ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరిగిన నేపథ్యంలో సేంద్రియ ఉత్పత్తుల వాడకం పెరిగింది. ఎక్కడ చూసినా సేంద్రియం పేరిటే అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి నిజమైన సేంద్రియ ఉత్పత్తులను గుర్తించేందుకు వీలుగా ఆహార పదార్థాల్లో క్రిమి సంహారక అవశేషాలను గుర్తించే పరికరాన్ని బిట్స్‌ హైదరాబాద్‌ పరిశోధకులు రూపొందించారు. ఆహార పదార్థాలు, పండ్లు, టమాటాలకు సూక్ష్మ పట్టీని అతికించి ఈ పరికరాన్ని దగ్గరికి తీసుకెళ్తే చాలు.. క్రిమి సంహారక అవశేషాలుంటే రెడ్‌లైట్‌ వెలుగుతుంది. నార్వేలోని ఆర్కిటిక్‌ విశ్వవిద్యాలయం సహకారంతో ప్రొ. సంకేత్‌ గోయల్‌ నేతృత్వంలో డా.పి. సాయికుమార్‌, పరిశోధక విద్యార్థి రేష్మ, రజనీశ్‌ కౌర్‌లు దీన్ని తయారు చేశారు. దీనికి కెమిలు మినో మీటర్‌ అని పేరు పెట్టారు. పరిశోధన పత్రం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ మైక్రో మెకానికల్‌లో ప్రచురితమైంది. ఈ పరికరాన్ని వాణిజ్య అవసరాలకు రూపొందించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రొ. సంకేత్‌ గోయల్‌ వివరించారు.