ఎల్ నినో-మారుతున్న వాతావరణం:పరాన్నజీవి వ్యాధులపై ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు మానవులు, పశువులు మరియు పర్యావరణ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల నేపాల్లో సంభవించిన తీవ్ర వరదలు మరియు హిమాలయ ప్రాంతంలో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని మరోసారి వాతావరణ మార్పుల ప్రభావాలపై ఆలోచించేలా చేశాయి. ఈ మార్పుల్లో ఎల్ నినో–సదరన్ ఆసిలేషన్ (El Niño–Southern Oscillation – ENSO) ఒక ముఖ్యమైన వాతావరణ ప్రక్రియ. ఎల్ నినో సమయంలో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు సంభవిస్తాయి.

2027 వరకు ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గే అవకాశం లేదని భారత వాతావరణ శాస్త్ర విభాగం (India Meteorological Department – IMD) హెచ్చరిస్తోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాతం, కరువులు, వరదలు వంటి వాతావరణ మార్పులు మానవ–పశు ఆరోగ్యం, పశుపోషణ, వ్యవసాయం, ఆహార–నీటి భద్రత మరియు పర్యావరణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదేవిధంగా, పరాన్నజీవులు, వాటి మధ్యస్థ అతిథులు, వాహకాలు మరియు అతిథి జంతువుల పరస్పర సంబంధాలను ప్రభావితం చేసి, పరాన్నజీవుల అభివృద్ధి, జీవన సామర్థ్యం మరియు వ్యాప్తిని మార్చగలవు. అనేక పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు మరియు ఇతర అభివృద్ధి దశలు పర్యావరణ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటాయి. అనుకూలమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్ల నుంచి లార్వాల అభివృద్ధి వేగవంతమవుతుంది. కొన్ని పరాన్నజీవుల జీవచక్రం త్వరగా పూర్తవుతుంది మరియు కొన్ని వాహకాల సంఖ్య కూడా పెరగవచ్చు. అయితే, అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు తీవ్రమైన ఎండలు కొన్ని పరాన్నజీవుల గుడ్లు మరియు స్వేచ్ఛా జీవన దశల జీవన సామర్థ్యాన్ని తగ్గించవచ్చు.

గొర్రెలు మరియు మేకల్లో కనిపించే ముఖ్యమైన జీర్ణాశయ నెమటోడ్ పరాన్నజీవి Haemonchus contortus. దీనిని సాధారణంగా Barber’s pole worm అని పిలుస్తారు. ఇది రక్తాన్ని పీల్చడం ద్వారా తీవ్రమైన రక్తహీనత, బలహీనత మరియు కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా కారణమవుతుంది.

ఈ పరాన్నజీవి గుడ్డు నుంచి సంక్రమణకు కారణమయ్యే మూడవ దశ లార్వా (L3) వరకు అభివృద్ధి చెందడానికి ఉష్ణోగ్రత మరియు తేమ వంటి పర్యావరణ పరిస్థితులు అవసరం. తగిన వర్షపాతం, నేల తేమ మరియు మితమైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు గుడ్లు వేగంగా అభివృద్ధి చెంది L3 లార్వాలుగా మారి పచ్చికపైకి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎల్ నినో సమయంలో తక్కువ వర్షపాతం, పొడి పరిస్థితుల కారణంగా లార్వాల అభివృద్ధి తగ్గవచ్చు. అయితే ఎల్ నినో తర్వాత తేమ మరియు వర్షపాతం పెరిగే పరిస్థితులు ఏర్పడితే సంక్రమణ పరిస్థితులు మళ్లీ మారవచ్చు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పచ్చికపై కొత్తగా లార్వాల అభివృద్ధి తగ్గినప్పటికీ, ఇప్పటికే జంతువుల్లో ఉన్న పరాన్నజీవి భారం కొనసాగవచ్చు. అంతేకాకుండా కరువు వల్ల మేత కొరత ఏర్పడి జంతువుల పోషక స్థితి మరియు రోగనిరోధక శక్తి తగ్గితే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

ఎల్ నినో (అధిక ఉష్ణోగ్రతల) ప్రభావం తగ్గగానే వచ్చే అధిక వర్షపాతం మరియు వరదల సమయంలో పశువుల మలం నీటి వనరుల్లోకి చేరడం వల్ల Cryptosporidium, Giardia, Entamoeba వంటి నీటి ద్వారా వ్యాపించే పరాన్నజీవుల సంక్రమణ ప్రమాదం పెరగవచ్చు. కరువు సమయంలో సురక్షితమైన నీటి వనరులు తగ్గిపోవడం వల్ల మానవులు మరియు పశువులు పరిమితమైన లేదా కలుషితమైన నీటి వనరులను ఉపయోగించే పరిస్థితి ఏర్పడవచ్చు.

