అన్నిరకాల పురుగుల నివారణకు సీతాఫల కషాయం

సీతాఫలం కషాయంతో బోల్‌వార్మ్‌తో పాటు పలు రకాల పురుగులను అరికట్టవచ్చు. సీతాఫలం దొరికే కాలంలో చక్కగా ముదిరిన కాయలను మధ్యకు పగలచీల్చి నీడకు ఎండించి పొడిచేసి పెట్టు కోవాలి. అవసరమైనప్పుడు లీటరు నీటికి వంద గ్రాముల చొప్పున పొడి వేసి మరిగించి కషాయం తీసుకోవాలి. మరిగించినప్పుడు సగం వరకు మిగిలిన కషాయం వడకట్టి పెట్టుకొని 5 శాతం చొప్పున పిచికారి చేసుకుంటే కాయతొలుచు పురుగుతో పాటు అన్ని రకాల పురుగుల మీద చక్కగా పనిచేస్తుంది.

అడ్డసరం ఆకులు, కానుగాకుల కషాయం
ఈ రెండు రకాల ఆకులను సేకరించి శుభ్రపరచుకోవాలి. ఆకుల బరువుకు 16 రెట్ల నీరు తీసుకోవాలి. ఆకులను సన్నగా తరిగి ఒక కుండలో పోసి మరగకాయాలి. పాత్రలో ద్రావణం సగం అయ్యేవరకు సన్నని సెగమీద మరిగించి దించి వడకట్టి ఉంచుకోవాలి. ఈ ద్రావణం లీటరు నీటికి 10 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.

తుమ్మికూర కషాయం
వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఉండ్రాళ్లతోపాటు తుమ్మికూర తినడం ఆచారం. తుమ్మికూర, తిమ్మికూరగా పిలిచే దీని శాస్త్రీయ నామం లూకాసఅస్పెరా. ఇది భారతీయ ఆయుర్వేద విధానంలో ప్రాధాన్యత కలిగిన మొక్క. ఈ తుమ్మికూరను సేకరించి ఆవు మూత్రంతో కషాయం చేసి పిచికారి చేస్తే అన్ని రకాల లద్దెపురుగులు, పాకుడు పురుగులు నశిస్తాయి.

విషముష్టి కషాయం
అటవీ ప్రాంతానికి దగ్గరి ప్రాంతాల్లో విషముష్టి మొక్క విస్త్రృతంగా లభిస్తుంది. విషముష్టి పళ్లు, ఆకులు, బెరడుల నుంచి తీసిన కషాయం పత్తి కాయతొలుచు పురుగును దరిదాపులకు రాకుండా తరిమేస్తుంది. అటవీ పరిసర గ్రామాలకు చెందిన వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో రైతులు దీన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

Read More

ఔషధ మొక్క… బంగ్లా ఆకు / గాంజా

గాంజా ఒక వార్షిక, 6-12 అ. ఎత్తు పెరిగే పూలు పూసే హెర్బల్ మొక్క. కాండం నిటారుగా పెరుగుతుంది. పెద్ద ఆకులు ఎగుడుదిగుడు అంచులు కల చిన్న ఆకులను కలిగి ఉంటాయి. మొదటి జత ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రమంగా ఈ చిన్న ఆకుల సంఖ్య 7 లేదా 9 వరకు పెరుగుతుంది. మొక్క చివరలో ఏర్పడే ఆకులు ఒకే చిన్న ఆకు కలిగి ఉంటాయి. క్రింది జత ఆకులు ఎదురెదురుగా ఏర్పడతాయి. మొక్క చివరి భాగంలోని జంట ఆకులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడతాయి. ప్రతి మొక్కలో ఆడ, మగ పూలు ఏర్పడతాయి.

