మామిడిలో భారీగా కార్బైడ్ వినియోగం
నాణ్యత పరీక్ష ఫలితాల ఆధారంగా చర్యలు: మంత్రి తుమ్మల
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా మామిడికాయలను మగ్గబెట్టేందుకు వ్యాపారులు హానికరమైన కార్బైడ్‌తోపాటు మోతాదుకు మించి ఎథిలీన్ సాచెట్లను వినియోగిస్తున్నట్లు తేలింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్, ఆహారభద్రత విభాగం అధికారులు మంగళవారం 110 నమూనాలను సేకరించి, నాణ్యత పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా కార్బైడ్ ప్యాకెట్లతోపాటు ఎథిలిన్ సాచెట్లనూ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని జాంబాగ్, గడ్డి అన్నారం, బాటసింగారం, వరంగల్, జగిత్యాల తదితర మార్కెట్లలోని వ్యాపారులు తెచ్చిన పండ్లను తనిఖీ చేశారు. పలువురు కార్బైడ్ వాడిన పండ్లతో, మరికొందరు ఎథిలీన్ సాచెట్లతో దొరికారు. దాంతో అధికారులు వారి వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ”సీజన్ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిత్యం అన్ని మార్కెట్లతోపాటు పండ్ల విక్రయ ప్రాంతాల్లో మామిడి పండ్లను తనిఖీ చేస్తాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే లైసెన్సుల రద్దుతోపాటు కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.