మరో వైపు ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమలో మార్పులు దోమలు, ఈగలు, గోమార్లు మరియు పేలు వంటి వాహకాల సంఖ్య, అభివృద్ధి మరియు కాలానుగుణ కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు. ఫలితంగా మలేరియా, ట్రీపానాసోమా, థిలేరియా, బెబేసియా, లీష్మానియాసిస్ మరియు ఫైలేరియాసిస్ వంటి పరాన్నజీవి వ్యాధుల వ్యాప్తి విధానాల్లో మార్పులు సంభవించవచ్చు.

పరాన్నజీవి వ్యాధులను ఎలా ఎదుర్కోవాలి?

మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పరాన్నజీవి నియంత్రణలో ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.

1.వాతావరణ ఆధారిత పర్యవేక్షణ: ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు తేమ సమాచారాన్ని పరాన్నజీవి వ్యాధుల పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.
2. లక్ష్యిత నులిపురుగు నివారణ: అవసరం లేని blanket deworming కు బదులుగా, మల పరీక్ష, వ్యాధి లక్షణాలు మరియు స్థానిక వ్యాధి పరిస్థితుల ఆధారంగా చికిత్స చేయాలి.
3. FAMACHA విధానం: Haemonchus contortus ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కంటి పొర ఆధారంగా రక్తహీనత ఉన్న జంతువులను గుర్తించి, అవసరమైన వాటికి మాత్రమే చికిత్స చేయడం ప్రయోజనకరం.
4. పోషకాహార నిర్వహణ: కరువు మరియు మేత కొరత సమయంలో తగిన ప్రోటీన్ మరియు శక్తి (ఎనర్జీ) పోషక పదార్థాలు అందించడం ద్వారా జంతువుల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలి.
5. సురక్షితమైన నీరు: మానవులు మరియు పశువులకు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని అందించాలి.
6. వాహకాల పర్యవేక్షణ: వాటి ఋతువుల ఆధారిత కార్యకలాపాలు క్రమం తప్పకుండా పర్యవేక్షించి అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలి. పర్యావరణ పరిశుభ్రత, నిల్వ నీటి తొలగింపు, పురుగుమందుల వినియోగం మరియు వాహక నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేయాలి.
7. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: El Niño వాతావరణ హెచ్చరికలను పశువుల వ్యాధుల నిఘా మరియు పర్యవేక్షణతో అనుసంధానం చేయాలి.

ఎల్ నినో (El Niño) అనేది ప్రపంచ వాతావరణాన్ని శాసించే ఒక శక్తివంతమైన క్లైమేట్ డ్రైవర్. ఇది కేవలం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతల మార్పులకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పరాన్నజీవి వ్యాధుల (parasitic diseases) వ్యాప్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కేవలం రోగ నిర్ధారణ, చికిత్స మాత్రమే సరిపోవు. కాబట్టి భవిష్యత్తులో పరాన్నజీవి వ్యాధుల నియంత్రణ రోగ నిర్ధారణ మరియు చికిత్సకే పరిమితం కాకుండా, వాతావరణ అంచనా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, లక్ష్యిత నులిపురుగు నివారణ, FAMACHA విధానం, పరమాణు స్థాయి పర్యవేక్షణ మరియు వన్ హెల్త్ (మానవ–పశు–పర్యావరణ ఆరోగ్య సమగ్ర విధానం) విధానాలను సమన్వయం చేయాలి.

“వాతావరణాన్ని అర్థం చేసుకుంటే పరాన్నజీవి వ్యాధుల ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చు; ముందస్తు అంచనా ఉంటే సమర్థవంతమైన నియంత్రణ సాధ్యమవుతుంది.”

Dr. వి. జ్ఞానీ చరిత, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి, Dr. పి వి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పరాన్న జీవశాస్త్ర విభాగం. పశు వైద్య కళాశాల, ప్రొద్దటూరు-516360, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, ఆంధ్ర ప్రదేశ్. Ph: 9100771767

Read More

ఔషధ మొక్క… చామ

చామ పంటను కూర వండుకు తినే దుంపల కోసం సాగు చేస్తారు. చామ మొక్క వివిధ ఆకారాలు, పరిమాణాలు గల దుంపలను ఉత్పత్తి చేస్తుంది. దీని ఆకులు 40þ24.8 సెం.మీ. పరిమాణంలో ఉంటాయి. దుంపల నుండి వచ్చే ఆకులు పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులో, క్రింది వైపు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. త్రికోణాకారంలో కోడిగుడ్డు పరిమాణంలో ఉంటాయి. ఆకు కాడ 0.8-1.2 మీ. ఎత్తులో ఉంటుంది.

