ప్రతికూలతల్లోనూ ఫలప్రదం

‘అనంత’ ఉద్యాన రైతులకు కలిసొస్తున్న ప్రత్యేక వాతావరణం
లోటు వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలతో పండ్లకు రుచి, నాణ్యత

తక్కువ వర్షపాతం, అంతంతమాత్రంగా భూగర్భ జలం, అధిక ఉష్ణోగత్రల వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులు ఉద్యాన పంటల సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఇక్కడి ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండించే పండ్లు ఎక్కువ రుచి, నాణ్యతగా ఉండడంతో వాటికి దేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్‌ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో అరటి, చీనీ, దానిమ్మ, మామిడి, సపోటా, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, దిల్లీ దోస, బొప్పాయి, డ్రాగన్‌ తదితర రకాలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఏటా 50 లక్షల టన్నుల మేర పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీన్ని 2047 నాటికి రెండింతలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. పండ్లరసంలో చక్కెర మోతాదును రిఫ్రాక్టోమీటరు ద్వారా బ్రిక్స్‌లో కొలుస్తారు. 1% చక్కెరను ఒక డిగ్రీ బ్రిక్స్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక పండులో 10 డిగ్రీల బ్రిక్స్‌ విలువ ఉందంటే.. 100 గ్రాములకు 10 గ్రాముల చక్కెర ఉన్నట్లు అర్థం. బ్రిక్స్‌ విలువ అధికంగా ఉండే పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అవి ఎగుమతులకు అనుకూలం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పండించే అరటి, మామిడి, దానిమ్మ పండ్లలో బ్రిక్స్‌ విలువ 13 నుంచి 17 వరకు ఉంటోందని అధికారులు చెబుతున్నారు. దీంతో దేశీయ వినియోగంతోపాటు ఎగుమతుల పరంగానూ జిల్లాలో పండే పండ్లకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది.

వాతావరణం ప్రత్యేకం

  • రాష్ట్రంలోనే అత్యల్పంగా అనంతపురం జిల్లాలో ఏటా 511 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లాలో 611 మి.మీ. వర్షపాతం నమోదవుతోంది. ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రనేలలు విస్తరించి ఉన్నాయి. ఇవి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోవు. ఫలితంగా పండ్ల మొక్కల వేరు వ్యవస్థ పటిష్ఠంగా మారడానికి దోహదపడుతోంది. వేరు కుళ్లు తెగులు తక్కువగా కనిపిస్తుంది.
  • ఉమ్మడి అనంతపురం జిల్లాలో గాలిలో తేమ శాతం ఉదయం 73, మధ్యాహ్న సమయాల్లో 38గా ఉంటోంది. రాష్ట్రంలో ఇదే అత్యల్పం. ఏటా సగటున 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజులో 8-9 గంటలు సూర్యరశ్మి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ తేమశాతం కారణంగా పండ్ల తోటలకు తెగుళ్లు ఆశించడం తక్కువ. మొక్కల్లో ఎదుగుదల బాగుంటుంది. సహజ బెట్ట పరిస్థితి పూత ఎక్కువగా రావడానికి దోహదపడుతుంది.

విదేశాలకు అరటి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13,700 హెక్టార్లలో అరటి పండిస్తుండగా, ఎకరాకు 65 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా ముంబయి పోర్టుకు, అక్కడి నుంచి ఇరాన్‌, ఇరాక్‌, సౌదీ అరేబియా, దుబాయ్‌, బహ్రెయిన్‌ తదితర అరబ్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1.05 లక్షల టన్నుల అరటిని ఎగుమతి చేశారు. గరిష్ఠంగా కిలోకు రూ.30ల ధర లభించడంతో అధిక లాభాలు పొందినట్లు రైతులు చెబుతున్నారు.

