అంతరించిపోతున్న మామిడి రకాల సంరక్షణ

అంతరించిపోతున్న మామిడి రకాలు పండూరు వారి మామిడి, కోలంగోవ, రాజమాను, పాపారాజు గోవ, హైదర్‌సాహెబ్, ఫిరంగి లడ్డూ, పనుకులు, నల్ల ఆండ్రస్ లాంటి రకాలను రేపటి తరానికి అందించాలనే సంకల్పంతో ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం సంరక్షిస్తోంది. ఇవే కాదు.. అరుదైన మొత్తం 24 మామిడి రకాలను జాగ్రత్తగా పెంచుతోంది. ఆయా చెట్లు ఎక్కడున్నాయో రైతుల ద్వారా తెలుసుకొని.. వాటి కొమ్మలు తెచ్చి పరిశోధనా స్థానంలో అంటుకట్టారు. ఇలా 2 నెలల కిందట ఒక్కో రకం మొక్కలు 120 చొప్పున అంటుకట్టి పెంచుతున్నారు. మంచి నాణ్యత, తెగుళ్లను తట్టుకునే వాటిని సేకరించి, సంరక్షిస్తున్నామని ఉద్యాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. రాధారాణి తెలిపారు.

Read More

రైతుమేళాలో ఆధునిక పరికరాల ప్రదర్శన

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండురోజుల రైతుమేళా రాజేంద్రనగర్‌లోని క్రీడా ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మానవరహిత వ్యవసాయ ప్రాజెక్టులో భాగంగా అగ్రివర్సిటీ సాంకేతిక కేంద్రం, ఇంజినీరింగ్ విభాగం, అగ్రి రోబోటిక్స్, ఐవోటీ సొల్యూషన్స్ ఫర్ అగ్రికల్చర్ (అరిసా) కేంద్రం రూపొందించిన రోబోలు, ఫార్మ్ రోబోలు, ఆధునిక యంత్ర పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, సేంద్రియ ఎరువులు, చిరుధాన్య ఉత్పత్తులకు సంబంధించి మొత్తం 102 స్టాళ్లను ఏర్పాటు చేయగా రైతులు భారీగా తరలివచ్చారు. ప్రధానంగా రూ.14 లక్షల విలువైన మెగాస్ప్రేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరి నారును పొలంలో సమాన దూరంలో నాటే రైస్ ట్రాన్స్‌ప్లాంటర్ కూడా ఆకట్టుకుంది. భారత వరి పరిశోధన సంస్థ(ఐఐఆరఆర్) అభివృద్ధి చేసిన అధిక దిగుబడి విత్తన రకం డీఆరఆర్ ధాన్ 75, ఇతర రకాలను భారీగా కొనుగోలు చేశారు. భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ(ఐఐఎంఆర్) చిరుధాన్యాల రకాలు, ఆహారాల తయారీ విధానాలు, యంత్రాలను ప్రదర్శించింది. ఉద్యానశాఖ నూతన విత్తన రకాలు, పౌల్ట్రీ డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కొత్త కోళ్ల రకాలు, దాణా, కమ్యూనిటీ సైన్స్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన సహజ ఆహార పదార్థాలను రైతులు కోనుగోలు చేశారు.

మహిళా రైతులకు త్వరలో డ్రోన్లు

తెలంగాణలో రైతులు కోటీశ్వరులు కావాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వర్సిటీ, వ్యవసాయ శాఖ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మెగా రైతు మేళాను పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తుమ్మల ప్రారంభించారు. ‘వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు భవిష్యత్తులో డ్రోన్‌లు ఇస్తాం. డిమాండ్‌కు అనుగుణంగా పంటమార్పిడి, సహజ వ్యవసాయ విధానాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం’ అని తుమ్మల తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘రైతులు అధునాతన నైపుణ్యాలు, సాంకేతికతను వినియోగించుకొని ఉత్పత్తులను పెంచాలి. అగ్రివర్సిటీ నూతన వంగడాలను రైతులకు అందుబాటులోకి తేవాలి’ అని సూచించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర. వారిని ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో భాగస్వామ్యం కల్పించేలా కృషి చేస్తున్నాం’ అన్నారు.