సాధారణ నామం : టారో శాస్త్రీయ నామం : కోలకేసియా ఎస్కులెంట కుటుంబం: ఆరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చామ దుంపలో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
  • 104 గ్రా. చామ దుంప తింటే 0.294 మి.గ్రా. విటమిన్ బి6, 27.52 గ్రా. కార్బోహైడ్రేట్లు, 0.179 మి.గ్రా. కాపర్, 0.398 మి.గ్రా. మాంగనీస్, 2.48 మి.గ్రా. విటమిన్ ఇ, 615 మి.గ్రా. పొటాషియం లభిస్తాయి. అంతేగాక 0.024 గ్రా. ట్రిప్టొఫాన్, 0.072 గ్రా. థ్రియొనైన్, 0.056 గ్రా. ఐసోల్యూసిన్, 0.115 గ్రా. ల్యూసిన్, 0.07 గ్రా. లైసిన్ వంటి అమినోయాసిడ్లు కూడా లభిస్తాయి.
  • చామ దుంపలో కాల్షియం, విటమిన్ సి, విటమిన్ ఇ, బి విటమిన్లు ఉన్నాయి. చామ ఆకులలో విటమిన్లు ఎ మరియు సి, పీచు పదార్థం, అదిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. చామ దుంప క్యాన్సర్‌ని నివారిస్తుంది.
  • రుమాటాయిడ్ ఆర్థ్రెåటిస్ లక్షణాలను తగ్గిస్తుంది. రక్తపోటుని నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
    జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. కంటిచూపుని మెరుగు పరుస్తుంది.
  • దంత ఆరోగ్య నిర్వహణకు సహాయపడుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తలలో వెంట్రుకలు దట్టంగా పెరగడానికి దోహదపడుతుంది.
  • రక్త ప్రసరణను పెంచుతుంది. ఎముకల నష్టాన్ని తగ్గిస్తుంది.శరీర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

వ్యవసాయరంగంలో

  • చామ దుంప అగ్లూటినిన్ (సిఇఎ) శక్తివంతమైన కీటకనాశనిగా గుర్తించబడింది (రాయ్, అతని అనుచరులు, 2002, మజుందార్, అతని అనుచరులు, 2004).
  • కోలకేసియా ఎస్క్యులెంటా ఎగ్లూటినిన్ (సిఇఎ) ప్రత్తి పంటనాశించే పేనుబంక, ఎఫిస్ గాసిపిని అత్యంత సమర్ధవంతంగా చంపింది. అలసంద పేనుబంక, ఎఫిస్ క్రాక్సివోరాని సిఇఎ సమర్థవంతంగా ఆరమ్ మాక్యులేటం దుంప లెక్టిన్ (ఎటితుల్)తో సమానంగా నివారించింది. సిఇఎ రెడ్ కాటన్ బగ్‌ని అల్లియం సెటైవం (వెల్లుల్లి) లీప్ అగ్లూటిన్ (ఎయసఎయల్) కన్నా అదిక సమర్థవంతంగా నివారించింది (దాస్, అతని అనుచరులు, 2013).
  • పండుఈగ, బాక్ట్రోసెరా కుకుర్బిటె దోసజాతి పంటలపై విపరీత నష్టం కలిగించే పురుగు. ఈ పురుగు నివారణ అతి కష్టం. చామ దుంప లెక్టిన్ (సిఇఎ) పండుఈగ లార్వాల పెరుగుదల, వృద్ధి నరికట్టింది. కనుక ఈ లెక్టిన్‌ని సమగ్ర పురుగు యాజమాన్య పథకంలో ఒక భాగంగా ఉపయోగించవచ్చు. (ఈ ఠాకూర్, అతని అనుచరులు, 2012).
  • చామ దుంప లెక్టిన్ (సిఇఎ) తెల్లదోమ, బెమిసియా టబాసి పెరుగుదలను, పునరుత్పత్తి సామర్థ్యాన్ని అరికట్టింది (అమిత్‌రాయ్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పలు పంటల్లో సస్యరక్షణకు… వామింట కషాయం

వామింట ఆకుల కషాయం క్యాబేజి, కాలీ ఫ్లవర్‌ను ఆశించే డైమండ్ బ్యాక్ మాత్ పురుగులను నివారిస్తుంది. వంగ పంటనాశించే పొగాకు లద్దె పురుగు, పేనుబంకను నివారించే గుణం వామింట కషాయానికి వుంది. వామింట ఆకులను “పంచపత్ర కషాయం” తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు. పంచపత్ర కషాయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ రైతులు అనేక పంటల్లో సస్యరక్షణకు వినియోగిస్తున్నారు.