సాధారణ నామం : మార్జువానా / భంగ్‌మొక్క / కామన్ హెంప్ శాస్త్రీయ నామం : కెన్నాబిస్‌సెటైవా కుటుంబం: కెన్నాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • వేలాది సంవత్సరాలుగా ఔషధరంగంలో దీనిని ఉపయోగిస్తున్నారు. ఆస్త్మా, డయేరియా, డిసెంట్రి, గనోరియ, ఎపిలెప్సి, గౌట్, మలేరియా, జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • గౌట్, వ్రణాలు, వెర్రుకోస్‌వెయిన్, కీళ్ళ నొప్పులకు లేపనంగా ఉపయోగిస్తారు. ప్రస్తుతం క్యాన్సర్ రోగులలో నాసియా, వామిటింగ్‌ల నుండి ఉపశమనంగా ఉపయోగిస్తున్నారు.

వ్యవసాయరంగంలో

  • గాంజా మొక్కను పురుగు వికర్షిణి, కీటకనాశినిగా అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పురుగులు, నులి పురుగులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలను ఆటంక పరుచుటకు దీనిని సహచర పంటగా నాటుతారు. (లేడీస్టోన్, 2015)
  • గాంజా మొక్క ఎండబెట్టిన ఆకులు, పూలు పురుగులు, నల్లులు, నులిపురుగులు కలుపు మొక్కలను వికర్షిస్తాయి లేదా చంపుతాయి. మొక్కల ద్రావణాలు పురుగులు, నులిపురుగులు, నల్లులు, శిలీంద్రాలు, కలుపు మొక్కలు, బాక్టీరియా, ప్రోటోజోవాలను వికర్షించడం లేదా చంపడం చేస్తాయి. (మెక్‌పార్ట్‌లాండ్, 1997)
  • ప్రత్తి చేలకు దగ్గరలో గాంజా మొక్కలను పెంచితే ప్రత్తి నాశించే అలబామా ఆర్ౙిల్లేసియా (కాటన్ వర్మ్) నుండి రక్షించింది (రిలే, 1885).
  • కూరగాయల పంటల చుట్టూ దీనిని పెంచితే క్యాబేజి లార్వా పియరిస్ బ్రాసికె క్యాబేజి పంటను ఆశించకుండా కాపాడింది (బెలింగ్, 1932).
  • ఆలుగడ్డ క్షేత్రాలు పొటాటో బీటిల్ (లెప్టినొటార్సా డెసెమ్‌లినియేటా) ఆశించకుండా రక్షింపబడ్డాయి (స్టాట్టి, 1976).
  • గోధుమ, వేరుశనగ లను డెలియాకోయార్ట్కేటా నుండి కాపాడతాయి. (పకోమోవ్ అండ్ పోటుషాన్ స్కీ, 1977),
  • గాంజా వేరు రసాలు భూమిలోని వేర్లకు నష్టం కలిగించే యూరోపియన్ చాఫర్ బీటిల్ (మెలోలోంతా మెలోలోంతా) నుండి కాపాడతాయి (మటీవ, 1995).
  • గాంజా చిక్‌వీడ్, స్టెల్లేరియా మీడియా, పెరుగుదలను అణచివేసింది (స్టుప్నికా రోడ్ౙింకీవిక్ౙ్, 1970).
  • పొటాటోలేట్‌బ్లెåట్ శిలీంద్రం, ఫైటోఫ్తొరా ఇన్‌ఫెస్టాన్స్ ను అరికట్టడానికి ఆలుగడ్డ పంటలో గాంజాని అంతర పంటగా వేయాలి (ఇస్రాయెల్, 1981).
  • ఆలుగడ్డ పంటని గాంజాతో పంట మార్పిడి చేసి పొటాటోసిస్ట్ నెమటోడ్, హిటరోడెరారోస్టోకైనెన్సిస్‌ని అణచి వేయవచ్చు. (కిర్‌యనోవా అండ్ క్రిల్, 1971).
  • గాంజాతో పంట మార్పిడి రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ చిట్‌వుడి, సంఖ్యని కూడా అణచి వేసింది (కోక్, అతని అనుచరులు, 1994).
  • బటన్ పుట్టగొడుగు (అగారికస్) పెంపకంలో 137 కి. కంపోస్టుకి 3 కి. గాంజా ఎండు ఆకులను కలిపి ఉపయోగిస్తే పుట్టగొడుగులను తినే నెమటోడ్, ఎఫెలెంకాయిడెస్ కాంపోస్టికోలాని అరికట్టబడింది. (గ్రెవాల్, 1989).
