో మంచి నాణ్యత కలిగిన, అధిక దిగుబడి ఇచ్చే మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన విత్తన రకాలను ఎంపిక చేయడం కీలకం.పంట కాలం, నీటి లభ్యత, నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన పంట–సరైన రకం–సరైన కాలం అనే విధానాన్ని పాటించడం ద్వారా ఉత్పాదకతను పెంచవచ్చు.
  6. మట్టి పరీక్ష – ఎరువుల ఖర్చుకు నియంత్రణ
    రైతులు మట్టి పరీక్ష చేయకుండా అంచనాతో ఎరువులు వేయడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.మట్టి పరీక్ష ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం చేయడం ద్వారా అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించవచ్చు. దీంతో ఎరువులపై అనవసరమైన ఖర్చు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
  7. ప్రెసిషన్ ఫార్మింగ్ – ప్రతి ప్రాంతానికి అవసరమైన నిర్వహణ
    ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే మొత్తం పొలాన్ని ఒకే విధంగా కాకుండా, పొలంలోని వివిధ ప్రాంతాల అవసరాలను గుర్తించి విత్తనం, నీరు, ఎరువులు, పురుగుమందులను అవసరానికి అనుగుణంగా వినియోగించడం.దీని ద్వారా “ఎక్కడ ఎంత అవసరమో అక్కడ అంతే” అనే విధానాన్ని పాటించవచ్చు. ఫలితంగా వనరుల వినియోగ సామర్థ్యం పెరిగి, ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది.
  8. పంటల వైవిధ్యీకరణతో అదనపు ఆదాయం
    ఒకే పంటపై ఆధారపడటం రైతుకు మార్కెట్ మరియు వాతావరణ ప్రమాదాలను పెంచుతుంది. అందువల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలు మరియు పశుగ్రాస పంటలను ప్రాంతానికి అనుగుణంగా చేర్చడం ద్వారా ఆదాయ వనరులను విస్తరించవచ్చు.ఉదాహరణకు, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పప్పుధాన్యాలు మరియు నూనెగింజలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించవచ్చు.
  9. పంట అవశేషాల నిర్వహణ – వ్యర్థం కాదు, వనరు
    పంట అవశేషాలను కాల్చడం వల్ల గాలి కాలుష్యం పెరగడంతో పాటు నేలలోని సేంద్రియ పదార్థం కూడా తగ్గుతుంది. పంట అవశేషాలను కంపోస్ట్, మల్చింగ్, పశుగ్రాసం లేదా ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులుగా వినియోగించడం ద్వారా వాటిని వనరుగా మార్చవచ్చు.ఇది పర్యావరణ పరిరక్షణతో పాటు సాగు ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
  10. యాంత్రీకరణతో శ్రమ మరియు సమయం ఆదా
    వ్యవసాయ కూలీల కొరత, పెరుగుతున్న కూలి ఖర్చులు రైతులకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. చిన్న మరియు పెద్ద రైతులకు అనువైన వ్యవసాయ యంత్రాలను ఉపయోగించడం ద్వారా దుక్కి దున్నడం, విత్తడం, కలుపు నివారణ, పంట కోత వంటి పనుల్లో సమయం మరియు శ్రమను ఆదా చేయవచ్చు.చిన్న రైతులు వ్యక్తిగతంగా యంత్రాలు కొనుగోలు చేయలేని సందర్భంలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, రైతు సమూహాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) ద్వారా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావచ్చు.
  11. మార్కెట్ సాంకేతికత – మంచి ధర కోసం
    రైతు ఆదాయంలో ఉత్పత్తి ఎంత ముఖ్యమో, సరైన మార్కెటింగ్ కూడా అంతే ముఖ్యం. మొబైల్ ఆధారిత మార్కెట్ సమాచారం, డిజిటల్ మార్కెటింగ్, రైతు సమూహాలు మరియు FPOల ద్వారా మార్కెట్‌కు నేరుగా అనుసంధానం కావడం వల్ల మధ్యవర్తిత్వ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంటుంది.నాణ్యత, గ్రేడింగ్, ప్యాకేజింగ్, నిల్వ మరియు విలువ ఆధారిత ఉత్పత్తులు రైతు ఉత్పత్తికి అదనపు విలువను తీసుకురాగలవు.
  12. సౌరశక్తితో వ్యవసాయం
    సౌర పంపులు మరియు ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత పరికరాలను వినియోగించడం ద్వారా కొన్ని సందర్భాల్లో విద్యుత్ మరియు ఇంధన వ్యయాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా నీటిపారుదల అవసరాల్లో సౌరశక్తి ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.

రైతు ఆదాయం పెరగడానికి “ఉత్పత్తి పెంపు” ఒక్కటే మార్గం కాదు
రైతుల ఆదాయాన్ని పెంచడానికి కేవలం దిగుబడిని పెంచడం సరిపోదు. దిగుబడి పెరగడం + సాగు ఖర్చు తగ్గడం + నాణ్యత పెరగడం + మంచి మార్కెట్ ధర + పంట నష్టాల తగ్గింపు + విలువ ఆధారిత ఉత్పత్తులు అన్నీ కలిసినప్పుడే రైతు నికర ఆదాయం గణనీయంగా పెరగవచ్చు.

ఒక రైతు కోసం సాంకేతిక వ్యవసాయ సూత్రం
మట్టి పరీక్ష → మంచి విత్తనం → సరైన పంట ఎంపిక → శాస్త్రీయ సాగు → సూక్ష్మ నీటిపారుదల → సమతుల్య ఎరువుల వినియోగం → IPM → డ్రోన్/సెన్సార్ ఆధారిత పర్యవేక్షణ → యాంత్రీకరణ → విలువ జోడింపు → మంచి మార్కెటింగ్ఈ మొత్తం ప్రక్రియను సమగ్రంగా అమలు చేస్తే రైతు ఉత్పత్తి ఖర్చును నియంత్రిస్తూ, ఉత్పాదకత మరియు నికర ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

ముగింపు
వ్యవసాయ రంగ భవిష్యత్తు సంప్రదాయ జ్ఞానం మరియు ఆధునిక సాంకేతికత కలయికలో ఉంది. సాంకేతికత రైతుకు ప్రత్యామ్నాయం కాదు; రైతు నిర్ణయాలను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా తీసుకోవడానికి ఒక శక్తివంతమైన సాధనం.ప్రతి రైతు తన ప్రాంతంలోని నేల, నీరు, వాతావరణం, పంట మరియు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఎంచుకోవాలి. వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మరియు రైతు సమూహాలు కలిసి సాంకేతికతను గ్రామస్థాయికి తీసుకెళ్లినప్పుడు వ్యవసాయం మరింత లాభదాయకంగా మరియు స్థిరమైన జీవనోపాధిగా మారుతుంది.

కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో రైతు పొలంలో డ్రోన్ ద్వారా విత్తనాలను విత్తే సాంకేతికతపై ప్రదర్శన నిర్వహించబడింది.

డా. టి. భరత్, సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి
కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU), తెలంగాణ
మొబైల్: 9700549754. ఇ-మెయిల్: kvkkothagudem@pjtau.edu.in

Read More