మొక్కజొన్న కొనుగోళ్లలో కలెక్టర్లకు పూర్తి అధికారాలు

సచివాలయంలో మొక్కజొన్నల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని, వారు హమాలీ, రవాణా, గన్నీ బ్యాగులు, గోదాములు వంటి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు. అన్ని ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు. ‘ఇప్పటికే రూ.1650 కోట్లతో 1.22 లక్షల మంది రైతుల నుంచి 6.74 లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశాం. అకాల వర్షాల దృష్ట్యా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకొని, మార్క్‌ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. కొనుగోళ్లు, రవాణాను సత్వరమే పూర్తి చేయాలి. రవాణాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నోడల్ అధికారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. రైతులు గన్నీ బ్యాగులను సొంతంగా తెచ్చుకుంటే దానికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తుంది’ అని తుమ్మల సూచించారు.
మంత్రి ఆదేశాల మేరకు మొక్కజొన్న కొనుగోళ్ల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్, కరీంనగర్-బి. గోపి, మెదక్, ఖమ్మం- రాహుల్రాజ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి-యాస్మీన్ బాషా, నల్గొండ, ఆదిలాబాద్ -కె. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్‌కు కొర్రా లక్ష్మిలను నియమించింది. రవాణా శాఖ తరఫున మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు నోడల్ అధికారి బాధ్యతలు అప్పగించింది.

Read More

తెలంగాణలో మద్దతు ధరతో పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం అనుమతి

తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సాగయిన శనగ, మినుములు, వేరుసెనగ, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తులను మద్దతు ధరలతో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రికి లేఖ రాయడంతో పాటు ఫోన్‌లో మాట్లాడగా కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. రాష్ట్రం నుంచి 1.25 లక్షల టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను కొనాలని. దీనికి సుమారు రూ. 894 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. కేంద్రం ఆమోదం లభించడంతో రాష్ట్రంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Read More

ఆంధ్రప్రదేశ్‌కు 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం

ఒడిశాలోని ధమ్రా పోర్టు నుంచి 10,800 టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిందని.. ఎవరూ అందోళన పడొద్దని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో వివరించారు. యూరియా కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాల్లోని రైతులకు వెంటనే దీన్ని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 6న గంగవరం పోర్టుకు 15,000 టన్నులు, సెప్టెంబరు రెండో వారంలో కాకినాడ పోర్టుకు 30,000 టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. ఎరువుల కొరత తలెత్తకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా 1.10 లక్షల టన్నుల బఫర్‌ నిల్వలు సిద్ధంగా ఉంచామని అచ్చెన్నాయుడు తెలిపారు.

Read More