వండని వంట… ఉల్లిపాయ పచ్చి పులుసు

తక్కువ దినుసులతో అతి తక్కువ వ్యవధిలో చేసుకోదగిన వండని వంట ఈ పచ్చి పులుసు.

ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గుప్పెడంత తాజా కొత్తిమీరను శుభ్రం చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి.

నిమ్మకాయంత చింతపండు ఈనెలు గింజలు లేకుండా చూసి, ఒకసారి కడిగి అరకప్పు నీళ్లలో నానబెట్టాలి.

రెండు లేదా మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. నిమ్మకాయంత బెల్లం పొడిగా అంటే నలగగొట్టి పెట్టుకోవాలి. తగినంత రాళ్ళ ఉప్పు దగ్గర పెట్టుకోండి.

ఇపుడు నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి, దానిలో రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉల్లిపాయ ముక్కలు, కొత్తమీర, బెల్లం, పపచ్చిమిర్చి, ఉప్పు వేసి గరిటెతో బాగా కలపాలి. అంతే ఉల్లిపాయ పచ్చి పులుసు తయారైపోయింది.

దీనికి కంది పచ్చడి మంచి జోడీ. పుల్ల పుల్లగా కొంచెం తీయగా, తక్కువ కారంగా, వేడి వేడి అన్నంతో తింటుంటే ఉల్లిపాయ ముక్కలు కొత్తమీర పంటికి తగులుతూ ఉంటే…. రుచి మీరే చెప్పాలి.

రచన : మంచికంటి సుబ్బల

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

క్యారెట్ ఆకుల పచ్చి పచ్చడి

క్యారెట్ ఆకులను కూడా చక్కగా రోటి పచ్చడి చెయ్యవచ్చు. తెలియని వారు దాన్ని కొత్తిమీర పచ్చడి అనుకుంటారు. అంత రుచికరంగా ఉంటుంది.

గుప్పెడు లేత క్యారెట్ ఆకులను తీసుకుని, శుభ్రంగా మంచినీటిలో కడగాలి. ఆకుల అడుగున పేను గట్రా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యారెట్ ఆకుల నుండి చిన్న చిన్న కాడలను తీసేసి, కేవలం ఆకులను మాత్రమే పళ్లెంలో సిద్దంగా ఉంచుకోవాలి.

రెండు టొమాటో పండ్లు, ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లిని ఒలిచి పొట్టు తీసి, తగినన్ని పచ్చిమిర్చి, లేత కరివేపాకులు కాసిన్నిచేర్చి, నాలుగింటిని ముక్కలుగా చేసుకుని రోట్లో వేసి దంచుకోవాలి లేదా మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

టొమాటో పండ్లలో ఉండే నీటి వల్ల పచ్చడి మెత్తగా రుబ్బుడు అవుతుంది. ప్రత్యేకంగా నీరు కలుపకూడదు.
ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు… ఇవన్నీ తగినంత మోతాదులో తీసుకుని రోట్లో/మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ముందుగానే తయారు చేసి, ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. తరువాత క్యారెట్ టొమాటో గుజ్జులో, ఈ పొడుల మిశ్రమాన్ని వేసి మళ్ళీ రోట్లో / మిక్సీలో వేసి బాగా కలిసేలా తిప్పుకోవాలి. అంతే! క్యారెట్ ఆకుల రోటి పచ్చడి రె‘ఢీ’.

సేంద్రీయ ముడిబియ్యపు వేడి అన్నంలో, క్యారెటాకుల పచ్చడి కలిపి తింటే రుచికరంగా ఉంటుంది. అవసరమైన వారు కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ కాస్తా వేసుకుని తినవచ్చు. లేదా పచ్చడి తయారీలోనే, గుప్పెడు నువ్వులు లేదా వేరుశనగలు పచ్చివే వేసి రుబ్బుకోవచ్చు.
ఇక నూనె, నెయ్యి అవసరం పడదు.

వంటలకు కొత్తవారు అయితే, ఉప్పు కారం ఎప్పుడైనా సరే, మొదట తక్కువ వేసుకుని, రుచి చూసుకుంటూ అవసరం అనుకుంటే, మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పును ఎంత తగ్గిస్తే, అంత ఆరోగ్యం.
ఏ రోజుకు ఆరోజు తయారు చేసి వాడుకోవాలి!

