తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువతకు, మహిళలకు కొత్త ఆదాయ మార్గాలను సృష్టించడానికి, రైతులకు అదనపు రాబడిని కల్పించడానికి నూతన, సంప్రదాయ విధానాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా తిన్నవారికి ప్రొటీన్లు… పెంచిన వారికి ఆదాయం అందుతుందనే భావనతో నాటుకోళ్ల పెంపకాన్ని భారీ ఎత్తున చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ప్రతి పల్లెలో నాటుకోళ్లు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య భారీగా తగ్గింది. జాతీయ పశుగణన గణాంకాల ప్రకారం… తెలంగాణలో 2014లో 8,20,134 నాటుకోళ్లు ఉండగా 2025 నాటికి 5,10,552 తగ్గాయి. మరోవైపు పట్టణాల్లో నాటుకోడి మాంసానికి అధిక గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కోళ్ల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేసింది.
కార్యాచరణ…
వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు సంబంధిత విశ్వవిద్యాలయాల ద్వారా పథకాన్ని అమలు చేస్తారు.
దళిత, గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద కోళ్లను పంపిణీ చేస్తారు. ఇప్పటికే మహబూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో దళితులు, గిరిజనులకు ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆరు వేల చొప్పున నాటుకోళ్లను అందజేశారు.
రైతులు తక్కువ పెట్టుబడితో పెరట్లో, వ్యవసాయ క్షేత్రాల్లో కోళ్ల షెడ్లను ఏర్పాటు కోవచ్చు. గుడ్లు, మాంసం సంతల్లో, స్థానిక మార్కెట్లలో అమ్మకాల ద్వారా లాభాలు పొందవచ్చు.
షెడ్లను ఉపాధి హామీ పథకం కింద నిర్మించుకోవచ్చు. మదర్ యూనిట్ కింద పెద్దషెడ్ నిర్మాణానికి రూ.3 లక్షలు ఇస్తున్నారు. దీనిలో కోడిపిల్లలను పెంచి గ్రామంలో ఇతరులకు పెంపకానికి ఇస్తారు. చిన్న యూనిట్లకు రూ. లక్ష ఇస్తారు. ఈ మేరకు రాయితీపై కోళ్లను, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణసాయాన్ని అందజేస్తారు.
మహిళాశక్తి పథకం కింద ప్రతి మండలానికి రెండు చొప్పున యూనిట్లు, 100 చొప్పన చిన్న యూనిట్లను మంజూరు చేస్తోంది. దీనికి రుణసాయాన్ని సెర్ప్ అందజేస్తుంది.