పండ్ల తోటల పెంపకానికి అనుకూలం

  • సుబ్రహ్మణ్యం, చీఫ్‌ సైంటిస్ట్‌, ఉద్యాన పరిశోధన స్థానం, రేకులకుంట
    ఉమ్మడి అనంతపురం జిల్లా వాతావరణం.. పండ్ల తోటల పెంపకానికి అనుకూలం. తక్కువ వర్షపాతం కారణంగా నేలలో తేమశాతం తక్కువ. ఫలితంగా వేరువ్యవస్థ పటిష్ఠంగా మారి మొక్క జీవితకాలం పెరుగుతుంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే పూత, పిందె రాలడం తక్కువ. గాలిలో తేమ అనుకూలంగా ఉండటంతో తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. ఫలితంగా దిగుబడి పెరగడంతో పాటు పండ్ల నాణ్యత బాగుంటుంది.

Read More

వ్యవసాయ యోగ్యంగా పోడు భూములు

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని రూపొందించింది. పోడు భూముల్లో సేద్యం చేస్తున్న రైతులందరికీ రానున్న ఐదేళ్లలో (2025-26 నుంచి 2029-30 వరకు) సోలార్‌ పంపు సెట్ల ద్వారా నీటివసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఒక్కో యూనిట్‌కు రూ. 6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ. 12,600 కోట్లు ఖర్చు చేయనుంది. తొలి ఏడాది రూ.600 కోట్లు… తర్వాత ఒక్కో ఏడాదికి రూ.3,000 కోట్ల చొప్పున వ్యయం చేస్తుంది. ఈ నెల 18న నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు ఈనెల 18న ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ. శరత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

2025-26 కార్యాచరణ
మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లా స్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలిచి, ఖరారు చేయాలి. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్ల ఏర్పాటు, ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేసి, యూనిట్ల వినియోగపత్రాలను సమర్పించాలి.

రైతుల అర్హతలు: – అటవీ హక్కుల చట్టం (2006) కింద 6.69 లక్షల ఎకరాలపై 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు పోడుపట్టాలు మంజూరయ్యాయి. 2.10 లక్షల మంది రైతుల అధీనంలోని 6 లక్షల ఎకరాల భూములకు విద్యుత్తు సౌకర్యం లేదు.. వీటికి పూర్తి రాయితీతో సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసి, నీటివసతి కల్పిస్తారు.

  • రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్‌గా పరిగణిస్తారు. అంతకు తక్కువుంటే పక్కనే ఉండే 2-5 మంది రైతులతో బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు. ఇది సాధ్యం కాకుంటే ఓపెన్‌ వెల్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాస్థాయిలో పథకం అమలు, కొనుగోళ్ల కమిటీ కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.
  • అధిక విస్తీర్ణంలో పోడు భూములున్న భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమురంభీం ఆసిఫాబాద్‌, ఖమ్మం, ములుగు, నిర్మల్‌, కామారెడ్డి, నల్గొండ, వరంగల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌ను ప్రత్యేక జిల్లాలుగా గుర్తించారు. తక్కువ విస్తీర్ణంలో భూములున్న జిల్లాలను సమీపంలోని ఇతర జిల్లాలతో కలిపి 5 నోడల్‌ జిల్లాలుగా ప్రకటించారు.
Read More

రాయితీపై సూక్ష్మ సేద్య పరికరాలుమంత్రి అచ్చెన్నాయుడు

ఉద్యాన పంటలు పండించే జిల్లాలను 7 క్లస్టర్లుగా ఏర్పాటు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్రం నుంచి మార్గదర్శకాలు వచ్చాక నిధులు ఎన్ని వస్తాయనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘క్లస్టర్లలో ఉద్యాన పంటల ప్రోత్సాహానికి కేంద్ర సాయం అందుతుంది. ధరలను నియంత్రించే వెసులుబాటు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యాన పంటలు 46 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. గడచిన 8 నెలల్లో లక్ష హెక్టార్లకు సూక్ష్మ సేద్య పరికరాలు అందించాం. ఈ ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ ఇస్తాం. రాయలసీమ జిల్లాల్లో 10 ఎకరాలు ఉన్న వారికి 90% సబ్సిడీపై ఇస్తాం. సూక్ష్మ సేద్య పరికరాలు, యాంత్రీకరణకు కేంద్రం నుంచి 60% రాయితీ వస్తుంది’ అని తెలిపారు.

Read More