వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించనున్న ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్ అత్యవసరమైనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచన చేసి కృత్రిమ మేదస్సుతో కూడిన ప్రయోగశాలను నెలకొల్పుతున్నందుకు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్యను మరియు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. పిజెటిఏయూ లోని సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ఆవరణలో ఎస్‌బీఐ సహకారంతో పీజెటిఏయూ అగ్రిహబ్ ఏర్పాటు చేయనున్న ఎస్‌బీఐ-ఏఆర్‌ఐఎస్‌ఏ ప్రయోగశాల ప్రీ లాంచ్ కార్యక్రమంలో రఘునందన్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్‌లో వ్యవసాయ విద్యను అభ్యసించే విద్యార్థులతో పాటు, ఇతర సాంకేతిక కోర్సులను అభ్యసించే విద్యార్థులని విస్తృతంగా భాగస్వాములను చేయాలని సూచించారు. అదే విధంగా విశ్వవిద్యాలయం చేపడుతున్న పరిశోధన, విద్య మరియు విస్తరణ కార్యక్రమాల రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన సూచించారు.
రానున్న 20 ఏళ్లలో వ్యవసాయం చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తద్వారా ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అన్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగం రెండు సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని అందులో మొదటిది అతివేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన వచ్చే మార్పు మరియు రెండవది వ్యవసాయ రంగంపై యువత మక్కువ చూపకపోవడం ద్వారా వ్యవసాయ రంగం నుంచి నానాటికి బయటికి రావటం. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉండాలంటే మానవ రహిత వ్యవసాయమే శరణ్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. దీనికోసం కృత్రిమ మేధస్సుతో కూడిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అందించినప్పుడే వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందని అన్నారు. వ్యవసాయ రంగంలో విస్తృతంగా డ్రోన్లు, రోబోలను అందుబాటులోకి తేవడం, నేలలోని పోషక పదార్థాలను అంచనా వేయటం మరియు వివిధ పంటలలో పోషకాల వినియోగానికి సంబంధించిన యాజమాన్య పద్ధతులను కృత్రిమ మేధస్సుతో కూడిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి రైతాంగానికి అందించటం మరియు వివిధ పంటల్లో తరచుగా వచ్చే తెగుళ్లు మరియు కీటకాల యాజమాన్యంలో కృత్రిమ మేధస్సుతో కూడిన యాజమాన్య పద్ధతులను అభివృద్ధి చేసి అందించడమే ఈ నూతన ప్రయోగశాల ప్రధాన లక్ష్యమని ఉపకులపతి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుచెట్టి ఈ ప్రయోగశాల ఏర్పాటుకు సహకారం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, అగ్రి హబ్, సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

25 Jun, 2025