  • గాంజా విత్తన చెక్కలను భూమిలో వేస్తే మెలాయిడోగైన్ ఇన్‌కాంగ్నిటా నులి పురుగుల సంఖ్య తగ్గుతుంది (గోస్వామి & విజయలక్ష్మి, 1986)
  • ఎండు ఆకులు నిల్వ ధాన్యంలో ఆశించే ముక్కు పురుగులను వికర్షించాయి (రిలే Ê హోవార్డ్, 1892, మాకిండూ & స్టీవర్స్, 1924).
  • ఆలుగడ్డ కుప్పలపై 2 సెం.మీ. మందంలో ఎండిన, పొడి చేసిన ఆకుల పొరనేర్పాటు చేస్తే పొటాటో ట్యూబర్‌మాత్ ఆశించకుండా 120 రోజుల వరకు కాపాడుకోవచ్చు. (కష్యప్, అతని అనుచరులు, 1992).
  • గోధుమ గింజలకు పొడి చేసిన గాంజా ఆకులను కలిపి ముక్కు పురుగు సైటోఫిలాఒరైజే ఆశించకుండా కాపాడవచ్చు. (ఖరె, అతని అనుసచరులు, 1974).
  • పూలు పూసే గాంజ మొక్కను నీటిలో వేసి మరగించి కషాయం తయారు చేసి ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి పొటాటో బీటిల్, లెప్టినోటార్సాడెసెమ్ లినియేటని చంపవచ్చు. (స్ట్రాట్టి, 1976).
  • 100 గ్రా. తాజా గాంజా ఆకులను 25 మి.లీ. నీటిలో కలిపి రుబ్బి, గుడ్డతో వడకట్టిన ద్రావణం 12వ దశ హిటరోడెరా కజాని నులిపురుగులను చంపాయి (మజుందార్, అతని అనుచరులు, 1989).
  • 10 గ్రా. గాంజా ఆకులను 100 మి.లీ. నీటిలో రుబ్బి, పిల్టర్ పేపర్‌తో వడపోసి ద్రావణాన్ని తయారు చేశారు. 40% ద్రావణం రాగి విత్తనాల నాశించిన 25 వివిధ జాతులకు చెందిన శిలీంద్రాల పెరుగుదలనరికట్టింది. వీటిలో ముఖ్యమైనవి ఆస్పర్ౙిల్లస్, పెనిసిలియం, క్లాడోస్పోరియం, డ్రెష్లెరా, ఫ్యుజేరియం, సెఫలోస్పోరియం, రైజోపస్, మ్యూకార్, కర్వులేరియా (పాండే, 1982).
  • గాంజా ద్రావణం పైన్ నారు మొక్కలను ఫ్యుజేరియం కలిగించే తెగులు నుండి కాపాడింది (వైసోట్స్‌క్యి, 1962)
  • సోవియట్ అగ్రానమిస్టులు ‘కాన్‌సాటిన్ 4” లేదా కొన్సాటిన” అనే నీటిలో కలిపిన ద్రావణాన్ని ఆలుగడ్డ పంటపై పిచికారి చేసి తెగుళ్ళు కలిగించే కొరినోబాక్టీరియం, సూడోమోనాస్, అగ్రోబాక్టీరియా స్పీసీస్‌ని నివారించారు. (జెలెపుకా, 1960, బెల్‌ట్యుకోవ, 1962).
  • ఆలుగడ్డ నిల్వ సమయంలో మెత్తని కుళ్ళు కలిగించే ఎర్వినియా కెరటవోరా మరియు ఇతర బాక్టీరియాలు నివారించబడ్డాయి (విజయ్, అతని అనుచరులు, 1992)
  • శ్రీవాస్తవ & దాస్ (1974) 100 గ్రా. నూరిన గాంజా ఆకులు, కాండాలను 10 మి.లీ. నీటిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరిగించి కషాయం తయారు చేశారు. ఈ కషాయం సైపరస్ రొటండస్ కలుపు మొక్క విత్తనాలను మొలకెత్తకుండా చేసింది.
  • గాంజా నీటి ద్రావణాలు ఫాల్స్‌ఫామోమైల్ (మాట్రికేరియా రెకుటియేటా), లెమన్ గడ్డి (లోపిడియం సెటైవా) కలుపు మొక్కల విత్తనాలను మొలకెత్తకుండా చేసాయి (స్టుప్నికరోడ్ౙింకి విక్ౙ్, 1970).
  • గాంజా ఆకు ద్రావణాలు (1,2 3, 10 మి.గ్రా/మి.లీ.) ఆపిల్ పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించే కాడ్లింగ్‌మాత్ (సైడియాపోయోనెల్లా) ఆపిల్ కాయల నాశించకుండా నివారించింది. (డుర్డెన్, అతని అనుచరులు, 2011).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కృష్ణతామర

