ప్రకృతి సేద్య రైతులకు ప్రయోజనం కలుగుతుంది

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీ విత్తన పంపిణీ

ఆంధ్రప్రదేశ్‌లో రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. డి-క్రిషి యాప్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్‌, మొబైల్‌ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు.

Read More

విజయవంతంగా ముగిసిన గ్రామగ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.

Read More