శిలీంద్ర తెగుళ్ళ నివారణ కషాయం

కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు (అలోవిర) 1 కిలో; బోగన్‌విల్లియా ఆకులు 1 కిలో; బొప్పాయి ఆకులు 1 కిలో; పసుపు పొడి: 200 గ్రాములు.

తయారు చేసే విధానం : పైన తెలిపిన అకులను సూచించిన మోతాదులో తీసుకుని మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రాముల పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగపై ఉడకబెట్టాలి. నాలుగయిదు పొంగులు వచ్చే వరకు బాగా కర్రతో తిప్పుతూ ఉడకబెట్టాలి. ద్రావణాన్ని బాగా చల్లారనిచ్చి, వడగట్టి ఒక ప్లాస్టిక్ డ్రమ్‌లో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి సాయంత్రంవేళల్లో పంటపై పిచికారి చేయాలి. ఈ ద్రావణం ఒక ఎకరం పంటకు సరిపోతుంది.

గమనిక :

  • కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డకట్టుకోవాలి.
  • పంటదశను, తెగులు ఉధృతిని బట్టి రెండుసార్ల వరకు పిచికారి చేసుకోవచ్చు.
  • ద్రావణాన్ని నిల్వ ఉంచరాదు.
  • ఈ కషాయాన్ని పంటలలో వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఉపయోగించవచ్చు.
Read More

పెరటిలో పోషకాహార తోటలతో ఆరోగ్యం, ఆర్థిక పొదుపు – మహిళ సాధించిన విజయగాథ

మహిళా రైతు విజయ గాధ

వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీమతి సి. విజయ కుమారి వైఎస్సార్ కడప జిల్లా, మైదుకూరు మండలం, పప్పనపల్లి వాసి. విజయ ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం సామూహిక నిర్వహణ విభాగంలో మైదుకూరు మండలం పోషణ మరియు ఆరోగ్యం కార్యకర్తగా పనిచేస్తుంది. ఆమె గతంలో తన కుటుంబానికి అవసరమైన కూరగాయలను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేది. పెరుగుతున్న కూరగాయల ధరలు, రసాయన అవశేషాలపై ఆందోళన, అలాగే కుటుంబ సభ్యులు తగినంత ఆకుకూరలు, కూరగాయలు తీసుకోకపోవడం వల్ల పోషకాహార లోపం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఆమె గమనించింది.

ఈ నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట, ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటి పెరటిలో పోషకాహార తోటలు పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. శిక్షణలో సమతుల్య పోషకాహారం ప్రాముఖ్యత, ఇంటి పరిసరాల్లో శాస్త్రీయ పద్ధతిలో పోషకాహార తోటలు ఏర్పాటు, సీజన్కు అనుగుణంగా కూరగాయల ఎంపిక, వంటింటి వ్యర్థాలతో సేంద్రీయ ఎరువుల తయారీ, నీటి పొదుపు పద్ధతులు మరియు సహజ పురుగు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అంతేకాక కూరగాయలు, పండ్ల తోటల్లో వాడే వివిధ రసాయన ఎరువులు, క్రిమి సంహారకాలు, వాటివల్ల పర్యావరణానికి, మానవాళి ఆరోగ్యానికి కలిగే నష్టాలను గూర్చి తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమం అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం (KVK), వొనిపెంట శాస్త్రవేత్తలు జాతీయ ఉద్యానవన పరిశోధన మరియు అభివృద్ధి ఫౌండేషన్ కూరగాయల విత్తనాల కిట్‌ను అందజేయటం జరిగింది. ఈ కిట్‌లో పాలకూర, మిరప, టమాటో, వంగ, బెండకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి మరియు గోరు చిక్కుడు వంటి కూరగాయ విత్తనాలు ఉంటాయి

శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ఉపయోగించి శ్రీమతి సి. విజయ కుమారి తన ఇంటి వెనుక ఖాళీ స్థలంలో టమాటా, బెండకాయ, వంకాయ, పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కాకరకాయ, నేతిబీర, సొరకాయ, ఉల్లి, అలసందలు, ముల్లంగి, బీరకాయ తదితర కూరగాయలను సేంద్రీయ పద్ధతిలోఎటిఎం విధానంలో సాగు చేశారు. కొద్ది వారాల్లోనే కుటుంబ అవసరాలకు సరిపడా తాజా, పోషక విలువలు అధికంగా ఉన్న కూరగాయలు ఆమెకు అందుబాటులోకి వచ్చాయి.

