బయోచార్ రీఛార్జ్ విదానము

బయోచార్‌ను స్వతంత్ర ఎరువుగా కాకుండా, కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి ఉపయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు లభిస్తాయి. తాజా బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ప్రారంభంలో మట్టిలోని పోషకాలను శోషించుకునే అవకాశం ఉన్నందున, దానిని నేరుగా ఉపయోగించకుండా ముందుగా రీచార్జ్ చేయడం మంచిది. ఇందుకోసం బయోచార్‌ను బాగా కుళ్లిన కంపోస్టు లేదా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి, బెల్లం (1–2 కిలోలు/100 కిలోల బయోచార్) కరిగించిన ద్రావణంలో అజోటోబాక్టర్/అజోస్పిరిల్లం, ఫాస్ఫేట్ ద్రావణీకరణ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులను కలిపి బయోచార్‌పై సమానంగా చల్లి తేమ 50–60% ఉండేలా చేసి 7–15 రోజుల పాటు నీడలో నిల్వ చేయాలి. ఈ ప్రక్రియ వల్ల ప్రయోజనకర సూక్ష్మజీవులు బయోచార్‌లో స్థిరపడి, పోషకాల నిల్వ మరియు విడుదల మెరుగుపడటంతో పాటు నత్రజని తాత్కాలిక స్థిరీకరణ తగ్గుతుంది. ఫలితంగా ఎరువుల వినియోగ సామర్థ్యం, నేల జీవక్రియ, వేర్ల పెరుగుదల మరియు పంట దిగుబడి మెరుగుపడతాయి.

బయోచార్ వినియోగం – మోతాదు మరియు వాడుక
బయోచార్‌ను ఎంత మోతాదులో ఉపయోగించాలనేది నేల రకం, పంట, బయోచార్ నాణ్యత మరియు స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా హెక్టారుకు 5-10 టన్నులు (ఎకరానికి సుమారు 2-4 టన్నులు) బయోచార్‌ను కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. నేల పరిస్థితులు మరియు పంటను బట్టి కొన్ని సందర్భాల్లో మోతాదును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
బయోచార్‌ను చివరి దుక్కి సమయంలో నేలలో బాగా కలిసేలా వేయాలి. తోట పంటల్లో మొక్కల వేర్ల పరిధిలో కలిపి ఉపయోగించడం మంచిది. నాట్లు వేసే ముందు లేదా విత్తే ముందు బయోచార్‌ను సేంద్రియ ఎరువులతో కలిపి కొంతకాలం ఉంచి (చార్జింగ్ చేసి) ఉపయోగిస్తే పోషకాల వినియోగ సామర్థ్యం మరింత పెరుగుతుంది.
బయోచార్ నేలలో చాలా నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది. అందువల్ల ఒకసారి వేసిన బయోచార్ ప్రభావం అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కారణంగా రసాయన ఎరువుల మాదిరిగా ప్రతి పంటకు మళ్లీ మళ్లీ బయోచార్ వేయాల్సిన అవసరం ఉండదు. అయితే నేల పరిస్థితులు, పంటల అవసరాలను బట్టి అవసరమైనప్పుడు అదనపు మోతాదును ఉపయోగించవచ్చు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

రైతు పొలంలో మైకోరైజా తయారీ

మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.

మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.

ఏ పంటలకు వాడవచ్చు
సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.

ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు
ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.

Read More