  • రచన : తుమ్మేటి రఘోత్తమరెడ్డి

*రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కాలీఫ్లవర్ పచ్చడి

1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.

3) 4, 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగాదంచుకోవాలి.

4) రెండు టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు.

కాలీఫ్లవర్ ముక్కలను, నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, కారం, ఉప్పు… అన్నిటిని కలపాలి. ఓ పావుగంట నుంచి అరగంట వరకు అలా ఉంచాలి. (అన్నీ పచ్చివే.)

క్యాలీఫ్లవర్ ముక్కలకు పులుపు పట్టి, నములుతుంటే కరకర మంటాయి.

అన్నంలో కలుపుకున్నా, ఉప్మా లాంటి వాటిలోనూ, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే, ఓ ముద్ద ఎక్కువే తింటారు.

ఫ్రిజ్‌లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏ రోజుకారోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

ఒక కాలీఫ్లవర్ పువ్వును, 3 లేదా 4 సార్లు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు.

  • రచన : తాయమ్మ కరుణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… క్యారెట్ పచ్చడి

క్యారెట్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు

  • ఒక పెద్ద క్యారెట్ దుంప
  • రెండు ఉల్లిగడ్డలు
  • ఒక వెల్లుల్లి గడ్డ
  • ఆరు పచ్చి మిరపకాయలు
  • తగినంత ఉప్పు
  • జీలకర్ర, చింతపండు లేదా నిమ్మరసం
  • సమయానికి ఉంటే, కొత్తిమీర ఆకులను వేసుకోవచ్చు.

అన్నిటినీ శుభ్రంగా నీళ్లతో కడిగి, తేమ లేకుండా నీడన ఆరబెట్టాలి.

మొదట చింతపండు, జీలకర్రలను రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో క్యారెట్ ముక్కలు వేసి దంచి, అందులో పొట్టు తీసిన ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలను వేసుకొని కాస్తా బరుకుగా దంచుకోవాలి.

ఉప్పు, కారం ఎవరి అబిరుచి ప్రకారం వారు కలుపుకోవాలి.

క్యారెట్ పచ్చడిలో ఉప్పు తక్కువ పడుతుంది. కనుక ఉప్పును తక్కువ వేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు.
ఏ రోజుకు ఆ రోజు తయారు చేసుకుని వాడుకోవచ్చు. తాజాగా, సహజ సువాసనలతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నం రొట్టెలు దోశెల్లో కలిపి తినడానికి రుచికరంగా ఉంటుంది.

అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు.

చిన్న రోలు, నూరే రాయి ఉంటే సరిపోతుంది.

పొయ్యి మీద వండే పనే లేదు.

  • శ్రీమతి జిట్టా జ్యోతి
Read More

వండని వంట… కరివేపాకు పచ్చడి

కరివేపాకు గుండెకు మంచిది. జుట్టుని నల్లగా పెరిగేట్టు చేస్తుంది. కడుపులో ఉండే నులిపురుగుల్ని చంపివేస్తుంది. కంటి చూపుకి మంచిది. ఇన్ని రకాలుగా ఆరోగ్యాన్నిచ్చే కరివేపాకు పచ్చడి చేసే విధానం…
కరివేపాకు పచ్చడి చాలా సులువుగా చేసుకోవచ్చు. కావల్సిందల్లా పది పదిహేను ఎండు మిర్చి, రాళ్ళ ఉప్పు, గోలీకాయంత చింతపండు, అర స్పూను జీలకర్ర, కొంచెం బెల్లం ఇంక శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్న గుప్పెడు కరివేపాకు. కడిగిన నీటి తాలూకా తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.

ముందుగా ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు రోట్లో వేసి నూరుకున్నాక చింతపండు, పసుపు, బెల్లం వేసి ఇంకొంచెం మెదిపి చివరగా కరివేపాకు వేసి బాగా నలిగేట్టు నూరుకోవాలి. అంతే.

Read More