కృష్ణతామర సుమారు 50-75 సెం.మీ. ఎత్తు పెరిగే దుంప జాతి మొక్క. అనేక రంగుల పూలు పూస్తాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేస్తారు

సాధారణ నామం : ఇండియన్ రీడ్ / ఇండియన్‌షాట్ / ఫ్లవరింగ్ రీడ్ శాస్త్రీయ నామం : క్యాన్నా ఇండికా కుటుంబం: క్యాన్నేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంపలు, గింజలు ఔషధ లక్షణాలు కలిగి ఉంటాయి. దుంపలలో పిండి పదార్థం ఉంటుంది. గింజల నుండి సహజ రంగు లభిస్తుంది.
  • కృష్ణతామర వేర్లు జ్వరం, ఉబ్బసం నివారణకు, మూత్రం సులువుగా జారీ చేయుటకు, నిద్ర కలిగించుటకు ఉపయోగపడతాయి.
  • వేరు దుంపలను కత్తిరించి ముక్కలు చేసి, బియ్యపు నీటిలో ఉడికించి మిరియాలు కలిపి పశువులకు దాణాగా ఇస్తే విషపుగడ్డికి విరుగుడుగా పనిచేస్తుంది.

వ్యవసాయరంగంలో

  • కృష్ణ తామర వేరు ద్రావణం మరియు దానిమ్మ బెరడు ద్రావణాలను శక్తివంతమైన మొల్లస్కిసైడ్స్‌గా ఉపయోగించవచ్చు. ఇవి నత్త, లైమ్నీయ అక్యూమినేటతో కలిసి జీవించే చేప, కోలిసాఫాసియేటస్ పై ఎటువంటి విషప్రభావం చూపవు (త్రిపాఠి అండ్ సింగ్, 2000).
  • కృష్ణ తామర పూల తెల్ల కిరోసిన్ ద్రావణం 1.1% పైరిత్రం ద్రావణం కన్నా రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజెపై అధిక కీటక నాశక చర్యను ప్రదర్శించింది (రావు, 1957).
  • కృష్ణ తామర పూల ద్రావణం వీవిల్స్, బ్రూచిడ్స్, బీటిల్స్, గొంగళి పురుగులను సమర్ధవంతంగా నివారించింది. (రావు, 1957).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పురుగులు, తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడే వావిలాకు కషాయం

పంటపొలాల చుట్టూ ప్రకృతిలో దొరికే వివిధ రకాల ఆకులను ఉడకపెట్టడం ద్వారా కషాయాలను తయారు చేస్తారు. ఇది మన సంప్రదాయ వ్యవసాయంలో భాగం. ఆకులను ఉడకపెట్టడం వలన అందులో ఉండే మూల పదార్థాలు పూర్తి స్థాయిలో ద్రావణంలో చేరి కషాయం ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పంటల సస్యరక్షణలో ఈ కషాయాలు అనాదిగా రైతులకు తెలిసినవే. ఇందులో ముఖ్యంగా వావిలాకు కషాయం రైతులకు వివిధ పంటలలో పురుగుల నియంత్రణ కొరకు ఉపయోగపడుతుంది.