దీని ఫలితంగా కుటుంబం మార్కెట్‌పై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. కూరగాయల కొనుగోలు ఖర్చులో నెలకు సుమారు ₹1500–₹2,500 ల వరకు పొదుపు సాధించారు. కుటుంబ సభ్యుల ఆహారంలో ఆకుకూరలు, కూరగాయల వినియోగం పెరగడంతో వారి ఆరోగ్య పరిస్థితిలో సానుకూల మార్పులు కనిపించాయి. మిగులు ఉత్పత్తిని పొరుగువారికి విక్రయించడం ద్వారా ₹4,500 -5,000 లఅదనపు ఆదాయం కూడా పొందుతున్నారు. అలాగే ఆమె తమ పెరటి తోటలో పండిన కాయగూరలను , ఆకుకూరలను దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో మరియు పాఠశాలలో పిల్లలు భోజనానికి అందించేది.

శ్రీమతి సి. విజయ కుమారి గారి న్యూట్రి గార్డెన్ విజయాన్ని చూసి గ్రామంలోని అనేక మంది తమ ఇళ్లలో కూడా పోషక తోటలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ గ్రామంలో పోషకాహారం, సేంద్రీయ సాగు మరియు కుటుంబ ఆహార భద్రతపై అవగాహన కల్పించే ఆదర్శ మహిళగా ఆమె నిలిచారు.

విజయ అభిప్రాయం
కృషి విజ్ఞాన కేంద్రం అందించిన శిక్షణతో మా ఇంటి ఖాళీ స్థలం పోషకాహారాన్ని అందించే తోటగా మారింది. ఇప్పుడు మా కుటుంబానికి తాజా కూరగాయలు ఇంట్లోనే లభిస్తున్నాయి. డా॥బి. శ్రీ కాంతి శ్రీ, గృహవిజ్ఞాన శాస్త్రవేత్త తనకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వడం వల్లే నేను ఈ విజయం సాధించగలిగాను. ఇప్పుడు మా ఇంటికి కూరగాయల ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ప్రతి ఇంట్లో న్యూట్రి గార్డెన్ ఉంటే కుటుంబ ఆరోగ్యం, పోషకాహార భద్రత మరియు ఆర్థిక పొదుపు ఒకేసారి సాధ్యమవుతాయి.

సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 7032463875.

డా॥బి. శ్రీ కాంతి శ్రీ , డా ఎం. బాలకృష్ణ, డా ॥ఎన్ .శ్రీ విద్యారాణి, డా ॥టి. విజయ నిర్మల, డా ॥ఎస్ . ఫిరోజ్ హుస్సైన్, డా . బి. గోవిందరాజులు మరియు డా ॥ సి హెచ్ . రూత్, కృషి విజ్ఞాన కేంద్రం, ఒనిపెంట – డా॥వై. ఎస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్న గూడెం. Ph: 9493993523

Read More

వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వివిధ పంట రకాలు, ప్రయోజనాలు

పప్పు ధాన్యాలు ` నూనెగింజలు

మినుము :
ఆంధ్ర రాష్ట్రంలో మినుము 9.71 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 3.65 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 376 కిలోల దిగుబడి నిస్తుంది. రాష్ట్రంలో మినుమును తొలకరిలో, రబీలో మరియు వేసవిలో వరి కోతల తర్వాత పండిస్తారు.

మినుము పంటను జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మినుములో అనువైన రకాలు :

జి.బి.జి-1 : ఈ రకం పంట కాలం 70-75 రోజలు, దిగుబడి 8-9 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. అన్ని కాలాలకు అనువైన రకం ఇది. వ్యవసాయ పరిశోధనా స్థానం, ఘంటశాల, కృష్ణాజిల్లా నుండి లభ్యం అవుతుంది- 9248838628

టి.బి.జి. 104 : పంట కాలం- 70-75 రోజలు, దిగుబడి, 8-9 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకునే పాలిష్ రకం. ఇది అన్ని కాలాలకు అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, దర్శి, ప్రకాశం జిల్లా నుండి లభ్యం అవుతుంది – 9989623827.

ఎల్.బి.జి-352: ఈ రకం పంట కాలం 75-80 రోజలు . దిగుబడి 6-7 క్వింటాళ్ళు. వరి మాగాణుల్లో ఆలస్యముగా విత్తుటకు కూడా అనువైన రకం. ఇది కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటశాల, కృష్ణా జిల్లా నుండి లభ్యం అవుతుంది – ఫోన్ నంబర్- 8008201253.

