రైతులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలిఅధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
హెచ్‌డీ బర్లీ పొగాకు, తోతాపురి మామిడి, కోకో కొనుగోలులో వేగం పెంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మామిడికి ప్రాసెసింగ్ యూనిట్లు కిలోకు రూ.8 తగ్గకుండా చెల్లించేలా చూడాలని.. మరో రూ.4 ప్రభుత్వం చెల్లిస్తోందని స్పష్టం చేశారు. వీలైనంత వరకు రైతులకు అధిక ధరలు వచ్చేలా చూడాలని చెప్పారు. బుధవారం ఆయన సచివాలయంలో పొగాకు, మామిడి, కోకో కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. మామిడి పల్ప్ (గుజ్జు) పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించే విషయమై కేంద్రంతో మాట్లాడామని వివరించారు. దీనిపై కేంద్రప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడికి మార్కెట్ డిమాండ్‌పై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. సాగు ప్రణాళికపై అవగాహన కల్పించాలని నిర్దేశించారు.
*53 మిలియన్ కిలోల పొగాకును త్వరగా కొనాలి*
రాష్ట్రంలో ఈ ఏడాది 80 మిలియన్ కిలోల హెచ్‌డీ బర్లీ పొగాకు ఉత్పత్తి వచ్చిందని.. ఇప్పటి వరకు 27 మిలియన్ కిలోల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 33 మిలియన్ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. మరో 20 మిలియన్ కిలోలను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు. బాపట్లలో 3, గుంటూరులో 2, పల్నాడులో 1, ప్రకాశంలో 1 చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశామని.. గురువారం నుంచి కొనుగోలు మొదలవుతుందని చెప్పారు. రైతుల వద్ద ఉన్న 53 మిలియన్ కిలోల పొగాకు త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వివరాలను రైతులకు తెలియజేయాలన్నారు.
*జులై మొదటి వారానికి కోకో మొత్తం కొనాలి*
ఈ ఏడాది 12 వేల టన్నుల కోకో ఉత్పత్తి వచ్చిందని.. ఇందులో 10వేల టన్నుల విక్రయాలు పూర్తయ్యాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రోజూ 80 నుంచి 100 టన్నులు సేకరిస్తున్నారని తెలిపారు. జులై మొదటి వారానికి రైతుల వద్ద మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని సూచించారు
నేటి నుంచి 7 మార్కెట్ యార్డుల్లో హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు
ప్రాసెసింగ్ మామిడి రకాలకు కిలో రూ.12 – కోకో కిలో ధర రూ.500..- సీఎం సమీక్షలో నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా హెచ్‌డీ బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచే సేకరణ ప్రారంభించనున్నారు. ఇక, ప్రాసెసింగ్ రకం మామిడికి కిలో రూ.12 చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని ఆహారశుద్ధి పరిశ్రమలు, ట్రేడర్లను ఆదేశించింది. ఇందులో వ్యాపారులు రూ.8, ప్రభుత్వం రూ.4 చొప్పున భరించాలని నిర్ణయించింది. కోకో రైతులకు కిలోకు రూ.500 దక్కేలా… వ్యాపారులు రూ.450, ప్రభుత్వం రూ.50 చొప్పున చెల్లించనుంది. పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధరలపై గురువారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులకు వివరించారు. గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 550 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. *సీఎం సమీక్షలోని ప్రధానాంశాలు*- హెచ్‌డీ బర్లీ పొగాకును ఐటీసీ, జీపీఐ సంస్థలు కలిపి 25 మిలియన్ కిలోలు, చిన్న కంపెనీలు 20 మిలియన్ కిలోల చొప్పున కొనాలి. రెండు, మూడు గ్రేడ్ల రకాలు కొనేలా కంపెనీలతో మాట్లాడాలి. ప్రధాన రకాన్ని క్వింటాలుకు రూ.12 వేలకు తగ్గకుండా సేకరించాలి. మిగతా రెండు రకాలకు పరిస్థితులను బట్టి ధర నిర్ణయిస్తాం. ఈ పొగాకు కొనుగోళ్లతో ప్రభుత్వం పై రూ.300-350 కోట్ల భారం పడనుంది.- ఈ ఏడాది చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి ఉత్పత్తి వచ్చింది. ఇదంతా ప్రాసెసింగ్ రకం, ఇప్పటికే ప్రాసెసింగ్ సంస్థల వద్ద 43 వేల టన్నుల మామిడి గుజ్జు నిల్వలున్నాయి. పార్లే ఆగ్రో, కోకకోలా, పెప్సికో సంస్థల నుంచి ఆర్డర్లు రాకపోవడమే సమస్యకు కారణం, రైతులు, ట్రేడింగ్ కంపెనీలు, ప్రాసెసర్లను రిజిస్టర్ చేయాలి. రికార్డులు నిర్వహించాలి. కంపెనీలు కిలోకు రూ.8 ఇస్తే, ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా కిలోకు రూ.4 చొప్పున జమ చేస్తుంది. ఇందుకు రూ.100-150 కోట్ల వరకు భరించనుంది.- రైతుల నుంచి ఇప్పటికే 465 టన్నుల కోకో కోనుగోలు చేశారు. ఇంకా 745 టన్నుల నిల్వలు రైతుల వద్దే ఉన్నాయి. కనీసం కిలోకు రూ.500 దక్కేలా చేసేందుకు ప్రభుత్వం కిలోకు రూ. 50 చొప్పున చెల్లించనుంది. మొత్తం రూ.10.50 కోట్లు ఖర్చవుతుంది. – రాష్ట్రంలో కోకో పాలసీ తీసుకురావాలి. నాణ్యత కలిగిన ఉత్పత్తులు వచ్చేలా రైతుల్ని చైతన్యపరచాలి. రైతుబజార్లను 116 నుంచి 200కు పెంచాలి. మొబైల్ మార్కెట్లు తీసుకురావాలి.- పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగా అన్నదాతా సుఖీభవ లబ్దిదారుల జాబితా రూపొందించాలి.- పామోలిన్ పై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రైతులు ఎలా నష్టపోతున్నారో కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యతను కేంద్ర మంత్రులు, ఎంపీలు తీసుకోవాలి.- ధరలు లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించే బాధ్యత వ్యవసాయ శాఖదే.