వావిలాకులో సహజంగా ఉండే ఎన్నో రకాల ‘ఆల్కలాయిడ’ల వలన ఇది పురుగుల నియంత్రణలో మరియు తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడుతుంది.

వావిలాకు కషాయాన్ని పంటలలో వచ్చే రసం పీల్చే పురుగులపైన, చిన్న దశలలో ఉన్న లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, ఆకులను తినే పురుగులపై వాడవచ్చు.

వావిలాకులో “నిర్ణుడిన” మూల పదార్థంగా ఉండడం వలన ఇది పురుగులను స్పర్శ చర్య ద్వారా మరియు పొగ చర్య ద్వారా నియంత్రించడంలో ఉపయోగ పడుతుంది.

వావిలాకును వైద్యంలో ఉపయోగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే వావిలాకు ఆకులు వ్యవసాయంలో సస్యరక్షణలో కూడా ఉపయోగపడుతున్నవి. ఇది పురుగులకు అభివృద్ధి నిరోధకంగా మరియు క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు:
వావిలాకు : 5 కిలోలు
సబ్బు పొడి : 100 గ్రాములు (లేదా)
కుంకుడుకాయలు : 500 గ్రాములు

తయారు చేసే విధానం:

  • ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో అరగంట నుండి గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన కషాయం సుమారు 5 లీ. వరకు ఉంటుంది.
  • ఒక కర్రతో ఉడుకుతున్న కషాయాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  • కషాయాన్ని బాగా చలార్చి, పలుచని గుడ్డతో వడపోయాలి.
  • కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 500 గ్రా. కుంకుడుకాయ రసాన్ని కలపాలి.
  • ఈ కషాయానికి 100 లీటర్ల నీటిని చేర్చి ఒక ఎకరాకు సాయంత్రం వేళ పంటపై పిచికారీ చేయాలి.

జాగ్రత్తలు:

  • వావిలాకు కషాయం తయారు చేసేటపుడు ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి.
  • పంట కాలంలో పంట దశను మరియు పురుగు ఉధృతిని బట్టి 2-3 సార్లు పిచికారీ చేసుకోవచ్చు.
  • తయారు చేసిన కషాయాన్ని నిల్వ ఉంచరాదు.

ఉపయోగాలు:

  • వావిలాకు కషాయాన్ని అన్ని పంటలలో వచ్చే పురుగుల నియంత్రణలో వాడవచ్చు.
  • పంట తొలిదశలో (30 – 45 రోజులు) సుమారు 100 లీ. ద్రావణం ఒక ఎకరాకు సరిపోతుంది. పంట (60 నుండి 90 రోజులు) మధ్య దశలో సుమారు 150 లీ. ద్రావణం మరియు పంట చివరి దశలో (90-120 రోజులు) సుమారు 200 లీ. ద్రావణం ఒక ఎకరాకు అవసరం పడుతుంది.
  • వావిలాకు కషాయం వేరుశనగలో వచ్చే తామర పురుగు, మిరపలో వచ్చే ఆకుముడత, కూరగాయ పంటలను ఆశించే రసం పీల్చే పురుగుల నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
  • వావిలాకు కషాయం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటలపై పిచికారీ చేయాల్సి ఉంటుంది.
  • పురుగుల తొలిదశలో వావిలాకు కషాయం బాగా పనిచేస్తుంది.
Read More

