మన దేశం నుంచి మిరప ఎగుమతుల్లో చైనా వాటా 30-35 శాతం మధ్య ఉంటుంది. 2020-21 సంవత్సరంలో 1.80 లక్షల టన్నులు, 2021-22లో 1.91 లక్షల టన్నులు, 2022-23లో 1.58 లక్షల టన్నులు, 2023-24లో 1.80 లక్షల టన్నులు చైనాకు ఎగుమతయ్యాయి. ఈ ఏడాది మరింత తగ్గాయి. ఎగుమతులు లేకపోవడమే మిర్చి ధరల పతనానికి ప్రధాన కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు.
ఎగుమతికి అనుకూలమైన మిరప ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే లభిస్తుంది. ఇందులో అధిక శాతం చైనాకు ఎగుమతి అవుతుంది. మిరప అనుబంధ ఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ఎగుమతులు లేకపోవడంతో చైనాతోపాటు ఇతర దేశాల వద్ద నిల్వలు తరగడం లేదు. యూరప్, అమెరికాల్లో ఆర్థిక ఒడుదొడుకులే దీనికి కారణం. ఘాటు ఉండే మిరపకాయలను చైనాలో పండిస్తుడటంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి అయ్యే తేజ రకానికి పోటీ వాతావరణం ఏర్పడింది.
బంగ్లాదేశ్, శ్రీలంక, సింగపూర్‌లకు ఎగుమతులు ఆశాజనకంగా ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లో పచ్చిమిర్చికి ఎక్కువగా కోయడం, ఎండుమిర్చి నాణ్యత దెబ్బతినడంతో అక్కడి నుంచి మన మార్కెట్‌కు పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణ విస్తీర్ణం కంటే సాగు సుమారు 2 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి తగ్గితే… ధరలు పెరగొచ్చనే ఆశలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
గుంటూరు మార్కెట్‌కే…
గుంటూరు మిర్చియార్డుకు సగటున 40-45 వేల బస్తాలు వస్తున్నాయి. గుంటూరు మినహా ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు ఆశాజనకంగా లేకపోవడంతో సరకు మొత్తం ఇక్కడికే వస్తోంది. వారం రోజుల నుంచి కొత్త పంట అమ్మకాలు మొదలయ్యాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, కర్నూలు, ఆదోని తదితర ప్రాంతాల నుంచి 4-5 వేల బస్తాలు వస్తుండగా, క్వింటాకు గరిష్టంగా రూ. 14 వేల ధర మాత్రమే లభిస్తోంది.


