పాముకాటుకు చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టండి

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

పాముకాటు సమస్య దేశమంతటా ప్రబలంగా ఉందని, దీనికి సంబంధించిన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపట్టాలని సోమవారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాముకాటు చికిత్సలో కీలకమైన యాంటీ (పాలీ)వీనమ్‌ కొరత కారణంగా దేశం గణనీయమైన ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏటా సుమారు 58,000 పాము కాటు మరణాలు భారత దేశంలో సంభవిస్తున్నాయని, యాంటీవీనమ్‌ కొరత కారణంగా చికిత్స ఆలస్యమై బాధితులు మరణిస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు మరణాలను తగ్గించడానికి ప్రజా చైతన్య ప్రచారాలను నిర్వహించాని విజ్ఞప్తి చేశారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన వైద్యులతో పాముకాటు చికిత్స, సంరక్షణ విభాగాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్‌ సుప్రీంకోర్టును కోరారు. ఈ సమస్యపై కేంద్రంతో పాటు రాష్ట్రాలూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రాల వైద్య ప్రతినిధులతో సమావేశమై ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం తరపు న్యాయవాదికి తెలిపింది.
Read More

ఖాళీ స్థలాల్లో గోదాములు నిర్మించండి

గిడ్డంగుల సంస్థకు మంత్రి తుమ్మల ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఖాళీ స్థలాల్లో కొత్త గోదాములను నిర్మించాలని, ఆహార ఉత్పత్తుల నిల్వ సౌకర్యాలు పెంచాలని గిడ్డంగుల సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థపై సమీక్ష నిర్వహించారు. సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎండీ కొర్రా లక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”ఈ ఏడాది కొత్తగా 30,000 టన్నుల సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చాం. మరో 1,03,800 టన్నుల నిల్వ సామర్థ్యంతో 8 ప్రాంతాల్లో కొత్త గిడ్డంగుల నిర్మాణం చేపట్టాం. గోదాముల్లో సరకుల నిల్వ, రవాణా, వాహనాల రాకపోకలపై నిఘా ఏర్పాట్లు ప్రారంభించాం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు రాని సందర్భంలో అన్నదాతలు గోదాముల్లో సరకులను నిల్వ చేసుకోవాలి. సన్న, చిన్నకారు రైతులు ధాన్యం, పంట ఉత్పత్తులను నిల్వ చేస్తే వారికి 35 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన సరకు ద్వారా బ్యాంకులను నుంచి రుణాలు సైతం పొందవచ్చు” అని మంత్రి తెలిపారు.

Read More
  • 1
  • 2