ఎల్.బి.జి`904 మరియు టి.బి.జి-129 రకాలు కెవికె, రెడ్డిపల్లి, అనంతపూరం జిల్లా నుండి లభ్యం అవుతున్నాయి – ఫోన్ నెంబర్ -9989623825

పెసర :
ఆంధ్ర రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ, దాదాపు 0.81 లక్షల టన్నుల ఉత్పత్తిని, సగటున ఎకరాకు 313 కిలోల ఉత్పాదకతనిస్తుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో తొలకరి పంటగాను, కోస్తా ఆంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తారు. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, వేసవిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతంలో మూడవ పంటగాను పండిస్తున్నారు. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసరను పండించవచ్చు. కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలలో అంతర పంటగా కూడా పండించవచ్చు.

ఎల్.జి.జి-574: ఈ రకం పంట కాలం 65-70 రోజులు. దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు. ఇది పల్లాకు తెగులును తట్టుకుంటుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లి అనంతపురం నుండి లభిస్తుంది – 9989623825.

డబ్ల్యు.జి.జి.-42: ఇది ఖరీఫ్ పంటకు అనుకూలం, పంట కాలం 55-60 రోజులు. 4-6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తుంటాయి. ఇవి కెవికె, ఊటుకూరు, వై.యస్.ఆర్. కడప జిల్లాలో లభ్యం అవుతాయి. ఫోన్ నెంబర్:9848809236,

కంది : అనువైన రకాలు ఎల్.ఆర్.జి-52 రకం. వ్యవసాయ పరిశోధనా స్థానం, గరికపాడు, ఎన్.టి.ఆర్. జిల్లా నుండి లభ్యం అవుతుంది. ఫోన్ నెంబర్-9491003499 మరియు టి.ఆర్.జి.-59 మరియు జి.ఆర్.జి-152 రకాలు కెవికె, బనవాసి నుండి అభ్యం అవుతున్నాయి – 8074420092.

వేరుశనగ : పంట కాలం 105-110 రోజులు. ఇందులో కదిరి లేపాక్షి రకం తీవ్ర బెట్ట పరిస్థితులను తట్టుకుని 6-8 క్వింటాళ్ళు దిగుబడి ఇస్తుంది. ఈరకం కెవికె, రెడ్డిపల్లిలో లభ్యం అవుతుంది -9989623825, కదిరి చిత్రావతి కూడా లభ్యం అవుతుంది. కె-6, కదిరి, అమరావతి రకాలు వ్యవసాయ పరిశోధనా స్థానం, కదిరి నుండి లభ్యం అవుతున్నాయి. సంప్రదించవలసిన నంబరు – 9490081470. విశిష్ట రకం వ్యవసాయ పరిశోధనా స్థానం, ఊటుకూరు నుండి లభ్యం ఆవుతుంది. ఫోన్ నెంబర్ – 7981982531.

నువ్వులు : నువ్వులలో YLM-66 రకం,YLM-17 రకం ఖరీఫ్‌కు అనువైనవి. పంటకాలం 75-80 రోజులు, దిగుబడి 5-6 క్వింటాళ్ళు. ఇవి రాయలసీమకి ఆనుకూలం. వ్యవసాయ పరిశోధనా స్థానం, యలమంచిలి, అనకాపల్లి జిల్లా నుండి లభిస్తుంది. ఫోన్ నెంబర్: 9440977352, 9849275470.

ఆముదం : ఆముదం పంట కాలం 90-150 రోజులు, దిగుబడి 6 – 7 క్వింటాళ్ళు. ఇందులో కిరణ్ రకం బెట్టను తట్టుకుంటుంది. బూజు తెగులు తక్కువ. డి.సి.ఎస్-107 మరియు ప్రగతి ఎండు తెగులును తట్టుకుంటుంది. ఐ.సి.హెచ్- 66 ఎండు తెగులు మరియు బెట్టను తట్టుకుంటుంది. ఇవి వ్యవసాయ పరిశోధనా స్థానం అనంతపురం నుండి లభ్యం అవుతున్నాయి. ఫోన్ నెంబర్: 9989210879.

వరితో పోల్చితో చిరుధాన్యాల్లో అధిక పోషక విలువలు ఉన్నాయి. వీటిలో అధిక మాంసకృకృత్తులతో పాటుగా మంచి అమైనో ఆమ్లాలు ఉంటాయి. పిండి పదార్థాలు తక్కువ. పీచు పదార్థం ఎక్కువ ఉండి రాగి, కాల్షియం అధిక మోతాదులలో ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే తీవ్ర కరువు ప్రభావాన్ని తగ్గించడానికి, రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటలను కాక నీటి ఎద్దడిని తట్టుకునే చిరుధాన్యాలను సాగు చేసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడులను సాధించవచ్చు.

