జూన్ 12న తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం

దేశంలోనే రెండవ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 1964 జూన్ 12 వ తేదీన రాజేంద్రనగర్‌లో ఏర్పాటు అయింది. ప్రస్తుత వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిపాలనా భవనంతో పాటు ఇతర మౌలిక వసతుల సముదాయాన్ని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జూన్, 1966 లో ప్రారంభించి రైతాంగానికి అంకితం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రముఖ తెలంగాణా సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయ శంకర్ గారి పేరుతో ఈ విశ్వవిద్యాలయం రైతాంగానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్బంగా జూన్ 12 వ తేదీన నిర్వహించ తలపెట్టిన 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భారత హరిత విప్లవ సాధనలో ఇందిరాగాంధీ విశేష సేవలు అన్న అంశంపై జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆవిర్భావ దినోత్సవ ప్రసంగాన్ని ప్రముఖ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఇవ్వనున్నారు. అదే విధంగా యం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ వ్యవసాయ ఆర్ధిక వేత్త ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ ఈ జాతీయ సదస్సు అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్, విధాన విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట ప్రసంగం చేయనున్నారు.

రాహుల్ గాంధీకి ఆహ్వానం
ఈ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం, ఇతర మౌలిక వసతులని ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ప్రారంభించి 60 ఏళ్ళు అయిన సందర్బంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆహ్వానం అందించినట్లు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా విశ్వవిద్యాలయం కోరింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలని నిర్వహించనున్నట్లు అల్దాస్ జానయ్య తెలిపారు.1966-84 మధ్యలో హరిత విప్లవాన్ని విజయవంతంగా అమలు చేసి దేశానికి ఆహార భద్రతని అందించిన ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వాన్ని, ఆనాటి రైతు అనుకూల విధానాలని, వివిధ సంస్థలని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఉప కులపతి పేర్కొన్నారు. అందుకే ఈ 62 వ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాతీయ సదస్సుని నిర్వహిస్తున్నట్లు అల్దాస్ జానయ్య వివరించారు.

Read More

90 లక్షల టన్నుల ధాన్యం ఈ యాసంగిలో ఉత్పత్తి అవుతుంది

“తెలంగాణలో యాసంగి పంటలో వచ్చే ధాన్యం ఉప్పుడు బియ్యం మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ నుంచి 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డితో కేంద్ర మంత్రిని దిల్లీలో కలిసి ఈ అంశంపై చర్చించారు. దేశవ్యాప్తంగా ఈ బియ్యానికి డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. ఇందులో మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం (10% నూకతో) సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం” అని రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రికి వినతిపత్రమిచ్చారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, దీని కారణంగా పౌర సరఫరాలశాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే బకాయిలు విడుదల చేయించాలని విన్నవించారు. ఉప్పుడు బియ్యం సరఫరాకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

Read More

గోసంరక్షణకు తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది

తెలంగాణా రాష్ట్రంలో గోసంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అమలు చేస్తోందని ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందని, సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, పీపుల్ ఫర్ యానిమల్స్ వ్యవస్థాపకురాలు మేనకాగాంధీ ఆదివారం శాసనమండలి హాలులో రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ కె. రామకృష్ణారావు, జీహెచఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్, నిర్వహణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీకి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Read More

అగ్రివర్సిటీలో మార్చి 8, 9 తేదీలలో మెగా రైతు మేళా

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్ౙాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8, 9 తేదీల్లో మెగా రైతు మేళా నిర్వహించనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభిస్తారు. వ్యవసాయరంగంలో మహిళా రైతుల సాధికారత, భూసార పరి రక్షణ, సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, ఆధునిక సాంకేతికత వినియోగం, వ్యవసాయానుబంధ రంగాల బలోపేతం తదితర అంశాలపై చర్చతోపాటు ప్రదర్శన నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. మేళాలో ఉత్తమ మహిళా రైతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.

Read More

నిజామాబాద్ జిల్లాలో రేపు కొత్త వ్యవసాయ కళాశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విద్యను మరింత విస్తరించి, రైతు సంక్షేమం-వ్యవసాయ అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లాలో కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని సుద్దపల్లి మరియు నడపల్లి గ్రామాల పరిధిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సర్వే నంబర్లు 265/1, 277 మరియు 334లో మొత్తం 120 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆధునిక వ్యవసాయ కళాశాల నిర్మించబడనుంది. వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధన, శిక్షణ మరియు రైతు సేవలను ఒకేచోట అందించేందుకు ఈ కళాశాల రూపుదిద్దుకోనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఈ కళాశాల రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక ముఖ్య మైలురాయిగా నిలవనుంది. విద్యార్థులకు ఆధునిక వ్యవసాయ విద్యను అందించడంతో పాటు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించబడ్డాయని మంత్రి తుమ్మల తెలిపారు.

