‘అనంత’ ఉద్యాన రైతులకు కలిసొస్తున్న ప్రత్యేక వాతావరణం
లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి, నాణ్యత
తక్కువ వర్షపాతం, అంతంతమాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగత్రల వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి, నాణ్యతగా ఉండడంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీనీ, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, దిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్ తదితర రకాలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. పండ్లరసంలో చక్కెర మోతాదును రిఫ్రాక్టోమీటరు ద్వారా బ్రిక్స్‌లో కొలుస్తారు. 1% చక్కెరను ఒక డిగ్రీ బ్రిక్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పండులో 10 డిగ్రీల బ్రిక్స్ విలువ ఉందంటే.. 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్లు అర్థం. బ్రిక్స్ విలువ అధికంగా ఉండే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి ఎగుమతులకు అనుకూలం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లలో బ్రిక్స్ విలువ 13 నుంచి 17 వరకు ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో దేశీయ వినియోగంతోపాటు ఎగుమతుల పరంగానూ జిల్లాలో పండే పండ్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.
వాతావరణం ప్రత్యేకం
- రాష్ట్రంలోనే అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఏటా 511 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లాలో 611 మి.మీ. వర్షపాతం నమోదవుతోంది. ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రనేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోవు. ఫలితంగా పండ్ల మొక్కల వేరు వ్యవస్థ పటిష్ఠంగా మారడానికి దోహదపడుతోంది. వేరు కుళ్లు తెగులు తక్కువగా కనిపిస్తుంది.
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాలిలో తేమ శాతం ఉదయం 73, మధ్యాహ్న సమయాల్లో 38గా ఉంటోంది. రాష్ట్రంలో ఇదే అత్యల్పం. ఏటా సగటున 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజులో 8-9 గంటలు సూర్యరశ్మి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమశాతం కారణంగా పండ్ల తోటలకు తెగుళ్లు ఆశించడం తక్కువ. మొక్కల్లో ఎదుగుదల బాగుంటుంది. సహజ బెట్ట పరిస్థితి పూత ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది.
విదేశాలకు అరటి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13,700 హెక్టార్లలో అరటి పండిస్తుండగా, ఎకరాకు 65 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా ముంబయి పోర్టుకు, అక్కడి నుంచి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ తదితర అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1.05 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశారు. గరిష్ఠంగా కిలోకు రూ.30ల ధర లభించడంతో అధిక లాభాలు పొందినట్లు రైతులు చెబుతున్నారు.
పండ్ల తోటల పెంపకానికి అనుకూలం
- సుబ్రహ్మణ్యం, చీఫ్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, రేకులకుంట
ఉమ్మడి అనంతపురం జిల్లా వాతావరణం.. పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. తక్కువ వర్షపాతం కారణంగా నేలలో తేమశాతం తక్కువ. ఫలితంగా వేరువ్యవస్థ పటిష్ఠంగా మారి మొక్క జీవితకాలం పెరుగుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పూత, పిందె రాలడం తక్కువ. గాలిలో తేమ అనుకూలంగా ఉండటంతో తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. ఫలితంగా దిగుబడి పెరగడంతో పాటు పండ్ల నాణ్యత బాగుంటుంది.

