పొలాలకు పైపులతో సాగునీటి సరఫరా ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో సుమారు 25 వేల హెక్టార్లకు నీటిని అందించేలా ఎంకాడ్ (మోడ్రనైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలని కర్నూలు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఎర్రనేలల్లో గణనీయంగా పంటలు పండించడానికి వీలుగా ఎంకాడ్ పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఎర్రనేలలకు పైపుల ద్వారా నీటిని అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఐదు చోట్ల ఎర్రనేలలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో బ్లాక్‌గా నిర్ణయించారు. ఒక్కో బ్లాక్ పరిధిలో సుమారు ఐదు వేల హెక్టార్ల ఎర్రనేలలున్నాయి. ఐదు బ్లాకుల్లో కలిపి మొత్తం 25 వేల హెక్టార్లకు నీరు అందించడానికి అవకాశం ఉంది. హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువ నుంచి నీటిని తీసుకునేలా ఎంకాడ్ పథకానికి రూపకల్పన చేశారు. ఒక్కో బ్లాక్ దగ్గర ఒక్కో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. దీనికి సుమారుగా రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వ్యయాన్ని భరిస్తుంది. నందికొట్కూరు, కృష్ణగిరి, పత్తికొండ, వెల్దుర్తి మండలాల పరిధిలో నీటిని అందించనున్నారు.*ప్రయోజనాలెన్నో..*- పీపీడబ్ల్యూఎస్ (ప్రెజరైజ్డ్ పైప్డ్ వాటర్ సప్లై) విధానంలో సాగునీటిని రైతులు పొలం దగ్గరికి పైపుల ద్వారా పంపుతారు. ఫలితంగా సాగునీటి వృథాకు అడ్డుకట్ట పడుతుంది. 90 శాతం నీరు సద్వినియోగం అవుతుంది.- పొలం దగ్గరికి పైపులైను వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి డ్రిప్‌లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ‘ప్రెజరైజ్డ్ పైప్ ఇరిగేషన్ నెట్‌వర్క్’ (పీపీఐఎన్) పేరుతో ఒక్కో బ్లాక్ పరిధిలో ఉండే రైతులందరినీ ఇందులోకి తెచ్చి.. ప్రతి ఒక్కరికి తగిన పరిమాణంలో నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. – ఈ విధానంలో ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.- మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంకాడ్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. – మోటార్లు ఉపయోగించి పైపుల్లో నీటిని పంపుతున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు రైతులకు నీరందదనే సమస్య ఉండదు.