ఈ వ్యవసాయ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ముఖ్య సౌకర్యాలు:

  • 5 ఎకరాలలో ఆధునిక అకడమిక్ బ్లాక్ మరియు పరిపాలన భవనాలు
  • 2 ఎకరాలలో అత్యాధునిక 10 ప్రయోగశాలలు
  • 2 ఎకరాలలో 1000 మంది విద్యార్థులకు వసతి కలిగిన హాస్టళ్లు
  • 1 ఎకరంలో లైబ్రరీ
  • 50 ఎకరాలలో విస్తృత పరిశోధన ఫార్మ్‌లు మరియు సీడ్ ఫార్మ్‌లు
  • 20 ఎకరాలలో విద్యార్థుల ప్రాక్టికల్ శిక్షణ కోసం ప్రత్యేక ఫార్మ్‌లు
  • 10 ఎకరాలలో మోడల్ ఫార్మ్ మరియు రైతు శిక్షణ బ్లాక్
  • 10 ఎకరాలలో సైన్స్ మ్యూజియం, బొటానికల్ గార్డెన్
  • 8 ఎకరాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు ఇండోర్ స్టేడియం
  • 3 ఎకరాలలో ఆడిటోరియం, గ్యాలరీ మరియు సెమినార్ హాళ్లు
  • 3 ఎకరాలలో అధ్యాపకులు మరియు సిబ్బందికి నివాస వసతులు
  • 1 ఎకరంలో ఆరోగ్య కేంద్రం మరియు ఇతర మౌలిక సదుపాయాలు ఈ సదుపాయాలన్నీ పూర్తిస్థాయిలో ఏర్పాటవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ, ఆధునిక పరిశోధన, రైతులకు ప్రత్యక్ష శిక్షణ మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుందని మంత్రిగారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళాశాల ద్వారా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులకు ఉన్నత స్థాయి వ్యవసాయ విద్య అందుబాటులోకి రానుండగా, రైతులకు నూతన పంట విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం, విత్తనాల అభివృద్ధి మరియు సాగు విధానాలపై శిక్షణలు అందించి వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు దోహదం చేస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునీకరించడం, యువతను వ్యవసాయ రంగంలో ఆకర్షించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త వ్యవసాయ కళాశాల నిర్మాణాన్ని చేపట్టిందని, ప్రతి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ ప్రతిష్ఠాత్మక వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేసి, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి మరో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారని మంత్రి తుమ్మల వెల్లడించారు. వ్యవసాయ రంగంలో విశేష అనుభవంతో ఆధునిక సాగు పద్ధతులతో మార్గదర్శి గా నిలిచిన మంత్రి తుమ్మల వ్యవసాయ విద్యకు మూడు దశాబ్దాల క్రితమే బాటలు వేశారు. అశ్వరావుపేటలో వ్యవసాయ కళాశాల స్థాపనకు రూపకల్పన చేసిన తుమ్మల నాటి అనుభవాలతో సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ విద్య విస్తరణ ప్రాధాన్యంపై ప్రతిపాదనలు చేయగా, వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ కళాశాల స్థాపనకు సంతోషంగా ఆమోదం తెలిపారు. వ్యవసాయ కళాశాల స్థాపనలో మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేస్తున్నారని వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్లు, రైతు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగనున్న వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ విద్యార్ధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి తుమ్మల కోరారు.
Read More

ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ

  • దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో నర్మెట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం
  • ఫ్యాక్టరీలో ట్రయల్‌ రన్‌ విజయవంతం
  • సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో ఆయిల్‌ ఫామ్‌ సాగు విస్తరణ
  • ఆయిల్‌పామ్‌ సాగులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుంది….
  • త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం: మంత్రి తుమ్మల

నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీతో ఆయిల్‌పామ్‌ రైతులకు మహర్దశ పట్టనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. శనివారం నాడు అధికారులతో కలసి సిద్దిపేట జిల్లా నర్మేట్టలో ఆయిల్‌ఫెడ్‌ 300 కోట్లతో నిర్మాణం చేసిన పామాయిల్‌ ఫ్యాక్టరీ పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ విజయవంతం కావడంతో అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి లాంగ్‌ విజన్‌తో నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టామని, దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీ నిర్మాణం చేసినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక లాభాలు ఉంటాయని, అంతర పంటల సాగుతో అదనపు లాభాలు రైతులకు లభిస్తాయని తెలిపారు. దేశంలోనే ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ మొదటి స్థానంలో నిలవనుందనీ మంత్రి తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా నర్మేట్ట పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరుగనుందని తెలిపారు.

Read More