పైరుకు నత్రజని (యూరియా) అవసరానికి మించి వాడితే నష్టమే. నత్రజని 90 శాతానికిపైగా ఉండే యూరియాకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో లభించే జీవన ఎరువుల వినియోగం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి వివరించారు. జీవన ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లమ్, నీలి ఆకుపచ్చ నాచు వినియోగించడం ద్వారా భూమి సహజ స్వభావం దెబ్బతినకుండా నత్రజని శాతాన్ని పెంచవచ్చు.నత్రజనిని స్థిరీకరిస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు పైరుకు లభ్యమవుతాయి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల బెడద కొంత తగ్గి దిగుబడి 10-20 శాతం పెరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం, దిగుబడి బాగుంటుంది. జీవన ఎరువులు ఒకసారి ఉపయోగిస్తే తదుపరి వాటంతట అవే వృద్ధి చెందుతాయి. *రైజోబియం:* ఇది పైర్ల వేర్లపై బుడిపెలు కలుగజేసి సహజీవనం చేస్తూ గాలిలోని నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. ఎకరాకి 40 కిలోల నత్రజని సహజ సిద్ధంగా పైరుకు లభ్యమవుతుంది. లీటరు నీటిలో 50 గ్రా. బెల్లం కరిగించి 15 నిమిషాలు కాచి చల్లార్చాలి. దానికి 20 గ్రా. రైజోబియం కల్చర్ కలిపి వాడుకోవాలి.*అజటోబాక్టర్:* ఎకరాకు 20 కిలోల నత్రజని అందిస్తుంది. కొద్దిపాటి క్షార గుణం కలిగిన నేలలకూ అనువైంది. పైర్లకు అవసరమైన విటమిన్లు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కిలో జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలపాలి. అందులో 15-20 కిలోల సేంద్రియ ఎరువు (లేదా) 40-60 కిలోల మట్టి కలపాలి. అదునులో పొలంలో చల్లుకోవాలి. అజోస్పైరిల్లం, ఆకుపచ్చ నాచును వాడడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. రసాయన ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

9 Sep, 2025
