నారాయణపేటలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
తెలంగాణాలోని నారాయణపేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.కోటి విలువైన పత్తి విత్తనాలను పట్టుకున్నారు. సోమవారం జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ డా. వినీత్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట మండలం బండగొండ, కొత్తపల్లి మండలం భూనీడ్ గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ అధికారులు సంయుక్తంగా ఆదివారం సాయంత్రం ఆయా గ్రామాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. భూనీడ్‌కు చెందిన తండ్రీకొడుకులు బాలకృష్ణనాయుడు, శశివర్దన్‌నాయుడు ఇళ్ల నుంచి రూ.కోటి విలువైన 10 టన్నుల (100 క్వింటాళ్లు) నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసినా, అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసును ఛేదించిన డీఎస్పీ లింగయ్య, సీఐలు శివశంకర్, సైదులు, ఎస్సైలు రాముడు, విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ బృందం, వ్యవసాయశాఖ అధికారులను అభినందించారు.

