యాసంగిలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు
బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కివమ్) సమావేశం ఈఎన్సీ అంజద్ హుస్సేన్ అధ్యక్షతన జరిపి యాసంగి పంట కాలంలో 43 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబరు మూడో వారం నుంచి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని ఇందులో నిర్ణయించారు. సమావేశంలో చర్చించిన అంశాలిలా ఉన్నాయి.
- రాష్ట్రవ్యాప్తంగా భారీ, మధ్యతరహా, చిన్నతరహా ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం సాగునీటి వినియోగానికి 370 టీఎంసీల లభ్యత ఉంది. దీన్ని దాదాపు 43 లక్షల ఎకరాలకు అందించాలని నిర్ణయించారు.
- ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, నిజాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర భారీ ప్రాజెక్టుల్లో జూన్ నెలాఖరు నాటికి తాగునీటి అవసరాలు పోను 288.64 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. 30.97 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వాలని ప్రతిపాదన చేశారు.
- చిన్నతరహా ప్రాజెక్టుల పరిధిలో 42.11 టీఎంసీలతో 7.5 లక్షల ఎకరాలకు, ఐడీసీ లిఫ్టుల కింద 10 టీఎంసీలతో 1.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.
- మధ్యతరహా ప్రాజెక్టుల్లో 28.95 టీఎంసీలు ఉన్నాయి. వీటి ద్వారా 2.78 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
- 24.61 లక్షల ఎకరాల తరి, 18.45 లక్షల ఎకరాల ఆరుతడి పంటకు నీరు ఇవ్వనున్నారు.