ఔషధ మొక్క… జిల్లేడు

జిల్లేడు మొక్కలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అంతటా పొలాల్లోను, బీడు భూముల్లోను, రోడ్ల ప్రక్కనా కలుపు మొక్కలుగా పెరుగుతాయి. జిల్లేడు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఆకులు కణుపుకు రెండు చొప్పున అండాకారంలో ఉండి, తుంపితే పాలు కారతాయి. ఇవి కాడలు లేకుండా దళసరిగా ఉండి తెల్లని నూగుతో కప్పబడి ఉంటాయి. పువ్వులు తెల్లగాగానీ లేదా ఊదా రంగులో గానీ ఉండి కొమ్మల చివర గుత్తులుగా ఏర్పడతాయి. కాయలు విడివిడిగాగానీ, జంటలుగాగానీ ఏర్పడతాయి. కాయలు ఒకవైపు నిలువుగా బ్రద్ధలై, విత్తనాలు గాలితోపాటు నెమ్మదిగా బయట పడతాయి. పూవులు, కాయలు సంవత్సరం పొడవునా ఏర్పడతాయి. ఈ మొక్కలో “కెలోట్రాపిన”, “జైగాంటి యాల” వంటి అనేక ఆల్కలాయిడ్‌లు, రసాయనాలు ఉంటాయి.

సాధారణ నామం : మిల్క్‌వీడ్ శాస్త్రీయ నామం : కలోట్రాపిస్ జైగాంటియా కుటుంబం: ఆస్ల్కెపియడేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • జిల్లేడు మానవులు, పశువులు, పంటల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. పంటల్లో దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
  • మానవులలో : విరేచనాలు, బోదకాలు, కుష్టు, గజ్జి, తామర, సిఫిలిస్, కీళ్ళనొప్పులు, న్యుమోనియా, పళ్ళనొప్పులు, దగ్గు, జలుబు, ఆస్త్మా, జ్వరం, పాముకాటు, కడుపులో నులిపురుగులు, అల్సర్లు, నరాల వ్యాధులు, చర్మవ్యాధులు, ఆస్త్మా, అబార్షన్ నివారణకుపయోగిస్తుంది.
  • పశువులలో : ఎక్సిమా, వాపులు, చలిజ్వరం, కంట్లో పడిన నలకలను, పరాన్నజీవులను, వ్రణాలనూ, బోదకాలు, కుష్టు, మొండిఎక్ౙిమా, డయేరియా, డీసెంట్రీలను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో …

  • పంటలకు ఎరువుగా, పురుగులు, తెగుళ్ళ నివారణలో ఉపయోగపడుతుంది.
    అ) ఎరువుగా : జిల్లేడు ఆకులను, చిన్న చిన్న లేత మొక్కలను పచ్చి ఆకుఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎకరానికి సుమారు 100 కి. జిల్లేడు రొట్ట అవసరమౌతుంది. కానుగ, గ్లెåరిసిడియా, తంగేడు, వేప వంటి మొక్కల పచ్చి ఆకులతో కలిపి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. జిల్లేడు ఆకులలో 2 శాతం నత్రజని, 0.5 శాతం భాస్వరం, 0.3 శాతం పొటాష్ ఉంటాయి. పచ్చి ఆకుల ఎరువు వేయడం వలన భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది పోషకాలు మొక్కలకందుబాటులోకి వస్తాయి.