Read More

మొక్కజొన్న రైతులకు మిగిలిన బకాయిలు చెల్లింపు

తెలంగాణా రాష్ట్రంలోని రైతుల నుంచి మార్క్‌ఫెడ్ 8.66 లక్షల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేసింది. వీటి నిమిత్తం రూ.907 కోట్లకు గతంలో రూ.735 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.172 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read More

వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ జులైలో పూర్తి

2026 జులై నెలలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నీళ్లు విడుదల చేయబోతున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా గురువారం ప్రకటించారు. ‘1996 మార్చి 5.. నాకు ఇంకా గుర్తుంది. అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల కిందట అప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశాను. అనేక కారణాలతో తర్వాత నిర్లక్ష్యానికి ఈ ప్రాజెక్టు బలయింది. 2014-19 మధ్య మళ్లీ పనులు వేగవంతం చేశాం. ఐదేళ్లలో రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టాం. మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.140 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం. ప్రాజెక్టు కోసం రూ.585 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు జరుగుతున్నాయి. హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది జులై నాటికి తొలి దశ పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకువస్తాం. 2027-28 నాటికి రెండో దశ నిర్మాణమూ పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 15 లక్షల మందికి తాగునీరు అందుతుంది. కరవు ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. రైతులు జీవితాలు మారుస్తాం. ఉద్యాన సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం’ అని సీఎం పేర్కొన్నారు.

Read More

ప్రత్యామాయ పంటల సాగుకు ప్రభుత్వం అండ

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు రైతుల్ని మళ్లించేలా ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని, ప్రకాశం జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల పరిధిలో 15 లక్షల హెక్టార్లలో పంట మార్పిడికి ప్రణాళిక తయారు చేశామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వివరించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ‘వరి లోనూ కొత్త రకం సాగును ప్రోత్సహిస్తున్నాం. ప్రజలు కోరే రకాలకే రాయితీ వర్తింప చేయనున్నాం. 9.13 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్‌సి కార్డులిచ్చి రూ. 4,474 కోట్లు రుణాలిచ్చాము. రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డు. పంటల మార్పిడిలో భాగంగా ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులకు అండగా నిలిచేలా రూ.2,400 మద్దతు ధర ప్రకటించాం. మార్కెఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

Read More

వ్యవసాయ కమిషన్ బృందం ఇక్రిశాట్‌ను సందర్శించింది

అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ బుధవారం సందర్శించింది. కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గడుగు గంగాధర్, భవానిరెడ్డి, కేవీఎన్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి కమిషన్ బృందంలో ఉన్నారు. పంట క్షేత్రాలను ప్రయోగశాలలను పరిశీలించింది. జొన్న, వేరుసెనగ, శనగ, కంది, ఇతర తృణధాన్య పంటల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్‌పాఠక్, అధికారులు, శాస్త్రవేత్తలతో బృందం సమావేశమై.. పంటల మార్పిడి, ఆరుతడి పంటలు, నీటి సంరక్షణ, సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయం పెంపు, చీడ, పీడల బెడద లేకుండా సాగు తదితర అంశాలపై చర్చించింది.

Read More

ప్రకృతి రైతులకు సరైన ధర కల్పించాలి

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం శెట్టిపల్లెలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన వ్యాపార సంబంధాల వేదిక కార్యక్రమంలో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు, నమూనాలను పరిశీలించారు. ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, విక్రయాల గుర్తించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు సరైన ధర కల్పించాలన్న ఉద్దేశంతో రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ సురేష్ బాబు, డీఏవో మురళి, రైతునేస్తం ఫౌండేషన్ ప్రతినిధి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Read More

