ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘రైతన్నా.. మీ కోసం’ వారోత్సవాల మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు సేవా కేంద్రం యూనిట్‌గా వ్యవసాయ / ఉద్యాన/పట్టు సహాయకుడు, పశుసంవర్ధక/మత్స్య సహాయకుడు, గ్రామ రెవెన్యూ అధికారి, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, అభ్యుదయ రైతు, సహకార పరపతి సంఘాలు, నీటి వినియోగదారుల సంఘాలు, మార్కెట్ కమిటీల సభ్యులు బృందంగా ఏర్పడి కార్యక్రమాన్ని నిర్వహించాలని పేర్కొంది. ‘సీఎం చంద్రబాబు రాసిన లేఖ అందించడంతోపాటు రైతు సంక్షేమంపై కరపత్రాలు, పంచసూత్రాలతో పాటు ఏపీఏఐఎంఎస్ యాప్ వివరాలు రైతులకు తెలియజేయాలి. ప్రతి ఆర్‌ఎస్‌కే బృందం ఆరు రోజుల్లో 540 కుటుంబాల్ని చేరుకోవాలి. 24 నుంచి 29వ తేదీ వరకు ఇంటింటి ప్రచారం చేయాలి. నవంబరు 30 నుంచి డిసెంబరు 2 వరకు రైతు కుటుంబాల వారీగా సమాచారం సేకరించాలి. డిసెంబరు 3న సదస్సు నిర్వహించి 2026-27 వార్షిక ప్రణాళిక తయారుచేయాలి’ అని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.58 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా సోమవారం 8,451 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 11. 93 లక్షల కుటుంబాల వద్దకు వెళ్లాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్ణయించింది. 4.07 లక్షల కుటుంబాల వద్దకు బృందాలు వెళ్లాయి. అన్నమయ్య, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో లక్ష్యంలో 50% పైగా సాధించారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, కర్నూలు, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో లక్ష్యంలో 30% లోపే ఉంది.

26 Nov, 2025