ఆ) పురుగు నివారణలో…

  • చెరకు ముచ్చెలను 15%, 20% జిల్లేడు ఆకు కషాయ ద్రావణంలో ముంచి లేదా ముచ్చెలను నాటే ముందు జిల్లేడు ఆకులను 24 నుండి 48 గంటలు నీటిలో నానబెట్టి, వడకట్టిన ద్రావణాన్ని భూమిలో చల్లడం ద్వారా పాండిచ్చేరి, ఒరిస్సా, గుజరాత్ రైతులు చెరకు పంటలో చెదలను నివారిస్తున్నారు.
  • 8 -10 కి. జిల్లేడు ఆకులను 24 గంటలు నీటిలో నానబెట్టి, మరగబెట్టి, వడపోసి చెదలు ఆశించిన భూమిలో చల్లి నివారించవచ్చు.
  • గుజరాత్ రైతులు 50 జిల్లేడు కొమ్మలను ఆకులతో సహా వరి చేలల్లో 14.6 మీ. దూరంలో ఉంచి పేనుబంకని నివారించగలిగారు. కొమ్మలను పేనుబంక ఆశించే కాలంలో 3 సార్లు మార్చారు.
  • కర్ణాటక రైతులు జిల్లేడు మొక్కలను నూరి కషాయాన్ని సాగు నీటి ద్వారా పారించి వరిలో కాండం, వేరు తొలుచు పురుగులను నివారించారు.
  • గుజరాత్‌లోని భావనగర్ రైతులు 1 పాలు జిల్లేడు పాలను 15 పాళ్ళు నీటిలో కలిపి ప్రత్తి పంటపై పిచికారి చేసి గొంగళిపురుగులను 3 రోజుల్లో నివారించగలిగారు.
  • తెలంగాణ రాష్ట్రంలో మెదక్, నల్గొండ రైతులు వేరుశనగ పొలంలో సరిహద్దుల్లో జిల్లేడు కొమ్మలను ఉంచి ఎర్రగొంగళిపురుగులను నివారించగలిగారు. ఆముదం, నువ్వులు, వేరుశనగ పొలాల్లో జిల్లేడు కొమ్మలను ఎరగావేసి ఎర్రగొంగళి పురుగును నివారించారు. దీపపు ఎరలు, ఫెరమోన్ ఎరలకన్నా ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్న పని.
  • గుజరాత్‌లోని సబర్కంతా ప్రాంతంలో అల్లం పంటలో పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ జిల్లేడు మొక్కలను నాటుతారు.
  • వేరుశనగలో జిల్లేడు ఆకు ద్రావణాన్ని (1 శాతం) వేరుశనగ మొలకెత్తిన 40 రోజులలో పిచికారి చేసి మొవ్వుకుళ్ళు తెగులుని తగ్గించగలిగారు.
  • ఎండాకాలంలో బత్తాయి, నిమ్మ, జామ, ఉసిరి, మామిడి చెట్ల మొదళ్ళపై చెదలు కనిపించగానే మట్టినంతా దులిపేసి మొక్క మొదలుచుట్టూ 25 కి. జిల్లేడు ఆకులు పరచి మట్టిలో బాగా కలిసిపోయేలా తిరగత్రవ్వాలి. సంవత్సరకాలంలో 34 సార్లు ఇలా చేయాలి.
  • వేరుశనగ పంటలో ఎర్రగొంగళి పురుగు నివారణకు పొలం చుట్టూ లోతైన మడక చాలుని ఏర్పాటు చేసి అందులో జిల్లేడు ఆకులను పరచి, వాటికి ఆశించిన పురుగులను చంపివేయాలి.
  • పంటలపై వచ్చే పురుగుల నివారణకుపయోగించే వివిధ ఆకుల కషాయం (కీటకనాశిని) తయారీలో జిల్లేడు ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

వివిధ ఆకుల కషాయం తయారు చేసే పద్ధతి
కావలసిన పదార్థాలు

  • పశువులు, గొర్రెలు తినని ఆకులు (వావిలి, అడ్డసరం ఆకులు) : 3 కి.
  • పాలుకారే ఆకులు (జిల్లేడు, గన్నేరు, మేడి) : 3 కి.
  • చెడు వాసన నిచ్చే ఆకులు (రబ్బరు ఆకు, తూటికూడ ఆకు, లాంటానా) : 3కి.
  • చేదుగా ఉండే చెట్లకాయలు (వేప, ముష్టి, కానుగ) 5 కి.
  • ఆవుపేడ మరియు నీరు: పేడ 15 కి, నీరు 45 లీ.
  • గోమూత్రం : 15 లీ.
  • ప్లాస్టిక్ డ్రమ్ము లేదా మట్టికుండలో తయారు చేసుకోవచ్చు.

