మీనామృతం తయారుచేసి వడపోసేటప్పటికి అందులోని చేప ముక్కలు పూర్తిగా కరగకుండా కొంతమేరకు మిగిలే ఉంటాయి. అటువంటి చేప ముక్కలను పారేయకుండా తిరిగి ఉపయోగించవచ్చు. వీటిలోని ఉపయుక్త సూక్ష్మజీవులు (ఇండిజినెస్ మైక్రో ఆర్గానిజమ్స్ – ఐ.ఎం.ఓ.లు) లేదా మత్స్య సంజీవని నేలను సారవంతం చేస్తుంది. వేరు వ్యవస్థకు రక్షణగా ఉండి వేరుకుళ్లు, ఎండు తెగుళ్లు వంటి వాటి నుంచి వేర్లను కాపాడుతుంది. వేరు వ్యవస్థ ద్వారా సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుంది. వ్యాది నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
మత్స్య సంజీవని తయారీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు (మీనామృతం తయారీలో మిగిలిన వాటితో పాటు తాజా చేప ముక్కలను కూడా వాడవచ్చు) – కిలో, నల్లబెల్లం – 500 గ్రాములు, దేశీ ఆవు నెయ్యి / వెన్న – 50 గ్రాములు, తాటికల్లు – 1 లీటరు, తేనె – 50 గ్రాములు, కాచి చల్లార్చిన నీరు – 5 లీటర్లు
మత్స్య సంజీవనిని తయారుచేసే పద్ధతి: ఒక మట్టి పాత్రలో 50 గ్రాముల దేశీ ఆవు నెయ్యి లేదా వెన్న వేసి పొయ్యిమీద పెట్టాలి. అందులో కిలో చేప ముక్కలను, అర కిలో బెల్లం ముక్కలను వేసి బాగా ఉడికించాలి. చేప ముక్కలు ఉడుకుతున్నప్పుడు అడుగంటి మాడిపోకుండా తగినంత తాటికల్లు కలుపుతూ ఉండాలి. మరొక పాత్రలో 5 లీటర్ల మంచినీటిని మరిగించి చల్లారనివ్వాలి. ఒక మట్టికుండను తీసుకొని, అందులో కాచి చల్లార్చిన నీటిని, ఉడకబెట్టి చల్లార్చిన చేపముక్కలను వేయాలి. అందులో ఒక లీటరు తాటికల్లు, 50 గ్రాముల తేనె కూడా పోసి ఒక శుభ్రమైన తడిలేని కర్రతో బాగా కలియబెట్టాలి. కుండపై మూత ఉంచి దళసరి గుడ్డను రెండు పొరలుగా తీసుకొని బిగించి కట్టాలి. ఈ కుండను ఎండ తగలని చల్లని ప్రదేశంలో నేలలో గుంత తీసి పూడ్చి పెట్టాలి. 5Ð7 రోజుల తర్వాత కుండను వెలికి తీయాలి. కుండలో ఉపయుక్త సూక్ష్మజీవులు పూత పూసినట్టుగా, తెట్టులా తేలుతూ సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ, నలుపు, ఊదా రంగులు కలగలసి ఉంటాయి.
మత్స్య సంజీవని వాడే పద్ధతి: వంద కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టుకు ఒక లీటరు చొప్పున మత్స్య సంజీవనిని కలిపి మొక్క పాదుల్లో చల్లాలి. వేప పిండి, ఆముదం చెక్క, గానుగ చెక్క వంటి సేంద్రీయ ఎరువులతో కూడా కలిపి వాడవచ్చు. 120 మైక్రాన్ల మెష్‌తో వడపోసి ఎకరానికి విడతకు 10 లీటర్ల చొప్పున డ్రిప్ ద్వారా అందించవచ్చు. వంద లీటర్ల నీటికి 3 లీటర్ల మత్స్య సంజీవనిని కలిపి మె°క్కలపై పిచికారీ కూడా చేయవచ్చు.