పంట ఉత్పత్తుల విలువ పెంపుపై దృష్టి

తెలంగాణలో వరి, పత్తి వంటి ప్రధాన పంటల స్థానంలో చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, నూనె గింజల అధికోత్పత్తిని సాధించడం, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎగుమతి అవకాశాల పెంపుదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయంలో కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతకు పెద్దపీట వేస్తామని తెలిపింది. కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్ౘ్ారు. “వరి ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పత్తి సాగు అధికమే. కేంద్రీకృత పంటల విధానం సమస్యాత్మకంగా ఉంది. దాని స్థానంలో వైవిధ్యీకరణను, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తాం. బియ్యం, నూనెగింజలు, పండ్లు, కూరగాయల శుద్ధి ద్వారా పంట ఉత్పత్తులకు విలువల పెంపుపై దృష్టి పెట్టాం. ఫార్మ్ టు ఫోర్క్ నినాదంతో బియ్యం, మాంసం, చేపలు, మామిడి పండ్ల ఎగుమతులకు ఊతమిస్తాం. సహజ సాగు విస్తీర్ణం పెంచుతాం. 99 రోజుల ప్రణాళికలో.. రాబోయే 30 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలు, విత్తన నిల్వల పంపిణీ పూర్తి చేస్తాం. 60 రోజులలోపు సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులను విస్తరిస్తాం. మూడు నెలల లోపు ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు పూర్తి చేస్తాం” అని వివరించారు.

Read More

అగ్రివర్సిటీలో మార్చి 8, 9 తేదీలలో మెగా రైతు మేళా

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ౙాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. వ్యవసాయరంగంలో మహిళా రైతుల సాధికారత, భూసార పరి రక్షణ, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, ఆధునిక సాంకేతికత వినియోగం, వ్యవసాయానుబంధ రంగాల బలోపేతం తదితర అంశాలపై చర్చతోపాటు ప్రదర్శన నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. మేళాలో ఉత్తమ మహిళా రైతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Read More

విత్తనోత్పత్తి క్షేత్రాలను రక్షించాలి

తెలంగాణాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విత్తనోత్పత్తి క్షేత్రాలను రక్షించాలని రైతు కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో 8 చోట్ల 1629 ఎకరాల్లో వున్న సీడ్ ఫార్మ్స్ ద్వారా గతంలో వివిధ రకాల విత్తనోత్పత్తి జరిగేది. కానీ గత కొన్నేళ్లుగా ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు కమిషన్ తన నివేదికలో వివరించింది. ఇవాళ సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భూమి సునీల్, గోపాల్ రెడ్డి.. సీడ్ ఫార్మ్స్ భూములపై రిపోర్ట్‌ను అందజేశారు. గత నెలలో కమిషన్ కామారెడ్డి జిల్లాలో పర్యటించిన సమయంలో మాల్తుమ్మెదలో 700 ఎకరాలకుపైగా వున్న సీడ్ ఫార్మ్ అన్యాక్రాంతం అయ్యే స్థితిలో ఉన్నట్లు అక్కడి స్థానిక రైతులు కమిషన్ దృష్టికి తెచ్చారని, వెంటనే కమిషన్ ఆ స్థలాన్ని పరిశీలించినట్లు సీఎస్‌కు వివరించారు. సీడ్ ఫార్మ్స్‌పై ఈనెల 2న కమిషన్ కార్యాలయంలో వ్యవసాయశాఖ అధికారులతో కమిషన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో మిగతా చోట్ల కూడా విత్తనోత్పత్తి క్షేత్రాల భూములు ఆగమౌతున్నట్లు కమిషన్ గుర్తించింది. అంతేకాదు భూ భారతిలో కొన్ని చోట్ల భూములు ఎక్కకపోవడంపై సీరియస్ అయ్యింది. ఈ విషయాలని సైతం ఇవాళ సీఎస్ రామకృష్ణారావుకు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గోపాల్ రెడ్డి, సునీల్ వివరించారు. వెంటనే ఆ భూములను కాపాడాలని, ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరింది.

Read More