జొన్న: ఇది అధిక కరువు నిరోధకత కలిగిన పంట. దీని లోతైన “వేరువ్యవస్థ కారణంగా సుదీర్ఘ వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ముఖ్యంగా చిరుధ్యాల సాగు అధికంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో ఒకటైన కడపలో ఇటీవల కాలంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. నల్లరేగడి నేలలుండి కెసి కెనాల్ ఆయకట్టు ప్రాంతాలైన ప్రొద్దుటూరు మరియు పులివెందుల ప్రాంతాలలో NTJ NJ-1 CSV-29 రకాలను సాగు చేయవచ్చు. అలాగే ఇవి ధాన్యం మరియు పశుగ్రాసం రెండింటిని అందిస్తాయి. సజ్జ పంట విషయానికి వస్తే తక్కువ తేమగల నల్లరేగడి నేలలలో ABH-1, CTP-8203 హైబ్రిడ్ రకాలను ఎంచుకోవచ్చు. ఆలస్యమైనా ఖరీఫ్ సీజన్‌లో ఆగష్టు రెండవ వారం నుండి సెప్టెంబర్ మొదటి వారం లోపు వేసుకోవచ్చు. ఎర్రనేలలు అధికంగా ఉన్న జమ్మలమడుగు మండలంలో కొర్రలు(స్వల్పకాలిక రకాలు) సియా`3223 (రేనాడు/గరుడ) లేదా సూర్యనంది వంటి అధిక దిగుబడులు ఇచ్చే రకాలు నాటుకోవచ్చు.

రాగి రకాలు చూసినట్లయితే గౌతమి (PR) వకుళ, చైతన్య మరియు ఇంద్రావతి వర్షాధార పరిస్థితులకు అనుకూలం. ఈ రకాలు బ్లాస్ట్ తెగులు మరియు తేమ ఒత్తిడిని అధికంగా తట్టుకుంటాయి. పంట ఏది వేసినా విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. సాళ్ళలో నాటడం వలన అప్పుడప్పుడు పడిన వర్షం బొట్టును కూడా ఒడిసి పట్టుకుని పంట నిలబడుతుంది. అలాగే అంతర పంటల సాగుకు కూడా అనుకూలం. కొర్ర లేదా జొన్నను కంది తో కలిపి 4:1 లేదా 5:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. విత్తనం కొరకు భారత చిరుధ్యాల పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు.ఫోన్ నంబరు : 040 – 24599300.

నీటి ఎద్దడిని తట్టుకునే పశుగ్రాస రకాలు
నీటి ఎద్దడిని (Drought) తట్టుకుని, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పశుగ్రాస రకాలు పాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అనంతపురం, వై ఎస్ ఆర్ కడప జిల్లాల పరిసర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు ఈ క్రింది రకాల పశుగ్రాసాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి:

ధాన్యపు జాతి పశుగ్రాసాలు:

జొన్న గడ్డి రకాలు :
ఏకవార్షికాలు – పి.సి -9, ఎం.పి. చారి, పంత్ చారి-5,7, సి.ఎస్.వి. -30F,
32F,

బహు వార్షికాలు – ఎస్. ఎస్. జి 59 -3 , పూస చారి – 6, 23, సి.ఎస్.వి. -33 COFS 29 (కోఎస్ఎస్ 29) COFS 31 (కోఎస్ఎస్ 31). బహుళ కోతలు (మల్టీ కట్) జొన్న రకాలు. కరవును తట్టుకుని, వర్షాలు పడగానే మళ్లీ చిగురిస్తుంది.

సోర్గమ్ -సూడాన్ గడ్డి (SSG): ఇది జొన్న మరియు గడ్డి జాతుల సంకరం. ఇందులో కాండం మందంగా ఉండి రసం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుని పెరుగుతుంది
సజ్జ గడ్డి రకాలు : జైంట్ బాజ్ర , ఎస్ – 530, జె-55 , కె – 533

కాయజాతి (లెగ్యూమ్) పశుగ్రాసాలు:
హెడ్జ్ లూసర్న్ (దశరథ గడ్డి): ఇది బహువార్షిక (3-4 ఏళ్లు వచ్చే) పశుగ్రాసం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువ. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది.

అలసందలు / బొబ్బర్లు: వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలికంగా పండించడానికి ఇది అనువైన పశుగ్రాసం.
స్టైలో హేమాటా – ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దీనిని వర్షాధారంగా సారవంతం కాని భూముల్లో సాగుచేయవచ్చు. భూసారాన్ని పెంచుతుంది. మిశ్రమ పంట లాగా తోటల్లో సాగు చేయవచ్చు.

గడ్డి జాతులు:
బాజ్రా నేపియర్ హైబ్రిడ్ : నేపియర్ రకాల వేర్లు లోతుగా చొచ్చుకుపోయి నీటిని గ్రహిస్తాయి కాబట్టి కరవును తట్టుకుంటాయి.

