ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రధానుల చేతుల మీదుగా 60 ఏళ్ల క్రితం ప్రారంభమైన విశ్వవిద్యాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. డిసెంబర్‌లో జరగనున్న విశ్వవిద్యాలయం వజ్రోత్సవ ఉత్సవాలు (డైమండ్ జూబ్లీ) ఫ్లయర్, లోగోలనీ మంత్రి ఈ ఉదయం సైఫాబాద్‌లో ఉన్న విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ యం. కోదండ రెడ్డి, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య, విశ్వవిద్యాలయ అధికారులు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉందనీ, అలాగే విశ్వవిద్యాలయాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని తుమ్మల సూచించారు. డైమండ్ జూబ్లీ ఉత్సవాలని ఉపయోగించుకొని ఈ లక్ష్యాలని సాధించాలన్నారు. ముఖ్యమంత్రికి వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత అంశం అని వివరించారు. అందుకే బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు విశ్వవిద్యాలయం భవిష్యత్తుని నిర్ణయించేలా ఉండాలన్నారు. 60 ఏళ్ల విజయాల గురించి సంతృప్తి చెందకుండా భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి సలహాలు, ఆదేశాలు తీసుకొని ముందుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా తోడుంటుందని అన్నారు. అదేవిధంగా ఈనెల 30న మహబూబ్ నగర్ లో రైతు సదస్సు ఉండనుందని.. 28 నుంచే ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. రైతులకి ఆచరణలో ఉపయోగపడేలా ఈ ప్రదర్శనలు ఉండాలన్నారు. చిన్నారెడ్డి, కోదండ రెడ్డిలు నిరంతరము రైతులు, వ్యవసాయ రంగాల గురించే మాట్లాడుతారని వారి సేవలను వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
ఏడాదిగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి అనేక చర్యలు చేపడుతున్నదని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ యం. కోదండ రెడ్డి అన్నారు. ఈ సమయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకల ద్వారా రాష్ట్ర వ్యవసాయరంగ భవిష్యత్‌కి సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయం మంచి సందేశం ఇవ్వాలని ఆయన సూచించారు. 1971-78 ల మధ్య తాను రాజేంద్రనగర్ క్యాంపస్ లోనే వ్యవసాయ విద్యన్ని అభ్యసించానని ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తెలిపారు. ఉత్సాహవంతులైన ఉపకులపతి నేతృత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలని సూచించారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈమధ్య ప్రధాని విడుదల చేసిన వంగడాల్లో తెలంగాణవి లేకపోవడం ఆలోచించవలసిన విషయం అని చిన్నారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964 లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని పిజెటిఏయు ఉపకులపతి ప్రొఫెసర్ అల్థాస్ జానయ్య అన్నారు. 1964లో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశ్వవిద్యాలయాన్ని, 1966 లో పరిపాలన భవనాన్ని ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారన్నారు. ఇన్నేళ్ళ విశ్వవిద్యాలయ విజయాలు, సేవల్ని స్మరించుకుంటూ వజ్రోత్సవాలని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా లోగో, ఫ్లయర్ లని విడుదల చేశామన్నారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో ఉత్సవాల్ని నిర్వహించాలని నిర్ణయించామని, భవిష్యత్తులో తేదీలు మారవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యుజిసి చైర్మన్, ఐసిఏఆర్ డీజీ, ఇక్రిశాట్ డీజీ ఇంకా అనేక మంది ప్రముఖులు, మాజీ ఉపకులపతులు, వ్యవసాయ మంత్రులని ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. మహబూబ్ నగర్ వాసి, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్మన్ శ్రీనివాసులు శెట్టి కూడా ఈ వేడుకలకు హాజరవుతారని అన్నారు.
రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వ్యవసాయ కళాశాలలను ప్రారంభించడానికి ముందే తమ ముందస్తు అనుమతి ఉండాలని ఐసిఏఆర్ ఈ మధ్య అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లకి లేఖ రాసిందని జానయ్య తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ విషయం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తానన్నారు. ప్రైవేట్ కళాశాలల ప్రలోభాలకు గురికావద్దని ఉపకులపతి సూచించారు.

26 Nov, 2024
