ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ
రూ.300 కోట్ల వ్యయంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ పరిశ్రమను ఆగస్టు నెలాఖరుకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అశ్వారావుపేటలో మాత్రమే ఆయిల్‌పామ్ శుద్ధి పరిశ్రమ ఉంది. ఆ తర్వాత మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నర్మెట్టలో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 62 ఎకరాల్లో చేపట్టిన పనులు తుది థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