తయారీ విధానం :

  • ముందుగా 15కి., ఆవుపేడను 45 లీ. నీటిలో కలిపి ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో గానీ, మట్టికుండలోగానీ పోసి మూత పెట్టాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు కర్రతో కలుపుతూ 4 రోజులు మురగబెట్టాలి. 5వ రోజున పైన పేర్కొన్న ఆకులు, కాయలు తెచ్చి ముందుగా కాయలు మెత్తగా కొట్టి ఆవుపేడ, నీరు మిశ్రమంలో పోయాలి. ఆ తర్వాత ఆకులను మెత్తగా నూరి డ్రమ్ములో వేసి 15 లీ. గోమూత్రం అందులో పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఆపైన డ్రమ్ము/కుండపై మూత బెట్టి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బాగా కలియబెట్టాలి. మొదటి రోజు ఆకులు పైకి తేలతాయి. ఒక మోస్తరుగా ఆకులన్నీ మాగిన తర్వాత 5వ రోజు నుండి ఆకులన్నీ ద్రావణం క్రిందకు జారతాయి. ఈ విధంగా 10 నుండి 15 రోజులు ఉంచిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డలో వడపోసి ఉంచుకోవాలి. ఈ ద్రావణాన్ని అన్ని పంటల్లో వాడవచ్చు.

మోతాదు : ఒక లీటరు ద్రావణం 10 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు 100 లీటర్లు పిచికారి చేయాలి.

వరిలో కాండంతొలిచే పురుగు లేదా తెల్ల కంకి నివారణ

  • ఈ పురుగు నివారణకు రైతులు ఎకరాకు 100 కి. జిల్లేడు ఆకులు, లేత కొమ్మలను వరిపొలంలో 30-45 రోజుల మధ్య సమంగా వేసి నీటిని పొలం నుండి తీయకుండా సుమారు 5 రోజులు ఉంచుతారు. పొలంలో వేసిన జిల్లేడు ఆకులు క్రమంగా మాగి తర్వాత కుళ్ళుతాయి. జిల్లేడు ఆకులోని ఆల్కలాయిడ్స్ వల్ల కాండంతొలిచే పురుగు ఉత్పత్తి తగ్గుతుంది. జిల్లేడు ఆకులు ఉపయోగించిన రైతు పొలంలో తెల్లకంకి బెడద చాలా తక్కువగా ఉంది. 5 రోజుల తర్వాత పొలంలో నీరు తీసివేసి మరల 23 సెం.మీ. లోతు మించకుండా నీరు కట్టాలి (రైతుల అనుభవం).

తెగుళ్ళ నివారణలో…

  • జిల్లేడు ఆకులకు శిలీంద్రనాశిని గుణాలు కూడా వున్నాయని పరిశోధనలలో తేలింది. అనేక దేశాలలో మామిడితోటల సాగులో విపరీత నష్టాన్ని కలిగిస్తున్న ఫ్యుజేరియం మాంగిఫెరే అనే తెగులు కారక శిలీంద్రం జీవనియంత్రణలో ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకుల కషాయం భూమిలో నివసించి పం\ల్లో తెగుళ్ళను కలిగించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం సొలాని, రైజోక్టోనియా ఒరైజేసెటైవే శిలీంద్రాల పెరుగుదలను అరికట్టింది. (మండేపూడి డేవిడ్ మరియు అతని అనుచరులు, 2013). కాని ఈ శిలీంద్రాల పెరుగుదలనరికట్టే ట్రైకోడెర్మా విరిడె అనే జీవనియంత్రణకారక శిలీంద్రం పెరుగుదలపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అందువలనే జిల్లేడు ఆకులను పచ్చి ఆకు ఎరువుగా నారుమళ్ళలో నారు మొక్కలను పెంచడానికి, కొబ్బరి తోటల్లో ఎరువుగా వాడుచున్నారు.

పంటల దిగుబడి పెరగడానికి…

  • పోక, కొబ్బరి తోటల్లో దిగుబడులు పెంచడానికి కొన్ని గ్రామాల్లో రైతులు చెట్ల మొదళ్ళు చుట్టూ మట్టిని త్రవ్వి 25-45 కి. జిల్లేడు ఆకుల ముక్కలను వలయాకారంలో భూమిలో పాతిపెడతారు.
  • వర్షాకాలంలో పోకచెట్టు లేదా కొబ్బరి చెట్లకు సహజంగా పాలు లేదా జిగురు కారే మొక్కల ఆకులను పచ్చి ఆకు ఎరువుగా వేస్తే దిగుబడులు పెరుగుతాయని రైతుల నమ్మకం.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More