రైతులందరికి ప్రయోజనం చేకూరేవిధంగా చర్యలు – మంత్రి తుమ్మల ఈరోజు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు మరియు ఇతర అధికారులతో పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ పథకం కింద రైతులందరికి భీమా అందేలా మరియు ఏఏ పంటలకు భీమా పథకాన్ని వర్తింపచేయాలనే విషయాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా వానాకాలం మరియు యాసంగి కాలాల్లో ఏఏ పంటలకు ఏఏ విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై సమగ్రంగా చర్చించారు. నష్టం కలిగే సంభావ్యత ఆధారంగా రాష్ట్రాన్ని 11 క్లస్టర్లుగా విభజించడం జరిగిందని, సాధారణంగా వానాకాలం సీజన్‌లో సుమారు 128 లక్షల ఎకరాలు పంటలు వేయడం జరుగుతుందని, వాటిలో వరి 66.78 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 5.23, పత్తి 44.75, మిర్చి 1.90, సోయాబీన్ 3.80, కంది 5.21 లక్షల ఎకరాలు సాగవగా, యాసంగి పంటకాలంలో మొత్తం 78 లక్షల ఎకరాలల్లో పంటలు సాగవగా, వరి 59 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 9, వేరుశనగ 2.2, శనగ 1.7 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు మంత్రిగారికి వివరించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం మార్గదర్శకాల ప్రకారంగా వానాకాలానికిగాను మొత్తం ప్రీమియంలో రైతు వాటా 2 శాతం, యాసంగి పంటకాలంలో 1.5 శాతం, వాణిజ్య మరియు ఉద్యానపంటలకు గాను 5 శాతం ప్రీమియం ఉంటుందని, మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం 50:50 భరించడం జరుగుతుందని తెలిపారు. రైతులందరికి పంటలభీమా వర్తింపచేయడం వలన స్థూల పంట విస్తీర్ణంలోని 98 శాతం విస్తీర్ణానికి భీమా వర్తిస్తుందని మంత్రిగారికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాతావారణ మార్పుల వలన ప్రధానంగా అకాల వర్షాల వలనగాని, అధిక వర్షాల వలన గాని, వడగండ్ల వానల వలన, వర్షాభావ పరిస్థితుల వలన గాని కలిగే పంట నష్టానికి పంటల భీమా వల్ల రైతులకు కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీచేసే అవకాశం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దిగుబడి ఆధారిత భీమా పథకం కింద వరి, మొక్కజొన్న, కంది, మినుము, సోయాబీన్, వేరుశనగ, శనగ, నువ్వులు, మొదలైన పంటలు మరియు వాతావరణ ఆధారిత భీమా పథకం కింద పత్తి, మిరప, మామిడి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి మరియు మొదలైన పంటలకు భీమా వర్తింపచేసే విషయంలో పూర్తిస్థాయిలో రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోని పథకాన్ని రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఎండాకాలంలో వడగళ్ల వర్షం వలన నష్టపోయే వరి మరియు మామిడి వంటి ప్రధాన పంటలకు పూర్తి స్థాయి నష్ట పరిహారాన్ని రైతులకు అందించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని ఇతర రాష్ట్రాలు ఏ విధంగా అమలుచేస్తున్నాయో అధ్యయనం చేసి, రైతులందరికి ప్రయోజనం చేకూరే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా టెక్నాలజీ ఆధారంగా పంటల దిగుబడి అంచనాలను రూపొందించడం మరియు నష్టపోయిన పంటల విషయంలో భీమా కంపెనీలు సత్వరమే భీమా క్లెయిమ్ అందించుటకు గల విధివిధానాలను రూపొందించాలని సూచించారు. వానాకాలం మరియు యాసంగి పంటలకు సంబంధించి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా అన్ని రకాల ప్రధాన పంటలకు భీమా ప్రీమియం అంచనా వేయుటకు వెంటనే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను సరైన సమయంలో చేస్తూ అధిక దిగుబడి మరియు నాణ్యమైన దిగుబడిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.
మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు
1. కొమ్మ కత్తిరింపులు
మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది.
కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
కత్తిరింపుల వలన లాభాలు
చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
చీడ పీడల బెడద తగ్గుతుంది.
2. ఎరువుల యాజమాన్యం
కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి.
పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.
మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్ సల్ఫేట్, 2 గ్రా. బోరాన్, 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
3. కలుపు యాజమాన్యం
మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్‌గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.
4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం
కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది.
పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి.
డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్: 9948977535