జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

జీవన ఎరువులు నత్రజనిని అందిస్తాయి

పైరుకు నత్రజని (యూరియా) అవసరానికి మించి వాడితే నష్టమే. నత్రజని 90 శాతానికిపైగా ఉండే యూరియాకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో లభించే జీవన ఎరువుల వినియోగం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ సుధారాణి వివరించారు. జీవన ఎరువులైన రైజోబియం, అజటోబాక్టర్‌, అజోస్పైరిల్లమ్‌, నీలి ఆకుపచ్చ నాచు వినియోగించడం ద్వారా భూమి సహజ స్వభావం దెబ్బతినకుండా నత్రజని శాతాన్ని పెంచవచ్చు.నత్రజనిని స్థిరీకరిస్తాయి. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు పైరుకు లభ్యమవుతాయి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ల బెడద కొంత తగ్గి దిగుబడి 10-20 శాతం పెరుగుతుంది. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం, దిగుబడి బాగుంటుంది. జీవన ఎరువులు ఒకసారి ఉపయోగిస్తే తదుపరి వాటంతట అవే వృద్ధి చెందుతాయి. *రైజోబియం:* ఇది పైర్ల వేర్లపై బుడిపెలు కలుగజేసి సహజీవనం చేస్తూ గాలిలోని నత్రజనిని మొక్కలకు అందిస్తాయి. ఎకరాకి 40 కిలోల నత్రజని సహజ సిద్ధంగా పైరుకు లభ్యమవుతుంది. లీటరు నీటిలో 50 గ్రా. బెల్లం కరిగించి 15 నిమిషాలు కాచి చల్లార్చాలి. దానికి 20 గ్రా. రైజోబియం కల్చర్‌ కలిపి వాడుకోవాలి.*అజటోబాక్టర్‌:* ఎకరాకు 20 కిలోల నత్రజని అందిస్తుంది. కొద్దిపాటి క్షార గుణం కలిగిన నేలలకూ అనువైంది. పైర్లకు అవసరమైన విటమిన్లు, హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కిలో జీవన ఎరువును 10 లీటర్ల నీటిలో కలపాలి. అందులో 15-20 కిలోల సేంద్రియ ఎరువు (లేదా) 40-60 కిలోల మట్టి కలపాలి. అదునులో పొలంలో చల్లుకోవాలి. అజోస్పైరిల్లం, ఆకుపచ్చ నాచును వాడడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. రసాయన ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

Read More