అంజన్ గడ్డి – ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. తోటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకోవచ్చు
గిన్ని గడ్డి – ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాలలో బాగా అనువైన రకం.

చెట్ల మేత:
సుబాబుల్ మరియు అవిశ: నీరు లేని సమయాల్లో వీటి కొమ్మలు, ఆకులను పశువులకు మేతగా వేయవచ్చు.

విత్తనాలు లభ్యత :
పశుగ్రాస విత్తనాలను ఆంధ్రప్రదేశ్ లోని పశువైద్య విశ్వ విద్యాలయ పరిధిలోని పరిశోధన కేంద్రాలు, ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణ కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు లేదా వ్యవసాయ సంభందిత ఆన్లైన్ ప్లాట్ ఫారముల ద్వారా పొందవచ్చు.

రైతుల సమాచారం కోసం కెవికె శాస్త్రవేత్తలచే రూపొందించబడినది. సంప్రదించవలసిన చిరునామా, కెవికె, ఒనిపెంట`9398982828, 7032463875, 8121136184

డా. శ్రీవిద్య రాణి.ఎన్, శాస్త్రవేత్త, విస్తరణ విభాగం , డా.బి.ఎస్.కాంతి శ్రీ, శాస్త్రవేత్త, గృహవిజ్ఞాన విభాగం, డా. టి.విజయ నిర్మల, శాస్త్రవేత్త, పశుపోషణ విభాగం. Ph: 93989 82828

Read More

ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More

వడగాల్పుల ప్రభావంతో నష్టపోయిన పౌల్ట్రీ రైతులను ఆదుకుంటాం

యూరియా లభ్యత, మొక్క జొన్న ధరలు, రొయ్యల మార్కెట్ పరిస్థితులు, కొబ్బరి రైతుల సమస్యలు, అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి తదితర అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల సంచాలకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పౌల్ట్రీ, ఉద్యాన, ఆక్వా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. వడగాడ్పుల ప్రభావంతో రాష్ట్రంలో సుమారు 5.5 కోట్ల కమర్షియల్ లేయర్ కోళ్లలో 2.5% నుంచి 3.5% వరకు మరణాలు నమోదైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారని ఆయన తెలిపారు. నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పౌల్ట్రీ రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయక్షేత్రంలో మామిడి పండ్లను రుచి చూసిన లోకేశ్

ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు మునగాల ద్వారకానాథ రెడ్డికి చెందిన 17 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్ౙిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.

Read More

ఎల్‌నినో ప్రభావం ఉన్న చోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా పశుగ్రాసానికి కొరత రావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు. ఎల్‌నినో ప్రభావంపై చర్చ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ పశుగ్రాస కొరత రాకుండా జాగ్రత్తలను ప్రస్తావించారు. ఉపాది హామీ పథకం కింద ప్రైవేటు భూముల్లోనూ పశుగ్రాసం సాగుకు అనుమతించామని పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెప్పారు. ‘ఇప్పటివరకు 3,458 ఎకరాలను ఉపాది హామీ పథకం కిందకు తెచ్చి, అక్కడ గ్రాసం సాగుకు విత్తనాలు అందించాం. అనంతపురం జిల్లాలో చెరువు భూముల్లోనూ సాగు కోసం పశు గ్రాసం విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామ’ని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదరాయుడు తెలిపారు. పలు సందేహాలు లేవనెత్తిన సీఎం.. గ్రాసం సాగుకు ఎంత బడ్జెట్ కావాలని ప్రశ్నించారు. రూ.700 కోట్ల అవసరమని డైరెక్టర్ చెప్పగా, ‘రూ.1,000 కోట్ల వరకైనా పర్లేదు. ఎల్‌నినో ప్రభావం ఉన్నచోటల్లా పశుగ్రాసం పెంచేలా చర్యలు చేపట్టండి. కలెక్టర్లు వెంటనే ఈ సాగు మొదలు పెట్టించాలి’ అని ఆదేశించారు.

Read More

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం వద్దు

ధాన్యం అమ్మిన రైతుల చెల్లింపుల కోసం అవసరమైన నిధులకు ఎలాంటి కొరత లేదు, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం, జాప్యం జరిగినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా వేసిన దశ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమయ్యే వరకు జీరో పెండెన్సీ విధానాన్ని ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని వివరించారు. ధాన్యంతో వచ్చిన వాహనాలను రైస్ మిల్లులు వెంటనే అన్ లోడ్ చేసి, డిజిటల్ ఎక్‌నాలెడ్ౙ్‌మెంట్ ఇచ్చేలా చూడాలని జిల్లాల పౌరసరఫరాల అదికారులను కమిషనర్ గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు.

Read More