రైతులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలిఅధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

హెచ్‌డీ బర్లీ పొగాకు, తోతాపురి మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామిడికి ప్రాసెసింగ్‌ యూనిట్లు కిలోకు రూ.8 తగ్గకుండా చెల్లించేలా చూడాలని.. మరో రూ.4 ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. వీలైనంత వరకు రైతులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో పొగాకు, మామిడి, కోకో కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. మామిడి పల్ప్‌ (గుజ్జు) పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే విషయమై కేంద్రంతో మాట్లాడామని వివరించారు. దీనిపై కేంద్రప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడికి మార్కెట్‌ డిమాండ్‌పై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. సాగు ప్రణాళికపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు.

*53 మిలియన్‌ కిలోల పొగాకును త్వరగా కొనాలి*

రాష్ట్రంలో ఈ ఏడాది 80 మిలియన్‌ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకు ఉత్పత్తి వచ్చిందని.. ఇప్పటి వరకు 27 మిలియన్‌ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 33 మిలియన్‌ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. మరో 20 మిలియన్‌ కిలోలను మార్క్‌ఫెడ్‌ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. బాపట్లలో 3, గుంటూరులో 2, పల్నాడులో 1, ప్రకాశంలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని.. గురువారం నుంచి కొనుగోలు మొదలవుతుందని చెప్పారు. రైతుల వద్ద ఉన్న 53 మిలియన్‌ కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు.

*జులై మొదటి వారానికి కోకో మొత్తం కొనాలి*

ఈ ఏడాది 12 వేల టన్నుల కోకో ఉత్పత్తి వచ్చిందని.. ఇందులో 10వేల టన్నుల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రోజూ 80 నుంచి 100 టన్నులు సేకరిస్తున్నారని తెలిపారు. జులై మొదటి వారానికి రైతుల వద్ద మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్‌ విధానాలు అమలు చేయాలని సూచించారు