సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపైసర్టిఫికేషన్‌ కోర్సు

మనుషుల్లో పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నిరోధించుకోవాలంటే సేంద్రియ సాగు విధానంపై అవగాహన పెంచుకోవాలని, సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన ఉత్పత్తులను తినాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, మైలవరం, లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప ప్రిన్సిపల్‌ పి. రంగారావు పేర్కొన్నారు. కళాశాల వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మొక్కల పెంపకంపై సర్టిఫికేషన్‌ కోర్సును శుక్రవారం ప్రారంభించారు. పూల మొక్కల నుంచి పండ్లు, కూరగాయలను ఇళ్లల్లోనే పెంచుకోవచ్చని విభాగాధిపతి జె. రాముడు వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు హరిబాబు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

దేశంలో తొలిసారి నారావారిపల్లెలో పాడి పశువుల్లో ఎద క్రమబద్ధీకరణ

కొన్ని పశువులు ఎదకు రాకపోకపోవడం.. లేదంటే ఒకట్రెండు ఈతలకే వట్టిపోతుండటం లాంటి సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లె పరిసరాల్లో దేశంలోనే తొలిసారిగా ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణతో 30-40 శాతం చూలు కట్టు శాతం ఉండగా.. ఎద క్రమబద్ధీకరణ కార్యక్రమంతో 63 శాతం పశువులు గర్భం దాల్చాయి. నారావారిపల్లె సహా చుట్టుపక్కల 29 గ్రామాల్లో వెయ్యికి పైగా ఎదకు రాని పశువుల్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు గుర్తించారు. తొలి విడతగా 172 మంది రైతులకు చెందిన 250 పశువులను ఎంపిక చేసుకుని మార్చి 29న పథకాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 30 మంది పశు వైద్యులు, సహాయకులు ఎంపిక చేసుకున్న ప్రతి పశువు పునరుత్పాదక, గర్భాశయం, అండాశయ స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఎదకు రప్పించే ప్రక్రియను ప్రారంభించారు. పశువుకు ఆరోగ్య పరీక్షలు చేసి ఎదకు రాకపోవడానికి కారణాలను గుర్తించారు. ప్రతి పశువుకు డీవార్మింగ్‌ మాత్రలు, 20 కిలోల సమీకృత దాణా, 20 మినరల్‌ మాత్రలు, యాంటీ బయాటిక్‌ మందులతో కూడిన రూ. 1500 విలువైన కిట్‌ను రూ.400కే అందజేశారు. మే నెలలో మేలుజాతి ఆంబోతుల వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో 156 వట్టి పోయిన పశువులు ఇప్పుడు చూలు కట్టాయి.

75 శాతం ఫలవంతం చేయడమే లక్ష్యం
ఎదకు రాని పాడి పశువు విలువ రూ. 15 వేలు మాత్రమే. అదే పశువు ఎదకు వచ్చి గర్భం దాల్చితే రూ.60-70 వేలు. ఆరు నెలల తర్వాత నారావారిపల్లెలోని 172 మంది రైతుల ఇళ్లలో పాల వెల్లువ ప్రారంభమవుతుంది. మంచి ఆదాయం లభించనుంది.
-ఎ. రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి

Read More

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ‘పశు పోషకులు అప్రమత్తంగా ఉండాలి’

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున పశుపోషకులంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక శాఖ సంచాలకుడు డాక్టర్‌ టి. దామోదర్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. ‘పశువులు సహా ఇతర జీవాల షెడ్లను పొడిగా ఉంచి వాటి చుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ వంటివి చల్లాలి. ఈ కాలంలో సంభవించే వ్యాధుల నుంచి వాటిని రక్షించుకుంటూ ప్రభుత్వం ఉచితంగా అందించే నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను వేయించాలి. లేగదూడలకు వెచ్చని వాతావరణం కల్పించాలి. పశువులకు సురక్షిత నీటిని అందించాలి. తడిసిన దాణా పెట్టకూడదు. పశువులకు అనారోగ్య లక్షణాలు కనిపించినా లేదా చనిపోయినా సమీప పశువైద్యశాలలో తప్పకుండా తెలియజేయాలి’ అని దామోదర్‌ వివరించారు.

Read More